26 September 2015


శని ముద్ర :-

1. నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం
చాయమార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం.


2. రవి సుతాయ విద్మహె మందగమనాయ ధీమహి
తన్నో శని ప్రచోదయాత్ .


3 .ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనైశ్చరాయ నమ:


ఈ శని ముద్ర వేసి , శని మంత్రాలు పారాయణ చెయ్యండి. ఉపశమనం కలుగుతుంది.


గణపతి నిమజ్జనం ఎందుకు?

మట్టితో వినాయకుని చేస్తాం. ఆ విగ్రహానికి మంత్రపూర్వకంగా ప్రాణప్రతిష్ట చేస్తాం. పూజ చేస్తాం. అంతవరకు బాగాబే ఉంది. మామూలు దృష్టితో చూస్తే అది మట్టి బొమ్మే. కానీ ఆధ్యాత్మిక దృష్టితో ఆలోచిస్తే అది మామూలు మట్టి బొమ్మ కాదు. పరబ్రహ్మ రూపమైన మృత్తికా ప్రతిమ. మనం ప్రాణప్రతిష్ట చేసి ఆహ్వానించి పూజ చేయకపోయినా ఆ ప్రతిమ యందు పరబ్రహ్మ ఉన్నాడు. ఆ మృత్తికలోని అణువణువూ ఆయనే.
అలాంటి మృత్తికను మంత్రపూర్వకంగా పూజించిన తర్వాత ఆ విగ్రహాన్ని అలా వదిలేయడం దోషం. బొమ్మని సృష్టించాం. పూజానైవేధ్యాలతో పోషించాం. మరి లయం చేయవద్దా? లయం చేయడమంటే ఆత్మను విశ్వాత్మతో ఐక్యం చేయడం. అణువును బ్రహ్మాండంలో లీనం చేయడం. అంటే ఎక్కడ నుంచి వచ్చిందో అక్కడికే చేరుకోవడం. ఇదే సృష్టి, స్థితి, లయల చక్రభ్రమణం. ఇదే పరబ్రహ్మతత్వం.
అందుకే పరబ్రహ్మ ప్రతిరూపమైన మట్టి వినాయకుడిని పరబ్రహ్మ స్థూలరూపమైన భూమిలో ఐక్యం చేయడానికి యీ విగ్రహాన్ని సముద్ర జలమందు గానీ, నదీ, తటాక జలములయందుగానీ నిమజ్జనం చేస్తే ఆ నీటియందు చేరిన విగ్రహం కరిగి ఆ జలప్రవాహంతో ప్రయానించి, అంటే వ్యాపిస్తూ, పరబ్రహ్మరూపమైన మట్టిలో ఐక్యమైపోతుంది.

అందుకే పూజానంతరం వినాయక నిమజ్జనం ఆచారంగా పూర్వులు ప్రకటించారు. ఆచరించారు. పూజలో వినాయకుడికి అర్పించిన పత్రి ఓషధీ గుణాలు కల్గినవీ, భూదేవి ప్రసాదించినవే గనక వాటిని కూడా నిమజ్జనం ద్వారా ఆ పరబ్రహ్మకి అర్పించి అంజలి ఘటిస్తారు. సర్వ ఈశ్వరార్పణం అంటే అసలు అర్ధం 

ఇదే !!

25 September 2015

విశిష్ట దేవదేవుడు వినాయకుడుకి ఇరువురు భార్యలు సిద్ధి, బుద్ధి :-

వినాయకునకు సిద్ధి, బుద్ధి అనేవారు భార్యలు. కనుకనే వినాయకుడు ఉన్నచోట సకల కార్యాలూ సిద్ధిస్తాయి. జ్ఙానం వికసిస్తుంది. ఇక కొరతేమున్నది. అందువలన ఏ పనైనా - పూజ కాని, పెండ్లి కాని, గృహప్రవేశం గాని, ప్రారంభోత్సవం గాని, రచనారంభం గాని, పరీక్ష గాని, ఉద్యోగం గాని - వినాయకుని పూజతోనే మొదలవుతుంది. ముఖ్యంగా జ్యోతిష్యులకూ, రచయితలకూ వినాయకుడు నిత్యారాధ్య దేవుడు.

భారతీయుల ఆరాధ్య దైవం గణపతి. దేశం నలు చెరగులా వినాయక ఆరాధన పలు విధాలుగా వ్యాప్తి చెందింది. మనం ఏ పూజ చేయాలన్నా, ఏ పని ప్రారంభించాలనుకున్నా, ఏదైనా శుభకార్యానికి శ్రీకారం చుట్టాలన్నా అన్నింటా తొలి పూజ అందుకునేది వినాయకుడే. ఈ కారణంగానే ప్రాంతీయ భేదం లేకుండా యావత్ భారతదేశంలోని హిందువులు వినాయక చవితి పండుగను ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.

వినాయకుడు విశిష్ట స్వరూపుడు. వేదాలలో అతి ప్రాచీనమైన రుగ్వేదంలో గణపతి శబ్దం ప్రస్తావన మనకు కనిపిస్తుంది. బృహస్పతికి పర్యాయపదంగా గణపతిని ఉదహరించారు. దేవగురువైన బృహస్పతి అపార విజ్ఞాన సంపన్నుడు. ఆయనే కాలక్రమంలో గణపతిగా పరిణమించాడనే ఓ వాదం మనకు అక్కడక్కడా వినిపిస్తుంది. ఈ వాదన సంగతెలా ఉన్నా, బొజ్జ గణపతి మాత్రం బృహస్పతి సమానుడైన బుద్ధి సంపన్నుడే. విఘ్నాతిపతిగా, సర్వ శుభంకరునిగా వినా యకుడు నిత్య పూజితుడు. బ్రహ్మ వైవర్త పురాణం గణపతి పేరును నిర్వచిస్తూ ‘గ’ మేధకు, ‘ణ’ మోక్షానికి సమానార్థకాలంటూ ఆ రెండింటికీ ‘పతి’ (అధిదేవుడని) ఆయనను కొనియాడింది.

అలాంటి గణపతి కాలచక్ర పరిభ్రమణంలో రానురానూ ఔన్నత్యాన్ని సంతరించుకుంటూ పురాణయుగం నాటికి ప్రసిద్ధ దైవంగా గుర్తింపు పొందాడు. ఇందుకు మన పురాణాలు ఎంతో దోహదపడ్డాయి. ఒకప్పుడు క్షుద్ర దైవంగా పిల్వబడిన గణపతి సిద్ధి వినాయకుడైపోయాడు. త్రిమూర్తులలో ఒకరైన పరమేశ్వరుడి పుత్రుడిగా ప్రసిద్ధి చెందాడు. విఘ్నాధిపతియై ముక్కోటి దేవతలకే కాక ముల్లోకవాసులందరికీ ముఖ్య దైవమై తొలి పూజలు అందుకోవడానికి అర్హుడయ్యాడు.

ఇక గణపతి బ్రహ్మచర్యం గురించిన విషయానికొస్తే అనేకానేక అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి. ఆయనకు పెళ్ళయినదనీ, సిద్ధి, బుద్ధి అనే ఇరువురు భార్యలున్నారనీ, వారి ద్వారా క్షేముడు, లాభుడు అనే ఇద్దరు కుమారులు కలిగారనీ కొన్ని పురాణాల్లో కనబడుతుంది. ఇక్కడ ముఖ్యంగా చర్చించుకోతగిన విషయం కూడా ఒకటుంది. సోదరులైన కుమారస్వామి, గణపతికి మధ్య జరిగిన ఒకానొక పందెంలో భూప్రదక్షిణానికి బదులు తల్లి పార్వతి చుట్టూ ప్రదక్షిణ చేసిగణపతి భేష్ అనిపించుకుంటాడు. ఆ బుద్ధి సూక్ష్మతకు సంబరపడిన పార్వతీదేవి అతనికి సిద్ధి, బుద్ధులనిచ్చి పెళ్లి జరిపిస్తుంది. బ్రహ్మచారికి కార్యసిద్ధి, సూక్ష్మబుద్ధి భార్యల వంటివి. వాటికి అతడే భర్త. ఈ విషయం వినాయకుడి ప్రవర్తనవల్ల మనకు స్పష్టమవుతుంది. ఆ ఇద్దరు భార్యలవల్ల గణపతికి లాభుడు, క్షేముడు కలిగారని అంటారు. కార్యసిద్ధివల్ల క్షేమం, సూక్ష్మబుద్ధివల్ల లాభం ప్రాప్తిస్తాయని మనకు తెలియచెప్పేందుకే వినాయకునికి వివాహమైనదనీ, ఇద్దరు కుమారులున్నారనీ చెప్పబడింది. పెళ్లి తంతు జరుగలేదు కనుకనే ఆయనను ‘బ్రహ్మచారిణే నమః’ అని పూజించడం జరుగుతోంది.

గణపతి పూర్యష్టకానికి అధిపతి అని తెలుస్తోంది. పూర్యష్టకం అంటే ఎనిమిది రకాల ప్రత్యేకతలున్న పట్టణం అని అర్థం. ఇక్కడ పూర్యష్టకం అని చెప్పుకోతగిన ఆ పట్టణం మరేదో కాదు- అది మన దేహమే. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచప్రాణాలు, కామం, కర్మ, అవిద్య, మనస్సు అనే ఈ ఎనిమిది ప్రత్యేకతలతో రూపొందినదే మానవ దేహం. దీనికి అధిపతి గణపతి. కనుకనే దేహానికిగల ప్రత్యేకతలను గ్రహించి తదనుగుణంగా దానికి అధిపతియైన వినాయకుణ్ణి సేవిస్తే అహం నశించి, మోక్షప్రాప్తి కల్గుతుందని భారతీయ రుషిగణం, ఆధ్యాత్మిక వేత్తలూ వివరించి చెప్పారు. వినాయకుణ్ణి విశిష్ట స్వరూపుడిగా వివరించుకున్న దానిని బట్టి ఆయన సర్వాంగాల విశిష్టతను ఓసారి తెలుసుకుందాం.

‘‘ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం
పాశాంకుశ ధరం దేవం ధ్యయేత్ సిద్ధి వినాయకమ్’’
-అని వర్ణించారు.


ఏకదంతం ద్వంద్వాతీత ప్రవృత్తికి, అద్వైత భావనకు ప్రతీక. ఒకసారి పరశురాముడు శివుడి దర్శనానికి వచ్చాడు. శివపార్వతులు ఏకాంతంగా ఉన్నారనీ, వారి ఏకాంతానికి భంగం కల్గించవద్దని ద్వారం దగ్గరే నుంచున్న గణేశుడు అడ్డగించాడు. అందుకు పరశురామునికి కోపం వచ్చి చేతనున్న గండ్రగొడ్డలిని అలా ఝుళిపించగా ఒక దంతం సగానికి విరిగిపోయింది. అలా విరిగిన దంతాన్ని వినాయకుడు దుష్ట సంహార సమయంలో ఆయుధంగానూ, వ్యాస మహర్షి భారతం చెబుతూండగా రాసేందుకు గంటంగాను ఉపయోగించాడు. శూర్పకర్ణుడైనందున భక్తుల మొరలను సులభంగా వింటారని అంతరార్థం. ఆయనది ఏనుగు తల. పెద్దదైన ఆ తల అపార జ్ఞాన భాండాగారానికి గుర్తు. ఎంతటి మహోన్నతుడైనా అణగిఉన్నంత మాత్రాన గొప్పతనం ఏ విధంగానూ తగ్గదని తెలియచెబుతుంది- ఆ మరుగుజ్జు రూపం.

గణేశుడు చతుర్భుజుడు. నాల్గు చేతులూ నాల్గు పురుషార్థాలకు సంకేతం. ఒక చేత గండ్రగొడ్డలి లేదా అంకుశం, మరో చేతిలో పాశం, ఇంకో చేతిలో కమలం, నాల్గవచేయి అభయముద్ర చూపుతూ ఉంటుంది. చెడును, అజ్ఞానాన్ని నరికివేసేది గొడ్డలి. మందకొడితనాన్ని పోగొట్టి మోక్షమార్గం వైపు నడిపేది అంకుశం. భవ బంధాలను వదిలించుకోమనే తత్త్వాన్ని తెలియజేసేది, భగవంతుడిపై భక్తి పాశమును పెంపొందించేది పాశము. ఇక కమలం నిర్మల హృదయానికి గుర్తు. సకల కార్యాలను సాధించడానికి, భక్తుల బాధలు నివారించడనికి తానున్నానని భరోసా ఇస్తుంది- ఆ అభయహస్తం. ఐతే, ఆ లంబోదరం సకల జగత్తూ తనలోనే ఉన్నదని గ్రహించమని సూచిస్తుంది. నడిపే వారి సామర్థ్యాన్ని బట్టి వాహనం నడుస్తుంది. ఈ ప్రపంచంలో ఏదీ నీచమైనది కాదనే బోధతోపాటు, చిక్కకుండా పరుగెత్తే ఏ విషయమైనా మన అదుపులోకి రాక తప్పదనేది మూషికం ద్వారా తెలుసుకోమంటుంది వినాయకుని తత్త్వం. ఇలా.. వినాయకుని విశిష్టతను వివరిస్తూ పోతే దానికి అంతే ఉండదు. పరమేశ్వరుని పుత్రుడిగా వాసికెక్కి, ముక్కోటి దేవతలకు, ముల్లోక వాసులందరికీ ముఖ్య దైవమై విరాజిల్లుతూ అందరితో పూజలందుకొంటూన్న గణపతిని అనునిత్య భక్తిశ్రద్ధలతో పూజించుకుంటే మనకు అన్నీ శుభాలే. మన కార్యాలనన్నింటినీ నిర్విఘ్నంగా నెరవేర్చుకుని ఆనందమయ జీవనం సాగించేందుకు వి నాయకుడే నిజమైన మార్గదర్శి.ప్రతి రోజు ఇది చదువుకుంటే ఏ గ్రహ దోషం మన దరి చేరదు :-

శ్రీకృష్ణుడు శివుణ్ణి ఎందుకు ఆరాధించాడు ?

శ్రీ దేవీ భాగవతంలో సూత మహర్షి శౌనకాది మునులకు శ్రీకృష్ణ చరితను చెప్పిన తర్వాత శౌనకాది మునులకు ఒక సందేహం వచ్చింది. శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు అవతారం కదా... మరి ఆయన శివుణ్ణి ఆరాధించడమేమిటి? ఆయనకు పార్వతీదేవి వరాలు ఇవ్వడమేమిటి? వీరిద్దరినీ శ్రీకృష్ణుడు ఆరాధించడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.. తాను స్వయంగా సర్వేశ్వరుడు అయి వుండీ, సర్వ సిద్ధప్రదుడై వుండీ సాధారణ మానవుడిలాగా మరొక దేవుడిని ఉపాసించడమేంటి? ఘోర నియమాలతో తపస్సు చేయడమేంటి? ఇది మాకు అర్థం కాని విధంగా వుంది. దయచేసి మాకు అర్థమయ్యేలా వివరించండి అని అడిగారు.

దానికి సూత మహర్షి స్పందించారు. ఇప్పుడు శౌనకాది మునులకు వచ్చిన సందేహమే గతంలోనూ జనమేజయుడికీ వచ్చిందట. ఆ సందేహాన్ని ఆయన ఆ సమయంలో వ్యాసుడి దగ్గర వ్యక్తం చేశాడట. అప్పుడు వ్యాసుడు ఆయనకు చెప్పిన సమాధానాన్నే సూత మహర్షి శౌనకాది మునులకు చెప్పారు.
మునులారా.. మీరన్నది నిజమే! శ్రీకృష్ణుడు నిజంగానే జనార్దనుడే. సర్వకార్య నిర్వహణ సమర్థుడే. అకానీ, మానవరూపంలో వున్నాడు కదా. అందుకుని వర్ణాశ్రమ ధర్మాలను బట్టి మానుష భావాలను ఆచరించాడు. పెద్దలను గౌరవించడం, గురువులను పూజించడం, బ్రాహ్మణులను సత్కరించడం, దేవతలను ఆరాధించడం లాంటి గృహస్థాశ్రమ ధర్మాలను అనుసరించాడు. అలాగే దుఃఖ పడవలసిన విషయాలలో దుఃఖపడటం, సంతోషించాల్సిన సందర్భాలలో సంతోషించడం, రకరకాల అపవాదాలకు తల ఒగ్గి బాధపడటం, స్త్రీలతో కామోపభోగాలు అనుభవించడం, సమయానుకూలంగా విజృంభించే అరిషడ్వర్గాలకు లోనుకావడం లాంటి గృహస్థు గుణాలకు కట్టుబడ్డాడు. గుణమయ శరీరాన్ని ధరించి గుణాతీతంగా వుండటం అసంభవం.

సౌబలి శాపం వల్ల యాదవ వినాశనం, బ్రాహ్మణ శాపం వల్ల కృష్ణుడి అవతార సమాప్తి తెలిసీ వీటిని తప్పించగలిగాడా? కృష్ణ పత్నులను దొంగలు దోచుకున్నారు. అర్జునుడు సన్నిధిలోనే వున్నాడు. మహావీరుడైన అర్జునుడు బాణాలు వేసి దానిని ఆపగలిగాడా? అలాగే ప్రద్యుమ్నాపహరణాన్ని శ్రీకృష్ణుడు నివారించగలిగాడా? కనీసం తెలుసుకోను కూడా తెలుసుకోలేకపోయాడు. వీటన్నిటి ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, మానవ దేహం ధరించినప్పుడు మానవ లక్షణాలే వుంటాయి. అంచేత నారాయణుడైనా, నారాయణాంశజుడైనా మానవుడు మానవుడే. మానవ రూపంలో వున్న శ్రీకృష్ణుడు శివుణ్ణి ఆరాధించడంలో ఎంతమాత్రం ఆశ్చర్యం అవసరం లేదు.

ఆ శివుడు సర్వేశ్వరుడు. విష్ణుమూర్తికి కూడా కారణ భూతుడు. సుషుప్తస్థాన నాథుడు. విష్ణువుకే శివుడు పూజనీయుడు అయినప్పుడు విష్ణ్వంశజులైన కృష్ణాదులకు పూజనీయుడు కావడంలో వింత ఏమీ లేదు. అలాగే ఆదిపరాశక్తి సర్వోతృష్ట. జగన్మాత అర్ధమాత్రంగా, అనుచ్చార్యగా వున్నప్పటికీ సర్వోతృష్టురాలు. తక్కిన త్రిమూర్తులలో బ్రహ్మకన్నా విష్ణువు, విష్ణువు కన్నా శివుడు అధికులు. అందుచేత శ్రీకృష్ణుడు శివుణ్ణి అర్చించడంలో సంశయించాల్సింది, సందేహించాల్సింది ఏమీ లేదు అని వారి సందేహాలను సూత మహర్షి నివృత్తి చేశారు.

24 September 2015

జగద్గురువు శ్రీ అది శంకరాచార్యుల వారి జన్మ క్షేత్రం ( కాలడి ) :-

కేరళలో గురువాయూర్ కు 75కిలో మీటర్ల దూరం లో కాలడి గ్రామం ఎర్నాకులం జిల్లా లో ఉంది. ఇదే జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులు వారు జన్మించిన పవిత్ర క్షేత్రం. ఇక్కడి నుండే కాలి నడకన ఆసేతు హిమాచల పర్యంతం అనేక సార్లు తిరిగి నాలుగు ఆమ్నాయ పీఠాలు స్తాపించి ఆర్షధర్మాన్ని నిల బెట్టారు. వైదిక మతోద్ధారణ చేశారు. అద్వైత మత స్థాపనా చార్యులు గా కీర్తి శిఖరాన్ని అధిరోహించారు.
పరమ విశిష్టమైన కాకాశ్మీర్ శారదా పీఠాన్ని సమర్ధత నిరూపించి శారదా మాత అంగీకారం తో అధిరోహించి జగద్గురువు లని పించుకొన్నారు. ఆ మహాను భావుడే లేక పోతే చైనా, పాకిస్తాన్ సరిహద్దు లో ఉన్న భారత దేశ ప్రజలు ధర్మానికి దూరమై పోయి ఉండేవారు. ఆయన ప్రబోధం సకల మానవ సోదరత్వమే. ఆధ్యాత్మిక కీర్తి పతాకని ప్రపంచం అంతా రెపరెప లాడించిన ఆ మహనీయ మూర్తి జన్మ స్థలాన్ని దర్శించాలనే తపన. ఆ మాహత్మునికి ఏమిచ్చినా హిందూ జాతి ఋణం తీరనే తీరదు. అలాంటి పవిత్ర కాలడి గురించిన విశేషాలు.

