15 September 2015

శ్రీ వారికి జరిగే నిత్య సేవలు :-

తిరుమలలో శ్రీ వారికి జరిగే నిత్య సేవలు పలురకాలు. ఆ విశేషాలు వర్ణింపశక్యం కానివి. తూర్పు తెల్లవారక ముందే స్వామి వారికి ఈ నిత్య సేవలు ఆరంభమవుతాయి.


సుప్రభాత సేవ :-

శ్రీవారికి చేసే మొట్టమొదటి సేవ, ప్రతిదినం తెల్లవారు జామున 3 గంటల సమయంలో మొదలవుతుంది. అర్చకుల రాకను తెలియబర్చటానికి పెద్ద పలక గంటను మోగిస్తారు. మహాద్వారం తెరుచుకుంటుంది. సన్నిధి గొల్ల ముందు నడుస్తుండగా మిగతావారు వెనుక నడుస్తారు. తాళం చెవులను క్షేత్రపాలక శిలకు తాకించి అయన అనుమతి తీసుకుని, ఆనందనిలయ విమానం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అర్చకులు "కౌసల్యా సుప్రజా రామా" అంటు ప్రారంభించి, తర్వాత శ్రీ వేంకటేశ్వర స్తోత్రం, శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి, శ్రీ వేంకటేశ్వర మంగళాశాసనం పఠిస్తారు. తాళ్ళపాక అన్నమయ్య వంశానికి చెందిన ఒకరు తుంబూరా మీటుతూ శ్రీ స్వామివారిని మేల్కొలుపుతారు. తర్వాత దీపోద్దీపనం, గర్భాలయ సంమార్జనం చేసి స్వామివారిముందు తెరను వేస్తారు. నివేదన, తాంబూలం సమర్పిస్తారు. నవనీతి హారతి, తీర్థం, శఠారి ఇస్తారు. స్స్వామివారి దర్శనాన్ని విశ్వరూప దర్శనం అంటారు. ఈ సుప్రభాత గీతాన్ని "ప్రతివాది భయంకర అన్నన్" అనే భక్తుడు క్రీ. శ. 1430 నుంచి శ్రీవారి ఆలయంలో పాడటం ప్రారంభించి వుంటారని భావిస్తారు.

అర్చన :-

ప్రతీరోజూ ఉదయం 4 గంటలకు జరిగే ఆరాధన, జియ్యంగారు యమునత్తురైకి వచ్చి అక్కడి పుష్పమాలలు, వెదురుగంపను తలపై పెట్టుకుని బయలదేరుతారు. వీటిని శుద్ధిచేసి, జేగంటను మ్రోగిస్తూ ఆరాధన ప్రారంభిస్తారు. స్వామివారికి ఆకాశగంగ నుంచి తెచ్చిన తీర్థం అర్ఘ్యపాద్యాదులు, ఉదయం, సాయంత్రం పూజకి, బ్రహ్మారాధనకు ఉపయోగిస్తారు. అర్చన సమయంలో మంత్తాశనం, స్నానాశనం, పుష్పాన్యాసం, అలంకారాసనం నిర్వహించి, స్వామికి పురుషసూక్తం చదువుతూ అభిషేకిస్తారు. జియ్యంగార్లు నిరాట్టం చదువుతారు. అభిషేక సమయంలో విగ్రహానికి పలుచని గుడ్డ కట్టి నూనె రాసి, చింతపండు నీటిని కలిపి ఆ జిడ్డును తోలిగిస్తారు. ఆవుపాలు, గంధం, పసుపునీటితో అభిషేకించి, శుద్దోదక స్నానం చేయించి, చివరగా గంగోదక స్నానం చేయించి, మరలా శుద్దోదక స్నానం చేయిస్తారు. తరువాత పుస్పాంజలి సమర్పించి, మూలవిగ్రహానికి, భోగ శ్రీనివసమూర్తి విగ్రహనికి స్వర్ణ సూత్రాన్ని కలుపుతారు. మూల విగ్రహానికి పుష్పన్యాసం జరుపుతారు. గర్భగృహం వద్దనున్న మెట్టును కడిగి అర్చన చేస్తారు. అలంకారాసనంలో స్వామివారికి ఆసనం, వస్త్రం, భూషణం, ఉత్తరీయం సమర్పిస్తారు. కర్పూరంతో నుదుటిమీద ఊర్ధ్వపూండ్ర చిహ్నాన్ని దిద్ది యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు. శ్రీవారి సువర్ణపాదాలను (తిరువడి) స్నాన పీఠంలో పెట్టి, వీటితో పాటు గర్భగుడిలో ఉన్న విగ్రహాలకు అభషేకం చేస్తారు. అభిశేకించిన నీటిని ఒక పాత్రలోకి సేకరిస్తారు. జియ్యంగారు, భక్తులు తిరుప్పళ్లి ఎళుచ్చి అరవై పాశురాలను గానం చేస్తుంటారు.

