06 September 2015

ద్వారక :-

కురుక్షేత్ర సంగ్రామం అనంతరం, ఒకనాడు కణ్వ, విశ్వామిత్ర , నారద మహర్షులు శ్రీ కృష్ణుని సందర్శనార్దం ద్వారకకు విచ్చేశారు. వీరు పురవీధుల్లో సంచరిస్తూ ఉండగా కొందరు ద్వారక యువకులకు చిలిపి ఊహ తట్టింది. ఆ యువకులు ఒకడికి స్త్రీ వేషం వేసి ఆ మునుల వద్దకు తీసుకుని పోయి ఈ చిన్నదానికి ఆడ బిడ్డ పుడతాడో , మగ బిడ్డ పుడతాడో చెప్పమన్నారు. ఆ మహర్షులు అమాయకులు కాదు కదా, దివ్యదృష్టి తో మొత్తం కనుక్కుని ఆగ్రహం తో, ఆడబిడ్డా కాదు మగబిడ్డా కాదు ఒక ముసలం (రోకలి) పుడుతుంది, అది మీ యాదవ వంశం మొత్తాన్ని నాశనం చేస్తుంది అని శపించి వెనక్కి వెళ్ళిపోయారు. ఈ విషయం శ్రీ కృష్ణునికి తెలిసింది. విధి రాత ను ఎవరూ తప్పించలేరు, యాదవ వంశానికి కాలం చెల్లింది అనుకున్నాడు.

మహర్షుల తపశ్శక్తి ఫలితంగా ఆ యువకుడికి ముసలం జన్మించింది. ఆ యువకులు దానిని శ్రీ కృష్ణుని వద్దకు తీసుకుపోయారు. శ్రీ కృష్ణునికి అది యాదవ వంశాన్ని నాశనం చేసే ఆయుధం లా కనిపించింది. దానిని పిండి చేసి సముద్రం లో కలపమని ఆ యువకులకు చెప్పాడు. వారు దానిని పిండి చేసి సముద్రం లో కలిపారు. చివరగా ఒక ముక్కను అరగదీయలేక దానిని సముద్రం లోనికి విసిరివేశారు. పిండి చేసిన ముసలం మనల్ని ఎలా నాశనం చేస్తుంది లెమ్మని సంతోషం గా ఇళ్ళకు పోయారు. కానీ మునుల వాక్కు వృధా పోదు కదా. మిగిలిన ఆ రోకలి ముక్క తీరానికి కొట్టుకు వచ్చి ఒకానొక చోట ఇసుకలో దిగబడింది. సముద్రంలో కలిసిన రోకలి పిండి బడబాగ్ని వలె కాచుకుని ఉంది. శ్రీ కృష్ణునికి ఇవన్నీ తెలిసినా విధి రాతను తప్పించే శక్తి లేక మిన్నకుండి పోయాడు.

అది మొదలు ద్వారక నగరం లో అనేక ఉత్పాతాలు సంభవించాయి. ఎపుడూ లేని విధంగా యాదవులు సజ్జనలును బాధించడం మొదలుపెట్టారు. స్త్రీలు భ్రష్టు పట్టిపోతున్నారు. యాదవవంశ నాశనం దగ్గరలోనే ఉందని కృష్ణునికి అర్ధం అయ్యింది. తను ఎంతో ప్రేమించే ద్వారకలో యాదవులు నాశనం అవ్వడం ఇష్టం లేని కృష్ణుడు యాదవులు అందరినీ కొలువుపర్చాడు. సముద్రానికి జాతర చెయ్యాలని అందరినీ బయలుదేరమని చెప్పాడు. అందరూ కావలసిన సరంజామా అంతా తీసుకుని బయలుదేరారు. 

బలరాముడు అరణ్యమునకు బయలుదేరాడు. శ్రీ కృష్ణుడు ఒక్కడే యాదవుల తో పాటు వెళ్ళాడు. వెళ్ళే ముందు తండ్రియైన వసుదేవునితో ఇలా అన్నాడు. "తండ్రీ! కొద్ది రోజులలో ద్వారకను సముద్రం ముంచెత్తనున్నది. అర్జునుడు వస్తాడు మిమ్ములను అందరినీ ఉద్ధరిస్తాడు. అతను వేరు నేను వేరు కాదు. అందరూ అతని ఆజ్ఞను పాటించండి."