# కాలడి చూడాల్సిన ప్రదేశాలు :-
కాలడికి ఒక కిలో మీటర్ దూరం లో మాణిక్య మంగళం లో శ్రీ కాత్యాయిని మాత దేవాలయం ఉంది .ఇది దుర్గా మాత ఆలయం. ఇక్కడే శంకరుల బాల్యం లో తండ్రి శివ శర్మ ఏదో పని మీద వెడుతూ కొడుకు కు అమ్మవారికి పాలు నైవేద్యం పెట్టి రమ్మని పంపాడు. అలానే బాల శంకరుడు అమ్మవారి ముందు పాల చెంబు ఉంచి నైవేద్యం పెట్టి తాగమని గోల చేశాడు అమ్మ వారు తాగక పోయే సరికి ఏడుపు లంకించుకొన్నాడు అప్పుడు అమ్మ వారు ప్రత్యక్షమై ఆ క్షీరాన్ని తృప్తిగా త్రాగి శంకరులకు ఆనందాన్ని కలిగించింది. ఈ అమ్మ వారి గురించే తరువాత ‘’సౌందర్య లహరి’’ రాశారు శంకరాచార్య .
కాలడికి రెండు కిలో మీటర్ల దూరం లో ‘’మట్టూర్ తిరు వేలు మాన్ శివ దేవాలయం’’ ఉంది. దీన్నిశంకరుల తండ్రి శివ శర్మ ప్రతిస్టించాడు. ముసలి తనం లో శంకరుని తలి దండ్రులు ఇంత దూరం వచ్చి పూజాదికాలు చేయలేక శివుడిని ప్రార్ధించారు. అప్పుడు కల లో కన్పించి ‘’నాట్యం చేసే తెల్ల జింక ‘’ను అనుసరించి వెడితే తన లింగం దగ్గరకు చేరుస్తుందని చెప్పాడు. అలానే రోజూ చేసేవారు. అందుకే ఈ గుడికి ‘’తిరువెల్ల మాన్ మల్లి ‘’అనే పేరొచ్చింది. అంటే ‘’నాట్యం చేసే తెల్ల జింక ‘’అని అర్ధం.
నయ తోడూ శంకర నారాయణ దేవాలయం కాలడికి మూడు కిలో మీటర్ల దూరం లో ఉంది. ఇది అద్వైత అర్చనకు గొప్ప స్థానం గా ప్రసిద్ధమైంది. ఈ శివాలయం లో శంకరాచార్య విష్ణువును ప్రార్ధిస్తే ఆయన ప్రత్యక్షమై ఇక్కడి శివుని లో కలిసి పోయి శివ కేశవులకు భేదం లేదని నిరూపించినగొప్ప క్షేత్రం ఇది. అందుకే ముందు శివుడికి తర్వాత విష్ణువుకు ఇక్కడ అర్చన నిర్వహిస్తారు. మంజప్ప కు ఎనిమిది కిలో మీటర్ల దూరం లో శివ శర్మ పూజారిగా ఉన్న ‘’మంజప్ప కార్విల్లి కావు శివ టెంపుల్ ‘’ఉంది.

అలాగే ‘’తెక్కే మదోం ‘’అనే చోట శ్రీ కృష్ణుని గుడి పక్కనే తిరుచ్చి శంకర మఠం ఉంది ఈ మతానికి చెందిన వారికే పూజార్హత.

శంకరుని తల్లి ఆర్యామ్బకు దహన సంస్కారాలను జరిపిన చోటు ఇప్పుడు శంకరాలయం లోనే ఉంది .పది నంబూద్రి కుటుంబాలలో శంకరునికి సాయం చేసినవి రెండే రెండు కుటుంబాలు. ఈ ప్రాంతాన్ని ‘’కపిల్లమన’’ అంటారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నిత్య దీపారాధన జరుగుతూనే ఉండటం విశేషం.
కాలడి కరవు (ఆడట్టు కడవు )దగ్గరే నది మార్గం మారి కాలడి గ్రామం ఏర్పడింది .ఇక్కడే శంకరులు శ్రీ కృష్ణ విగ్రహం స్థాపించారు. శ్రీ కృష్ణ ఉత్సవాలలో ఇక్కడి నుండే జలాన్ని తీసుకు వెడతారు.

‘’మూతల ల కడవు ‘’అంటే మొసలి ఘాట్ -క్రోకడైల్ ఘాట్ అంటారు. ఇక్కడే నదిలో స్నానం చేస్తుంటే బాల శంకరుని మొసలి పట్టుకోంది. తల్లి అనుమతి తో నీటిలోనే ఆపద్ధర్మ సన్యాస దీక్ష తీసుకొన్నాడు బాల శంకరులు. ఇవి కాక శ్రీ శంకరాచార్య యూని వర్సిటి, కాలేజి, ఇంజినీరింగ్ కాలేజి చూడ తగిన ప్రదేశాలు.

ఎర్నాకులం జిల్లాలో పెరియార్ నదికి తూర్పున ఉంది కాలడి గ్రామం ఐతే ఇప్పుడు ఈకాలడి గ్రామం చిన్న పట్నంగా మారింది. కొచ్చిన్ -- శోరనుర్ రైలు మార్గంలో కాలడి రైలు స్టేషను వుంది. కొచ్చిన్ నుంచి సుమారు ఇరవై, ఇరవైరెండు కిలోమీటర్ల దూరంలో వుంది. కొచ్చిన్ నుంచి రాష్ట్రరోడ్డురవాణా వారి బస్సు సౌలభ్యం వుంది. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ కి ఎనిమిది కిమీ.. దూరం. ఆటో వాళ్ళు నూరు లేక నూటయిరవై రూపాయలు తీసుకుంటారు.23 September 2015

ఆత్మసాక్షత్కారం :-

అంతరదృష్టితో అంతర్ముఖమై ఆంతర్యంలోనికి పయనిస్తేనే ఆత్మజ్ఞానం అలవడుతుంది. ఆత్మజ్ఞానం అలవడితేనే ఆత్మసాక్షత్కారం అవుతుంది. ఆత్మసాక్షత్కారం పొందుటకు చేసే ప్రయత్నమే "సాధన".


ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని, అనంతుడుని తెలుసుకోవాలన్న జిజ్ఞాస ప్రారంభమయ్యాక ఎన్నో సంఘర్షణలు, సందేహాలు. ఎలా పయనించాలి, ఏం చేయాలి, ఎలా సాధించగలను, ఎవర్ని ఆశ్రయించాలి.......ఓహో.... ఎన్నో ప్రశ్నలు.

అయితే తమ తమ సంసారధర్మాలను, గృహధర్మాలను, లౌకిక భాధ్యతలన్నింటిని నిర్వర్తిస్తూ, పరమగమ్యంను చేరగోరు గృహస్థభక్తులుకు తమ దైనందికకార్యంలలో ఆధ్యాత్మిక సాధన ఓ అంతర్భాగమై ఉండాలి.


సాధనకు కావాల్సింది మొదటిగా మనో నియంత్రణ. వ్యవహారికంలో పూర్తి భావజాగృతిలో ఉంటూ, ప్రతీక్షణం ప్రతీ చిన్నపనిలో కూడా నాచే ఇది భగవంతుడే చేయిస్తున్నాడన్న భావనతో ఎరుకలో ఉండగలిగినప్పుడే మనోరహితస్థితి కల్గుతుంది.


అటుపై కావాల్సింది అంతఃకరణశుద్ధి. ఇది అలవడాలంటే అందుకు కావాల్సింది వివేకం (బ్రహ్మ సత్యం, జగత్తు మిధ్య అను సత్య దృఢ నిశ్చయజ్ఞానమే వివేకం. అనిత్యమైన ప్రపంచవిషయాలను విడిచిపెట్టి నిత్యమైన ఆత్మగురించి ఆలోచించడమే వివేకం), వైరాగ్యం (ఇహపర భోగాలపట్ల అభిలాష లేకపోవడం), శమం (మనోనిగ్రహం), దమం (చక్షురాది బాహ్యేంద్రియ నిగ్రహం), ఉపరతి (స్వధర్మానుష్టానం), తితిక్ష (శీతోష్ణ సుఖదుఃఖంలను సహించుట), శ్రద్ధ (దేనిచేత సద్వస్తువు తెలియబడునో అట్టి శాస్త్రంనందును, గురువాక్యంలందును సంపూర్ణ విశ్వాసం), సమాధానం (చిత్తంను ఏకాగ్రతలో ఉంచుట), ముముక్షత్వం (మోక్షం కావాలనే తీవ్ర కోరిక) భక్తి (స్వ స్వరూప అనుసంధానం అంటే నిదిధ్యాస), ధ్యానం (సత్యమైన ఏకవస్తువును చింతించడం), సేవ (పరోపకారజీవనం), సమత్వం (శత్రుమిత్రులయందు, మానావమానములయందు, సుఖదుఃఖంలయందు, సర్వ పరిస్థితులయందు సమభావంతో ఉండుట), శౌచం (జ్ఞానవైరాగ్యంలనెడి మృత్తిక చేత మదిని క్షాళ నం కావించి, వాసనాత్రయంను నశింపచేసుకోవడం), దయ (దుఃఖితులయందు కృప), సజ్జనసాంగత్యం (భగవత్తత్త్వాన్ని గ్రహించే వారితో సాంగత్యం), ఋజువర్తనం (చక్కటి నడవడిక) ఏకాత్మభావన (అందరూ ఆత్మస్వరూపులే అన్న భావం) అభ్యాసం చేయాలి.

ఈ అభ్యాస సమయంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు, ఆనందాలు, ఆవేదనలు, సమస్యలు, సంఘర్షణలు, అనుభవాలు, అయోమయాలు..... అన్నీ ప్రాపంచిక జీవితానికి అన్వయింపబడి అగమ్యగోచరంగా, అలజడిగా అన్పించిన, ఎంతో అంతర్మధనం జరుగుతున్నా, ఇవన్నీ పారమార్ధిక జీవనంలో వైరాగ్యాన్ని, వివేకాన్ని, భక్తిని, పరమాత్మునిపై పరమప్రేమను పరిక్షించడానికి ఈశ్వరుడు పెట్టే పరిక్షలుగా భావించి సంకల్పమును చెదరనీయక, క్రుంగక, ప్రయత్నం వీడక ఫలితం ఆశించక, పయనం ఆపక, మరింత శ్రద్ధతో, పట్టుదలతో, సంయమనంతో, సమర్ధవంతంగా, ధీశాలిగా ముందుకు పోవడమే సరైన సాధన. బంగారానికి పుటం పెడితేగానీ ఆభరణం తయారుకాదు. పాత్రశుద్ధి ఉంటేగానీ పాలు కాచలేం. ఉలిదెబ్బలు పడితేగానీ విగ్రహం చేయడం కుదరదు. అలానే అనేక పరీక్షలు నెగ్గి సాధన చేస్తేగానీ అంతఃకరణ శుద్ధి కాదు. ఎవరికి వారే వారివారి సంస్కారముల ఆధారంగా సాధనామార్గంలను అనుష్టించి ఆత్మసాక్షాత్కారం కలిగేంతవరకు నిర్విరామ సాధన చేయాలి. అప్పుడే భవం నుండి భవ్యం వైపు వెళ్ళగలరు.

సాధకులు :-

త్రికరణశుద్ధిగా పై సాధనను ఆచరించినవారే సాధకులు. సదా సర్వప్రాణులను స్వాత్మ(తన ఆత్మ) యందు చూచునో, సర్వప్రాణులయందు ఆత్మను చూచునో వారే సాధకులు. అనంతుని స్మరణ, ఆధ్యాత్మికతత్వ అవగాహన, అన్యవిషయ విస్మరణ, అనన్య చింతన, ఆత్మ విచారణ, అంతా ఆత్మయేనన్నఅచంచల భావనలను అలవర్చుకొని, అవరోధాలను అధిగమిస్తూ ఆజన్మ సాధన అహర్నిశలు చేసేవారే నిజమైన సాధకులు. సత్కర్మలు, సదాచారణములు, సత్ శీలం , సత్ప్రవర్తన, సత్ వాక్కు, సన్మార్గం, సాత్వికాహారం, సమదృష్టి, సంయమనం, సందేహరహిత సాధన సాధకునికి అవసరం.


సత్ సంకల్పంతో, సద్గ్రంధంలు పఠనం శ్రవణం మననం చేస్తూ, సదా సత్యవస్తువుస్మరణ తోడుగా సద్గురువు సన్నిధిలో సాధన సక్రమంగా సాగించే సాధకునికి ఆత్మసాక్షాత్కారము సంప్రాప్తిస్తుంది.
మంత్ర జప సాధన :-

ఒక్కొక్క సారి గాయత్రీ జపము లో కళ్ళు మూసుకుని మనస్సులో ధ్యానం చేసుకోవడం కుదురుట లేదు. మనస్స్సు కుదురు గా ఉంచాలంటే ఏమి చేయాలి? ఈ ధ్యానములో, గాయత్రీ మాతను ఊహ చేసుకొని జపం చేయ వచ్చా? లేక ఇతర దేవత లేదా గురు స్వరూపములను ఊహ చేయవచ్చా? ఇది కూడా మనసు ఎక్కువ సేపు నిలబడదు. కొంత సేపు ఒక దేవత, తరువాత కొంత సేపు ఇంకొక దేవత లేదా గురు స్వరూపము తో జపము చేయవచ్చా? అసలు గాయత్రీ మంత్రం ఎలా చేయాలి?


మనస్సును ఒక చోట నిలపడం అంత సామాన్యమైన విషయం కాదు. మనసు స్వభావమే చంచలత్వం. అది ఎప్పుడు స్థిరత్వానికి లోనవుతుందో అప్పుడు సమాధి స్థితికి మీరు వెళ్లినట్లే. కానీ అది కొందరికి తాత్కాలికం. కొద్ది పాటి అనుభవం కలిగి మరల చంచలమౌతుంది. ఎంతో సాధన తరువాత చాలా కొద్దిమంది యోగులకు ( యుగపురుషులకు ) మాత్రమే నిరంతరం మనసు ఆ భగవంతుని యందులగ్నమై ఉంటుంది. మనసు ఎప్పుడు నిశ్చలమౌతుంది? ఎప్పుడు చంచలమౌతుంది? అనేది ఎంతో సాధనద్వారామాత్రమే తెలుసుకోగలిగే విషయం. ఎవరికి వారు మాత్రమే తెలుసుకోవలసిన విషయం. అలా తెలుసుకోవడానికి సాధనకు మించిన మార్గం లేదు. మరో అడ్డదారి లేనే లేదు. క్షణంలో బ్రహ్మానుభూతి కలగదు.


"మననాత్ త్రాయతే ఇతి మంత్రః " పదే పదే పఠించడం ( మననం చేయడం ) వలన రక్షణ కలిగించునది మంత్రము అన్నారు. గాయత్రీ లేదా మరో దేవతా జపము అనేది మంత్ర ప్రథానమైనది. అందు మంత్రమును స్పష్ఠము గా ఉఛ్చరించుట ప్రధానము.( అనుదాత్త ఉదాత్త స్వరితములతో సరిగా ఉచ్ఛరించాలి. వీటిగురించి మరో టపాలో తెలియజేస్తాను. ) ప్రస్థుతానికి జపం చెయ్యడంలోని వివిధ స్థితుల గురించి తెలుపుతాను.


1) పెదాలతో శబ్దం బయటకు వచ్చేటట్టు జపం చెయ్యడం ప్రాథమికం. ఇది మొదటి మెట్టు. ప్రాథమికం అన్నారు కదా అని దీనికి ఏ శక్తీ కలగదు, ఏకోరికా సిద్ధించదు అనుకుంటే పొరపాటు పడినట్లే. కేవలం బ్రాహ్మణుడు వేదాన్ని చదివినంత మాత్రముచేతనే జన్మరాహిత్య స్థితిని పొందుతాడు అని ఆర్యోక్తి. ( ఇక కోరిన కోరికలు తీరడంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే ఫలితాలను ఇవ్వడంలో ఒకదానికంటే మరొకటి ఉత్తమం అని తెలుసుకోవడానికే ఈ సూచన చేశారు పెద్దలు) ప్రాధమికం అనే దృష్టితో ఒకేసారి ఉత్తమ జపం చెయ్యాడానికి ప్రయత్నించి బోర్లా పడిపోతారు చాలామంది సాధకులు. ప్రతీ సాధకుడూ సాధనలో పెట్టాలనుకునే ప్రతీ మంత్రమునూ కూడా ఈ మొదటి మెట్టుతో మొదలుపెట్టాలి. అప్పుడే సాధన సమర్థవంతంగా ఉంటుంది. ఒక మంత్రాన్ని తీసుకుని ముందు సద్గురువు దగ్గర కొన్ని సంతలు చెప్పుకుని ( ఎన్ని సార్లు అనేది మీ గ్రహణ శక్తిని బట్టి గురువు నిర్ణయిస్తారు. వారు మీకు వచ్చింది ఇక మీరు స్వయంగా చదువుకోవచ్చు అని చెప్పిన తరువాత) , కొన్ని రోజుల పాటు వల్లె వెయ్యాలి. ( శబ్దం బయటకి వచ్చేటట్లు ఉచ్ఛైశ్వరముతో మంత్రమును గురువు సన్నిధిలో పదేపదే చదవాలి. గురువు సన్నిధిలో స్వరముతో చదవడం బాగా అలవడిన తరువాత గరువులేనప్పుడు జపసమయంలో కూడా కొన్ని రోజులు సాధన ( ఓ పది పదిహేను రోజులు రోజూ కనీసం మూడువందలసార్లు చదివితే సరిపోతుంది ) చెయ్యాలి. తరువాత రెండవ మెట్టుకి వెళ్లాలి.

2) పెదాలు కదుపుతూ శబ్దం బయటకు రాకుండా తనకు మాత్రమే వినపడేటట్లు మంత్రం చదవడం ద్వితీయ స్థితి . ఇది సాధనలో రెండవమెట్టు. ఈ స్థితిలో మంత్రం మీకు ( జపం చేసేవారికి ) మాత్రమే వినపడాలి. స్వరాలను పదేపదే గుర్తు చేసుకుంటూ సాధన చెయ్యాలి. అలా కొన్ని రోజుల సాధన ( మంత్రం బాగా నడుస్తున్నది అన్నది నమ్మకంగా అనిపించిన ) తరువాత మూడవమెట్టుకి వెళ్లాలి.


3) మనసుతో పదే పదే స్ఫురణకు తెచ్చుకోవడం ( మననం చెయ్యడం ) మధ్యమం. పైరెండు స్థితులకంటే ఈ మూడవ స్థితి ( మెట్టు ) చాలా కష్టమైనది. దీనిని అధిగమించడానికి కొన్ని నెలలు పట్టవచ్చు. కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. కొన్ని జన్మలు పట్టవచ్చు. ఈ స్థితిలోనే మనసు వేరే విషయాలపైకి వెళ్లడం ఎక్కువగా ఇబ్బందిపెడుతూ ఉంటుంది. మనసులో జపం చేయడం అంటే స్ఫురణకు తెచ్చుకోవడం అనేవిషయం గుర్తుంచుకోవాలి. ఆ మంత్రాన్ని పదే పదే గుర్తుకు చేసుకుంటూ ఎక్కడైనా తప్పులు పడుతోందేమో తెలుసుకుని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలి. జపం చేస్తున్నప్పుడు మనసుకి చెప్పవలసిన అసలైన పని ఇదే. సాధారణంగా మంత్రం తప్పులు రాదు. కానీ రెండు కారణాల వలన తప్పులు దొర్లడం బాగా గమనిస్తే తెలుస్తుంది.


అ) మరో ఆలోచనలో పడడం: ఒకసారి స్మరించడం తేలిక. వందసార్లు గుర్తుకు తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ వేలసార్లు జపించాలి అని సంకల్పించినప్పుడు ఈ సమస్యలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకేసారి వేలసంఖ్యలో జపం చెయ్యాలని సంకల్పించినప్పుడు. సమయం ఎక్కువ పడుతుంది. అంత సమయం మనసు స్థిరంగా ఉండడానికి ఒకేసారి అంగీకరించదు. వ్యతిరెకిస్తుంది. జాగ్రత్తగా ఉండక పోతే విపరీతాలు జరిగే ప్రమాదమూ ఉంది. ( కనుక ఈ స్థితిలో ఎప్పటికప్పుడు గురువులను, అనుభవఙ్ఞులను సంప్రదిస్తూ ఉండాలి ) ఎక్కువసేపు మనసు నిలిచి ఉండదు. కానీ మంత్రాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం అనే ప్రక్రియని దానికి సాధన ద్వారా అలవాటు చెయ్యాలి. మొదటిలో కష్టం గా ఉన్నా రానురాను సానుకూల పడుతుంది. అందువలన మొదట ఓ వందసార్లు జపం చెయ్యడంతో మొదలుపెట్టి క్రమక్రమంగా జపసంఖ్యను పెంచుకుంటూ పోవాలి.


ఒక వందసార్లు జపం సరిగానే చేస్తున్నాము కదా అని సంఖ్య ఒకేసారి పెంచి రోజూ ఓ వెయ్యిసార్లు జపం చేస్తాను అని దీక్షపూనినప్పుడు మరో సమస్యవలన మంత్రం తప్పులు దొర్లడం కనిపిస్తుంది.


ఆ) మనసు తొందర పడడం : నేను రోజుకు వెయ్యిసార్లు నలభైఒక్క రోజులు చేస్తాను అని సంకల్పం చేసుకున్నారు. కానీ ఆ సంఖ్య మీ మనసుకు భారీగా ఉండి ఉండవచ్చు, లేదా ఏదో ఒక రోజు ఆఫీసుకు లేటవుతుండవచ్చు. అందువలన మనసు తొందర పెడుతుంది. త్వరగా పూర్తి చెయ్యాలి అని అనిపిస్తుంది. ఆ తొందరలో మంత్రాన్ని ఏదో ఒకలా పలకడం, పరధ్యానంగా చెయ్యడం మొదలవుతుంది. మనసు పెట్టే తొందరను బట్టి అక్షరాలు, పదాలు లేదా వాక్యాలే దాటవేయడం జరుగుతుంది. అలా జపిస్తే మంత్రం ఫలితానివ్వడం అటుంచి అపకారం కలిగే ప్రమాదముంది. కనుక మనసు సిద్దపడక పోయినా, సమయం లేక పోయినా నేను వెయ్యిచెయ్యాలని సంకల్పించాను అది పూర్తిచెయ్యవలసినదే అని మంకు పట్టు పట్టి కూర్చోకూడదు. చెయ్యగలిగిన జప సంఖ్యమాత్రమే పూర్తి చెయ్యాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే "మనసు ఎక్కువ సమయం జపంలో ఉండడానికి సిద్ధపడాలంటే కూడా మన మొండి పట్టుదలే కారణం". అది ఎలాగ అన్నది ఎవరికి వారే తెలుసుకోవాలి. అన్ని విషయాలు మాటలతో చెప్పలేము.