తోమాల సేవ :-

తమిళంలో 'తోదుత్తమాబై' అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థం. ఆ పదమే కాలక్రమేణా "తోమాల"గా మార్పు చెంది, తోమాలసేవ అయి ఉంటుందని భావిస్తారు. తోమాలసేవనే "భగవతీ ఆరాధన" అని అంటారు. ప్రాతఃకాలంలో స్వామివారి ఆరధనలో భాగంగా మూల విగ్రహంపై ఉండే బంగారు కవచానికి, భోగ శ్రీనివాసుకి అభిషేకం జరుగుతుంది. తరువాత స్వామివారిని అనేక రకాల పూలమాలలతో అలంకరిస్తారు. తెల్లవారుజామున సుమారు 3.45నుండి 4.30 వరకు జరుగుతుంది.

అష్టదళ పద్మారాధన :-

శ్రీ స్వామివారికి అష్టదళ పద్మారాధన 108 సువర్ణ పుష్పాలతో జరుగుతుంది. వీటిని గుంటూరు జిల్లాకు చెందిన షేక్ హుస్సేన్ సాహెబ్ అను భక్తుడు సమర్పించాడు
.


సహస్రనామార్చన :-

ఈ అర్చన తెల్లవారుజాము 4.45 నుండి 5.30 వరకు జరుగుతుంది. అర్చకుడు శ్రీవారి పాదాల చెంత కూర్చుని సంకల్పం చెప్పుకుని జేగంట వాయిస్తూ పువ్వులు, తులసిపత్రాలు తీసుకుని "ఓం వేంకటేశ్వరాయ నమః" అని అంటూ స్వామివారి వేయి పేర్లను స్తుతిస్తూ చేసే సేవ ఇది. తర్వాత శ్రీవారి పాదాలు వద్ద ఉన్న పువ్వులు, తులసి పత్రాలతో శ్రీవారి దేవేరులకు పూజ చేస్తారు. ఈ సమయంలో మిరాశీదారు లక్ష్మీ సహస్రనామాలను పఠిశ్తారు. చివర్లో నక్షత్ర హారతి, కర్పూర హారతి జరుగుతాయి. (ఆర్జితసేవ)


గురువారంనాడు జరిగే సేవలు -- ఉదయం సేవ :-

ప్రతఃకాలారాధన తర్వాత తలుపులు మూసి, స్వామివారి ఆబరణాలన్నీ తీసివేస్తారు. నుదుటన గల పచ్చ కర్పూరపు నామాన్ని తగ్గిస్తారు. దీనివలన స్వామివారి నేత్ర సౌందర్యం భక్తులు కనులారా గాంచవచ్చు. తరువాత స్వామివారికి 24 మూరల పట్టంచు ధోవతిని, 12 మూరల ఉత్తరీయాన్ని కడతారు. శ్రీవారికి సువర్ణపాదాలు, సువర్ణహస్తాలు, శంఖచక్రాలు, కర్ణాభరణాలు, సువర్ణ సాలగ్రామ హారాలు సమర్పించి, తలుపు తీస్తారు. దీనినే "సడలింపు" లేదా "సళ్ళింపు" అంటారు.


