ఇంతటి మహత్తరమైన సాహిత్యాన్ని సృష్టించిన వారెవరు?
భారతీయుల జీవన విధానానికీ సంస్కారవంతమైన భావాలకూ మూలం వేదం. భిన్నరీతుల
ఆధ్యాత్మిక మార్గాల్ని ఏకలక్ష్యం వైపు చేర్చగల మార్గదర్శి వేదం. మనిషి
జన్మించిన నాటినుంచి మరణించేవరకు సమాజంలో వివేకవంతమైన జీవన రీతులకు వేదాలే
సాధనాలు. బాగానే ఉంది. ఇంతటి మహత్తరమైన సాహిత్యాన్ని సృష్టించిన వారెవరు?
సహజంగానే కుతూహలంతో ఉత్పన్నమయ్యే ప్రశ్న ఇది.
నాలుగు చేతుల్లో వేదాలు
ధరించిన బ్రహ్మ ఈ సాహిత్యాన్ని సృష్టించి ఉంటాడా? సారస్వతం సరస్వతి సొత్తు
కనుక ఆమె సహాయంతో బ్రహ్మ వేదగ్రంథాలను రచించి ఉంటాడేమోనని భావించవచ్చా?
కానే కాదని బ్రహ్మమానస పుత్రుడు నారదుడే తన నారదీయం లో సూచించాడు.
శివకేశవుల్లో ఒకరెవరైనా రచించి ఉంటారనుకొందామా? అదీ కాదని విష్ణుశివ
పురాణాల్లో వాళ్లు తేల్చేశారు. దేవతలో, రుషిపుంగవులో, ద్రష్టలెవరైనా
వేదాలకు సృష్టికర్తలని అనుకొందామా? ఆ భావనకూడా తప్పేనని రుగ్వేదం స్వయంగా
చెబుతోంది. చెల్లాచెదురై ఉన్న వేదాలను విభజించి రుక్, సామ, యజుర్, అధర్వణ
వేదాలుగా సంపుటీకరించిన వ్యాసుని పుత్రుడు శుకుడే, శౌనకాది మునులతో-
వేదాలు అపౌరుషేయాలని ఎందరో మహా రుషులకు నిలయమైన నైమిశారణ్యంలో ప్రకటించాడు.
తపస్సు వల్ల తమస్సు తొలగి ఆధ్యాత్మిక ప్రభల నుంచి జాలువారిన శ్లోకాల
పరంపరలే వేదాలని నిర్ణయాత్మకంగా అంగీకరించాల్సిన సత్యం.
No comments:
Post a Comment