పైరెండు స్థితులలో మంత్రం తప్పులు పోవడానికి త్వరగా లక్షల జపాన్ని పూర్తిచెయ్యాలి అన్న సంకల్పమే కారణం. కనుక ఒకే సారి పెద్దపెద్ద అడుగులు వెయ్యడం కాక చిన్న చిన్న అడుగులతో లక్ష్యాలతో ముందుకు వెళ్లాలి. ఎప్పుడు ఎంత ఎక్కువ చెయ్యగలము అన్నది ఎవరికి వారే తెలుసుకోవాలి. గురువులకి శిష్యుని సామర్థ్యమెంతో తెలుస్తుంది. అందుకనే అప్పుడప్పుడు గురువుగారితో పాటు కూర్చుని జపం చేసే అలవాటు చేసుకోవాలి. వచ్చే సందేహాలను నివృత్తి చెసుకుంటూ ముందుకు సాగాలి.


4) ఇక మంత్రము ఒక దేవత లేదా గురువు ఉపదేశిస్తున్నట్లుగా కర్ణములకు ( చెవులకు ) వినపడడం ఉత్తమం జపం. ఈ స్థితి కలగడానికి చాలా సాధన కావాలి. కొంతమందికి కలలో కొన్ని మంత్రాలు ఉపదేశం ఇవ్వబడతాయి. వాటిని సాధన చెయ్యడం ద్వారా జన్మరాహిత్యాన్ని పొందగలరు. ఇక నిత్య జీవనంలో కూడా ఏపని చేస్తున్నా ఒక స్వరం చెవిలో మంత్రాన్ని వినిపిస్తూ ఉండడం జపం పూర్ణత్వం పొందడాన్ని సూచిస్తుంది. రామకృష్ణ పరమ హంస, రమణ మహర్షి వంటి వారికి ఇది సాధ్యమైనది. ఈ స్థితిలో అనేక శక్తులు సాధకుని వశమౌతాయి. అణిమాద్యష్ఠసిద్ధులు సాధకుని లొంగతీసుకోవడానికి ప్రయత్నిస్తాయి. అనేక విధాల ప్రలోభపెడతాయి. వాటికి లొంగితే తరువాతి స్థితి ఏమిటన్నది తెలియదు. సాధన అక్కడితో ఆగిపోయి సాధకుడు లౌకిక వ్యామోహాలలో పడతాడు. అనేక విధాల భ్రష్ఠుడౌతాడు. వాటికి లొంగక ఉపాస్యదేవతనే ఆశ్రయించినవారు జీవైక్యస్థితిని పొందుతున్నారు.


మంత్రము - ఉపాస్య దేవత - ఉపాసకుడు వేరువేరు అనేస్థితిలో మొదలైన ఈ ప్రయాణం ఆమూడూ ఐక్యమై ఒకటే శక్తి గా రూపొందడంతో పరిపూర్ణమౌతుంది.


పైవిషయాలన్నీ గమనించిన మీదట కొన్ని విషయాలు తెలుస్తాయి.
1) మొదట గురువు వద్ద మంత్ర దీక్షను పూని వారి సమక్షములో కొంత సాధన చెసిన తరువాత స్వయముగా ప్రయత్నించాలి.


2) మూడవస్థితి ప్రారంభకులకు మొదట సంఖ్యానిర్ణయముతో గాక మానసిక నిశ్చలమును బట్టి సమయ నిర్ణయము ఉత్తమము. అంటే "మనసు నిలచినంత సమయము జపం చెయ్యాలి" అనే సంకల్పముతో మానసిక జపమును ( పునశ్చరణ) చెయ్యాలి. క్రమముగా నూటఎనిమిదిసార్లు, మూడువందలు, ఐదువందలు వెయ్యి అని సంఖ్యా నిర్ణయముతో సాధన చెయ్యాలి.


3) సాధనమాత్రమే ఆసాధ్యాలను సుసాధ్యం చెయ్యగలదు. మనసు పదేపదే వేరే విషయాలమీదకి వెళుతున్నది కదా అని నీరుగారిపోక మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి. అలా జపం చేస్తున్నప్పుడు వేరే విషంమీదకి మనసు మళ్లింది అని ఎన్ని సార్లు గుర్తుపట్టగలిగితే మీకు అంత స్థిరమైన సంకల్పం ఉన్నట్లు. మళ్ళిన మనసుని తీసుకువచ్చి మళ్లీ మంత్రం గుర్తుకు తెచ్చుకోవడం మీద పెట్టాలి. ఆ మంత్రము యొక్క అర్థము మీద దృష్టి నిలపాలి. ఆ మంత్ర అధిష్ఠాన దేవతను దర్శించే ప్రయత్నం చెయ్యాలి. కనుక పట్టువదలని సాధన మాత్రమే మీ జీవితాన్ని తరింపచెయ్యగలదు.


సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు!


 
శ్రీ శ్రీ శృంగేరీ శారదాపీఠము యొక్క ముప్పైఐదవ జగద్గురువులైన శ్రీ అభినవ విద్యాతీర్థుల వారి కాలములో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది :-

గురువుల వద్దకు దర్శనానికి ఒక క్రైస్తవ మత ప్రచారకులు వచ్చినారు. ఆయన ఉద్దేశము , వారి మతము సర్వశ్రేష్ఠమయినది , కాబట్టి తమ మతానికి జనులను ఆకర్షించి వారికి స్వర్గ ప్రాప్తికి మార్గాన్ని చూపించవలెను. అందుకోసము జగద్గురువులను ఒప్పించి జనాలను క్రైస్తవ మతానికి చేర్పించాలని కోరడానికి వచ్చినారు. విషయము తెలిసిన జగద్గురువులు , వారి మతపు గొప్పదనము యేమిటో తెలుసుకోవలెనని ఆదరముతో ఆహ్వానించి సంభాషించినారు. యోగక్షేమాలు , కుశల ప్రశ్నలతర్వాత జగద్గురువులు అడిగినారు.

జగద్గురువులు :- మీరు ఇక్కడికి వచ్చిన కార్యమేమిటి ?
క్రైస్తవ మత ప్రచారకులు [ క్రై. మ. ప్ర. ] :- స్వామీ , నేను మీ ఊరిలో , మీ మఠము సమీపములో ఒక క్రైస్తవ సంస్థను తెరవాలనే ఉద్దేశముతో వచ్చినాను. 


గురువులు :- ఇక్కడ సంస్థను తెరచుటకు కారణము ?
క్రై. మ. ప్ర.:- నేను ప్రజలకు ఇక్కడనుండే ధర్మోపదేశమును ఇవ్వాలని ఆశిస్తున్నాను. 


గురువులు :- మీరు ఉపదేశించునది యేమి ?
క్రై. మ. ప్ర.:- మా మతమును గురించి, దాని శ్రేష్ఠతను గురించీ , జనులకు ఉపదేశము చేసి, వారందరినీ మా మతానికి మార్చుకోవాలనుకొంటున్నాను. 


గురువులు :- మీరు జనులకు ఉపదేశము ఇచ్చే ముందు నాకు కూడా మీ మతమును గురించి తెలిపితే , నేను కూడా తెలుసుకుంటాను గదా ?
క్రై. మ. ప్ర.:- అట్లే కానివ్వండి, మీరు నన్ను ప్రశ్నలు అడగండి, నేను వాటికి సూక్త సమాధానములను ఇవ్వగలవాడను. 


గురువులు :- మీ మతము మొదలై ఎన్ని సంవత్సరాలయినది ?
క్రై. మ. ప్ర.:- మా మతము పుట్టి 1973 సంవత్సరాలయినాయి. 


గురువులు :- సంతోషము , మీ మతపు ఆరంభమును గుర్తించుటకు ఒక నిర్దిష్టమైన కాలము , సమయము ఉన్నాయని స్పష్టమైంది. మీ మతము పుట్టుటకు ముందు ప్రజలు ఉన్నారా లేరా ? మీ మతము లేనప్పుడు జనులు జీవిస్తుండేవారా లేదా ?
క్రై. మ. ప్ర.:- జనులే లేకపోతే మేము మతబోధ ఎవరికి చేస్తాము ? మేము మా మత విషయములను నేర్చుకొని ప్రచారము చేయుటకు ముందు కూడా ప్రజలు ఉండనే ఉన్నారు. 


గురువులు :- మీ మతములోకి జనులు మారితే వారికి కలుగు ప్రయోజనమేమి?"
క్రై. మ. ప్ర.:- మా మతములో చేరిన వారందరికి మాత్రమే తప్పక స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. నరకము తప్పుతుంది.


గురువులు :- సరే , మీరు మీ మతమును అనుసరించే వారికి మాత్రము స్వర్గప్రాప్తి కలుగుతుందంటున్నారు. ఇతరులకు నరకప్రాప్తి అంటున్నారు. కానివ్వండి , మీ మతము పుట్టుటకు ముందు బ్రతికి జీవించిన కోటానుకోట్ల ప్రజలు స్వర్గానికి వెళుతుండేవారా లేక నరకానికి వెళుతుండేవారా ? "
క్రై. మ. ప్ర.:- వారంతా నరకానికే వెళుతుండేవారు. మా మత ధర్మాన్ని పాలించనందువల్ల. 


గురువులు :- ఇదెక్కడి న్యాయము ? ఈ కాలపు ప్రభుత్వాలూ , న్యాయస్థానాలు కూడా ఇటువంటి చట్టాన్ని చేయవు కదా , మీరు మీ ధర్మాన్ని, నియమాన్నీ ఏర్పరచక ముందు ఉన్నవారు మీ ధర్మాన్ని పాలించుట లేదు అన్న కారణానికి వారు నరకభాజనులవుతారు అనేది న్యాయమేనా ? ముందెప్పుడో రచించబోయే నియమాలను ఊహించుకొని వారు అనుసరించుట ఎక్కడైనా సాధ్యమా ? కాబట్టి , మీరు మీ మతమునకు సంబంధించిన నియమాలను రచించుటకు ముందే ఉన్నవారు నరకానికే వెళ్ళినారు అని చెప్పుట సమంజసమా ?
క్రై. మ. ప్ర.:- [ బిక్క చచ్చి ], ఔను స్వాములూ , వారు అందరూ నరకానికి కాదు , స్వర్గానికే వెళ్ళిఉండాలి. 


గురువులు :- ఇది కూడా అన్యాయమే అవుతుంది, ఎందుకంటే మీ మతపు నియమాలను రాయుటకు ముందు పుట్టి పెరిగిన వారందరూ స్వర్గానికే వెళ్ళేవారు కదా? ఇప్పుడు మీరు రచించిన మత నియమాల వల్ల , వాటిని అనుసరించే కొందరు మాత్రమే స్వర్గానికి వెళుతున్నారు. అనుసరించని వారు నరకానికే వెళుతారు అన్నట్లయింది కదా? అందువల్ల, మీరు మీ మత నియమాలను రచించకుండా ఉండిఉంటే అందరూ తప్పక స్వర్గానికే వెళ్ళేవారు. ఇప్పుడు మీ నియమాల వల్ల అనేకులకు అన్యాయము జరిగింది కదా ?"
క్రై. మ. ప్ర.:- [ తన మాటలకు తానే చిక్కుకొని గాభరా పడి] స్వామీ , మీరు నన్ను ఇటువంటి ప్రశ్నలను అడుగుతున్నారే ? దయచేసి నన్ను వదిలేయండి " అన్నాడు.


గురువులు :- సరే , అట్లాగే కానివ్వండి , ఆ సంగతి వద్దు. చూడండి , ఈ ప్రపంచములో ప్రజలు అనేక విధములైన దుఃఖ కష్టాలకూ , సుఖ సంతోషాలకూ లోనగుటను చూస్తున్నాము కదా , దానికేమిటి కారణము ?
క్రై. మ. ప్ర.:- దీన్నంతటినీ భగవంతుడే చేసినాడు.


గురువులు :- ఒకడికి ముష్టి అడుక్కోవలసిన హీన స్థితినీ , ఇంకొకడికి దానము చేయునట్టి ఉత్తమ స్థితినీ దేవుడు అనాదిగా ఇస్తున్నాడంటే , భగవంతుడు తనకు ఇష్టమైనవాడిని సుఖములోనూ , తనకు అప్రియమైన వాడిని దుఃఖములోనూ ఉండేటట్టు చేసినాడనే చెప్పవలెను కదా ?
క్రై. మ. ప్ర.:- అది భగవంతుని స్వంత ఇఛ్చ , స్వామీజీ , మనమేమీ చేయలేము. వాడు ఏమికావాలన్నా చేయగలడు. అది వాడిష్టము. 


గురువులు :- భగవంతుడు ఏమి కావాలన్నా చేయవచ్చు అన్నట్టయితే , అందరికీ సుఖాన్నే ఇవ్వవచ్చును కదా? ఆ సుఖాన్ని కొందరికి మాత్రమే ఎందుకు ఇచ్చినాడు ?దానికి కారణమేమయి ఉంటుంది ?
క్రై. మ. ప్ర.:- [అప్రతిభుడై], అదంతా భగవంతునికి చెందిన విషయము. నేనేమి చెప్పగలను ? 


గురువులు :- మీ వాదానికి ఒక యుక్తి గానీ , తర్కము గానీ ఉన్నట్టే కనిపించుట లేదు. సరే , అదీ ఉండనివ్వండి , మరొక విషయము ; చిన్న పిల్లలుగా ఉన్నపుడే కొందరు చనిపోతారు. కొందరేమో వయసయిన తర్వాత. ఇలాగున్నపుడు , చిన్నపిల్లలు చనిపోయాక స్వర్గానికి వెళతారా లేక నరకానికా ?
క్రై. మ. ప్ర.:- చిన్న పిల్లలు పాపము ఎలాచేయగలరు ? వారు ఒక తప్పును కూడా చేయలేరు. వారింకా చిన్నపిల్లలే కాబట్టి వారికి పాపపుణ్యాల ప్రసక్తే రాదు. వారికవి అంటవు. 


గురువులు :- అందుకే అడిగినాను , వారు వెళ్ళేది స్వర్గానికా , లేక నరకానికా ?
క్రై. మ. ప్ర.:- చిన్న పిల్లలందరూ స్వర్గానికే వెళతారు. 


గురువులు :- అట్లయితే మన తల్లిదండ్రులంతా మనగురించి చాలా పెద్ద తప్పే చేసినారు అనవలెను. మనలనందరినీ చిన్న పిల్లలుగా ఉన్నపుడే చావడానికి వదిలేయకుండా పెంచి పోషించి పెద్ద చేసినారు. ఇది చాలా పెద్ద తప్పు కదా ? శిశువులను పుట్టగానే చంపి వేసుంటే, మనము పెరిగి పెద్దయి, తప్పు చేసేందుకు అవకాశమే ఉండేది కాదు. మనందరకూ స్వర్గమే దొరికేది ? కాదా ?
క్రై. మ. ప్ర :-  [మరలా చిక్కుకొని], స్వామీ మీరు ఇలాంటి ప్రశ్నలు వేస్తే నేను జవాబివ్వలేను.


గురువులు :- సరే , వదిలేయండి, చనిపోయే వారందరూ స్వర్గానికో లేక నరకానికో వెళతారు తప్పదు కదా, ఎప్పుడు వెళతారు అన్నది చెపుతారా ?
క్రై. మ. ప్ర.:- భగవంతునికి ఎప్పుడు నిర్ణయించాలనిపిస్తే అప్పుడు నిర్ణయిస్తాడు , అప్పుడే పోతారు.


గురువులు :- ఇదేమయ్యా ఆశ్చర్యము ? భగవంతుడు పిచ్చివాడా యేమి , తనకిష్టమొచ్చినపుడు న్యాయ నిర్ణయము చేయుటకు ?
క్రై. మ. ప్ర.:- అలాగ కాదు , అక్కడ అదంతటికీ ఒక క్రమ విధానముంటుంది.

గురువులు :- సరే , మీ పుస్తకములో అదేమి క్రమ విధానమును వివరించినారో కొంచము చెపుతారా ? [ ఆయన మాట్లాడేందుకు తటపటాయించినాడు; గురువులే కొనసాగించినారు] మీ మతములో ఈ విషయము గురించి ఏమి సిద్ధాంతము ఉందో , దాన్ని నేను చెపుతాను. అది సరియా కాదా మీరే చెప్పండి.
క్రై. మ. ప్ర.:- కానివ్వండి స్వామీ , చెప్పండి.


గురువులు :- ఈ ప్రపంచములో ఉన్నవారందరూ చనిపోయిన తరువాత , దేవుడు , ఏదో ఒకరోజు , న్యాయ నిర్ణయమును చేసి, కొందరికి స్వర్గాన్నీ , కొందరికి నరకాన్నీ ఇస్తాడు. కదా ? సరియేనా ?
క్రై. మ. ప్ర.:- ఔనౌను , తమరు చెప్పింది సరిగ్గా ఉంది.


గురువులు :- ఈ ప్రపంచములోనే జరుగుతున్న సంగతిని చూడండి , ఎప్పుడైనా ఎవరైనా ఒక తప్పు చేసినారంటే , విచారణకు మొదట , ఆ తప్పు చేసినవాడిని పోలీసులు కొన్నిరోజులు నిర్బంధములో ఉంచుతారు. దాని తర్వాత కూడా అతడిని పోలీసులు లాకప్ లో ఉంచాలంటే ,దానికి న్యాయాధీశుల అనుజ్ఞను పొందవలసి ఉంటుంది. అలాగ , కారణమూ , అనుమతీ లేకుండా , విచారణ చేయకుండా ఎక్కువ రోజులు ఉంచుటకు వీలు లేదు. న్యాయాధీశులు ఒప్పుకోకుంటే అతడిని పోలీసులు నిర్బంధము నుండీ వదిలివేయ వలసి ఉంటుంది. ఇలాగున్నపుడు , ఒకడు మృతుడయిన తరువాత వాడికి , " ఈ ప్రపంచములో ఉన్నవారందరూ చచ్చిపోయే వరకూ , అనగా , కోటి కోటి సంవత్సరాలయ్యే వరకూ జనాలు పుట్టుతూ చస్తూ ఉంటారు కాబట్టి , అదంతా అయ్యే వరకూ , ’ నువ్వు విచారణ లేకుండానే కాచుకొని ఉండాలి" అంటూ ఆ భగవంతుడు చెబితే ,అది న్యాయమనిపించుకుంటుందా ? మీరే చెప్పండి?" జగద్గురువుల ఈ మాటను విని ఆ క్రైస్తవ మత ప్రచారకుడు దిక్కుతోచనివాడైనాడు.
అప్పుడు గురువులు ఆతనికి సమాధనము చెబుతూ , " మీకు మీ మతమే గొప్పది. మీరు దానిని అత్యంత శ్రద్ధతో అనుసరించవలెను. అంతే కానీ , ఇతరులతో , ’ మా మతమే శ్రేష్ఠమైనది, దానినే అందరూ అనుసరించవలెను, అలాగ ఏమైనా మీరు మా మతాన్ని అనుసరించకపోతే మీకు , నరకమూ , దుఃఖమే గతి’ అని చెప్పుట సాధువైనది కాదు. 

మీకు మీ తల్లి పూజనీయురాలు. ఇతరులకు వారి వారి తల్లులు పూజనీయులు. ’ మాతల్లి మాత్రమే పూజనీయురాలు , ఇతరుల తల్లులు కాదు’ అంటూ మీరు చెప్పితే అది మీ మూఢత్వమే అవుతుంది. నా తల్లి కూడా ఇతరుల తల్లులవలె సమానముగా పూజనీయురాలు అని తెలుసుకున్నపుడే మనలను ప్రపంచము ఆదరిస్తుంది. లేకుంటే ఛీత్కరిస్తుంది. " అని ఉపదేశించినారు. ఆతడిని వీడ్కొనునప్పుడు ఆతనికి జగద్గురువులు ఎప్పటివలెనే ఫలమునిచ్చి సత్కరించినారు. అతడు దానిని ఆదరముతో స్వీకరించి వెళ్ళిపోయినాడు. 

ఆ తరువాత గురువులు భక్తులను ఉద్దేశించి , || సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః | అనేన ప్రసవిష్యధ్వమేష వోఽత్తిష్వ కామధుక్ || " మొదట యజ్ఞములతోపాటు ప్రజలను సృష్టించి ప్రజాపతి, ’ ఈ యజ్ఞములు మీకు కామధేనువులగు గాక ’ యని అంటాడు. బ్రహ్మ దేవుడు , జగత్తును సృష్టి చేయునపుడే అది సరిగ్గా నడుస్తూ ఉండుటకు అవసరమైన విధి-నియమములను రచించినాడు.
ఇది మన మతపు గొప్పతనము. మన సనాతన ధర్మపు సిద్ధాంతము ప్రకారము , భగవంతుడు అనాదియైనవాడు. అలాగే ఈ ప్రపంచమూ , మన ధర్మమూ కూడా అనాదిగా ఉన్నవి. జీవరాశులకు వాటి వాటి కర్మలకు తగినట్లు ఫలము ప్రాప్తిస్తుంది. దుష్టులకు దుష్టఫలము , సత్కర్ములకు మంచి ఫలము. కర్మలు అచేతనమైనవి-అంటే జడమైనవి. ఫలము నిచ్చేది భగవంతుడే. భగవంతుడు దయాళువు అనునది దిటమైన మాట.

