01 September 2015

ధనుర్మాసము :-

చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ధనూరాశిలో ఉన్నమాసాన్ని "ధనుర్మాసము"అంటారు. ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది.

భక్త వత్సలుడైన ఆ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనది "ధనుర్మాసము" . ఈమాసములో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా అక్షయ , అమోఘ సత్పలితాలను ప్రసాదిస్తుంది .ఈ మాస దివ్య ప్రభావము వల్లే గోదాదేవి సాక్షాత్ ఆ శ్రీ రంగనాయకుని పరిణయ మాడిందనేవిషయం మనకుపురాణాల ద్వారా తెలుస్తుంది .

ఆమె " తిరుప్పావై పాసురాలు" జగద్విక్యాతి నార్జించాయి .దీనిలో తిరు అంటే మంగళ కరమైన అని ,పావై అంటే మేలుకొలుపు అనే అర్ధం వస్తుంది .వేదాంత పరమైన ఎన్నో రహస్యాలు ఈ పాశురాలలో మిళితం చేసినందున భాగవతానికి సమన్వయము చెస్తూ వస్తారు.


ధనుర్మాసం అంటే ధనుస్సుఅనే పదానికి ..ధర్మం అని అర్ధం .అంటే ఈధనుర్మాసము లో దర్మాని ఎంతగా ఆచరిస్తామో అంతగా మనము ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమన మాట .

ధనుస్సు మాసాల రిత్యా మార్గశిర మాసము లో వస్తుంది . ధనుర్మాసానికి ఆద్యురాలు గోదాదేవి ."గో "అనే శబ్దానికి జ్ఞానము అని ,"ద" అనే శబ్దానికి అర్ధం ఇచ్చునది అని .గోదాదేవి చెప్పిన పాసురాలను ధనుర్మాసము లో విష్ణాలయాలలో తప్పనిసరిగా గానము చేస్తారు.


ప్రతీ ధనుర్మాసము లోను గోదాదేవి గోపికలను లేపి శ్రీ కృష్ణుని గొప్పతనాన్ని వర్ణించడం ఆ పాసురాల విశేషం. ధనుర్మాసము అరంబాన్నే పల్లెటూర్లలొ "సంక్రాంతి "నెల పట్టడము అంటారు .ఈ నెల రోజులూ హరిదాసులకీర్తనలతొ,జంగమ దేవర లతో ,గంగిరెద్దుల ను ఆడించేవారితోనూ ,సందడిగా వుంటుంది.ముంగిళ్ళలో కల్లాపి జల్లి, ముత్యాలముగ్గుల తో కనుల విందు గా వుంటాయి .ధాన్యపు రాశులను ఇళ్ళకు చేర్చిన రైతు ల సంభారాలతో పల్లెలు "సంక్రాంతి "పండుగ కోసం యెదురుచూస్తూ వుంటాయి . 

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం ఈనెల 16 నుంచి ఆరంభం కానుంది. సాయంత్రం 4.42 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈనెల 17 నుంచి స్వామివారికి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. ధనుర్మాస ఘడియలు జనవరి 14న ముగియనున్నాయి. పురాణ నేపథ్యంలో గోదాదేవి ద్వాపరయుగం నాటి గోపికగా భావించి పాడిన 30 పాశురాలను నెల రోజుల పాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా "శ్రీకృష్ణస్వామి"వారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా నిర్వహిస్తారు.

ధనుర్మాస వ్రత విశిష్టత :-
ధనుర్మాసంలో చేసే వ్రతం కనుక దీనిని ధనుర్మసవత్రంగా పిలుస్తున్నాం. మనకు మేషం నుండి మీనం వరకు పన్నెండు రాశులున్నాయి. సూర్యుడు నెలకో రాశిలో ప్రవేశిస్తుంటాడు. దీనిని సంక్రమణం లేక సంక్రాంతి అంటున్నాం. ఉదాహరణకు సూర్యుడు మేష రాశిలో ప్రవేశిస్తే ధనుస్సంక్రమణం లేదా మేష సంక్రాంతి అవుతుంది. అలాగే సూర్యుడు ధనూరాశిలో ప్రవేశిస్తే ధనుస్సంక్రమణం లేక ధనుస్సంక్రాంతి అవుతుంది. ఒక రాశిలో ప్రవేశించిన సూర్యుడు నెలపాటు ఆ రాశిలో వుంటాడు కనుక ఆ రాశి పేరున ఆ సంక్రాంతిని వ్యవహరిస్తారు. ధనూరాశిలో ఒక మాసం పాటు సూర్యుడు వుంటాడు కనుక ఆ మాసాన్ని ధనుర్మానం అనడం జరుగుతోంది. మార్గశీర్ష మానం ఆరంభమైన ఏడు రోజులకు ధనుస్సంక్రమణం జరుగుతుంది. అంటే మార్గశీర్ష మాసపు ఏడవ రోజునుండి పుష్యమాసం ప్రారంభమైన ఆరవ రోజు వరకు ఉంటుంది. 30వ రోజును భోగి పండుగగాను, ఆ మరుసటిరోజున మకర సంక్రాంతి పండుగగాను మనం జరుపుకుంటాం.

