18 September 2015

కాణిపాకం వినాయకుడు :-

దేవగణాలకు అధిపతిగా ఉద్భవించిన వినాయకుడు – తొలిపూజలందుకునే వేలుపుగా అశేష భక్తులకు ఆరాధనీయుడు. ‘దండాలయ్య… ఉండ్రాలయ్యా దయుంచయా దేవా ‘అంటూ మన దేశంలోనే కాదు -నేపాల్, చైనా, జపాన్, టర్కీ, ఇండోనేషియా తదితర దేశాల్లోని ప్రజలు ఆయన్ను భక్తితో ప్రార్ధిస్తారు. విఘ్న కారకుడిగా, విఘ్న నివారకుడిగా పేరొందిన విఘ్నేశ్వరుడు- మనరాష్ట్రంలో శాతవాహన రాజుల కాలం నుంచీ విశేషపూజలందుకుంటున్న వైనం… చారిత్రక సత్యం! ముప్పై రెండు రూపాల్లో ప్రణతులందుకుంటున్న గణనాధుడు, చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో వరసిద్ది వినాయకుడిగా అవతరించాడు. కోరిన వరాలిచ్చే కొండంత దేవుడిగా, పిలిచే భక్తుడికి పలికే భగవంతుడిగా ప్రస్తుతులందుకొంటున్న బొజ్జ గణపయ్య ప్రస్తుతం కాణిపాకంలో బ్రహ్మోత్సవాల మహశివరాత్రి సంరంభానికి సిద్ధమవుతున్నాడు.

చిత్తూరు జిల్లాలో తిరుమల, శ్రీకాళహస్తిల తరువాత చెప్పుకొదగిన అపురూప పుణ్యక్షేత్రం కాణిపాకం. ఇక్కడి స్వయంభూ వరసిద్ది వినాయక స్వామి ఆలయం సత్య ప్రమాణాలకు నెలవుగా ప్రసిద్ది పొందింది. ఈ ఆలయానికి సుమారు వేయ్యేళ్ళ చరిత్ర ఉంది. చిత్తూరు పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో బహుదానదీ తీరంలో వెలసిన ఈ క్షేత్రానికి సంబంధించి స్థలపురాణాలు, స్వామి వారి జననాన్ని గురించి తెలిపే ఇతిహాసాలు ఎన్నోఉన్నాయి.

బావిలో వింత :-
సాధారణంగా పుణ్యక్షేత్రాల్లో వెలసిన విగ్రహాలు చెక్కినవే కానీ స్వయంగా ఆవిర్భవించినవి కావు. అయితే కాణిపాకంలోని విఘ్నేశ్వరుడు మాత్రం ఏ శిల్పుల చేతా రూపుదిద్దుకోకుండా స్వయంగా భూమి నుంచి ఉధ్బవించిన స్వయంభూ విగ్రహమని ప్రసిద్ధి చెందడంవల్ల – ఈ క్షేత్రం అధిక ప్రాసస్త్యం గడించింది. ప్రకృతి సంపదలకు, పచ్చనైన పంటలకూ నిలయమైన ఈ ప్రదేశాన్ని పూర్వం ‘విహారపురీ అని పిలిచేవారు. దీనిక సంబంధించిన ఓ కధ భక్తుల్లో అత్యంత ప్రాచుర్యం గడించింది. ఈ గ్రామంలో పుట్టుకతో మూగ, చెవిటీ, గుడ్డి వారైన ముగ్గురు సోదరులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తూ ఉండేవారట. వారికి ఉన్న ఆస్తిపాస్తులు ఒక కాణి మాగాణి (పాతిక ఎకరాల భూమి). అందులో ఒక ఏతం బావి ఉండేవట. ఒకసారి వర్షాభవం కారణంగా కరువు కాటకాలతో ఆ ప్రాంతం విలవిలలాడింది.

బావిలోని నీరు అగాధం లోకి చేరుకుంది. వారు తమ పొలంలో పంటలకు కావలసిన నీటికోసం అక్కడే ఉన్న ఏతం బావి పూడికతీయడం ప్రారంభించారు. బావిని తవ్వుతుండగా లోపలి నుంచి ఠంగ్ మని శబ్దం వినిపించి , వెంటనే ఆ ముగ్గురు సోదరులు బావిలో ఉన్న రాయిని పార, గడ్డ పారలతో తొలగించడానికి ప్రయత్నం చేశారు. గడ్డపార రాయి పై పడగానే కింది నుంచి రక్తం చిమ్ముకొని పైకి ఎగిసిందట. రక్తం చూసి వారు భయాందోళనలకు గురయ్యారు. రాయి నుంచి వెలువడ్డ రక్తం ఆ ముగ్గురు వికలాంగుల శరీరానికి తాకగానే వారి వైకల్యాలు తొలిగి మూగవాడీకి మాటలు, చెవిటి వాడికి వినికిడి శక్తి, గుడ్డివాడికి దృష్టి వచ్చాయట.