తప్పుచేసినవాడు తన తప్పును ప్రామాణికముగా ఒప్పుకొని క్షమాభిక్ష వేడితే న్యాయాధీశులు శిక్షను తగ్గిస్తారు కదా ? కానీ ఇతడు పదే పదే తప్పులు చేస్తూ ప్రతిసారీ క్షమాభిక్షను కోరితే న్యాయాధీశుడు క్షమిస్తాడా ? భగవంతుడు కూడా అట్లే. ప్రామాణికులైనవారిని క్షమిస్తాడు. కానీ పదే పదే తప్పుచేసే వాడిని ఖచ్చితముగా క్షమించడు. మన శాస్త్రములు శ్రద్ధతో పాటూ వివేకము కూడా ఉండవలెనని బోధిస్తాయి. ఇతరమతాలు శ్రద్ధ ఒక్కటీ ఉంటే చాలని చెబుతాయి. మత ధర్మములలో భావుకత మాత్రమే కాక విచారము చేయు ప్రవృత్తి కూడా ఉండవలెను. 

శ్రీరామచంద్రుడు , శ్రీ కృష్ణుడు వంటి అవతారాలు మన ధర్మములో మాత్రమే కనిపిస్తాయి. మన ధర్మము వారివల్ల యేదో కొత్తగా స్థాపించబడినది కాదు. మన ధర్మము , అటువంటివారిని ఈ జగత్తుకు ప్రసాదించింది. ఇంతటి మహాత్మ్యమున్న సనాతన ధర్మములో మనందరమూ జన్మించినాము. ఈ సనాతన ధర్మపు బోధనలను పాలించి మనమందరమూ శ్రేయస్సుకు తగినవారము కావలెను. " అని ఉపదేశించినారు.22 September 2015

కష్టం :-

माता पिता :-
Golden Rules :-

గ్రహదోష పరిహారములు :-

ఒక గృహస్తు కుటుంబమందు అనేక కష్టములు అనుభవించుట వల్ల తన జాతక పరిశీలనకు జోస్యుని వద్దకు వెళితే ఆతను గ్రహానునుకూలం లేదు నవగ్రహ హోమము చేసుకోవలెను మరియు మాతృ దోషం, పితృ దోషం, బ్రాహ్మణ శాపం, గో శాపం, సుమంగళి శాపం జాతకములో వుంది. దీనికి పరిహారము చేసుకొంటే కష్ట నివారణ కలుగుతుందని విన్న వించెను. గృహస్తుకు ఏమి పాలుపోకుండా పరమాచార్యుల ఆశీస్సులకు గాను వెళ్లి తన కష్టములను వినిపించి జోస్యుడు చెప్పిన పరిహారాదులను చెప్పి ఒక మార్గము ఉపదేసించాలని కోరితే ఆచార్యులు జోస్యుడు చెప్పిన పరిహారాదులు చేసుకొంటే మంచి జరగకున్నా చెడుపు మట్టుకు జరుగదు అని అన్నారు.

ఇతనికి పరిహారాదులు చేసేదా వద్దా అనే సమస్య అర్థము కాకుండా మరలా అడిగేలోపు ఆచార్యులు వెళ్ళిపోయిరి. గృహస్తు తనకు ఏమియు అర్థము కాలేదని చింతించుచుండడం చూసి ఆచార్యులు అతనికి కొన్ని వివరణములు చెప్పిరి అవి :

1. ప్రతి ఒక్కరికి నిర్దేసింపబడిన కార్యములు కలవు దానిని విస్మరించ కూడదు. ఇతనికి తండ్రి తల్లి కాక తాత నాన్నమ్మ బ్రతికి ఉన్నారు వారిని సక్రమముగా వృద్ధాప్యమందు పోషించడం ప్రథమ కర్తవ్యమ్.
2. ఇంటికి వచ్చిన ఆర్థులకు తన శక్త్యానుసారం బిక్షం వేసి పంపవలెను మారుగా వారిని విమర్శించడం అవమానించడం చేయడం తగదు.
3. దాహార్తిగా వచ్చిన వారికి మంచి నీరు ఇవ్వవలెను.
4. బీదలను, వంట చేయడానికి వచ్చిన వారిని పని వారలను నిందించకుండా ప్రియముగా పలుకవలెను.
5. వాకిలి వద్దకు వచ్చిని గోవుకు నీరు లేక అరటి పండో ఇచ్చి దాని గొంతు భాగము తడిమి విడవ వలెను.
6. తన వంశమందు సుమంగళిగా మరణించిన వారి ప్రీతి ఆశీస్సులకు గాను బీద సుమంగళి స్త్రీలకూ వర్షమునకు ఒక పర్యాయము గృహమునకు ఆహ్వానించి భోజనాదులు ఇచ్చి వారికి చీర రవిక మాంగల్య వస్తువులు అంటే కాటుక అద్దం గాజులు పసుపు కుంకుమ పెట్టి గౌరవించ వలెను.

ఇవి అన్ని గృహస్తుగా చేస్తే తనకు యే కుటుంబ కష్టములు వుండవు మరియు శాపాదులు తగలవు హాయిగా జీవించ వచ్చు అని విడమరిచి చెప్పిరి. ఇప్పుడు గృహస్తు తన తప్పిదం ఏమి అనేది అర్థం అయ్యి పెద్దలకు సాష్టాంగ నమస్కారములు సమర్పించుకొని తన తప్పులు ఒప్పుకొని ఇకపై తానూ తప్పు చేయనని ఒప్పుకొని ఆశీస్సులు పొంది చెప్పిన వాటిని అనుసరించి బాగుపడెను.

ఇవి అన్ని మనము చేయవలసిన అవశ్య కృత్యములు దానిని విస్మరించితే అన్ని కష్టములే మరి మనము మనలను మార్చుకొంటే మనకు అన్ని సుఖములే కలుగుతుంది.

అశోక ధర్మచక్రం :-

21 September 2015

రాధాకృష్ణులు :-

మహోన్నతమైన రాధా ప్రేమ తత్వం !!

* ఈ విశ్వంలో ప్రేమ అంటే తెలిసిన ఒకే ఒక్క స్త్రీమూర్తి "రాధ" !!
* స్వచ్చమైన ప్రేమకు నిదర్శనం పల్లెపడుచు రాధా !!
* రాధా తన ప్రేమతో దేవాధిదేవుడైన కృష్ణుని బందీని చేసిందా !!
* పల్లెపడుచు రాధా స్వచ్చమైన ప్రేమకు కృష్ణుడు దూరమయ్యాడా ??


గోవింద బోలోహరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే !!


ప్రేమ అన్న పదాన్ని నిర్వచించమని ఎవరైనా అడిగితే జవాబుగా "రాధ" అన్న ఒకేఒక్క పదాన్ని మాత్రమే చెబుతారు. ప్రేమకు దీనిని మించిన నిర్వచనం ప్రపంచంలోనే లేదు. ప్రేమంటేనే రాధ. రాధంటేనే ప్రేమ. అప్పటికీ ఇప్పటికీ ఈ విశ్వంలో ప్రేమ అంటే తెలిసిన ఒకేఒక్క స్త్రీమూర్తి రాధ. ఇంకెవ్వరికీ ప్రేమంటే తెలియదు. తెలుసని అనుకుంటారు భ్రమిస్తారు.అంతే.


లోకంలో ఉన్నవి కామమూ స్వార్ధమూ మాత్రమే. ప్రేమనేది ఈలోకంలో లేనేలేదు.లోకులకెవ్వరికీ ప్రేమ అనేది తెలియనే తెలియదు.తెలుసనుకుంటే అది పిచ్చిభ్రమ మాత్రమె.


కొంతమంది స్నేహాన్ని ప్రేమనుకుంటారు. కొందరు కోరికను ప్రేమనుకుంటారు. మరి కొంతమంది అభిమానాన్ని ప్రేమనుకుంటారు. ఇంకొందరు మోహాన్ని ప్రేమగా భ్రమిస్తారు. అవసరాన్ని ప్రేమనుకునేవారు ఎందరో ఉంటారు. ఎక్కువమంది కామాన్ని ప్రేమగా భావించి మోసపోతారు. నిజానికి వీటన్నిటి వెనుకా ఉండేది మాత్రం స్వార్ధమే.


లోకంలో ఉన్న ఈ ప్రేమలన్నీ స్వార్ధంతో నిండినవే. బృహదారణ్యక ఉపనిషత్ లో యాజ్ఞవల్క్య మహర్షి ఇదేమాటను తన భార్య అయిన మైత్రేయితో చెబుతాడు.మైత్రేయి సామాన్యవనిత కాదు. ఆమె మహాపండితురాలు, బ్రహ్మవాదిని. ఆమెతో యాజ్ఞవల్క్యుడు ఈ సత్యాన్ని చెబుతాడు.


"లోకంలో భర్తను ప్రేమించేది భర్తకోసం కాదు. ఆత్మ కోసమే. భార్యను ప్రేమించేది భార్యకోసం కాదు. ఆత్మకోసమె. సంతానాన్ని ప్రేమించేది సంతానంకోసం కాదు. ఆత్మ కోసమే." ఈ విధంగా ఇంకా చాలా సంభాషణ సాగుతుంది. ఈ సంభాషణ ద్వారా ఆయన ఆత్మతత్వాన్ని భార్యకు ఉపదేశిస్తాడు. ఈ సంభాషణకు లోతైన వేదాంతార్ధాలున్నాయి.


వాటిని అలా ఉంచితే, సామాన్యార్ధంలో చూచినా కూడా 'ఎవరు దేనిని ప్రేమించినా తన సుఖం కోసమే ఆ పని చేస్తారు కాని ఎదుటివారి సుఖం కోసం కాదు. ఆ వ్యక్తైనా వస్తువైనా తనకు ఇచ్చే సుఖాన్ని బట్టి ఆ వ్యక్తి అన్నా వస్తువన్నా తాత్కాలికంగా ఇష్టం కలుగుతుంది.కనుక ప్రతి మనిషీ నిజానికి తన సుఖాన్నే తాను ప్రేమిస్తున్నాడు గాని ఇతరులను కాదు-అని తేలుతుంది. మనకు నచ్చని అనేక చేదునిజాలలో ఇదొక చేదునిజం. అందుకే అవసరం ఉన్నంతవరకే మనుషుల మధ్యన సోకాల్డ్ 'ప్రేమ' అనేది ఉంటుంది. అవసరం తీరిన తరువాత ఉన్నట్టుండి మాయం అవుతుంది. ఇది నిజమైన ప్రేమ కాదు. అసలు ఇది ప్రేమే కాదు. ఇది అవసరార్ధ ఏర్పాటు మాత్రమే.దీనిని మానవులు ప్రేమగా భ్రమిస్తారు. ఇది స్వార్ధమే కాని ప్రేమ కానేకాదు.


లోకంలో నడుస్తున్న సంసారాలు,కాపురాలు అన్నీ 'అవసరం' అన్నదానిమీదే నడుస్తున్నాయి గాని 'ప్రేమ' అనేదాని మీద ఆధారపడి కాదు. కాని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యం మారదు.


రాధ ప్రేమ ఇలాంటిది కాదు. స్వార్ధాన్ని దాటిన ప్రేమ ఆమె సొంతం. నిజానికి స్వార్ధాన్ని దాటినదే నిజమైన ప్రేమ అవుతుంది. తన ఆనందాన్ని ఆశించే ప్రేమ ఆమెది కాదు. ప్రియతముని ఆనందాన్ని మాత్రమే ఆశించిన ప్రేమ ఆమె సొంతం. తన ఆత్మనే అర్పించగలిగిన ప్రేమ ఆమె సొంతం. రాధయొక్క ప్రేమస్థాయిని మానవమాత్రులు ఎన్నటికీ అర్ధం చేసుకోలేరు. సంపూర్ణ స్వార్ధరహిత స్థితిని అందుకున్నవారే ఆ ప్రేమను కొద్దిగా అర్ధం చేసుకోగలరు. తనను తాను సంపూర్ణంగా అర్పించి తానే పూర్తిగా అదృశ్యం కాగలిగిన వారికే ఆ ప్రేమ అందుతుంది. దేవతలకి కూడా అందని ఈ స్థితి ఆమె సొంతం అంటే ఇక మామూలు మానవుల మాట చెప్పేదేముంది?ఎందుకంటే దేవతలు కూడా ఆత్మార్పణ చేసి శూన్యులుగా మారడానికి భయపడతారు.రాధ ఆ భయాన్ని కూడా అధిగమించింది.


అంతటి పరమోత్కృష్ట ప్రేమోన్మత్త స్థితి ఆమెది. అందుకే ఆ ప్రేమ ఆమెను రసరాణిని చేసింది. సర్వదేవతాశిరోమణిని చేసింది. సకలలోకసామ్రాజ్ఞిని చేసింది. మహత్తర ప్రేమస్వరూపిణిగా భక్తబృంద పెన్నిధిగా ఆమె ప్రతినిత్యం విరాజిల్లుతూ ఉన్నది. ఆమె తన ప్రేమతో దేవాధిదేవుడైన కృష్ణుని బందీని చేసింది. కృష్ణుడు నిరంతరమూ రాధానామాన్ని జపిస్తూ ఉంటాడని,రాధనే నిరంతరమూ ధ్యానిస్తూ ఉంటాడని కొన్ని పురాణాలు చెబుతాయి. అంతగా అతడు రాధాదాసుడయ్యాడు. యోగేశ్వరుడైన కృష్ణుడు రాధాదాసుడా? కృష్ణుడు నిరంతరమూ రాధికను ధ్యానిస్తాడా?ఇదెలా సంభవం?ప్రేమతో సమస్తమూ సాధ్యమే. సమస్తమూ సంభవమే.ప్రేమకు కట్టుబడినట్లు భగవానుడు ఇక దేనికీ కట్టుబడడు.


రాధిక,వయసులో కృష్ణుని కంటే పెద్దది అని పురాణాలు చెబుతున్నాయి. ఆమె కృష్ణునికి వరసకు మేనత్త అవుతుంది అనికూడా కొన్ని చోట్ల వ్రాయబడి ఉన్నది. కాని ఈ తేడాలన్నీ వారి ప్రేమకు ఏమాత్రం అడ్డురాలేదు. శ్రీకృష్ణుని మనోహరరూపాన్ని చూచి అందరూ ముగ్దులవుతారు. ఆ దివ్యమంగళ ప్రేమమూర్తిని చూచి మైమరచని ప్రాణి ఎక్కడుంటుంది?కృష్ణుని సమ్మోహనకరమైన చిరునవ్వులోని మహత్యానికి దాసోహం అనని జీవి ఉండటానికి వీల్లేదు. అలాగే బృందావన గోపికలూ అయ్యారు.ఆయన మురళీగానాన్ని విని వారందరూ మైమరిచారు.


బృందావనంలో,యమునాతీరంలో,వెన్నెలరాత్రులలో,మదనమోహనుని మృదుమధుర మురళీరవాన్ని విని పులకరించి తమతమ కుటుంబాలనూ,పిల్లలనూ కుటుంబసభ్యులనూ,చేస్తున్న పనులనూ ఎక్కడివారిని అక్కడ వదలి మంత్రముగ్దలలాగా ఆ మురళీనాదం వినవస్తున్న వైపు గోపికలందరూ పరుగులెత్తారు.ఒంటిమీద దుస్తులు ఉన్నాయో లేవో వారికి ధ్యాస లేదు. కాళ్ళకు ముళ్ళు గుచ్సుకుంటున్న సంగతి కూడా వారికి తెలీదు. దారిలో పాములను తొక్కుకుంటూ వెళుతున్నారో లేదో స్పృహే లేదు. తమతమ కుటుంబాలు ఉన్నాయో,ఏమయ్యాయో వారికి చింతే లేదు. వారందరూ జీవులు ఆయన జీవేశ్వరుడు. ఇనుపముక్కలు అయస్కాతం వైపు ఆకర్షింపబడినట్లు వారి హృదయాలు కృష్ణుని వైపు లాగబడ్డాయి.


అక్కడ లతానికుంజం మధ్యలో పూర్ణచంద్రుని లాగా చిరునవ్వుమోముతో ప్రకాశిస్తున్న కృష్ణుని చూచి వారు తమను తాము పూర్తిగా మరిచారు. దేహభ్రాంతికి అతీతులయ్యారు.కృష్ణుని దివ్యప్రేమలో వారి వ్యక్తిత్వాలు కరిగి మాయమయ్యాయి.వారికి మాయామోహాలు పటాపంచలయ్యాయి. దేహభ్రాంతి వారిని ఒక్కసారిగా ఒదిలిపెట్ట్టింది.కృష్ణుని దివ్యమంగళరూపమే వారికి కనిపించసాగింది.ప్రపంచాన్నే వారు మరచిపోయారు. మహాయోగులకు కూడా అందనట్టి ప్రేమపూర్వక భావోన్మత్తస్థితి వారికి కరతలామలకమైంది. కృష్ణుని అలా చూస్తూ ఆ మహాప్రేమలో మైమరచారు.ఆ ఆనందస్థితిలో ప్రపంచాన్నే మరిచిపోయారు.దివ్యమైన సమాధిస్థితిలో కరిగిపోయారు. ప్రేమయోగంలో తరించారు.


కాని వారుకూడా తమతమ ఆనందం కోసమే కృష్ణుని ప్రేమించారు.కృష్ణుని సాన్నిధ్యం ఇచ్చేటటువంటి దివ్యమైన ఆనందస్థితిని వారు ఆశించారు.ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఎల్లప్పుడూ సమాధిస్థితిలో ఉండాలని వారు కోరుకున్నారు.అదే మిగిలిన గోపికలకూ రాధకూ ప్రధానమైన భేదం. రాధ ఈ స్థాయిని కూడా అధిగమించింది. రాధ తన ఆనందాన్ని ఆశించలేదు. ఆమె కృష్ణుని ఆనందాన్ని ఆశించింది. కృష్ణుడు ఆనందంగా ఉండటం కోసం తాను ఏమి చెయ్యగలదు?అనే ఆమె ఎప్పుడూ తపించేది.తన ప్రియతముని ఆనందం కోసం తన జీవితాన్ని తన సర్వస్వాన్ని ఆమె తృణప్రాయంగా వదిలిపెట్టింది.తన ఆత్మనే అర్పించి తానొక అనాధగా మిగిలింది. లోకం అర్ధం చేసుకోలేని అతీతస్తితి గోపికలది అయితే, గోపికలను మించిన స్థితి రాధది. దైవానందం కోసం లోకాన్ని లెక్కచెయ్యని స్తితి గోపికలది అయితే,ఆ ఆనందాన్ని కూడా తృణీకరించి పూర్తిగా దైవానికి అర్పణ అయిన స్థితి రాధది.


తన స్థితిని చూచి లోకులు ఏమనుకుంటారో అన్న భయం ఆమెనుంచి దూరమైంది. ఈ బంధాన్ని సమాజం హర్షించదేమో అన్న శంక ఆమె మదిలో లేశమాత్రం కూడా తలెత్తలేదు.తన ప్రియతముని ముందు సమస్త ప్రపంచమూ ఆమెకు తృణప్రాయంగా కనిపించింది. రాధ మనస్సులో కృష్ణుడు తప్ప ఇతర చింత లేనేలేదు. పగలూ రాత్రీ తన ప్రియతముని ధ్యానంలో ఆమె మునిగి ఉండేది. తన వ్యక్తిత్వం ఆ క్రమంలో ఎలా అదృశ్యం అయిందో ఆమెకే తెలీదు.లోకులకు అత్యంత ప్రియమైన దేహంకూడా ఆమె స్మృతిలోనుంచి తప్పుకుంది.ఎల్లప్పుడూ కృష్ణుని ధ్యాసతో ఆమె పరవశించేది."తాను రాధను"- అన్న స్పృహకూడా ఆమెను వదలి వెళ్ళిపోయింది.


ఈ ప్రేమధ్యానంలో పడి సమస్త లోకబంధాలకూ ఆమె అతిసులువుగా అతి సహజంగా అతీతురాలైంది. ప్రేమమహిమ వల్ల విషయవాంఛలు ఆమెలో అదృశ్యమయ్యాయి.తన శరీరాన్నే తాను మరచింది. తన మనస్సునే అధిగమించింది. తన ఆత్మనే కృష్ణునికి నైవేద్యం పెట్టింది.కృష్ణప్రేమలో మునిగిపోయింది. తను వేరు కృష్ణుడు వేరు అన్న భావనకు అతీతురాలైంది. తానే కృష్ణునిగా మారింది. అంతగా తన వ్యక్తిత్వాన్ని ఆమె కృష్ణునిలో లయం చెయ్యగలిగింది.ఆమె ప్రేమకు యోగేశ్వరుడైన కృష్ణుడు కూడా చలించాడు. మహర్షుల కఠోరతపస్సుకు ఏ మాత్రమూ చలించని దేవదేవుడు విచలితుడైనాడు.రాధ ప్రేమలో కృష్ణుడు పిచ్చివాడయ్యాడు.ఆమెకు పరిపూర్ణ బందీ అయిపోయాడు.జీవితాంతం కఠోరమైన నియమనిష్టలు పాటిస్తూ సాధన చేసే యోగులకు కూడా దక్కని సంపద ఆమె సొంతం అయింది.భగవంతుడే ఆమెకు దాసానుదాసుడయ్యాడు.కృష్ణుడు రాధకు ఎంతగా దాసుడయ్యాడంటే,ఆమె అనుజ్ఞ లేనిదే ఆయన ఎవరికీ దర్శనం ఇవ్వడు, ఎవరితోనూ మాట్లాడడు.అంతగా ఆయన రాధకు బందీ అయిపోయాడు. తన నిష్కల్మషమైన పరిపూర్ణమైన ప్రేమతో రాధ భగవంతుని తనవాడిగా చేసుకుంది.రాధ ప్రేమ అంత గొప్పది. అది మానవుల ఊహకు అందనిది. దేవతలకే దుర్లభమైన స్తితి రాధ సొంతం అయ్యింది.