ఈ ధనుర్మాస వ్రతం మార్గశీర్షపు ఏడవ రోజునుండి ప్రారంభమై పుష్యమాసపు ఆరవ రోజువరకు నిరంతరాయంగా సాగుతుంది. వ్రతాన్ని ధనుర్శాసంలోనే ఎందుకు చేయాలన్న సందేహం రావచ్చు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా 'మాసోహం మార్గశీర్షోహం' అని తానే మార్గశీర్ష మాసాన్నని భగవద్గీతలో సెలవిచ్చాడు. ఇది శ్రీకృష్ణ భగవాసునికి ప్రీతి పాత్రమైన మాసం కాబట్టి స్వామిని ఈ మాసంలో విశేషంగా ఆరాధిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని శ్రీ గోదాదేవి మనకు నిరూపించి చూపింది.
మనకు ఉత్తరాయణం, దక్షిణాయనం అని రెండు పుణ్యకాలాలున్నాయి. ఇందులో ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగలుగను, దక్షిణాయన పుణ్యకాలం వారికి రాత్రిగాను పరిగణించబడతాయి. ఇందులో మార్గశీర్ష మాసం ఉత్తరాయణ పుణ్యకాలానికి ఉషఃకాలమాట. అంటే బ్రహ్మీ ముహూర్తమన్నమాట! కావుననే మార్గశీర్షమాసం ఇంత ఆధిక్యతను సంతరించుకుంది.
ఇక ధనుర్మస వ్రత విషయానికొస్తే శ్రీ ద్వాపరయుగంలో శ్రీ కృష్ణ సంశ్లేషమును పొందగోరిన గోపకన్యలు వ్రేపల్లెలో కాత్యాయినీ వ్రతాన్ని చేశారని విని, తానూ అలాగే చేయాలనుకుంది. తానున్న విల్లిపుత్తూరును వ్రేపల్లెగను, తన్ను ఒక గోప కన్యకగను, తన స్నేహితురాళ్ళను వ్రజ కన్యలుగను భావించి, తాను గొల్ల కన్య రూపాన్ని ధరించి విల్లిపుత్తూరులో వేంచేసియున్న వటపత్రశాయినే శ్రీకృష్ణునిగా భావించి, అతి శ్రేష్ఠమైన మార్గశీర్షమాసాన ధనుర్మాససమయంలో శ్రీ స్వామివారిని నెలరోజులూ అర్చిస్తూ రోజుకొక పాశురాన్ని(పాట) సమర్పించింది. ఆమె పాడిన పాటలు సామాన్యమైనవి కావు.

(1) శ్రీ సీతాకళ్యాణం "అష్ఠాక్షరీ మంత్రాన్ని "ఓం నమోనారాయణాయ.
(2) శ్రీ గోదాకళ్యాణం" ద్వయమంత్రాన్ని "శ్రీ మన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః
3) శ్రీ రుక్మిణీ కళ్యాణం చరమశ్లోకాన్ని ... శ్లో|| సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచుః

అని ప్రతిపాదిస్తాయని ఆచార్య సూక్తి - శ్రీ గోదాదేవి స్వామికి సమర్పించిన పాశురాలు ప్రణవమంత్ర, అష్టాక్షరీ మంత్ర, స్వరూపాలే. వేదోపనిషత్తుల సారాంశమే! నియమ నిష్ఠలతో స్వామిని ఆరాధిస్తే ముప్పది దినాల్లోనే తరుణోపాయం లభిస్తుందని చాటి చెప్పింది.