సముద్ర తీరానికి వెళ్ళిన యాదవులు సుష్ఠుగా భోజనం చేసి, కృష్ణుని ఎదుటే మద్యం తాగి ఒకరిలో ఒకరు కలహించుకోసాగారు. అన్నీ తెలిసినా కృష్ణుడు ఏమీ చెయ్యలేని వాడయ్యాడు. అంతలో ఒకడు ఆనాడు సముద్ర తీరంలో దిగబడిన రోకలి తుంగను తీసుకుని ఒకడిని మోది చంపేశాడు. అది మొదలు అందరూ ఒకరిని ఒకరు చంపుకున్నారు.

మిగిలిన దారుకుడిని, భబ్రుడిని తీసుకుని బలరాముడు ఉన్న చోటికి బయలుదేరాడు శ్రీ కృష్ణుడు. అక్కడ బలరాముడు అరణ్యం లో ధ్యానం లో ఉన్నాడు. అపుడు శ్రీ కృష్ణుడు అర్జునుడి ని ద్వారకకు తీసుకురమ్మని దారుకుడిని పంపాడు. భబ్రుడి ని ద్వారకలోని స్త్రీలను, మిగిలిన వాళ్ళని ప్రయాణమునకు సిద్దం చెయ్యమని పంపాడు. కానీ మార్గమధ్యం లో ఒక ఆటవికుడు అతనిని అదే రోకలి తుంగ తో సంహరించాడు.

దారుకుడు ఏడుస్తూ పాండవుల దగ్గరికి వెళ్ళాడు. అతనిని ఆ పరిస్థితి లో చూసి పాండవులు చలించిపోయారు. అపుడు దారుకుడు జరిగిన విషయం చెప్పి బలరామకృష్ణులు అరణ్యం లో ఉన్నారని, అర్జునుడుని ద్వారకకు తీసుకువెల్లమన్నారని చెప్పాడు. అది విని పాండవులు ఆశ్చర్యపోయారు. శ్రీ కృష్ణ భగవానుడు అచట ఉండగా ఇలా ఎందుకు జరిగిందా అని చాలా భాధపడ్డారు. అర్జునుడు వెంటనే ద్వారకకు పయనమయ్యాడు.

అచట అరణ్యంలో బలరాముడు తన దేహమును విడిచి తన అంశ అయిన మహా సర్ప రూపం ధరించి సముద్రం లో కలిసిపోయాడు. తన అన్న లేని లోకంలో ఉండటం వృధా అని తలచి, తను చెయ్యవలసిన పనులు కూడా ఏమీ లేవని గ్రహించి తన శరీరం వదలడానికి ఏమి కారణం దొరుకుతుందా అని వేచి చూడసాగాడు. ఒకనాడు తనకు అరికాలితో మరణం సంభవిస్తుందని దుర్వాస మహాముని శాపం ఇవ్వడం గుర్తుకువచ్చింది. అపుడు శ్రీ కృష్ణుడు ఒక మహా వృక్షం నీడన మేను వాల్చి, అక్కడకు వస్తున్న ఒక బోయవానికి, తన పాదం లేడి పిల్ల లాగా భ్రమింపచేశాడు. అది తెలియని బోయవాడు గురి చూసి కృష్ణుని పాదానికి బాణం వదిలాడు. తర్వాత వచ్చి చూసి దేవదేవుడైన వాసుదేవునికా నేను బాణం వేసింది అని రోదించడం మొదలు పెట్టాడు. శ్రీ కృష్ణుడు అతనిని ఓదార్చి ఇలా అన్నాడు. "త్రేతాయుగాన వాలి వైన నిన్ను చెట్టు చాటునుండి చంపిన ఫలితం ఇపుడు అనుభవిస్తున్నాను. కర్మ ఫలమును భగవంతుడైనను అనుభవించవలసినదే. నీవు నిమిత్తమాత్రుడవు." అని శ్రీ కృష్ణుడు తన శరీరమును త్యజించాడు.