రాధాకృష్ణులు యమునా తీరంలో విహరించని చోటు లేదు. ఒకరి సాన్నిధ్యంలో ఒకరు కరిగిపోతూ ఊసులాడుకోని పొదరిల్లు లేదు.ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ప్రపంచాన్ని మరువని రోజులేదు. బృందావనం వారి ప్రేమకు మూగసాక్షిగా మిగిలింది. ప్రకృతి వారి ప్రేమకు పరవశించింది. వారి పాదాల స్పర్శకు పచ్చిక పులకరించేది. యమునానది పరవళ్ళు తోక్కేది.అక్కడ నిత్యమూ వసంత ఋతువే. నిత్యమూ కోకిలల గానాలు అక్కడ ప్రతిధ్వనించేవి. అక్కడ చెట్లు ఎప్పుడూ చిగురిస్తూనే ఉండేవి. మధుర సువాసనలు ఆ ప్రాంతాన్ని ఆవరించి ఉండేవి.నెమళ్ళు ఆనందనాట్యం చేస్తూనే ఉండేవి. భూమిమీద స్వర్గం దిగి వచ్చినట్లు ఉండేది.దేవతలు ఎల్లప్పుడూ వారి సూక్ష్మరూపాలలో అక్కడ కొలువై రాసలీలను వీక్షిస్తూ ఉండేవారు. అదొక ఆనంద ధామం. అదొక అంతులేని నిత్యోత్సవం.


కానీ,ఎంత గొప్ప ఆనందమైనా ఒకనాటికి సమాప్తంకాక తప్పదుకదా.అలాగే ఒకనాడు బృందావనలీల అయిపొయింది.కృష్ణుడు లోకంలో చెయ్యవలసిన పనులు చాలా మిగిలి ఉన్నాయి.వాటిని పూర్తి చెయ్యడం కోసం ఆయన అక్రూరునితో కలిసి బయలుదేరాడు.ఆ పోవడం పోవడం మళ్ళీ గోకులానికి రానేలేదు. మహారాజు అయ్యాడు.రాజ్యాలు నడిపాడు.యుద్ధాలు చేశాడు. చేయించాడు. జీవితమంతా ఎన్నెన్నో పనులలో తలమునకలుగా ఉన్నాడు. ఎనిమిదిమంది రాజకుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. రాజభవనాలలో నివసించాడు. విలాసజీవితం గడిపాడు.


తన చిన్ననాటి ప్రేయసి రాధను మరచిపోయాడా?బృందావన గోపికల అమాయకమైన, నిష్కల్మషమైన ప్రేమను విస్మరించాడా?మహారాజు అయిన తర్వాత విలాసినుల వగలకు లోబడి పల్లెపడుచుల స్వచ్చమైన ప్రేమకు దూరమయ్యాడా?మనకు తెలియదు.ఆయన అంతరంగం ఆయనకే తెలియాలి.అగాధమైన ఆయన అంతరంగాన్ని ఎవరు శోధించగలరు? మాయా మానుష విగ్రహుని మనసు లోతుపాతులను ఎవరు గ్రహించగలరు?


కాని అమాయకులైన గోపికలు కృష్ణుని మరువలేదు.ఆయన ప్రేమే వారిని నడిపించింది. ఆయన ధ్యానమే వారికి ఊపిరైంది.వారి నాయిక రాధ,కృష్ణుని అసలే మరువలేదు.ఆమె జీవితమంతా కృష్ణుని కోసం ఎదురుచూచింది. కృష్ణప్రేమలో నిరంతరం రగిలిపోయింది.మౌనవేదనలో తన జీవితాన్నే విరహాగ్నిలో వ్రేల్చింది.నిరంతర ధ్యాననిమగ్నతలో,ప్రేమవిహ్వలతలో తపించింది.


ఆ తపనే మహా తపస్సైంది.ఆ నిరంతర తపోఫలంగా లోకమంతా ఆమెకు కృష్ణస్వరూపంగా దర్శనమిచ్చింది. నెమలిపించం రంగు ఆమెకు తన ప్రియతముని గుర్తుకు తెచ్చింది.నెమలిని దగ్గరకు తీసుకుని దాని మెడను ముద్దాడింది.నీలమేఘం ఆమెకు కృష్ణుని దర్శనాన్ని ఇచ్చింది. తనను తాను మరచి ఆ మేఘం వెంట ఆమె పరిగెత్తింది.నీలాకాశం ఆమెకు శ్యామసుందరుని ఎదురుగా నిలిపింది.చేతులు చాచి ఆకాశాన్ని ఆమె కౌగిలించుకుంది.ప్రకృతిలో ప్రియతముని చూస్తూ మౌనంగా కన్నీరు కార్చింది.లోకులకు రాధ పిచ్చిదానిగా తోచింది. ఆమె చేష్టలు పిచ్చిచేష్టలుగా వారికి తోచాయి. కాని ఆమెకు ఏదీ పట్టదు. దేహభ్రాంతే లేని ఆమెకు లోకభ్రాంతి మాత్రం ఎక్కడిది?లోకులను చూచి ఆమె నవ్వింది.లోకులే ఆమెకు పిచ్చివారిలా తోచారు.ఇంద్రియమోహాలలో పడి ప్రేమమూర్తి అయిన భగవంతునికి దూరం అవుతున్న వారిని చూచి ఆమె పిచ్చిదానిలా నవ్వింది.


నిరంతరం ఆమెకు కన్నీళ్లు ధారలు కట్టేవి. సజలనేత్రాలతో ఆమె ఎప్పుడూ పొంగి పొర్లుతున్న పవిత్ర గంగానదిలా తోచేది. విరహవేదనతో ఆమెకు ఒళ్ళు మంటలు పుట్టేది.ఆ వేడికి ఆమెను తాకిన చెలికత్తెల దేహాలు కాగిపోయేవి. ఆమె చెట్టు కింద కూచుంటే ఆ చెట్టు ఆకులు మాడిపోయేవి. ఆమె కూచున్న నేల కాలి నల్లగా అయేది.అంతటి విరహతాపం ఆమెలో తీవ్రయోగాగ్నిని సృష్టించింది.నీళ్ళతో కలిపి ఆమెకు అద్దిన చందనం వెంటనే ఎండిపోయి పొడిపొడిగా రాలిపోయేది.నిరంతరమూ ప్రపంచాన్ని మరచి ఆమె కృష్ణధ్యానంలో తన్మయురాలయ్యేది. తన శరీరస్పృహ ఎప్పుడో కాని ఆమెకు ఉండేది కాదు.మహత్తరమైన సమాధిస్తితులు ఆమెకు సునాయాసంగా కలిగేవి.దివ్యమైన సువర్ణకాంతి ఆమె దేహంనుండి వెలువడి చుట్టుపక్కల ఆవరించేది.దివ్య సుగంధపరిమళాలు ఆమెను ఆవరించి ఉండేవి.ఆమె ముఖంలోని దేవతాకళను చూచినవారు సంభ్రమానికి గురయ్యేవారు. అప్రయత్నంగా చేతులెత్తి నమస్కరించేవారు.


ఈ విధమైన నిరంతరధ్యానంతో రాధ తానే కృష్ణునిగా మారింది. తన వ్యక్తిత్వం కరిగిపోయింది. తాను రాధను అన్న విషయం పూర్తిగా మరచింది.తానే కృష్ణుణ్ణి అన్న అనుభవాన్ని పొందింది.


ఇదిలా ఉండగా ఒకరోజున ద్వారకలో అష్టభార్యలకూ కృష్ణుని జాడ కనిపించలేదు. ఉన్నట్టుండి ఆయన మాయమై ఎక్కడికి పోయాడో తెలియడం లేదు.అంతటా వెదికారు. ఎక్కడా ఆయన కనిపించడు. వారికి తామే కృష్ణుని అంతరంగ సఖులమని గర్వం ఉండేది. తాము ఇంతగా ప్రేమించే కృష్ణుడు తమను వదిలి ఎక్కడికి పోయాడా అని వారికి అనుమానమూ భయమూ కోపమూ కలిగాయి. అప్పుడు వారి బాధను చూడలేక, మహోన్నతభక్తుడైన నారదమహర్షి కరుణతో వారికి దర్శనమిచ్చి బృందావనం వెళ్లి చూడమని సలహా చెప్పాడు.


ఆయన సూచన మేరకు అక్కడకు వెళ్ళిన వారికి ఒక మనోహరమైన దృశ్యం కనిపించింది.

పున్నమివెన్నెలలో,చల్లని యమునాతీరంలో, మనోహరమైన పూలపొదరిండ్ల మధ్యన పుష్పసుగంధభరిత మనోహరనికుంజమధ్యంలో తన సఖుల మధ్యన రాధాసమేతుడై మృదుమధుర మురళీనాదాన్ని వెదజల్లుతూ తేజోమూర్తిగా వెలుగుతున్న కృష్ణుడు దర్శనమిచ్చాడు. ఆ ప్రదేశమంతా ఆనందప్రవాహం ముంచెత్తుతూ ఉన్నది. అక్కడ చెట్లూ ఆకులూ పూలూ అన్నీ ఏదో కాంతితో మెరిసిపోతున్నాయి. గోపికలూ,రాధా,కృష్ణుడూ అప్పటివరకూ వారికి తెలిసిన దేహధారులైన మనుషులలాగా కనిపించడం లేదు. దేవతాస్వరూపాల వలె వెలుగుతూ ఉన్నారు. ఆ మహత్తర దివ్యదర్శనాన్ని చూచి నోట మాటరాక అప్రతిభులైన వారినిచూచి చిరునవ్వు చిందిస్తూ నల్లనయ్య ఇలా అన్నాడు.

'ప్రియతములారా. మీరందరూ నన్ను ప్రేమించారు.నిజమే!!కాని ప్రేమలోని ఆనందాన్ని కోరి నన్ను మీరందరూ ప్రేమించారు. నాకోసం నన్ను మీరు ప్రేమించలేదు. నా సాన్నిధ్యంలో ఆనందంకోసం మీరు నన్ను కోరుకున్నారు. మీకు నేను ముఖ్యమే. కాదనను.కాని అంతకంటే మీ ఆనందమే మీకు ముఖ్యం
.

రాధ అలాకాక నన్ను నన్నుగా ప్రేమించింది.తన ఆనందం కోసం నన్ను ప్రేమించలేదు.నా సంతోషాన్ని నిత్యమూ ఆశించింది.దానికోసం తన వ్యక్తిత్వాన్ని నాకు సమర్పించి తానొక శూన్యంగా మిగిలింది. తానే అదృశ్యమై తన ఆత్మను నాకు పూర్ణంగా అర్పించింది. తానే నేనుగా మారింది. అందుకే ఆమె ప్రేమ మీ అందరి ప్రేమకంటే అత్యున్నతమైనది. నేను ఆమె దాసుడను. ఇటువంటి ప్రేమను మీరూ కలిగి ఉన్నప్పుడు మాత్రమె నేను మీవాడిని అవుతాను. నేను రాధను వదలి రాలేను. ఆమె ప్రేమకు నేను బందీని. కనుక మీకు నేను కావాలంటే రాధను ప్రార్ధించండి. ఆమె ఒప్పుకుంటే నేను మీతో వస్తాను. లేకపోతే రాలేను.మీరందరూ నా భార్యలు మాత్రమే కాని రాధిక నాకు అత్యంత ప్రియతమురాలు.ఆమె నా ప్రేయసి.నా హృదయంలో ఆమె స్థానం చాలా ఉన్నతమైనది.


అందరూ ఆయన మాటలు విన్నారు. రాధ పొందిన ప్రేమను అందుకోవాలంటే, రాధ చేరుకున్న స్థితిని పొందాలంటే ఈజన్మలో తమవల్ల కాదని వారికి అర్ధమైంది.అప్పుడు వారంతా ప్రేమమయి రాధకు ప్రణమిల్లి 'ఓ మనోజ్ఞా, అద్భుతమైన నీ ప్రేమతో భగవంతుడినే నీ ప్రేమికునిగా చేసుకున్నావు. ఎవరికోసం లోకం అంతా పరితపిస్తున్నదో ఆ దేవదేవుడు నిన్ను వదలి ఎటూ పోలేనంటున్నాడు. భార్యలమైన మాతో రానంటున్నాడు. రాజభవనాలను, అప్సరసల వంటి భార్యలను వదలి, ఈ నదీతీరంలో ఈ చెట్లమధ్యన నీతోనే ఉంటానని అంటున్నాడు. నీ ప్రేమ ఎంత గొప్పది? కనీసం దానిలో ఒక్క కణం మాకు దక్కితే చాలుకదా మా జన్మలు ధన్యములు అవడానికి? తల్లీ. నీ స్థాయిని మేము ఎన్నటికీ అందుకోలేము.దయుంచి కృష్ణుని మాతో పంపించు' అని ప్రార్ధించారు.


దానికి రాధాదేవి చిరునవ్వుతో 'సరే అలాగే కానివ్వండి.కృష్ణుని మీరు తీసుకువెళ్ళండి. అతను మీతో తప్పక వస్తాడు. కాని అతను ఇక్కడకూడా ఉంటాడు. అంతే కాదు ఎప్పటికీ ఇక్కడే ఉంటాడు. నాతోనే నాలోనే నిత్యమూ నివసిస్తాడు.యోగేశ్వరుడూ సర్వేశ్వరుడూ అయిన కృష్ణునికి అది అసాధ్యం కాదు. ఎందుకంటే నిజానికి కృష్ణుడు నన్ను వదలి ఉండలేడు. నేనూ అతన్ని వదలి ఉండలేను. అతనూ నేనూ వేర్వేరు కాదు. మేమిద్దరమూ ఒక్కరమే. కాని లోకలీల కోసం మీతో వస్తాడు. ఇది మీకు అర్ధంకాని దివ్యలీల. మహామహులైన యోగులకు కూడా ప్రేమయొక్క రుచి తెలియనిదే ఈ లీల అర్ధం కాదు.' అని కృష్ణుని వైపు చూచి మనోహరమైన చిరునవ్వు నవ్వింది. అప్పుడు కృష్ణుడు మారు మాట్లాడకుండా వారితో కలిసి ద్వారకకు పయనమయ్యాడు.

వారందరూ కలిసి కనుచూపు మేరకు వెళ్లి వెనుకకు తిరిగి చూడగా, అంతకు ముందు వారు చూచిన రీతిలోనే, మళ్ళీ గోపికలు రాధతో కృష్ణుడు వారికి యమునాతీరంలో యధావిధిగా రాసలీలలో దర్శనం ఇచ్చాడు.పక్కకు తిరిగిచూడగా కృష్ణుడు నవ్వుతూ మళ్ళీ వారితోనే ఉన్నాడు. అప్పుడు వారికి సత్యమేమిటో అర్ధమౌతుంది.


బృందావన రాసలీల నిత్యమూ సాగుతూనే ఉంటుంది. అక్కడ మహత్తరమైన ప్రేమప్రవాహం నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. లోకవాసనలు అందుకోలేని స్వచ్చమైన ప్రేమమూర్తులుగా రాదాకృష్ణులు అక్కడ ఎప్పుడూ విరాజిల్లుతూనే ఉంటారు. రాసలీల ఆ దివ్యభూమిలో నిత్యమూ జరుగుతూనే ఉంటుంది.ఇది ఇప్పటికీ ఉంది.చూడగలిగిన వారికి కనిపిస్తుంది.ఆస్వాదించే శక్తి ఉంటే అందుబాటులోకి వస్తుంది.


నిజానికి కృష్ణుడు బృందావనాన్ని వదిలి ఎక్కడికీ పోలేదు. అతని ఛాయ మాత్రమే గోపికలను వదిలి వెళ్లి లోకలీలను నడిపింది. ప్రేమమూర్తి అయిన కృష్ణుడు వారిని వదిలి ఎక్కడికి పోగలడు? అతను వారి ప్రేమకు కట్టుబడ్డాడు. నిత్యమూ రాసలీలలో అతను అక్కడే ఉంటాడు. వారి ప్రేమ కాలానికి అతీతంగా అలా వెలుగుతూనే ఉంటుంది.


అట్టి ప్రేమను పొందగలిగిన జీవితాలే నిజమైన జీవితాలు. ఆ ప్రేమ లేశమాత్రం తాకిన హృదయాలే ధన్యములు. రాధానుగ్రహం అనే ప్రేమసముద్రంలో ఒక బిందువు తాగితే చాలు మనిషి దేవతగా మారుతాడు. అతని వంశం మొత్తం ధన్యం అవుతుంది. అతని పూర్వీకులు అందరూ ఉత్తమగతిని పొందుతారు. మహోన్నతమైన ప్రేమతత్వంలో తనను తానే మరచి దివ్యప్రేమలో ఓలలాడుతూ అతడు ఉండిపోతాడు.యోగులకూ తపస్వులకూ అందని మహత్తర దివ్యభూమిక అతనికి అందుతుంది. అతను పిలిస్తే భగవంతుడు పలుకుతాడు. ఎదురుగా కనిపిస్తాడు. మాట్లాడతాడు.


ఆ మహత్తరమైన ప్రేమముందు లోకం తుచ్చంగా కనిపించదూ? ఈ ప్రేమ ముందు స్వార్ధపూరిత జీవితాలు అల్పాతి అల్పములుగా అనిపించవూ? అటువంటి ప్రేమను పొందని ఈ జన్మలెందుకు?క్రిమికీటకాలుగా బతికి చివరికి మట్టిలో కలిసే ఈ జీవితాలేందుకు?ప్రేమను ఆస్వాదించని మనిషి జన్మ ఎందుకు?


నిత్యానందసీమలో ప్రియతముని మోమును వీక్షిస్తూ కాలాన్ని మరచి కరిగిపోని ఈ భ్రాంతిమయ బానిస బ్రతుకులెందుకు?


తనను మరచి తన ప్రియతముని ధ్యానంలో కరిగి పోవడమే రాధాతత్త్వం. తన వ్యక్తిత్వాన్ని కరిగించి తాను తన ప్రియునిగా మారడమే రాధాతత్త్వం. తన ఆనందాన్ని కాక ప్రియుని ఆనందాన్ని ఆశించడమే రాదాతత్వం. సంపూర్ణ ఆత్మార్పణే ఈ సాధనారహస్యం.ఆ మహోన్నత అర్పణలోనే దైవాన్ని కదిలించగల కరిగించగల మహత్తరమైన శక్తి ఉన్నది.ఆ ప్రేమకే దైవం కట్టుబడుతుంది. దీనికి తక్కువైన ఇతరములైన ఏ సాధనలకూ దేవదేవుడు లొంగడు.


అందుకే రాధాతత్వం సర్వోత్తమం. రసరమ్యం. మహత్తర ప్రేమనిలయ రాధ. దేవదేవుడైన కృష్ణుడు ఆమె హృదయంలో నిత్యమూ వెలుగుతూ ఉంటాడు. అందుకే సమస్త దేవతలూ రాధానుగ్రహం కోసం తపిస్తూ ఆమెను ప్రార్ధిస్తూ ఉంటారు.ఆమె అనుగ్రహం లేనిదే ఎంతటి వారైనా ప్రేమమూర్తి అయిన కృష్ణదర్శనం పొందలేరు.ప్రేమను అందుకోలేని వారు జీవన సాఫల్యతను పొందలేరు.దానికి రాధానుగ్రహం తప్పనిసరి. ఎందుకంటే ఒక్క రాధ మాత్రమె తన సంపూర్ణ ఆత్మార్పణతో కృష్ణుని చేరుకోగలదు. దైవాన్ని చేరడానికి ఇది తప్ప వేరే దారి లేదు.

శ్రీరామకృష్ణులకు కూడా,మొదటగా రాధాదేవి దర్శనం అయిన తర్వాతనే కృష్ణదర్శనం కలిగింది.రాధాదేవి ఆయన ఎదుట ప్రత్యక్షమై ఆయన శరీరంలో లీనమైంది.తత్ఫలితంగా రాధాదేవి పొందిన ప్రేమసమాధిని ఆయన రుచి చూడగలిగారు.ఆ తర్వాతనే ఆయనకు కృష్ణ సాక్షాత్కారం కలిగింది.ఆ కృష్ణుడు కూడా ఆయనలోనే లీనమయ్యాడు.ఆవిధంగా రాధాకృష్ణులు ఆయనలోనే ఉన్నారు.అందుకే ఆయన ముఖం ఎప్పుడూ అంత ఆనందంతో వెలుగుతూ ఉండేది.


రాధానుగ్రహమే కృష్ణదర్శనానికి దారి.రాధాదేవి పొందిన స్థితిని పొందనిదే కృష్ణుడు కనికరించడు.కనిపించడు.రాధాదేవి కరుణించి అనుజ్ఞ ఇస్తేనే ఆయన మనకు కనిపిస్తాడు.రాధాదేవిని దాటుకునే మనం కృష్ణుని చేరుకోవలసి ఉంటుంది.అంటే,ప్రేమోన్మత్త పూరితమైన ఆత్మార్పణమే కృష్ణ దర్శనానికి దారి.ఆ స్థితే రాధ.