ఈ విషయాన్ని వారు గ్రామం లోని ప్రజలకూ, రాజుకూ తెలియజేశారు. వెంటనే గ్రామస్తులు బావి వద్దకు చేరుకొని , మరింత లోతుగా తవ్వగా, గణనాధుని రూపం కనిపించిదట .తెలియక జరిగిన అపరాధానికి క్షమాపణలు కోరుకుంటూ గ్రామస్తులు అత్యంత భక్తి శ్రద్దలతో స్వామి వారికి టెంకాయల్ని సమర్పించారట . టెంకాయల్ని కొట్టడం ద్వారా వచ్చే నీరు అక్కడ ఉన్న కాణి భాగమమతా ప్రవహించడం తో ఆ విహారపురి గ్రామం పేరు కాణిపాకం గా మారింది.కుళోత్తుంగ చోళుడనే రాజు 11 వ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం చేపట్టినట్లు ఆధారాలున్నాయి. ఇక్కడి స్వామివారి చుట్టూ ఎప్పుడూ నీరు ఉంటుంది.

వర్షాకాల సమయంలో స్వామి ఉన్న బావిలోని నీరు ప్రవహించడం కనిపిస్తుంది. ఇప్పటికీ స్వామి వారికి పారవేటు వెనుక భాగంలో ఉంది. అలాగే స్వామివారు స్వయంభువు కావడం వలన క్రమంగా పెరుగుతున్నాడనే ప్రజల నమ్మకం. గతంలో స్వామి వారి రూపం కొంత మేరకు మాత్రమే కనిపించేదని కొందరు వృద్దులు తెలిపారు. స్వామి వారి విగ్రహం ఉదరం, మోకాళ్ళు, బొజ్జ వరకు కనిపిస్తోంది. స్వామి వారి పెరుగుదలకు నిదర్శనం అన్నట్లు 1945వ సంవత్సరంలో అరగొండపల్లెకు చెందిన బెజవాడ సిద్దయ్య భార్య లక్ష్మమ్మ స్వామి వారికి సరిపడగా చేయించిన వెండి కవచం ప్రస్తుతం సరిపోవడం లేదు. స్వామి వారి బావిలో ఉన్న పవిత్ర జలాన్ని భక్తులకు తీర్ధంగా ఇస్తున్నారు.

ప్రమాణాలకు నెలవు :-
కాణిపాకం స్వయంభూ శ్రీవరసిద్ది వినాయక స్వామి ఆలయం సత్యప్రమాణాలకు నెలవని చెబుతారు. ప్రమాణాల పురుషుడైన శ్రీ వరసిద్ది వినాయకుడే ఇక్కడ న్యాయ నిర్ణేత. ఎటువంటి వివాదమైనా స్వామి వారి సన్నిధిలో అవలీలగా పరిష్కారం అయిపోతుందని భక్తులు నమ్ముతారు. ఇక్కడ స్వామి వారి ఎదుట ప్రమాణాలు చేసే పధ్ధతి ఆనవాయితీగా వస్తోంది. ఇలా ప్రమాణాలు చేస్తే జటిలమైన సమస్యలు కూడా తీరిపోతాయని ప్రజల నమ్మకం. భక్తులు ఆలయప్రాంతంలోని పవిత్ర పుష్కరిణిలో స్నానం ఆచరించి, అటుపై స్వామి వారి ఎదుట ప్రమాణం చేస్తారు. ఇక్కడి ప్రమాణాలకు ఆంగ్లేయుల పరిపాలన కాలంలోని న్యాయస్థానాల్లో కూడా అత్యంత ప్రాముఖ్యత ఉండేది.