ధనుర్మాస వ్రతం :-
ప్రత్యక్ష భగవానుడైన శ్రీసూర్యభగవానుడు మేషరాశి మొదలు పన్నెండు రాశులలో సంచరిస్తుంటాడు. ద్వాదశాత్మడైన ఆదిత్యుడు, తన దివ్యయాత్రలో ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తూనే "ధనుర్మాసం" ప్రారంభమై, సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించేంతవరకూ, అంటే మకర సంక్రాంతి పర్వదినం ముందురోజు భోగి వరకు వుంటుంది. ఈ నెలరోజుల పాటూ "ధనుర్మాసవ్రతం" ఆచరించాలి.ధనుర్మాసం గురించి మొదట బ్రహ్మదేవుడు స్వయంగా నారద మహర్షికి వివరించినట్లు పురాణకథనం. ధనుర్మాస వ్రత ప్రస్తావన, మహాత్మ్యాలు బ్రహ్మాండ, భాగవత ఆదిత్యపురాణాల్లో, నారాయణ సంహితలో కనిపిస్తుంది.వ్రతం చేయాలనుకునే వారు బంగారం లేదా వెండి లేకపోయినట్లయితే శక్తి మేరకు పంచలోహలతోగాని, రాగితో గానీ శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని ఒకదాన్ని తయారుచేయించుకుని పూజాపీఠంపై ప్రతిష్టించుకోవాలి. విష్ణువును 'మధుసూదనుడు' అనే పేరుతో వ్యవహరించాలి. ప్రతి రోజు సూర్యోదయానికి కంటే ఐదు ఘడియలు ముందుగా నిద్ర లేచి కాలకృత్యాలను పూర్తిచేసుకుని, తలస్నానం చేసి నిత్యపూజలు, సంధ్యావందనాలను ముగించి, అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. మధుసూధనస్వామిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకించాలి. అందుకోసం శంఖాన్ని ఉపయోగించడం శ్రేష్ఠం. శంఖంలో అభిషేక ద్రవ్యాలను ఒక్కొక్కదానినే నింపుకుని, అభిషేకం చేయాలని శాస్త్రవచనం. తర్వాత తులసీ దళాలతోనూ, వివిధ రకాలైన పుష్పాలను ఉపయోగించి స్వామి వారిని అష్టోత్తర శతనామాలతోగానీ, సహస్రనామాలతోగానీ, పూజించాలి. నైవేద్యంగా మొదటి పదిహేనురోజులూ 'చెక్కర పొంగలి' ని గానీ, బియ్యం, పెసరపప్పు కలిపి వండిన 'పులగం'ను గానీ సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులూ 'దధ్యోదనం' నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత ధూప,దీప, దక్షిణ,తాంబూలాలను సమర్పించి నమస్కరించుకోవాలి. మధుసూధనస్వామివారిని పూజించడంతో పాటూ బృందావనంలో తులసిని పూజించడం చేయాలి. ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూగానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు ధనుర్మాసం మొత్తం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం శ్రేష్ఠం. నెలరోజుల పాటూ చేయలేనివారు 15 రోజులుగానీ, 8 రోజులుగానీ, 6 రోజులుగానీ, 4 రోజులుగానీ, లేదంటే కనీసం ఒక్కరోజు అయిన ఆచరించాలని శాస్త్రవచనం.
వ్రతాన్ని ఆచరించడం పూర్తయ్యాక శ్రీమధుసూధన స్వామివారి విగ్రహాన్ని -

"మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రద తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథాః||"
అనే శ్లోకాన్ని పఠిస్తూ పండితుడికి దానం ఇవ్వాలి. పండితుడు దానన్ని స్వీకరిస్తూ -
"ఇందిరా ప్రతి గృహ్ణాతు" అని పండితుడు ఇచ్చే ఆశీర్వచనాన్ని స్వీకరించడం వల్ల సకల కోరికలు సిద్ధిస్తాయని చెప్పబడుతోంది. ఈవిధంగా ధనుర్మాసవ్రతాన్ని ఆచరించడం వలన కోరిన కోరికలు తీరడంతోపాటూ ఇహలోకంలో సౌఖ్యం, పరంలో మోక్షం సిద్ధిస్తుందనేది పురాణ కథనం. ధనుర్మాసవ్రతాన్ని ఒక్కరోజు ఆచరించడం వల్ల వేయిసంవత్సరాల పాటూ నిత్యం వివిధదేవతలను ఆరాధించినంత ఫలం లభిస్తుందనేది పండితాభిప్రయం. కాత్యాయనీవ్రతం లేక శ్రీ వ్రతంఈ వ్రతాన్ని ధనుర్మాసంలో వివాహం కాని అమ్మాయిలు ఆచరించాలని చెప్పబడుతోంది. పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడి సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుడినే భర్తగా పొందినట్లు కథనం. శ్రీ గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడిని భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి.


వ్రత విధానం :-
ధనుర్మాసంలో ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి. ఇంటిముందు శుభ్రపరిచి పేడనీటితో కళ్ళాపి చల్లి, బియ్యపు పిండితో ముగ్గులను తీర్చిదిద్ది, ముగ్గుల మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బిళ్ళను ఉంచి, వాటిని గుమ్మడి, బీర, చామంతి, బంటి వంటి పూలతో అలంకరించి నమస్కరించాలి. అనంతరం కాత్యాయనీదేవిని షోడశోపచారాలు , అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ విధంగా ప్రతిరోజూ ధనుర్మాసమంతా ఆచరించాలి. తెలుగునాట గొబ్బెమ్మల వ్రతంగా పేరు పడిన ఈ కాత్యాయనీ వ్రతాన్ని కన్యలు ఆచరించడం వల్ల మంచి భర్త లభిస్తాడని శాస్త్రవచనం.

No comments:

Post a Comment