ఇదే రాధా ప్రేమ తత్త్వం !!


 

19 September 2015

Psychological Facts !! Where You Feel It :-

కామాఖ్యాదేవి :-

ఈ సృష్టి సకలం శక్తి మూలంగానే నడుస్తోంది. ఆ శక్తి ఎవరనే వాదం అనవసరం. ఎన్నో కోట్ల మైళ్ల దూరంలో ఎప్పటినుంచో అలా ఉన్న నక్షత్రాలు భూమ్మీదకు రాలిపడకుండా ఉన్నాయంటే దానికి ఇప్పటి శాస్త్రజ్ఞుల ప్రయోగాలు కారణం కాదు! ప్రస్తుతం వాటిమీద ప్రయోగాలైతే చేస్తూ, ఇంకా కొత్తవి ఉన్నాయంటున్నారు గానీ, ఇతమిత్థంగా నిర్ణయించలేక పోతున్నారు. కాబట్టి నీకు, నాకూ, మనకందరకూ ఆ శక్తే దైవంతో సమానం. సమాన మేమిటి దైవమే. ఆ శక్తి లేనిదే అడుగు తీసి అడుగు వెయ్యలేం. చివరకు ఆ పరమేశ్వరుడైనా సరే! శివునికి, శక్తికి తేడాలేదు. శివ అంటే శివుడు. శివా అంతే శివానీ అని అర్థం. అందుకే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ‘శివశ్శక్త్యాయుక్తో’… అంటూ తమ సౌందర్యలహరిని ప్రారంభిస్తారు. కాళిదాస మహాకవి కూడా ఆది దంపతులను వాక్కు, అర్థంగా పోల్చాడు. అలాంటి ఆ శక్తి స్వరూపుణి వెలసిన అత్యంత శక్తిమంతమైన క్షేత్రం కామాఖ్యాదేవిమందిరం.


సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తి పీఠల్లో అత్యంత శక్తిమంతమైనది కామాఖ్యాదేవి క్షేత్రం ఒకటి. అస్సాంలోని బ్రహ్మపుత్రా నది ఒడ్డున, గౌహతికి సమీపంలో ఉందీ క్షేత్రం. అస్సాం రాజధాని గౌహతికి రైలు, విమానం, యాత్రాట్రావెల్స్ ద్వారా కూడా ప్రయాణం చేయవచ్చు. ఇక్కడకు రోడ్డు, రైలులో చేసే ప్రయాణం ఒక మధురానుభూతిని మిగిలిస్తుంది. ఈ ప్రయాణంలో మనతో పాటే సాగివచ్చే ఈ అందమైన ప్రకృతి మన హృదయ సీమలో చెరగని స్థానాన్ని పదిలపరచుకుంటుంది. ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ గౌహతి వచ్చిన వారికి ఇక్కడికి 8 కిలో మీటర్ల దూరంలో ఉన్న నీలాచల పర్వతాలు మరింత అందాలతో కనువిందు చేస్తాయి. గుబురుగా, దట్టంగా దారి కనిపించనంత ఎత్తుగా పెరిగిన చెట్టతో నిండి ఆకాశాన్నంటుతూ ఉన్న నీలాచలం - ఈ పర్వతం దిగువ అంచు తాకుతూ ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నదీ జలం. ఇంత రామణీయకతను దర్శించిన భక్తుల జన్మ సఫలం. దీన్నంతా చూసిన భక్తులు ఎంతగానో పరవశులై పోతారు. ఇంత అందమైన ప్రకృతి సోయగాన్ని తమ మనుగడకు వరంగా ఇచ్చిన పరమేశ్వరికి కృతజ్ఞతానుభూతిని తెలియచేసుకుంటారు. ఈ పర్వతంపైనే శక్తి పీఠం ఉంది. ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తున్న ఈ పర్వతం పైకి ఆటోలు, టాక్సీలపై చేరుకోవచ్చు. అమ్మను దర్శించుకోవచ్చు.
ఇక్కడ వెలసిన దేవిని కామాఖ్య అని, కామరూపిణి అని పిలుస్తారు. సామాన్యంగా కామం అంటే శారీరక చిత్త చాంచల్యంగా భావిస్తారు. కానీ, అసలు కామమన్నా, కామరూపిణి అన్నా అనుకున్న రూపాన్ని అనుకున్న క్షణంలో మార్చుకోగలగడం అని అర్థం. అలా చెయ్యగలగిన శక్తిమంతురాలు కాబట్టే కామరూపిణి అయింది. కామాఖ్య దేవి అనేక రూపాలు ధరించి భక్తులకు చేరువై వారి వారి కోరికలను తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది. కామాఖ్యా దేవిని త్రిపుర శక్తిదాయినిగా కొలుచుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మూడు ప్రధాన రూపాల్లో ఈ తల్లి ఇక్కడ దర్శనమిస్తుంది. అరాచకవాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా రూపం ధరిస్తుంది. ఈ రూపాన్ని పరమేశ్వరుడు కూడా చూడలేడు. ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహినియై దర్శనమిస్తుంది. పరమే శ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపురసుందరిగా మారుతుంది. ఇంకా అనేక రూపాలు ధరించగల తల్లి ఈమె.
ఆలయానికి వచ్చిన భక్తులకు ముందుగా స్వాగత ద్వారం ఎదురవుతుంది. స్వాగత ద్వారం కూడా ఎంతో ఆకర్షణీయంగా చక్కగా చెక్కిన శిల్పాలతో చూడముచ్చటగా కనిపిస్తూ భక్తులను అమ్మవారి దర్శనానికి రమ్మని ఆహ్వానిస్తున్నట్టుంటుంది. స్వాగత ద్వారాన్ని దాటుకుని ముందుకు వెడితే అక్కడ స్థూపాకారంలో ఉన్న గోపురాలతో ఆలయం దర్శనమిస్తుంది. ఆలయం గోపురాదులు, లోపలి శిల్ప సంపద అలనాటి సౌందర్యాన్ని చవి చూపిస్తుంటాయి. ఇక్కడి గోపుర నిర్మాణం మన వైపు మాదిరి కాకుండా ఉత్తరాది పద్ధతి స్పష్టంగా కనిపిస్తుంది. కనిపించే వాటిలో పెద్దగా ఉన్న గోపురం కలిగిన మందిరంలోనే కామాఖ్యాదేవి కొలువు దీరి ఉంది. ఈ ప్రధాన గోపురంపై ఉన్న శిఖరంపై బంగారు కలశం స్థాపితమై ఉంది. అలాగే, మిగిలిన గోపుర శిఖరాలపై త్రిశూలాలు స్థాపితమై ఉన్నాయి. ప్రధాన గోపురంపై అసంఖ్యాక రీతిలో పావురాళ్లు వాలి ఉంటాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే అమ్మవారు విగ్రహరూపంలో దర్శనం ఇవ్వరు.

ఇందుకో పురాణ కధ ఉంది. భర్త అయిన పరమేశ్వరుణ్ణి పిలవకుండా తన తండ్రి దక్షప్రజాపతి యాగాన్నే చేయాలను కోవడమే కాకుండా, వచ్చిన తనను కూతురని కూడా చూడకుండా అవమానించినందుకు సహించలేని సచీదేవి యజ్ఞ గుండం వద్దనే అగ్నికి ఆహుతై పోతుంది. దీన్ని భరించలేని పరమేశ్వరుడు అగ్రహోదగ్రుడై వీరభద్రుణ్ణి సృష్టించి యజ్ఞాన్ని భగ్నం చెయ్యమని పంపిస్తాడు. తనలో అర్థభాగమైన భార్య తనను విడిచి ఎక్కడకూ పోలేదని తెలిసిన పరమేశ్వరుడు సాధారణ మానవునిలా లోకాన్ని పట్టించుకోకుండా విరాగిలా మారతాడు. భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకుని పిచ్చిగా తిరుగుతుంటాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు పార్వతీ దేహాన్ని సుదర్శనంతో ఖండిస్తాడు. అలా ఖండించినప్సుడు ఆ ముక్కలన్నీ చెల్లాచెదురై వివిధ ప్రాంతాల్లో పడతాయి. అందులో అమ్మ వారి ప్రధానమైన యోనిభాగం గౌహతి వద్ద నీలాచలంపై పడింది. మానవ సృష్టికి మూల కారణమైన స్థానం కాబట్టి ఈ ప్రదేశం అన్ని శక్తి పీఠాల్లోకెల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

అంతే కాకుండా ఈ పీఠమే అన్ని శక్తి పీఠాలకూ ఆధార స్థానంగా భావిస్తారు. అలాగే, ఈ శక్తి పీఠాన్ని మహాయోగ స్థలమని పిలుస్తారు. నీలాచలంపై దేవి యోని భాగం పడి ఈ పర్వతం నీలంగా మారిందంటారు. ఈ రాతి యోనిలోనే కామాఖ్యాదేవి నివాసం ఉంటుందని అంటారు. ఇక్కడకు వచ్చి ఈ పర్వతాన్ని ఒక్కసారి తాకితే అమరత్వం సిద్ధించి బ్రహ్మలోకంలో ఉండి చివరిలో మోక్షాన్ని పొందుతారని అంటారు. దేవతల పంపుపై తనను మోహ పరవశుణ్ణి చేసేందుకు వచ్చిన మన్మథుణ్ణి ఈ నీలాచలంపైనే పరమేశ్వరుడు దగ్థం చేశాడు. అనంతరం రతీదేవి ప్రార్థనను ఆలించి ఆమెకు మాత్రమే కనిపించేలా తిరిగి బతికించారు అమ్మాఅయ్యలు. కాబట్టి ఈ ప్రాంతం కామరూప ప్రాంతమైంది. ఇక్కడ సకల దేవతలూ పర్వత రూపంలో ఉంటూ అమ్మను సేవించుకుంటుంటారు. ఎందుకంటే ఈ క్షేత్ర అధిష్ఠాన దేవత నీల పార్వతి. రాక్షసుడైన నరకాసురుడు ఆ నారాయణుని పట్ల భక్తి భావంతో ఉండే వాడు. అందుకు మహావిష్ణువు మోచ్చి అతనికి ప్రాగ్జ్యోతషపురానికి రాజును చేస్తాడు. కామాఖ్యాదేవిపై భక్తితో ఉంటే నీవా పదవిని ఎక్కువ కాలం అనుభవించగలవని చెబుతాడు.

కానీ, మరో ద్వాపరయుంగాంతంలో శోణితపురానికి బాణాసురుడు రాజయ్యాడు. అతని ప్రోద్బలంతో నరకుడు దేవతలకు శత్రువుగా మారి కామాఖ్యాదేవినే పెండ్లి చేసుకొమ్మని కోరతాడు. అప్పుడా తల్లి తెల్లవారేలోగా ఇక్కడ స్వర్గాన్ని తలపించే విధంగా భవనాల్ని సృష్టించ గలిగితే
చేసుకుంటానంటుంది.వెంటనే అతను విశ్వకర్మను పిలిచి ఆ పని అప్పచెబుతాడు. పని పూర్తయ్యే సమయానికి మాయా ప్రభావంతో కోడి కూస్తుంది. దాంతో వివాహం ఆగి పోతుంది. అందుకే కామాఖ్యా మందిరం వెళ్లే మార్గాన్ని నరకాసురమార్గంగా పిలుస్తారు. కామాఖ్యాదేవి గర్భగుడి మందిరాన్ని కామదేవ మందిరంగా పిలుస్తారు. ఈ లోపలెక్కడా నరకుని ప్రసక్తి వినిపించదు. అలాంటి కామమోహితుణ్ణి సైతం ఏమార్చగలిగిన తల్లిని దర్శించుకునేందుకు ఎంతో మంది భక్తులిక్కడకు తరలి వస్తారు.

ఈ ఆలయం ఎంతో పురాతనమైనది.12వ శతాబ్దం వరకూ ఈ ప్రాంతాన్ని పాలించిన కామరూపాధిపతి తమ శాసనాల్లో ఆలయం ప్రస్తావన ఎక్కడా తీసుకురానప్పటికీ, తరువాతి వారి శాసనాల మేరకు కామేశ్వరి మహా గౌరి అమ్మవారు ఇక్కడ ఉన్నట్టు తెలుస్తోంది.13వ శతాబ్దం మొదట్లో గుత్తాధిపత్యం కోసం రాజుల మధ్య యుద్ధాలు ఎక్కువగా జరుగుతుండేవి. ఈ క్రమంలో కూచ్ బిహార్ రాజా విశ్వసింహ్ రాజయ్యాడు. ఒకసారి జరిగిన యుద్ధంలో అయినవాళ్లనందరినీ కోల్పోయి వారిని వెతుక్కుంటూ సోదరునితో నీలాచలంపైకి వస్తాడు విశ్వసింహ్. ఇక్కడితనికి ఒక వృద్ధురాలు కనిపించి సేద తీరుస్తుంది. ఆ సందర్భంలో అక్కడ కనిపించిన మట్టి దిబ్బ గురించి అవ్వను ప్రశ్ని స్తాడు రాజు. ఇందులోని దేవత చాలా శక్తిమంతురాలని, ఏ కోరికనైనా క్షణాల్లో తీరుస్తుందని చెబుతుంది. వెంటనే రాజు తన అనుచరులంతా తిరిగి రావాలని కోరుకుంటాడు. వెంటనే వారంతా అతని వద్దకు వస్తారు. రాజు ఎంతో భక్తితో తన రాజ్యంలో కరవు శాంతిస్తే ఇక్కడ బంగారు గుడి కట్టిస్తానని మొక్కుకుంటాడు. అలాగే, అతని రాజ్యం సస్యశ్యామలమై సుఖవంతమవుతుంది. అప్పుడు రాజు గుడి కట్టించేందుకు మట్టిదిబ్బ తవ్వించగా అక్కడ కామాఖ్యాదేవి రాతిశిల బయటపడుతుంది. ఆ అమ్మకు మట్టి రాయిలో గురివింద ఎత్తులో బంగారాన్ని పెట్టించి తేనెతుట్టు ఆకార గోపురాదులతో ఆలయాన్ని నిర్మింపచేస్తాడు.
కామాఖ్యా దేవీ మందిరం అధిష్ఠాన దేవత భైరవి కామాఖ్యాదేవి. అమ్మ ఎక్కడుంటే అయ్య కూడా అక్కడే ఉంటాడు. కాబట్టి నీలాచలమంతా అమ్మాఅయ్యల స్వరూపమే. ఇక్కడ పరమేశ్వరుడు ఉమానంద భైరవునిగా ఉంటాడు. నీలాచలానికి తూర్పుభాగంలో బ్రహ్మపుత్రా నది మధ్యలో వేంచేసి ఉన్నాడీ స్వామి. అందుకే మందిరం కింద ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ శివుడు లింగస్వరూపంలో దర్శనమిస్తాడు. ఈ లింగాన్ని చూడగానే మనసంతా భక్తిభావంతో పులకించి పోతుంది. ఇక్కడకు పడవలపై చేరుకోవచ్చు. అమ్మవారిని దర్శించేందుకు ముందే ఈ స్వామిని దర్శించాలి. ఈ స్వామిని దర్శించని పక్షంలో అమ్మ వారి యాత్ర పూర్తిగానట్టే పరిగణిస్తారు భక్తులు. అందుకే తప్పనిసరిగా ఇక్కడకు వచ్చిన వారంతా ముందుగా ఉమానంద భైరవుణ్ణి దర్శించి ఆయన ఆశీస్సులు పొందుతారు. ఇక్కడకు చేరుకుంటుంటే వశిష్ఠుడు తపస్తు చేసుకునే ప్రాంతం కనిపిస్తుంది. వశిష్ఠా శ్రమాన్ని చూస్తుంటే నిజంగా మనం మునివాటికకే వచ్చామా అనిపించక మానదు. ఎటు చూసినా చూసినా పచ్చ దనమే. బండరాళ్ల మధ్య నుంచి జలజల పారుతున్న నీటి ప్రవాహం మన మనసుకు ఊరట కలిగిస్తుంది. దీన్ని వశిష్ఠ గంగ అంటారు. ఆ ప్రవాహ ఝరికి పైకి లేచే నీటి తుంపరులు పరిసరాల్ని ఆహ్లాదపరుస్తాయి. ఇక్కడ ఎంతో మంది స్నానాలు చేస్తారు. ఇక్కడ విఘ్న నివారకుడైన వినాయకుని విగ్రహం, విద్యలకు అధిదేవత అయిన సరస్వతి విగ్రహం దర్శనం ఇస్తాయి.

ఇక్కడ ఉన్న ఒక మందిరం కనిపిస్తుంది. దాని బయటా, లోపలా కూడా ఆద్యంతం దేవతా మూర్తులు, రాజుల విగ్రహాలు చెక్కి కనులకు విందు చేస్తాయి. లోపల గీతాచార్యుని విశ్వరూప సందర్శనం, త్రిమూర్తుల తైలవర్ణ చిత్రాలు కనిపిస్తాయి. ఇంకా గోడలపై అనేక భంగిమల్లో వినాయకుని వర్ణ విగ్రహాలు చెక్కి ఉంచారు. ముద్దులయ్య చూసేందుకు ముద్దు రావడమే కాదు భక్తిని కూడా పెంపొందింపచేస్తున్నాడు. లక్ష్మీనారాయణుల మందిరంతో పాటు మరెందరో దేవతా మూర్తుల విగ్రహాలు దర్శనమిస్తాయి. అమ్మవారి ఆలయ శక్తి పీఠం ముందే ఒక పుష్కరిణి కనిపిస్తుంది. ఇది ఎంతో శక్తిమంతమైంది. దీన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారంటారు. ఈ గుండానికి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలం వస్తుందని భక్తుల భావన. ఇందులో నీరు ఎరుపురంగులో ఉంటుంది. దీన్ని సౌభాగ్య కుండం, పాతక వినాశ కుండం అని పిలుస్తారు. అమ్మ వారి యోని స్రావిత పవిత్ర జలలాతో పునీతమైన ఈ కుండంలో స్నానం చేస్తే ఎంతటి మహాపాతకమైనా నశిస్తుందని, బ్రహ్మ హత్యా పాతకమైనా నివారణ మవుతుందని విశ్వాసం. దేవాలయానికి కొద్దిగా వెనుక భాగంలో మరో కుండం ఉంది. ఇది పార్వతి కుండం. ముందు కుండంలో స్నానం చేసిన భక్తులంతా ఈ పార్వతీకుండంలో కూడా స్నానం చేసి దర్శనానికి వెడతారు. అంటే సౌభాగ్య కుండంలో స్నానం చేసిన భక్తులు ఆలయంలోని యోని శిలారూపాన్ని తాకి నమస్కరించుకుంటారు. అక్కడి యోని స్రావిత జలాన్ని తీర్థంగా సేవిస్తారు. ఈ కారణంగా ఆలయం వెనుక ఉన్న పార్వతి కుండంలో మరో సారి తలస్నానం చేసి శుచులవ్వడం మంచిదని ఇక్కడి పూజార్లు చెబుతారు.