మధ్యాహ్న సేవ :-

మధ్యాహ్నం అస్థాన మండపంలో తిరుప్పావడ జరుగుతుంది. శ్రీవారి ముందు తెరవేసి సుమారు 450 కిలోల అన్నప్రసాదం (పులిహోర) పెట్టి, దానిమీద శ్రీవారి ద్రుష్టి ప్రసరించేలాగా పెడతారు. ఈ రాశిని 8 భాగాలు చేసి దిక్కులలో పెడతారు. దీనికి తోడుగా లడ్డు, వడ, దోసె, పాయసం, జిలేబీ, వగైర కూడ పెడతారు. దీనినే "అన్నకూటోత్సవం" అనీ "తిరుప్పావడ" అని వ్యవహరిస్తారు. అనంతరం స్వామి వారికి కర్పూరహారతి ఇచ్చి భక్తులకు తీర్థప్రసాదాలు ఇస్తారు.


రాత్రి సేవ :-

సాయంకాల పూజ తర్వాత పానకం, వడపప్పు నివేదన చేసి, బంగారు వాకిలి ముందు మజయల్ తెరను వేస్తారు. శ్రీవారికి మకుటం నుంచి పాదాల వరకు పువ్వుల మాలలతో వస్త్రరూపంలో ఉత్తరీయ రూపంలో, కిరీటం, శంఖు చక్రాల రూపంలో అలంకరిస్తారు. అంటే పూర్తిగా పువ్వల అలంకరణలోనే ఉంటారు స్వామివారు. ఈ సేవను "పూలంగి సేవ" అంటారు.


అంగ ప్రదక్షిణ :-

దీనినే పొర్లు దండాలు అని కూడా అంటారు. ఈ మొక్కు ఉన్నవారు తెల్లవారుజామునే రెండు గంటలకు స్నానం చేసి తడిబట్టలతో వైకుఠద్వారం ద్వారా అలయంలోకి ప్రవేశించి, బంగారు వాకిలి ఎదురుగా ఉన్న రంగనాథ సన్నిధి నుండి ప్రారంభించి, విమాన ప్రదక్షిణ మార్గం చుట్టి మళ్ళీ శ్రీరంగనాథ సన్నిధి దగ్గర తమ అంగప్రదక్షిణలు (మొక్కు) పూర్తి చేస్తారు. మొక్కుకున్న అంగప్రదక్షిణ పూర్తిచేస్తే, స్వామి సంతుష్టుడై, తమ కోర్కెలను తీరుస్తాడని భక్తుల విశ్వాసం.


శుక్రవారం అభిషేకం :-

అభిషేకం కేవలం శుక్రవారంనాడు మాత్రమే జరుగుతుంది. పచ్చకర్పూరం, చందనం పొడి, కస్తూరి, జవ్వాది వంటివి వెండి గిన్నెల్లో తీసుకుని, విమాన ప్రదక్షిణం ద్వారా మంగళవాద్యాల మధ్య గర్భగుడిలోకి తీసుకువస్తారు. ముందు స్వామివారి పాదాల వద్ద కస్తూరితో కలిపిన కర్పూరపు ముద్దను పెట్టి, మూల విగ్రహానికి తిరుమాంజనం అభిషేకం చేస్తూ, పురుష సూక్తం, నారాయణ సూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, ప్రబంధాలు పఠిస్తారు. ముందు శుద్దోదక స్తానం, తరువాత క్షీరాభిషేకం చందనం కలిపిన పన్నీరుతో స్నానాలు జరుగుతాయి. దీనికై రెండు వెండి గంగాళాల బంగారుబావి నీటిని, 84 తులాల పచ్చకర్పూరం, 36 తులాల కుంకుమపువ్వు, 1 తులం కస్తూరీ, ఒకటిన్నర తులం పునుగు తైలం, 24 తులాల పసుపు వాడుతారు. ఈ పవిత్ర అభిషేక జలాన్ని వెండి గిన్నెలో సేకరిస్తారు. ఈ జలాన్ని పులికా తీర్తం అంటారు. తరువాత విగ్రహాన్ని తుడిచి, పునుగు నూనెను మకుటం నుంచి పాదాల వరకు రాస్తారు. తరువాత చందనపుపొడి, తెల్ల నామాలతో ఊర్ధ్వపుండ్రాన్ని , మధ్యలో కస్తూరితో తిలకాన్ని దిద్దుతారు. మూలవిగ్రహం మీద వేళ్ళాడే శ్రీలక్ష్మి విగ్రహానికి శ్రీసూక్తం పఠిస్తూ అభిషేకం చేసి, స్వామివారికి హారతి ఇస్తారు. తరువాత స్వామివారి తెల్లనామాన్ని వెడల్పు చేస్తారు. శ్రీస్వామివారి నామాన్ని "తిరుమణికాపు" అంటారు. 16 తులాల కర్పూరాన్ని, ఒకటిన్నర తులం కస్తూరిని ఉపయోగిస్తారు. స్వామివారికి పీతాంబరాన్ని కట్టి ఆభరణాలతో అలంకరిస్తారు.
కొలువు :-