చెడు అలవాట్లకు, వ్యసనాలకు అలవాటు పడి వాటిని మానలేకుండా ఉన్న వారు స్వామి ఎదుట ప్రమాణం చేస్తే , దైవ భీతితో మానుకుంటారని ప్రతీతి. వివిధ సమస్యల పరిష్కారాలు ఆశిస్తూ ప్రతినిత్యం స్వామి ఎదుట ప్రమాణాలు చేస్తారు భక్తులు. ఉదాహరణకు సొమ్ము దొంగిలించాడన్న అనుమానానికి గురయిన వ్యక్తి అతనిపై నేరం మోపిన వ్యక్తి ఇద్దరూ స్వామి ఎదుట ప్రమాణం చేస్తారు. ఒకవేళ సదరు వ్యక్తి నిజంగా సొమ్ము దొంగతనం చేసి ఉండి, స్వామి ఎదుట తప్పుడు ప్రమాణం చేస్తే కొన్ని నెలలకే అతనికి ఎదో ఒక కీడు జరుగుతుందని ప్రజల నమ్మకం. అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేసిన వారు ఇక్కడ మొదట పూజలు చేసుకొంటుంటారు.

నది పేరు వెనుక కధ :-
కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి ఆలయానికి పక్కనే బహుదానది ఉంది. ఈ నదికి ఆపేరు రావడానికి పురాణాల్లో ఒక కధ ఉంది. పూర్వం శంఖుడు, లిఖితుడు అనే ఇద్దరు సోదరులు సుదూర ప్రాంతం నుంచి స్వామి వారి దర్శనానికి వస్తూ, కావలసిన ఆహార పదార్ధాల్ని తెస్తుండగా అవి మార్గ మధ్యంలో అయిపోయాయట. నడిచి నడిచి అలసిపోయిన చిన్నవాడైన లిఖితుడు ఆకలి బాధ తట్టుకోలేక సమీపంలో ఉన్న మామిడి తోటలో ఒక మామిడి పండును కోసుకుతింటానని అన్నను కోరాడట. అది ధర్మ విరుద్ధమని అన్న వారించాడట. కానీ అన్న మాటలను పెడ చెవిన పెట్టిన తమ్ముడు లిఖితుడు మామిడి పండును కోసుకు తిన్నాడు. ధర్మ విరుద్ధంగా దొంగతనం చేసి మామిడి పండు తినడాన్ని క్షమించని శంఖుడు ఈ విషయాన్ని రాజుకు తెలుపగా క్రూరుడైన రాజు లిఖితుని చేతులు నరికించి వేశాడట. తమ్ముడు చేసిన చిన్న తప్పునకు రాజు ఇంత పెద్ద శిక్ష విధిస్తాడని ఊహించని అన్న శంఖుడు, తమ్ముణ్ణి తీసుకొని, కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి ఆలయాన్ని దర్శించేందుకు వెళ్ళాడట . స్వామి వారి దర్శనానికి ముందు – పక్కనే ఉన్న నదిలో స్నానం ఆచరించేందుకు నదిలో మునిగాడట. పైకి లేచి చూసేసరికి లిఖితునికి మునిపటిలా చేతులు వచ్చాయట. బాహువులు ఇచ్చిన నది కావడంవల్ల ఈ నదికి బాహుదా నది అని, కాలక్రమంలో బహుదా నది అని పేర్లు వచ్చాయి.

హరిహర నిలయం :-
కాణిపాకం వినాయక స్వామి ఆలయానికి అనుబంధ ఆలయాలుగా వాయువ్య దిశలో శ్రీ మరకదాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయం, ఈశాన్య దిశలో శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మహత్యాది పాతక పరిహారం కోసం రాజరాజ కుళోత్తుంగ చోళ నరేంద్ర మహారాజు వంశస్థులు 101 శివాలయాల్ని నిర్మించారు. ఇందులో భాగంగానే కాణిపాకంలోని మణికంఠేశ్వరస్వామి ఆలయాన్ని కూడా నిర్మించారని అంటారు. అలాగే సర్పయాగ పరిహారానికి జనమేజయ మహారాజు నిర్మించిన ఆలయాల్లో కాణిపాకంలోని శ్రీ వరదరాజ స్వామి ఆలయం కూడా ఒకటని అంటారు. వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలో ఇంకా వీరాంజనేయస్వామి ఆలయం, నవగ్రహాలయాలు ఉన్నాయి. కాణిపాక క్షేత్రం హరిహర క్షేత్ర నిలయమనీ, ఇలాంటి క్షేత్రం మరెక్కడా లేదనీ కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి వ్యాఖ్యానించారు.

వైభవంగా బ్రహ్మోత్సవాలు :-
వినాయక చవితి మొదలుకొని 21 రోజులు ఇక్కది సిద్ది వినాయక స్వామి వారికి అత్యంత వైభవంగా తొమ్మిది రోజులపాటు బ్రహ్మోత్సవాలు, 12 రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు.

No comments:

Post a Comment