కామాఖ్యాదేవిని దర్శనానికి లోనికి వచ్చిన భక్తులకు అక్కడకు సమీపంలోనే ఉన్న వినాయకుడు దర్శనమిస్తాడు. ఆయనను దర్శించుకుని అనంతరం అమ్మవారి దర్శననానికి వెడతారు. కామాఖ్యే వరదే దేవీ: నీలపర్వత వాసినీ… త్వం దేవీ జగతం మాతా: యోనిముద్రా నమోస్తుతే’ అని ప్రార్థిస్తూ లోనికి ప్రవేశించి అక్కడ దీపాలు వెలిగించుకుంటారు. అనంతరం అమ్మవారి దర్శనానికి బారికేడ్లలో నిల్చొని క్రమపద్ధతిలో ముందుకు నడుస్తారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అడుగుపెడుతుంటే మందిరంలోకి అడుగు పెడుతున్న భక్తులకు పన్నెండు స్తంభాల మంటపం మధ్య దేవి ఉత్సవ మూర్తి కనిపిస్తుంది. ఈ తల్లినే హరగౌరి మూర్తి, భోగమూర్తి అని పిలుస్తారు. ఈ మూర్తికి ఉత్తర భాగంలో వృషభ వాహనుడు, పంచవక్త్రుడు, దశాభుజ విశిష్ఠుడు, కామేశ్వర మహాదేవ మూర్తులు కనిపిస్తారు. దక్షిణ భాగంలో షడాననుడు, ద్వాదశ బాహు విశిష్ఠుడు, అష్టాదశలోచన, సింహవాహిని, కమలాసనదేవి మూర్తి దర్శనమిస్తుంది. ఈ తల్లినే మహామాయ కామేశ్వరీ పేరుతో పిలిచి కొలుచుకుంటారు. వీరందరిని చూసుకుంటూ మెట్లు దిగుతుంటు కామాఖ్యాదేవి శిలాయోని పీఠ మందిరం వస్తుంది. ముందు చెప్పు కున్నట్టు కామాఖ్యా దేవి విగ్రహం రూపంలో ఉండదు. శిలారూపంలో యోనిముద్రలో పూజలందుకుంటుంది తల్లి. ఈ శిలారూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది. భక్తులంతా మెట్లు దిగి గర్భగుడిలోపల ఉన్న శిలారూప భగేశ్వరీ మాతను దర్శిస్తారు. ఇక్కడ విశేష మేమిటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యాదేవీకి నెలలో మూడు రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది. మృగశిర నక్షత్రం మూడవ పాదంతో మొదలుఎట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకూ అమ్మవారి ఋతు స్రావం జరిగే ప్రత్యేక రోజులు. దేవీ భాగవతంలో ఈ ప్రత్యేక రోజుల గురించి ప్రస్తావన స్పష్టంగా ఉంది. ఈ రోజుల్లో యోనిశిల నుండి ఎర్రని స్రావం వెలువడుతుంది. ఈ ఎర్రని నీరే శక్తిపీఠం ముందున్న సౌభాగ్య కుండంలోని నీరుగా చెబుతారు. ఈ ప్రత్యేకమైన మూడు రోజులు ఆలయం మూసి ఉంచుతారు. నాలుగో రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు. అంతకు ముందే చాలా మంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు. ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీ కుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు. ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు. ఇది దగ్గర ఉంటే వారికి ఋతుస్రావ దోషాలు, రజస్వల అయిన సందర్భంలోని దోషాలేవి అంటవని భక్తుల విశ్వాసం.
ఇక ప్రతీ ఆషాఢమాసంలో అయిదు రోజుల పాటు అంబుబాచి మేళా జరుగుతుంది. ఎప్పుడెప్పుడు ఈ మేళా జరుగుతుందా అని ఎంతోమంది భక్తులు ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ అంబుబాచి మేళానే కామాఖ్యా కుంభమేళాగా పిలుస్తారు. ఈ మేళా కనీవినని రీతిలో జరుగుతుంది. దీని వైభవాన్ని ప్రత్యక్షంగా చూడాలే తప్ప వర్ణించేందుకు భాష చాలదంటే అతిశయోక్తి కాదు. ఆ శుభ తరుణం రాగానే వేలాదిమంది పండాలు, సిద్దులు వంటి వాళ్లే కాక సామాన్య భక్తులు కూడా ఆలయానికి తరలివచ్చి ఈ మేళాలో పాల్గొని అమ్మపై తమకున్న భక్తిశ్రద్ధలను చాటుకుంటారు. ఈ సందర్భంగా వారు చేసే తప్పెట్లు, తాళాలు వాయించుకుంటూ చేసే విన్యాసాలు, అభినయించే నృత్యాలు, ఇంతింత బారున జటలు కట్టిన జుట్టుతో ఉన్న సాధులు, సాధ్విలు పెట్టే అభయ ముద్రలు ఆకర్షణీయంగా ఉంటాయి. చాలామంది భక్తులు ఈ మేళా రోజులు జరిగినన్ని రోజులూ ఇక్కడే బస చేస్తారు. సాధారణ రోజుల్లో కూడా సాధువులు, సంతులు, అఘోరాలు, తాంత్రికులు ఇక్కడకు వచ్చి అమ్మను దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. అన్నట్టు ఈ ఆలయం ఎక్కువగా మంత్ర, తాంత్రిక, ఐంద్ర జాలాలకు కామాఖ్యాక్షేత్ర శక్తి పీఠం కేంద్రస్థానంగా చెబుతారు. ఈ నీలాచలం పైనే భువనేశ్వరీ మాత మంమందిరం కూడా ఉంది. ఈ ఆలయం ఎప్పుడూ భక్తులతో రద్దీగా ఉంటుంది. ఈ ఆలయంలో విధిగా ఆషాఢ, జ్యేష్ఠ మాసాల్లోనూ, దసరానవరాత్రి పర్వదినాల్లోనూ, ఇంకా విశేషమైన రోజుల్లోనూ ఉత్సవాలు నిర్వహిస్తారు.


 

18 September 2015

పంచీకరణం :-

భాద్రపద శుక్ల చతుర్థీ అనగా వినాయకచవితి పూజా నియమాల గురించి ముద్గల పురాణంలో చెప్పబడింది. అందులో కణ్వమహర్షి భరతునికి గణపతి తత్వాన్ని, భాద్రశుక్ల చవితి వ్రత మహిమను చెప్పారు.

అందులో భాగంగా ప్రధానమైన నియమం గణపతి యొక్క మూర్తిని మట్టితో మాత్రమే చేసి పూజించడం. బంగారం, వెండి మొదలగు విగ్రహాల గురించి కూడా అందులో ప్రస్తావన లేదు. గణపతిని మట్టితో పూజించడం వెనుక పంచీకరణం ఉంది.

అసలు పంచీకరణం అంటే?

ఆకాశం నుండి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి. నీటి నుంచి భూమి ఏర్పడింది. జడపదార్ధమైన భూమి చైతన్యం కలిగిన నీళ్ళతో చేరినప్పుడు ప్రాణశక్తి కలిగి - ఆహారపదార్ధాలనూ, ఓషధులని మనకు అందిస్తుంది. నీరు ప్రాణాధారశక్తి. జడశక్తులు కలయికతో ఈ సృష్టి ఏర్పడిందనడానికి సంకేతంగా గణపతి విగ్రహాన్ని మట్టి నీరు కలిపి తయారుచేస్తాం. అప్పుడది పూజార్హం అవుతుంది.

మన శరీరంలో 6 చక్రాలు ఉన్నాయి అంటుంది .యోగశాస్త్రం. 6 చక్రాల్లో మొదటిది మూలాధారచక్రం, వెన్నుపూస చివరిభాగాన ఉంటుంది. నాలుగు రేకులు పద్మంవలే, ఎరుపు రంగు కాంతులు విరజిమ్ముతూ ఉంటుంది. 

యోగశాస్త్రం ప్రకారం మూలాధారచక్రానికి గణపతి అధిష్ఠానదేవత. మూలాధారం - పృధ్వీ తత్వం, అంటే భూమికి సంకేతం. కనుక వినాయకున్ని మన్నుతోనే చేయాలి.

పంచభూతాల్లో, ప్రతి భూతంలోనూ, దాని తత్వం 1/2 వంతు, తక్కిన 4 భూతాల తత్వాలు ఒక్కొక్కటి 1/8 వంతుగా ఉంటాయి. ఉదాహరణకు భూమి- అందులో 1/2 భూతత్వం అయితే, 1/8 జలం, 1/8 అగ్ని, 1/8 వాయువు, 1/8 ఆకాశం ఉంటాయి. దీన్నే 'పంచీకరణం' అంటారు. ఒక్కో తత్వానికి ఒక్కో అధిష్ఠానదేవత ఉంటారు. భూతత్వానికి అధిష్ఠానదేవత గణపతి, ఆకాశతత్వానికి ఈశ్వరుడు (శివుడు), జలతత్వానికి నారాయణుడు, అగ్నితత్వానికి అంబిక, వాయుతత్వానికి ప్రజాపతి (బ్రహ్మ). మనం పూజించే విగ్రహంలో గణపతి తత్వం 1/2 భాగం ఉండగా, మిగిలిన ఈ దేవతల తత్వం 1/8 భాగంగా ఉంటుంది.

పరమాత్ముడు ఒక్కడే, ఎన్నో విధాల కనిపించినా, అన్ని ఒక్కడినే చేరుతాయి. వినాయక విగ్రహ నిర్మాణంలో 1/2 భూతత్వం, తక్కినవి 1/8 ప్రకారం ఉంటాయి. మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచమహాభూతాల సమాహారం. ఆ మట్టి ప్రతిమను పూజించడం ద్వారా పంచభూతాలను, వాటి అధిష్ఠానదేవతలను పూజిస్తున్నాం.

ఇది ఇతర పదార్ధాల చేత చేయబడిన గణపతి మూర్తులను ఆరాధించడం వలన కలుగదు. పంచభూతాలతో ఆధునిక మానవుడు సంబంధం తెంచుకున్న కారణం చేతనే అనేక సమస్యలకు, ఒత్తిళ్ళకు, రోగాలకు బాధితుడవుతున్నాడు.

ఏ తత్వాలతో ఒక వస్తువు ఏర్పడుతుందో, చివరికది ఆ తత్వాలలోనే లయం అవుతుంది. అదే సృష్టి ధర్మం. కనుక వినాయక విగ్రహాన్ని నీళ్ళలో కలపడం వల్ల, ఆ విగ్రహంలో ఉన్న పంచతత్వాలు క్రమంగా వాటిల్లో లీనమవుతాయి.

ఓషధిగుణాలు కల్గిన 21 రకాల పూజపత్రాలు, విగ్రహంతో పాటూ నీళ్ళలో కలపడం వలన ఆ నీళ్ళలో కాలుష్యం హరించబడుతుంది. రోగకారక క్రిములు నశిస్తాయి.

కనుక వినాయకుడిని మట్టితో చేసి పూజించడమే సర్వశుభప్రదం, మంగళప్రదం.


కాణిపాకం వినాయకుడు :-

దేవగణాలకు అధిపతిగా ఉద్భవించిన వినాయకుడు – తొలిపూజలందుకునే వేలుపుగా అశేష భక్తులకు ఆరాధనీయుడు. ‘దండాలయ్య… ఉండ్రాలయ్యా దయుంచయా దేవా ‘అంటూ మన దేశంలోనే కాదు -నేపాల్, చైనా, జపాన్, టర్కీ, ఇండోనేషియా తదితర దేశాల్లోని ప్రజలు ఆయన్ను భక్తితో ప్రార్ధిస్తారు. విఘ్న కారకుడిగా, విఘ్న నివారకుడిగా పేరొందిన విఘ్నేశ్వరుడు- మనరాష్ట్రంలో శాతవాహన రాజుల కాలం నుంచీ విశేషపూజలందుకుంటున్న వైనం… చారిత్రక సత్యం! ముప్పై రెండు రూపాల్లో ప్రణతులందుకుంటున్న గణనాధుడు, చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో వరసిద్ది వినాయకుడిగా అవతరించాడు. కోరిన వరాలిచ్చే కొండంత దేవుడిగా, పిలిచే భక్తుడికి పలికే భగవంతుడిగా ప్రస్తుతులందుకొంటున్న బొజ్జ గణపయ్య ప్రస్తుతం కాణిపాకంలో బ్రహ్మోత్సవాల మహశివరాత్రి సంరంభానికి సిద్ధమవుతున్నాడు.

చిత్తూరు జిల్లాలో తిరుమల, శ్రీకాళహస్తిల తరువాత చెప్పుకొదగిన అపురూప పుణ్యక్షేత్రం కాణిపాకం. ఇక్కడి స్వయంభూ వరసిద్ది వినాయక స్వామి ఆలయం సత్య ప్రమాణాలకు నెలవుగా ప్రసిద్ది పొందింది. ఈ ఆలయానికి సుమారు వేయ్యేళ్ళ చరిత్ర ఉంది. చిత్తూరు పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో బహుదానదీ తీరంలో వెలసిన ఈ క్షేత్రానికి సంబంధించి స్థలపురాణాలు, స్వామి వారి జననాన్ని గురించి తెలిపే ఇతిహాసాలు ఎన్నోఉన్నాయి.

బావిలో వింత :-
సాధారణంగా పుణ్యక్షేత్రాల్లో వెలసిన విగ్రహాలు చెక్కినవే కానీ స్వయంగా ఆవిర్భవించినవి కావు. అయితే కాణిపాకంలోని విఘ్నేశ్వరుడు మాత్రం ఏ శిల్పుల చేతా రూపుదిద్దుకోకుండా స్వయంగా భూమి నుంచి ఉధ్బవించిన స్వయంభూ విగ్రహమని ప్రసిద్ధి చెందడంవల్ల – ఈ క్షేత్రం అధిక ప్రాసస్త్యం గడించింది. ప్రకృతి సంపదలకు, పచ్చనైన పంటలకూ నిలయమైన ఈ ప్రదేశాన్ని పూర్వం ‘విహారపురీ అని పిలిచేవారు. దీనిక సంబంధించిన ఓ కధ భక్తుల్లో అత్యంత ప్రాచుర్యం గడించింది. ఈ గ్రామంలో పుట్టుకతో మూగ, చెవిటీ, గుడ్డి వారైన ముగ్గురు సోదరులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తూ ఉండేవారట. వారికి ఉన్న ఆస్తిపాస్తులు ఒక కాణి మాగాణి (పాతిక ఎకరాల భూమి). అందులో ఒక ఏతం బావి ఉండేవట. ఒకసారి వర్షాభవం కారణంగా కరువు కాటకాలతో ఆ ప్రాంతం విలవిలలాడింది.

బావిలోని నీరు అగాధం లోకి చేరుకుంది. వారు తమ పొలంలో పంటలకు కావలసిన నీటికోసం అక్కడే ఉన్న ఏతం బావి పూడికతీయడం ప్రారంభించారు. బావిని తవ్వుతుండగా లోపలి నుంచి ఠంగ్ మని శబ్దం వినిపించి , వెంటనే ఆ ముగ్గురు సోదరులు బావిలో ఉన్న రాయిని పార, గడ్డ పారలతో తొలగించడానికి ప్రయత్నం చేశారు. గడ్డపార రాయి పై పడగానే కింది నుంచి రక్తం చిమ్ముకొని పైకి ఎగిసిందట. రక్తం చూసి వారు భయాందోళనలకు గురయ్యారు. రాయి నుంచి వెలువడ్డ రక్తం ఆ ముగ్గురు వికలాంగుల శరీరానికి తాకగానే వారి వైకల్యాలు తొలిగి మూగవాడీకి మాటలు, చెవిటి వాడికి వినికిడి శక్తి, గుడ్డివాడికి దృష్టి వచ్చాయట.

ఈ విషయాన్ని వారు గ్రామం లోని ప్రజలకూ, రాజుకూ తెలియజేశారు. వెంటనే గ్రామస్తులు బావి వద్దకు చేరుకొని , మరింత లోతుగా తవ్వగా, గణనాధుని రూపం కనిపించిదట .తెలియక జరిగిన అపరాధానికి క్షమాపణలు కోరుకుంటూ గ్రామస్తులు అత్యంత భక్తి శ్రద్దలతో స్వామి వారికి టెంకాయల్ని సమర్పించారట . టెంకాయల్ని కొట్టడం ద్వారా వచ్చే నీరు అక్కడ ఉన్న కాణి భాగమమతా ప్రవహించడం తో ఆ విహారపురి గ్రామం పేరు కాణిపాకం గా మారింది.కుళోత్తుంగ చోళుడనే రాజు 11 వ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం చేపట్టినట్లు ఆధారాలున్నాయి. ఇక్కడి స్వామివారి చుట్టూ ఎప్పుడూ నీరు ఉంటుంది.

వర్షాకాల సమయంలో స్వామి ఉన్న బావిలోని నీరు ప్రవహించడం కనిపిస్తుంది. ఇప్పటికీ స్వామి వారికి పారవేటు వెనుక భాగంలో ఉంది. అలాగే స్వామివారు స్వయంభువు కావడం వలన క్రమంగా పెరుగుతున్నాడనే ప్రజల నమ్మకం. గతంలో స్వామి వారి రూపం కొంత మేరకు మాత్రమే కనిపించేదని కొందరు వృద్దులు తెలిపారు. స్వామి వారి విగ్రహం ఉదరం, మోకాళ్ళు, బొజ్జ వరకు కనిపిస్తోంది. స్వామి వారి పెరుగుదలకు నిదర్శనం అన్నట్లు 1945వ సంవత్సరంలో అరగొండపల్లెకు చెందిన బెజవాడ సిద్దయ్య భార్య లక్ష్మమ్మ స్వామి వారికి సరిపడగా చేయించిన వెండి కవచం ప్రస్తుతం సరిపోవడం లేదు. స్వామి వారి బావిలో ఉన్న పవిత్ర జలాన్ని భక్తులకు తీర్ధంగా ఇస్తున్నారు.

ప్రమాణాలకు నెలవు :-
కాణిపాకం స్వయంభూ శ్రీవరసిద్ది వినాయక స్వామి ఆలయం సత్యప్రమాణాలకు నెలవని చెబుతారు. ప్రమాణాల పురుషుడైన శ్రీ వరసిద్ది వినాయకుడే ఇక్కడ న్యాయ నిర్ణేత. ఎటువంటి వివాదమైనా స్వామి వారి సన్నిధిలో అవలీలగా పరిష్కారం అయిపోతుందని భక్తులు నమ్ముతారు. ఇక్కడ స్వామి వారి ఎదుట ప్రమాణాలు చేసే పధ్ధతి ఆనవాయితీగా వస్తోంది. ఇలా ప్రమాణాలు చేస్తే జటిలమైన సమస్యలు కూడా తీరిపోతాయని ప్రజల నమ్మకం. భక్తులు ఆలయప్రాంతంలోని పవిత్ర పుష్కరిణిలో స్నానం ఆచరించి, అటుపై స్వామి వారి ఎదుట ప్రమాణం చేస్తారు. ఇక్కడి ప్రమాణాలకు ఆంగ్లేయుల పరిపాలన కాలంలోని న్యాయస్థానాల్లో కూడా అత్యంత ప్రాముఖ్యత ఉండేది.

చెడు అలవాట్లకు, వ్యసనాలకు అలవాటు పడి వాటిని మానలేకుండా ఉన్న వారు స్వామి ఎదుట ప్రమాణం చేస్తే , దైవ భీతితో మానుకుంటారని ప్రతీతి. వివిధ సమస్యల పరిష్కారాలు ఆశిస్తూ ప్రతినిత్యం స్వామి ఎదుట ప్రమాణాలు చేస్తారు భక్తులు. ఉదాహరణకు సొమ్ము దొంగిలించాడన్న అనుమానానికి గురయిన వ్యక్తి అతనిపై నేరం మోపిన వ్యక్తి ఇద్దరూ స్వామి ఎదుట ప్రమాణం చేస్తారు. ఒకవేళ సదరు వ్యక్తి నిజంగా సొమ్ము దొంగతనం చేసి ఉండి, స్వామి ఎదుట తప్పుడు ప్రమాణం చేస్తే కొన్ని నెలలకే అతనికి ఎదో ఒక కీడు జరుగుతుందని ప్రజల నమ్మకం. అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేసిన వారు ఇక్కడ మొదట పూజలు చేసుకొంటుంటారు.

నది పేరు వెనుక కధ :-
కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి ఆలయానికి పక్కనే బహుదానది ఉంది. ఈ నదికి ఆపేరు రావడానికి పురాణాల్లో ఒక కధ ఉంది. పూర్వం శంఖుడు, లిఖితుడు అనే ఇద్దరు సోదరులు సుదూర ప్రాంతం నుంచి స్వామి వారి దర్శనానికి వస్తూ, కావలసిన ఆహార పదార్ధాల్ని తెస్తుండగా అవి మార్గ మధ్యంలో అయిపోయాయట. నడిచి నడిచి అలసిపోయిన చిన్నవాడైన లిఖితుడు ఆకలి బాధ తట్టుకోలేక సమీపంలో ఉన్న మామిడి తోటలో ఒక మామిడి పండును కోసుకుతింటానని అన్నను కోరాడట. అది ధర్మ విరుద్ధమని అన్న వారించాడట. కానీ అన్న మాటలను పెడ చెవిన పెట్టిన తమ్ముడు లిఖితుడు మామిడి పండును కోసుకు తిన్నాడు. ధర్మ విరుద్ధంగా దొంగతనం చేసి మామిడి పండు తినడాన్ని క్షమించని శంఖుడు ఈ విషయాన్ని రాజుకు తెలుపగా క్రూరుడైన రాజు లిఖితుని చేతులు నరికించి వేశాడట. తమ్ముడు చేసిన చిన్న తప్పునకు రాజు ఇంత పెద్ద శిక్ష విధిస్తాడని ఊహించని అన్న శంఖుడు, తమ్ముణ్ణి తీసుకొని, కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి ఆలయాన్ని దర్శించేందుకు వెళ్ళాడట . స్వామి వారి దర్శనానికి ముందు – పక్కనే ఉన్న నదిలో స్నానం ఆచరించేందుకు నదిలో మునిగాడట. పైకి లేచి చూసేసరికి లిఖితునికి మునిపటిలా చేతులు వచ్చాయట. బాహువులు ఇచ్చిన నది కావడంవల్ల ఈ నదికి బాహుదా నది అని, కాలక్రమంలో బహుదా నది అని పేర్లు వచ్చాయి.

హరిహర నిలయం :-
కాణిపాకం వినాయక స్వామి ఆలయానికి అనుబంధ ఆలయాలుగా వాయువ్య దిశలో శ్రీ మరకదాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయం, ఈశాన్య దిశలో శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మహత్యాది పాతక పరిహారం కోసం రాజరాజ కుళోత్తుంగ చోళ నరేంద్ర మహారాజు వంశస్థులు 101 శివాలయాల్ని నిర్మించారు. ఇందులో భాగంగానే కాణిపాకంలోని మణికంఠేశ్వరస్వామి ఆలయాన్ని కూడా నిర్మించారని అంటారు. అలాగే సర్పయాగ పరిహారానికి జనమేజయ మహారాజు నిర్మించిన ఆలయాల్లో కాణిపాకంలోని శ్రీ వరదరాజ స్వామి ఆలయం కూడా ఒకటని అంటారు. వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలో ఇంకా వీరాంజనేయస్వామి ఆలయం, నవగ్రహాలయాలు ఉన్నాయి. కాణిపాక క్షేత్రం హరిహర క్షేత్ర నిలయమనీ, ఇలాంటి క్షేత్రం మరెక్కడా లేదనీ కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి వ్యాఖ్యానించారు.

వైభవంగా బ్రహ్మోత్సవాలు :-
వినాయక చవితి మొదలుకొని 21 రోజులు ఇక్కది సిద్ది వినాయక స్వామి వారికి అత్యంత వైభవంగా తొమ్మిది రోజులపాటు బ్రహ్మోత్సవాలు, 12 రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు.