ద్వారకకు చేరుకున్న అర్జునుడు కృష్ణుడు లేని ద్వారకను చూసి ఖిన్నుడయ్యాడు. శ్రీ కృష్ణుడి ప్రియ సఖుడైన ఆర్జునుడిని చూడగానే శ్రీ కృష్ణుని భార్యలు పలు విధాల రోదించారు. వసుదేవుడు శ్రీ కృష్ణుడు తనకు చెప్పినదంతా అర్జునుడికి చెప్పి తన యోగనిస్ఠ తో శరీరం వదిలాడు.

వసుదేవుని మరణవార్త శ్రీ కృష్ణునికి చేరవేయడానికి అర్జునుడు అరణ్యానికి బయలుదేరాడు. అరణ్యం లో శ్రీ కృష్ణ భగవానుని మృతదేహం చూసి కన్నీళ్ళ పర్వంతం అయ్యాడు. మృతదేహానికి చెయ్యవలసిన కార్యక్రమాలు చేసి తను ద్వారకకు పయనమయ్యాడు. సిద్ధంగా ఉన్నవారిని తీసుకుని తన రాజ్యానికి బయలుదేరాడు. అర్జునుడు ద్వారక విడిచిన మరుక్షణం అప్పటివరకు కాచుకుని ఉన్న సముద్రం ద్వారకను ముంచెత్తింది.

ఇపుడు సముద్రం లో బయటపడిన ద్వారక అదేనని అధికుల విశ్వాసం.

* ద్వారక :-
శ్రీక్రిష్ణుని దివ్య క్షేత్రాలలొ అతి విశిష్టమైనది ద్వారక. గుజరాత్ లొని ఈ దివ్యధామం శ్రీక్రిష్ణుని పాదస్పర్శతొ పునీతమైంది. జరాసందుని బారినుండి తప్పిన్చుకొనేందుకు ఈ నగరాన్ని నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడి ద్వారకాధీశుని మందిరం అతి పురాతనమైంది. ఈ మందిరాన్ని పదో శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. అయితే శ్రీక్రిష్ణుని మనుమడు ఐన వజ్రనాధుడు ఈ మందిరాన్ని మొట్టమొదటి సారిగా నిర్మించినట్ట్లు పురాణాలలో ప్రస్థావన వుంది. శ్రీక్రిష్ణుని ద్వారకా నగరం సముద్రగర్బంలో ఇంకా వుందని పరిశోధకుల అభిప్రాయం.

* ఏడుపవిత్ర పుణ్యక్షేత్రాలు :-
భారతదేశంలో ఉన్న హిందువుల ఏడు పవిత్రక్షే త్రాలలో ద్వారకాపురి ఒకటి. అయితే వీటిలో శివుడు ప్రతిష్టితమై ఉన్న వారణాశి అత్యంత పవిత్రమైనది.
" అయోధ్య మథుర మాయ కాశి కాంచి అవంతిక I
పూరి ద్వారకావతి చైవ సప్తైత మోక్షదాయిక " II - గరుడ పూర్ణిమ

క్షేత్రం అంటే పవిత్రమైన ప్రదేశం. దైవీక శక్తికి కేంద్రం. జీవుడికి తుది గమ్యమైన మోక్షమును అందించే మోక్షపురి. గరుడ పురాణం పేర్కొన్న ఏడు మోక్షపురాలు వరుసగా అయోధ్య, మథుర, మాయా, కాశి, కాంచి, అవంతిక, పూరి మరియు ద్వారావతి.

* ద్వారకాధీశుడి ఆలయం :-
ప్రస్తుత ద్వారకాధీశుని ఆలయం సాధారణ శకం(కామన్ ఎరా లేక కేలండర్ ఇయర్)16వ శతాబ్ధంలో నిర్మించబడింది. అసలైన ఆలయం శ్రీకృష్ణుడి మునిమనుమడైన రాజైన వజ్రుని చేత నిర్మించబడినదని విశ్వసిస్తున్నారు. 5 అంతస్థుల ఈ ఆలయం లైమ్‌స్టోన్ మరియు ఇసుకతో నిర్మితమైనది. ఈ ఆలయగోపురం మీద ఉన్నజండా ఒక రోజుకు అయిదుమార్లు ఎగురవేస్తారు. ఈ ఆలయానికి రెండు ద్వారాలు ఉంటాయి. ఒకటి స్వర్గ ద్వారం రెండవది మోక్షద్వారం. భక్తులు స్వర్గద్వారం గుండా ఆలయప్రవేశం చేసి మోక్షద్వారం గుండా వెలుపలికి వస్తారు. ఈ ఆలయము నుండి గోమతీ నది సముద్రంలో సంగమించే ప్రదేశాన్ని చూడవచ్చు. ద్వారకాపురిలో ఇంకా వసుదేవ, దేవకి, బలరామ, రేవతి, సుభద్ర, రుక్మిణీదేవి, జాంబవతీదేవి మరియు సత్యభామాదేవి ఆలయాలు ఉన్నాయి. బెట్ ద్వారకా ఆలయానికి వెళ్ళే మార్గంలో రుక్మిణీదేవికి ప్రత్యేక ఆలయం ఉన్నది. ఈ ఆలయాన్ని బోటులో ప్రయాణించి చేరుకోవాలి.