దీనినే "దర్బారు" అని కూడా అంటారు. తెల్లవారుజామున 4.30 గంటల నుంచి 15 నిముషములపాటు జరుగుతుంది. తిరుయామణి మండపంలో స్వర్ణఛత్రం క్రింద స్వర్ణ సింహాసనం మీద ఆశీనులైన శ్రీనివాసునికి ఛత్రచామరాలతో రాజోచిత మర్యాదలు జరిపి, రోజూ పంచాంగ శ్రవణం చేసి, ఆనాటి గ్రహసంచార క్రమాన్ని, ఉత్సవ విశేషాలను, ముందురోజు లభించిన ఆదాయ వివరాలను తెలియజేస్తారు. నువ్వులు, బెల్లం కలిపి దంచిన పిండిని నివేదన చేసి, హారతి ఇచ్చి శ్రీనివాసుని యథా స్థానానికి చేరుస్తారు.


పాదరేణువు :-

చందనం ముద్దను పునుగునూనెతో కలిపితే వచ్చే దానిని "శ్రీ పాదరేణువు" అంటారు. ఈ ముద్దని, వంశపారం పర్యంగా పూజనిర్వహించేవారికి, గ్రుహస్థులకు ఇవ్వటం జరుగుతుంది. దీనిని "కైనిథి" అని అంటారు. "చేతిలో ఉన్న నిథి." అని దీని అర్థం.


తిరుమంజన తీర్థం :-

శ్రీ స్వామివారి విగ్రహం నుండి క్రిందకు ప్రవహించే అభిషేక తీర్థాన్ని "తిరుమంజన తీర్థం" అని అంటారు. ఈ తీర్థంలో పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు కలిసి ఉంటాయి. అర్చకులు, జీయర్ స్వాములు ఈ తీర్థాన్ని శ్రీ పాదరేణువుతో కలిపి తీసుకుని భక్తులకు, గ్రుహస్తులకు, పంచుతారు. ఈ తీర్థంతో పాటుగా "పోళీలు" అనే పిండివంటను కూడా పంచుతారు.


ఏకాంతసేవ :-

ముఖమంటపంలో రెండు వెండి గొలుసులతో వేళ్లాడదీయబడే బంగారు ఊయలలో భోగ శ్రీనివాసమూర్తిని పవళింపచేస్తారు. ఆ కారణంగానే "శయనమంటపం" అని కూడా అంటారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో జరిగే ఈ సేవను "ఏకంతసేవా" లేదా "పవళింపు సేవ" అని కూడా అంటారు. స్వామివారికి పళ్ళు, బాదం పప్పులు నైవేద్యంగా పెడతారు. స్వామివారి రెండు పాదాల వద్ద 2 చందనపు బిళ్ళలు, భోగశ్రీనివసమూర్తి హ్రుదయం మీద సగం బిళ్ళ, మరొక పావు వంతు బిళ్ళను ధ్రువమూర్తి గుండెల మీద ఉండే అలివేలు మంగ వద్ద ఉంచుతారు. మరొక పావువంతు చందనపు బిళ్ళను అక్కడే ఉంచేస్తారు. అలాగే వెండిగిన్నెలో తగినంత నీటిని కూడా ఉంచుతారు. ఎందుకంటే స్వామివారిని పూజించవచ్చే బ్రహ్మదేవుని కోసమని. స్వామివారి శయనానందం కొరకు తాల్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలు, ఆలాపన చేస్తారు. ఈ సేవని "తాళ్ళపాక వారి లాలి" అని అంటారు. ఈ ఏకంత సేవ ఏడదిలో 11 నెలలు భోగశ్రీనివసునికి, ఒక్క మార్గశిర మాసంలో మాత్రం శ్రీ క్రుష్ణ విగ్రహానికి జరుగుతుంది. ఈ సేవ పూర్తి అయితే ఆ రోజుకి స్వామివారికి అన్ని పూజలు, సేవలు పూర్తి అయ్యినట్టు లెక్క.