మహా గణపతిం మనసా స్మరామి !!
మిత్రులందరికి వినాయకచతుర్ది శుభాకాంక్షలు !!


16 September 2015

గణపతి నవరాత్రులలో ఏకవింశతి పత్రపూజ ( ఔషధ విలువలు ) :-

1) మాచీపత్రం :- 

మన దేశంలో ప్రతి చోట కనిపిస్తుంది. మన ఇళ్ళ చుట్టుప్రక్కల, రోడ్ల మీద ఇది విపరీతంగా పెరుగుతుంది. కానీ ఇది గొప్ప ఆయుర్వేద మూలిక. ఇది నేత్రరోగాలకు అద్భుత నివారిణి. మాచీపత్రి ఆకుల్ని నీళ్ళలో తడిపి కళ్ళకి కట్టుకుంటే నేత్రవ్యాధులు నయమవుతాయి. ఇది చర్మరోగాలకు మంచి మందు. ఈ ఆకును పసుపు, నువ్వుల నూనెతో కలిపి నూరి ఆ ముద్దను చర్మవ్యాధి ఉన్న చోట పైపూతగా రోజు రాస్తూ ఉంటే వ్యాధి తొందర్లో నివారణ అవుతుంది. రక్తపు వాంతులకు, ముక్కు నుండి రక్తం కారుటకు మంచి విరుగుడు.

2) బృహతీ పత్రం:-
 

భారతదేశమంతటా విస్తారంగా ఎక్కడపడైతే అక్కడ పెరుగుతుంది బృహతీ పత్రం. దీనే మనం 'వాకుడాకు', 'నేలమునగాకు' అని పిలుస్తాం. ఇది కంఠరోగాలను, శరీర నొప్పులను నయం చేస్తుంది. ఎక్కిళ్ళను తగ్గిస్తుంది. కఫ, వాత దోషాలను, ఆస్తమాను, దగ్గను, సైనసైటిస్‌ను తగ్గిస్తుంది. అరుగుదలను పెంచుతుంది, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. బృహతీపత్రం చూర్ణం దురదలకు, నొప్పులకు పనిచేస్తుంది. బృహతీ పత్రం యొక్క కషాయంతో నోటిని శుభరపరచుకుంటే నోటి దుర్వాసన తొలగిపోతుంది. రక్తశుద్ధి చేయగల శక్తి బృహతీపత్రానికి ఉంది. ఇంకా బృహతీపత్రానికి అనేకానేక ఔషధీయ గుణాలున్నాయి.

3) బిల్వపత్రం :- 

దీనికే మారేడు అని పేరు. శివుడికి అత్యంత ప్రీతికరం. బిల్వ వృక్షం లక్ష్మీస్వరూపం. ఇది మధుమేహానికి(షుగర్‌కు) దివ్యౌషధం. ఈ వ్యాధి గలవారు రోజు రెండూ ఆకులను నిదానంగా నములుతూ ఆ రసాన్ని మింగితే వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. మారేడు గుజ్జును ఎండబెట్టి పోడిచేసుకుని, రోజూ ఒక చెంచా పొడిని మజ్జిగలో వేసుకుని త్రాగితే వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది.

4) దూర్వాయుగ్మం(గరిక) :-  

గణపతికి అత్యంత ఇష్టమైనవస్తువు గరిక. ఒక్క గరిక సమర్పిస్తే చాలు, మహాసంతోషపడతాడు బొజ్జగణపయ్య. తులసి తరువాత తులసి అంత పవిత్రమైనది గరిక. దూర్వాయుగ్మం అంటే రెండు కోసలు కలిగివున్న జంటగరిక. ఇది ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది. ఈ గరిక మహాఔషధమూలిక. గరికను పచ్చడి చేసుకుని తింటే మూత్రసంబంధిత వ్యాధులు నయమవుతాయి. మగవారికి సంతాన నిరోదకంగా కూడా పనిచేస్తుంది. కఫ, పైత్య దోషాలను హరిస్తుంది. చర్మ, రక్త సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. ముక్కునుండి రక్తం కారుటను నిరోధిస్తుంది. గరికను రుబ్బి నుడిటి మీద లేపనం వేసుకోవడం ద్వారా పైత్య దోషం వలన కలిగిన తలనొప్పి తగ్గిపోతుంది. హిస్టీరియా వ్యాధికి ఔషధం గరిక.

5) దత్తూర పత్రం :- 

దీనిని మనం ఉమ్మెత్త అని కూడా పిలుస్తాం. ఉష్ణతత్వం కలిగినది. కఫ, వాతా దోషాలను హరిస్తుంది. కానీ 'నార్కోటిక్' లక్షణాలు కలిగినది కనుక వైధ్యుని పర్యవేక్షణ తీసుకోకుండా ఉపయోగించకూడడు. మానిసక వ్యాధి నివారణకు పనిచేస్తుంది. మానసిక వ్యాధి ఉన్నవారికి గుండు చేయించి, ఈ ఉమ్మెత్త ఆకుల రసాన్ని రెండు నెలల పాటూ మర్దన చేయిస్తే స్వస్థత చేకూరుతుంది. దేని ఆకులు, వ్రేర్లు, పువ్వులు అమితమైన ఔషధ గుణములు కలిగినవే అయినా, దెని గింజలు(విత్తనాలు) మామూలుగా స్వీకరిస్తే విషంగా పనిచేస్తాయి. జ్వరాలు, అల్సర్లు, చర్మరోగాలకు, చుండ్రుకు ఉమ్మెత్త ఔషధం.

6) బదరీ పత్రం :- 

దీనినే రేగు అని పిలుస్తాం. బదరీ వృక్షం సాక్షాత్తు శ్రీ మన్నారాయణ స్వరూపం. చిన్నపిల్లల వ్యాధుల నివారణకు పనిచేస్తుంది. 3 ఏళ్ళ పైబడి 12 ఏళ్ళలోపు వయసులో ఉన్న పిల్లల్లో సామాన్యంగా వచ్చే అన్ని రకాల సాధారణ వ్యాధులకు ఉపయోగిస్తారు. ఒకటి లేదా రెండు రేగు ఆకులను వ్యాధిగ్రస్తుల చేత వ్యాధి నివారణ అయ్యేంతవరకు తినిపించాలి, కానీ రేగు ఆకులు ఎక్కువగా తింటే కఫం వచ్చే ప్రమాదముంది.

7) ‪అపామార్గ‬ పత్రం:- 

దీనికే ఉత్తరేణి అని వ్యవహారనామం. దీని కొమ్మలతో పళ్ళు తోముకుంటే దంతవ్యాధులు, ఆకులు నూరి పైపూతగా రాస్తే చర్మవ్యాధులు నివారణమవుతాయి. దీని పుల్లలు యజ్ఞయాగాదుల్లో, హోమాల్లో వినియోగించడం వలన హోమగుండం నుంచి వచ్చిన పొగను పీల్చడం చేత శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి. స్తూలకాయానికి, వాంతులకు, పైల్స్‌కు, ఆమం(టాక్షిన్స్) వలన వచ్చే వ్యాధులకు మంచి ఔషధం ఉత్తరేణి. ఉత్తెరేణి ఆకులను రుబ్బి గాయాలపై రాయడం వలన గాయాలు త్వరగా మానిపోతాయి. నొప్పి తగ్గిపోతుంది. పిల్లలు చెడుమార్గంలో వెళ్తున్నారని, చెడ్డ అలవాట్లకు లోనవుతున్నారని బాధపడే తల్లిదండ్రులు ఉత్తరేణి మొక్కను పూజించి, దాని వేర్లను పిల్లల మెడలో కడితే బుద్ధిమంతులవుతారు. రోజు ఉత్తరేణి కొమ్మలతో పళ్ళు తోముకునే అలవాటు ఉన్నవారు ఎక్కడకు వెళ్ళినా, ఆహారానికి లోటు ఉండదు. ఆహరం దొరకని ఎడారిలో కూడా ఎవరో ఒకరు పిలిచి భోజనం పెడతారట. అది ఉత్తరేణి మొక్క మహిమ. ఇంకా ఉత్తరేణికి అనేక ఔషధ విలువలు ఉన్నాయి. ఇంత గొప్ప ఉత్తరేణి మన దేశంలో ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది.

8) తులసి:- 

'తులానాం నాస్తు ఇతి తులసి' - ఎంత చెప్పుకున్నా, తరిగిపోని ఔషధ గుణములున్న మొక్క తులసి. పరమ పవిత్రమైనది, శ్రీ మహాలక్ష్మీ స్వరూపం, విష్ణు మూర్తికి ప్రీతికరమైనది. తులసి మొక్క లేని ఇల్లు ఉండరాదు అంటుంది మన సంప్రదాయం. అంత గొప్ప తులసి గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం. కఫ, వాత, పైత్య దోషాలనే మూడింటిని శృతిమించకుండా అదుపులో ఉంచుతుంది తులసి. కాలుష్యాన్ని తగ్గిస్తుంది, తులసి వాసనకు దోమలు దరిచేరవు. తులసి ఆకులు, వేర్లు, కొమ్మలల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. చర్మరోగాలను నయం చేస్తుంది. తులసి ఆకులు నమలడం చేత పంటి చిగుళ్ళకున్న రోగాలు నయమవుతాయి. అరుగుదలను, ఆకలిని పెంచుతుంది. కఫం వలన వచ్చే దగ్గును, ఆస్తమాను తగ్గిస్తుంది. తులసిరసాన్ని తేనెలో కలిపి తీసుకోవడం వలన ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. తులసి శరీరంలో ఉన్న ఆమాన్ని(టాక్సిన్స్/విషాలను) విశేషంగా తీసివేస్తుంది. ఈ మధ్య జరిగిన పరిశోధనల ప్రకారం ఒక్క తులసి చెట్టు మాత్రమే రోజుకు 22 గంటల పాటు ప్రాణవాయువు(ఆక్సిజెన్)ను విడుదల చేస్తుంది. ఇంత గొప్ప లక్షణం మరే ఇతర మొక్కకు లేదు.

కానీ పురాణ కధ ఆధారంగా గణపతిని తులసిదళాలతో ఒక్క వినాయక చవితి నాడు తప్ప ఇంకెప్పుడు ఆరాధించకూడదు.


9) చూత పత్రం :- 

మామిడి ఆకులను చూత పత్రం అని సంస్కృత బాషలో అంటారు. మామిడి మంగళకరమైనది. లేతమామిడి ఆకులను పెరుగులో నూరి సేవిస్తే అతిసారం తగ్గుతుంది. మామిడి జిగురులో ఉప్పు చేర్చి వేడీచేసి ఔషధంగా పూస్తే కాళ్ళపగుళ్ళు, చర్మవ్యాధులు ఉపశమిస్తాయి. చిగుళ్ళ వాపు సమస్యతో బాధపడేవారికి మామిడి లేత చిగురు మంచి ఔషధం. చెట్టు నుంచి కోసిన కొన్ని గంటల తరువాత కూడా ఆక్సిజెన్ (ప్రాణవాయువు) ను విడుదల చేయగల శక్తి మామిడి ఆకులకుంది. మామిడి దేవతావృక్షం. అందువల్ల ఇంట్లో ఏ దిక్కులో మామిడి చెట్టున్నా మంచిదే. ఆఖరికి ఈశాన్యంలో మామిడి చెట్టున్నా, అది మేలే చేస్తుంది. మామిడి చెట్టును సాధ్యమైనంతవరకు కాపాడాలని, ఇంటి ఆవరనలో పెరుగుతున్న మామిడి చెట్టును నరికేస్తే, ఆ ఇంటి సభ్యుల అభివృద్ధిని నరికేసినట్లేనని వాస్తు శాస్త్రం గట్టిగా చెప్తోంది. ఏ శుభకార్యంలోనైనా, కలశ స్థాపనకు ముందు కలశంలో 5 రకాల చిగుళ్ళను వేయాలి. అందులో మామిడి కూడా ఒకటి.

10) కరవీర పత్రం :- 

దినినే మనం గన్నేరు అని పిలుస్తాం. గన్నేరుకు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా పూజకు కోసిన పువ్వులు, అవి చెట్టు నుంచి కోసే సమయంలో చెట్టు మొదట్లో క్రింద పడితే ఫర్వాలేదు కానీ, మరొకచోట(అది దేవుడుముదైనా, పూజ స్థలంలోనైనా సరే) క్రింద పడితే ఇక పూజకు పనిరావు. కానీ గన్నేరు పూలకు ఈ నిబంధన వర్తించదు. గన్నేరు పూలు మరే ఇతర ప్రదేశంలో క్రింద పడినా, నీటిని చల్లి పరమాత్మకు అర్పించవచ్చు. గన్నేరు చెట్టు తప్పకుండా ఇంట్లో ఉండాలి. గన్నేరు చెట్టు నుంచి వచ్చిన గాలి పీల్చినా చాలు, అది అనేక రోగాలను దూరం చేస్తుంది.

11) విష్ణుక్రాంత పత్రం :- 

మనం వాడుకబాషలో అవిసె అంటాం. దీని ఆకును నిమ్మరసంతో కలిపి నూరి తామరవ్యాధి ఉన్న చోట పూస్తే తామరవ్యాధి నశిస్తుంది. ఆకును కూరగా చేసుకుని భుజిస్తే రక్తదోషాలు నివారణావుతాయి. విష్ణుక్రాంతం మేధస్సును పెంచుతుంది.
12) దాడిమీ పత్రం :-
 

అంటే దానిమ్మ. భారతదేశమంతటా పెరిగే చెట్టు ఇది. లలితా సహస్రనామాల్లో అమ్మవారికి 'దాడిమికుసమప్రభ' అనే నామం కనిపిస్తుంది. దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయడం చేత అలర్జీలు, కిటకాలు కుట్టడం వలన వచ్చిన పొక్కులు మానిపోతాయి. దానిమ్మ పండు తొక్క గాయాలకు ఔషధం, వాపును అరికడుతుంది. పైత్య దోషాన్ని అధుపులో ఉంచుతుంది. దానిమ్మ పండు ఆకలిని, అరుగుదలను పెంచుతుంది. విరోచనాలను తగ్గిస్తుంది. గొంతురోగాలకు ఔషధం దానిమ్మ. దానిమ్మ పళ్ళు, పువ్వులు, ఆకులు, వేర్లు అన్ని ఔషధ గుణాలు కలిగినవై ఉంటాయి. దానిమ్మ ఆకులను కొద్దిగా దంచి కాచి కషాయం చేసి దాన్లో తగినంత చక్కెర కలిపి సేచ్సితే ఉబ్బసం, అజీర్తి వంటి దీర్ఘకాలిక రోగాలు, దగ్గు, వడదెబ్బ, నీరసం ఉపశమిస్తాయి. దేని ఆకులకు నూనె రాసు వాపు ఉన్నచోట కడితే కల్లవాపులు తగ్గుతాయి.

13) దేవదారు :- 

ఇది వనములలో, అరణ్యాలలో పెరిగే వృక్షం. పార్వతీ దేవికి మహాఇష్టమైనది. చల్లని ప్రదేశంలో, ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది ఈ వృక్షం. దేవదారు ఆకులను తెచ్చి ఆరబెట్టి, తరువాత ఆ ఆకులను నునెలో వేసి కాచి, చల్లార్చిన తరువాత నూనె తలకి రాసుకుంటే మెదడు కంటి సంబంధ రోగాలు దరిచేరవు. దేవదారు మాను నుంచి తీసిన నూనె చుక్కలను వేడినీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి.

14) మరువక పత్రం :- 

మనం దీన్ని వాడుక బాషలో మరువం అంటాం. ఇది అందరి ఇళ్ళలోనూ, అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నవారు కుండిల్లో కూడా పెంచుకోవచ్చు. మంచి సువాసనం కలది. మరువం వేడినీళ్లలో వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికున్న దుర్వాసన తొలగిపోతుంది.

15) సింధువార పత్రం :-
 

వావిలి ఆకు. ఇది తెలుపు-నలుపు అని రెండు రకాలు. రెండింటిన్లో ఏదైనా వావికి ఆకులను నీళ్ళలో వేసి మరిగించిన నీటితో బాలింతలకు స్నానం చేయిస్తే బాలింతవాతరోగం, ఒంటినొప్పులు ఉపశమిస్తాయి. ఈ ఆకులను దంచి దానిని తలమీద కట్టుకుంటే రొంప, శిరోభారం ఉపశమిస్తాయి.

16) జాజి పత్రం:- 

జాజి పత్రానికి అనేక ఔషధ గుణాలున్నాయి. ఇది అని చోట్ల లభిస్తుంది. జాజిపూలు మంచి సువాసన కలిగి మనిషికి ఉత్తేజాన్ని, మనసుకు హాయిని కలిగిస్తాయి. ఈ సువాసన డిప్రేషన్ నుంచి బయటపడడంలో బాగా ఉపకరిస్తుంది. జాజి ఆకులు వెన్నతో నూరి ఆ మిశ్రమంతో పళ్ళుతోముకుంటే నోటి దుర్వాసన నశిస్తుంది. జాజి కాషాయన్ని రోజు తీసుకోవడం వలన క్యాన్సర్ నివారించబడుతుంది. జాజి చర్మరోగాలకు దివ్యౌషధం. కామెర్లను, కండ్లకలకను, కడుపులో నులుపురుగులను నయం చేయడంలో జాజిపూలు ఉపయోగిస్తారు. జాజిమొగ్గలతో నేత్రవ్యాధులు, చర్మరోగాలు నయం చేస్తారు.

17) గండకీపత్రం:- 

దీనిని మనం దేవకాంచనం అని పిలుస్తాం. థైరాయిడ్ వ్యాధికి ఔషధం గండకీ పత్రం. అరణ్యాలలో లభించే ఈ గండకీ చెట్టు ఆకు మొండి, ధీర్ఘవ్యాధులకు దివౌషధంగా పనిచేస్తుంది. చర్మరోగాలను, పైత్య రోగాలను హరిస్తుంది. దగ్గు, జలుబును హరిస్తుంది.

18) శమీ పత్రం:- 

దేని వ్యవహార నామం జమ్మి. మహాభారతంలో విరాటపర్వంలో పాండవులు దేనిమీదనే తమ ఆయుధాలను దాచిపెడతారు. జమ్మి ఆకుల పసరు తీసి దానిని పుళ్ళు ఉన్నచోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. జమ్మిపూలను చెక్కరతో కలిపి సేవించడం వలన గర్భస్రావం జరగకుండా నిరోధించబడుతుంది. జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది.

19) ఆశ్వత్థపత్రం:- 

రావి‬ వృక్షం. తులసి లేని ఇల్లు, వేపలేని వీధి, ఒక్క రావి చెట్టు కూడా లేని ఊరు ఉండరాదన్నది మన పెద్దలమట. రావి సాక్షాత్ శ్రీ మహావిష్ణుస్వరూపం. పరమాత్మయే తనును తాను రావిచెట్టుగా చెప్పుకున్నాడు. రావిమండలను ఎండబెట్టి, ఎండిన పుల్లలను నేతితీ కలిపి కాల్చి భస్మం చేసి, ఆ భస్మాన్ని తేనేతో కలిపి సేవిస్తూ ఉంటే శ్వాసకోశవ్యాధులు నివారణ అవుతాయి. అందుకే యజ్ఞయాగాదులు, హోమాల్లో రావికొమ్మలను వాడుతారు. రావి వేర్లు దంతవ్యాధులకు మంచి ఔషధం. దీని ఆకులను హృద్రోగాలకు వాడతారు. రావి ఆకులను నూరి గాయాలపై మందుగా పెడతారు. రావి చర్మరోగాలను, ఉదరసంబంధ వ్యాధులను నయం చేస్తుంది, రక్తశుద్ధిని చేస్తుంది.

20) అర్జున పత్రం:- 

మనం దీనినే మద్ది అంటాం. ఇది తెలుపు-ఎరుపు అని రెండు రంగులలో లభిస్తుంది. మద్ది చెట్టు హృదయ సంబంధిత జబ్బులకు మంచి ఔషధం. హృదయానికి సంబంధించిన రక్తనాళాలను గట్టిపరుస్తుంది. భారతదేశంలో నదులు, కాలువల వెంట, హిమాలయాలు, బెంగాలు, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది. ఇది శరీరానికి చలువ చేస్తుంది. కఫ, పైత్య దోషాలను హరిస్తుంది కానీ, వాతాన్ని పెంచుతుంది. పుండు నుంచి రక్తం కారుటను త్వరగా ఆపుతుంది. మద్ది బెరడును రుబ్బి, ఎముకలు విరిగినచోట పెడితే గాయం త్వరగా మానిపోతుంది. దీని బెరడును నూరి, వ్రణమున్న ప్రదేశంలో కడితే, ఎలాంటి వ్రణములైనా తగ్గిపోతాయి.

21) అర్క పత్రం:-

జిల్లేడు ఆకు. జిల్లేడు చెట్టు గణపతి స్వరూపం. జిల్లేడు పాలు కళ్ళలో పడడం వలన కంటికి తీవ్రమైన హాని కలుగుతుంది, కానీ జిల్లేదు ఆకులు, పూలు, వేర్లు, కొమ్మలు, పాలు అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఆస్తమా, దగ్గు మొదలైన వ్యాదులకు జిల్లేడు పూలను వాడటం ఆయుర్వేద గ్రంధాల్లో కనిపిస్తుంది. జిల్లేడుతో చేసిన నూనె చెవుడుకు ఔషధం. జిల్లేడు రక్త శుద్ధిని చేస్తుంది.