* పవిత్ర నగరం :-
ఈ నగరం పేరులోని ద్వార్ అనే పదానికి సంస్కృత భాషలో వాకిలి, ద్వారం లాంటి అర్ధాలు ఉన్నాయి. ద్వార్ అనే పదము ఆధారంగా ఈ నగరానికి ఆఈ పేరు వచ్చింది. అనేక ద్వారాలు ఉన్న నగరం కనుక ద్వారక అయింది. హిందువులు అతి పవిత్రముగా భావిణంచే చార్ ధామ్ (నాలుగు ధమాలు) ద్వారకాపురి ఒకటి. మిగిలిన మూడు పవిత్రనగరాలు బద్రీనాధ్, పూరి, రామేశ్వరం. ఈ నగరం వైష్ణవుల చేత గౌరవించబడింది.

ద్వారకాధీశుని ఆలయం జగత్‌మందిరం అని పిలువబడుతుంది. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీకృష్ణుడు. ద్వరకాపురి సమీపంలో జ్యోతిర్లింగాలలో ఒకటి అయ్న నాగేశ్వరలింగం ఉంది. ద్వారకలో శంకరాచార్యుడు ద్వారకా పీఠం స్థాపించబడింది. ఈ మఠం శ్రీకృష్ణభగవానుడికి సమర్పించబడింది. ఆది శంకరాచార్యుడితో ప్రతిష్ఠించబడిన నాలుగు మఠాలలో ఇది ఒకటి. మిగిలినవి శృంగేరి, పూరి మరియు జ్యోతిర్మఠం. ద్వారకా పీఠంను కాళికా పీఠంగా కూడా అంటారు.

* శ్రీద్వారకనాధ్ మహత్యం :-
ఆదిశంకరులు ద్వారకాధీశుడిని దర్శించి ద్వారకాపీఠాన్ని ప్రతిష్టించాడు. ఇక్కడ కృష్ణుడు క్షత్రియ రాకుమార వివాహ అలంకరణలో దర్శనం ఇస్తాడు. 108 దివ్యదేశాలలో ఈక్షేత్రం ఒకటి.

* దర్శనం సేవలు మరియు ఉత్సవాలు :-
ద్వారకానాధుడికి అనేక సేవలు దర్శనాలు ఉంటాయి. దర్శనలకు తగినట్లు వస్త్రధారణలో మార్పులు జరుగుతుంటాయి. ఈ దర్శనాలు వల్లభాచార్యుల చేత వ్రాయబడిన పుష్టి మార్గాంలో వ్రాయబడినట్లు జరుగుతాయి. ద్వారకానాధుని ఆలయం పుష్టి మార్గ ఆలయం. దర్శనాలు వరుసగా
మంగళ.
శృంగార్.
గ్వాల్.
రాజభోగ్.
ఉథాపన్.
భోగ్.
సంధ్యా ఆరావళి.
ష్యాన్.


* ద్వారకా సామ్రాజ్యం :-
మహాభారతం, హరివంశం, స్కంద పురాణం, భాగవత పురాణం మరియు విష్ణు పురాణం లాలలో ద్వారకాపురి ప్రస్థావన ఉంది. ప్రస్తుత ద్వారకాపురి సమీపంలో శ్రీకృష్ణ నిర్మితమైన ద్వారాపురి ఉండేదని. పురాణేతిహాసాలలో వర్ణించబడిన విధంగా అది సముద్రగర్భంలో కలసి సముద్రగర్భంలో కలసి పోయి కనిపించకుండా పోయిందని విశ్వసిస్తున్నారు.