నైవేద్య సమర్పణ :-

ఉద్యం 6.30 గంటలకు పోటు (వంటశాల)లో సిద్ధమైన నైవేద్యాన్ని నివేదిస్తారు. ఆ సమయంలో బంగారు వాకిలి తలుపులు మూసివేసి తిరుయామణి మండపంలో గంటలు మ్రోగిస్తారు. దీనినే "మొదటి గంట" అని అంటారు. అన్నప్రసాదాలు, పిండివంటలు మొదలైనవి నివేదన చేస్తారు. ప్రధాన వంటదారుడు "ఓడు" (పగిలిన మట్టికుండ)లో మాత్రా అనే దధ్యోదనం (పెరుగన్నం) ఆలయంలో వైష్ణవులు మాత్రమే గర్భగుడిలో ఉండి ప్రబంధ పారాయణం చేస్తూ ప్రసాదాన్ని నివేదిస్తారు. తోమాల సేవలో పఠించిన 28 పాశురాలు (30 పాశురాలకు) కాకుండా మిగిలిన 2 పాశురాలు ఇప్పుడు పఠిస్తారు. తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచుతారు.


మధ్యాహ్న సేవ (నైవేద్యం) :-

మధ్యాహ్న సమయంలో మరలా అష్టోత్తర శతనామార్చన జరుగుతుంది. ఆ సమయంలో శ్రీవారి పాదపద్మాలను తులసీ దళాలతో, పువ్వులతో పూజిస్తారు. తర్వాత శ్రీదేవి, భూదేవిలకు లక్ష్మీ నామార్చన జరుగుతుంది. ఈ సేవకు భక్తులు ఆర్జిత సేవ ద్వారా హాజరు కావచ్చు. స్వామివారికి మధ్యాహ్న భోజన సమయంలో "రెండో గంట" మోగుతుంది. పోటునుంచి వచ్చిన నైవేద్యాలను స్వామివారికి నివేదించి, తాంబూలం, కర్పూర హారతి సమర్పిస్తారు."రెండో గంట" ముగియగానే స్వామివారి హుండిలోని మొత్తాన్ని పరకాయణికి తరలిస్తారు. నైవేద్యం ఆరగింపు పూర్తయ్యాక శ్రీడేవి, భూదేవి సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులను కన్నుల పండగ చేసేందుకు విమాన ప్రదక్షిణంగా కల్యాణ మండపానికి వేంచేస్తారు. ఇక్కడే సుమారు 12 గంటల సమయంలో చిన్న కల్యాణం, పెద్ద కల్యాణం టిక్కెట్లు కొన్న భక్తులు స్వామివారి కల్యాణంలొ పాల్గొంటారు.


రాత్రి పూజ :-

ఈ సేవ కూడా తోమాల సేవ వంటిదే. జియ్యం గారు వెదురు గంపలో పువ్వులు, తులసీ దళాలు తేవటం, అర్చకుడు స్వామివారికి పూజ చేసి, పుష్పమాలలు అలంకరించటం, మంత్రపుష్పం, హారతులు సమర్పించటం జరుగుతుంది. తర్వాత స్వామికి అష్టోత్తర శతనామపూజ, శ్రీదేవి, భూదేవిలకు లక్ష్మీనామార్చన, ఆ తరువాత నైవేద్య సమర్పణ. ఈ సమయంలో మూడో గంట మోగుతుంది. ఈ సేవ సుమారు రాత్రి 8 గంటల ప్రాంతంలో జరుగుతుంది.


ప్రత్యేక సేవల విశేషాలు :-

స్వామివారికి ప్రతీ సోమవారం 7.00 నుండి 9.00 వరకు విశేష పూజ.
మంగళవారం ఉదయం 6.30 నుండి 7.30 వరకు అష్టదళ పద్మారాధన పూజ
బుధవారం ఉదయం 6.30 నుండి 9.00 వరకు సహస్ర కలశాభిషేకం
గురువారం ఉదయం 6.30 నుండి 8.00 వరకు తిరుప్పావడై
శుక్రవారం 4.30 నుండి 6.00 వరకు అభిషేకం జరుగుతుంది.

 

No comments:

Post a Comment