శ్రీకృష్ణుడు యుద్ధాల వలన జరిగే అనర్ధాల నుండి ద్వారకా వాసులను రక్షించే నిమిత్తం ద్వారకానగర నిర్మాణం చేసి యాదవులను ఇక్కడకు తరలించి సురక్షితంగా పాలించాడని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. శ్రీకృష్ణుడు కంసవధ అనంతరం కంసుడి తండ్రి అయిన ఉగ్రసేనుడిని చెరసాల నుండి విముక్తిడిని చేసి మథుర కు రాజును చేసాడు. కంస వధకు కినుక చెందిన అతడి మామగారైన జరాసంధుడు తన స్నేహితుడైన కాలయవనుడితో కలసి 17 మార్లు మథుర మీద దండయాత్ర చేసాడు.
యుద్ధాల నుండి ప్రజలను రక్షించే నిమిత్తం శ్రీకృష్ణుడు యాదవ ప్రముఖులతో సమాలోచనలు జరిపి సముద్రపరివేష్టితమైన భూమిలో ద్వారకానగరిని నిర్మించి దానికి మథురలోని యాదవులను తరలించాడు. 17 మార్లు జరిగిన దండయాత్రలలో అతడు తన సైన్యాలంతటిని క్షీణింపజేసుకున్నాడు. ఒక్కో మారు జరాసంధుడు 18 అక్షౌహినుల సైన్యంతో దాడి చేసే వాడు. మహారత యుద్ధంలో పండవుల మరియు కౌరవుల సైన్యం మొత్తము 18 అక్షౌహినులు. శ్రీకృష్ణుడు 18వ దండయాత్రకు ముందుగా మథురను వదిలి వెళ్ళాడు. జరాసంధుడు 800 నుండి 1000 సంవత్సరాలు జీవించినట్లు అంచనా. భీష్ముడు కూడా 800 నుండి 1000 సంవత్సరాలు జీవించినట్లు అంచనా.

ద్వారకా నగరం శ్రీకృష్ణుడి ఆజ్ఞానుసారం విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి. సౌరాష్ట్రా పడమటి సముద్రతీరంలో ఈ భూమి నగర నిర్మాణార్ధం ఎంచుకొనబడింది. ఈ నగరం ప్రణాళిక చేయబడి తరువాత నిర్మించబడినది. గోమతీనదీ తీరంలో ప్రణాళికా బద్ధంగా నిర్మించబడిన నగరం ద్వారక. ఈ నగరాన్ని ద్వారామతి, ద్వారావతి మరియు కుశస్థలిగా పిలువబడింది. ఇది ఆరు విభాగాలుగా నిర్వహణా సౌలభ్యం కొరకు విభజించి నిర్మించబడింది.

నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్యకూడలులు, సంతలు, రాజభవనాలు మరియు అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో నిర్మితమైనది. రాజ్యసభా మంటపం పేరు సుధర్మ సభ రాజు ప్రజలతో సమావేశం జరిపే ప్రదేశం ఇదే. ఈ నగరం సుందర సముద్రతీరాలకు ప్రసిద్ధం. ఈ నగరంలో 7,00,000 ప్రదేశాలు స్వర్ణ, రజిత మరియు మణిమయమై నిర్మించబడ్డాయి. శ్రీకృష్ణుడి 16108 మంది భార్యలకు ప్రత్యేక మందిరాలు ఉన్నాయి. వీటితో పాటు ఈ నగరంలో సుందర సరస్సులతో సర్వకాలంలో పుష్పించి ఉండే వివిధమైన వర్ణాలతో శోభిల్లే ఉద్యానవనాలు ఉంటాయి.

* సముద్రంలో మునుగుట :-
శ్రీకృష్ణుడు తన అవతారమును చాలించి వైకుంఠము చేరిన తరువాత ఈ పవిత్ర నగరం సముద్రపు జలాలలో మునిగిపోయింది. ఈ నగరం మహాభారత యుద్ధం జరిగిన 36 సంవత్సరాల అనంతరం సముద్రగర్భంలో కలిసి పోయింది. యాదవ ప్రముఖులు గాంధారి శాపప్రభావాన మునుల శాపప్రభావాన తమలోతాము కలహించికొని నిశ్శేషంగా మరణించిన తరువాత శ్రీకృష్ణుని ఆదేశం మీద అర్జునుడు యాదవకుల సంరక్షణార్ధం ఇక్కడకు వచ్చి శ్రీకృష్ణ బలరాములకు అంత్యక్రియలు నిర్వహించి ద్వారాకాపుర వాసులను ద్వారక నుండి దాటించిన మరు నిమిషం ద్వారకానగరం సముద్రంలో మునిగిపోయింది. ద్వారకానగరాన్ని దాటిన యాదవులు ద్వారకానగరం సముద్రజలాల్లో మునిగి పోవడం వెనుతిరిగి చూసి హాహాకారాలు చేసారు.

అర్జునుడు ఈ విషయం హస్థినాపురంలో వర్ణిస్తూ " ప్రకృతి ద్వారకానగరాన్ని తనలో ఇముడ్చుకుంది. సముద్రం నగరంలో ప్రవేశించి ద్వారకానగర సుందరమైన వీధులలో ప్రవహించి మెల్లగా నగరాన్ని సంపూర్ణంగా తనజలాల్లో ముంచివేసింది. అందమైన భవనాలు ఒకటి తరువాత ఒకటి మునగడం నేను కళ్ళారా చూసాను. అంతా మునిగి పోయింది. అక్కడ నగరం ఉన్న సూచనలు ఏమీ లేవు చివరకు ఒక సరస్సులా ఆ ప్రదేశం కనిపించింది. అక్కడ నగరం ఉన్న జాడలు లేవు. ఇక ద్వారక ఒక పేరు మాత్రమే ఒక జ్ఞాపకం మాత్రమే " . విష్ణు పురాణం ద్వారకానగర మునక గురించి ప్రస్థావించింది. ఇలా ద్వారకానగరం సముద్రగర్భంలో కలసి పోయి అంతటితో ద్వాపరయుగం అంతమై కలిపురుషుడు ఈ లోకంలో ప్రవేశించి కలియగానికి నాంది పలికాడు.

* విశేషాలు :-
ఇది ముక్తి ప్రద క్షేత్రములలో ఒకటి. సన్నిధికి సమీపముననే గోమతీ నది సముద్రములో సంగమిస్తుంది. అక్కడ నుండి బస్సుమార్గంలో పోయి బేటి ద్వారక చేరాలి. ఇది శ్రీకృష్ణుని నివాస స్థలము. ఇచట 1500 నివాస గృహాలు ఉన్నాయి. ఇక్కడ మాలవరులు శంఖ చక్రధారియై ఉపస్థితమై ఉన్నాడు. దీనికి 5 కి.మీ. దూరమున శంఖతీర్థము ఉంది. ఇక్కడ పెరుమాళ్ళ వక్షస్థలమున శ్రీదేవి ఉపస్థితమై ఉంది. రుక్మిణీదేవి ఉత్సవ తాయార్. ఉక్కడ అనేక సన్నిధులు ఉన్నాయి. ప్రతిదినము తిరుమంజనము జరుగును. పసిపిల్లవానివలె-రాజువలె-వైదికోత్తమునివలె అలంకారములు జరుగుతుంటాయి.

ద్వారక నుండి ఓఘ పోవుమార్గములో 5 కి.మీ. దూరమున రుక్మిణీదేవి సన్నిధి ఉంది. ఇదియే రుక్మిణీ కల్యాణము జరిగిన ప్రదేశము. ద్వారక సమీపమున తోతాద్రి మఠము ఉంది. విరావన్‌స్టేషన్‌లో దిగి 160 కి.మీ. దూరమునగల రైవతక పర్వతమును చేరవచ్చును. ఇచట అనేక సన్నిధులు ఉన్నాయి. కృష్ణావతారమునకు ముందుగానే వెలసున ప్రదేశంలో శయనభంగిమలో స్వామి ఉపస్థితమై ఉన్నాడు.

* మార్గం :-
బొంబాయి-ఓగా రైలుమార్గములో ఓగారేవు ముఖద్వారానికి 35 కి.మీ. దూరము. అహమ్మదాబాద్ నుండి బస్‌లు గలవు. అన్నివసతులు కలవు.

No comments:

Post a Comment