19 September 2015

కామాఖ్యాదేవి :-

ఈ సృష్టి సకలం శక్తి మూలంగానే నడుస్తోంది. ఆ శక్తి ఎవరనే వాదం అనవసరం. ఎన్నో కోట్ల మైళ్ల దూరంలో ఎప్పటినుంచో అలా ఉన్న నక్షత్రాలు భూమ్మీదకు రాలిపడకుండా ఉన్నాయంటే దానికి ఇప్పటి శాస్త్రజ్ఞుల ప్రయోగాలు కారణం కాదు! ప్రస్తుతం వాటిమీద ప్రయోగాలైతే చేస్తూ, ఇంకా కొత్తవి ఉన్నాయంటున్నారు గానీ, ఇతమిత్థంగా నిర్ణయించలేక పోతున్నారు. కాబట్టి నీకు, నాకూ, మనకందరకూ ఆ శక్తే దైవంతో సమానం. సమాన మేమిటి దైవమే. ఆ శక్తి లేనిదే అడుగు తీసి అడుగు వెయ్యలేం. చివరకు ఆ పరమేశ్వరుడైనా సరే! శివునికి, శక్తికి తేడాలేదు. శివ అంటే శివుడు. శివా అంతే శివానీ అని అర్థం. అందుకే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ‘శివశ్శక్త్యాయుక్తో’… అంటూ తమ సౌందర్యలహరిని ప్రారంభిస్తారు. కాళిదాస మహాకవి కూడా ఆది దంపతులను వాక్కు, అర్థంగా పోల్చాడు. అలాంటి ఆ శక్తి స్వరూపుణి వెలసిన అత్యంత శక్తిమంతమైన క్షేత్రం కామాఖ్యాదేవిమందిరం.


సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తి పీఠల్లో అత్యంత శక్తిమంతమైనది కామాఖ్యాదేవి క్షేత్రం ఒకటి. అస్సాంలోని బ్రహ్మపుత్రా నది ఒడ్డున, గౌహతికి సమీపంలో ఉందీ క్షేత్రం. అస్సాం రాజధాని గౌహతికి రైలు, విమానం, యాత్రాట్రావెల్స్ ద్వారా కూడా ప్రయాణం చేయవచ్చు. ఇక్కడకు రోడ్డు, రైలులో చేసే ప్రయాణం ఒక మధురానుభూతిని మిగిలిస్తుంది. ఈ ప్రయాణంలో మనతో పాటే సాగివచ్చే ఈ అందమైన ప్రకృతి మన హృదయ సీమలో చెరగని స్థానాన్ని పదిలపరచుకుంటుంది. ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ గౌహతి వచ్చిన వారికి ఇక్కడికి 8 కిలో మీటర్ల దూరంలో ఉన్న నీలాచల పర్వతాలు మరింత అందాలతో కనువిందు చేస్తాయి. గుబురుగా, దట్టంగా దారి కనిపించనంత ఎత్తుగా పెరిగిన చెట్టతో నిండి ఆకాశాన్నంటుతూ ఉన్న నీలాచలం - ఈ పర్వతం దిగువ అంచు తాకుతూ ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నదీ జలం. ఇంత రామణీయకతను దర్శించిన భక్తుల జన్మ సఫలం. దీన్నంతా చూసిన భక్తులు ఎంతగానో పరవశులై పోతారు. ఇంత అందమైన ప్రకృతి సోయగాన్ని తమ మనుగడకు వరంగా ఇచ్చిన పరమేశ్వరికి కృతజ్ఞతానుభూతిని తెలియచేసుకుంటారు. ఈ పర్వతంపైనే శక్తి పీఠం ఉంది. ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తున్న ఈ పర్వతం పైకి ఆటోలు, టాక్సీలపై చేరుకోవచ్చు. అమ్మను దర్శించుకోవచ్చు.
ఇక్కడ వెలసిన దేవిని కామాఖ్య అని, కామరూపిణి అని పిలుస్తారు. సామాన్యంగా కామం అంటే శారీరక చిత్త చాంచల్యంగా భావిస్తారు. కానీ, అసలు కామమన్నా, కామరూపిణి అన్నా అనుకున్న రూపాన్ని అనుకున్న క్షణంలో మార్చుకోగలగడం అని అర్థం. అలా చెయ్యగలగిన శక్తిమంతురాలు కాబట్టే కామరూపిణి అయింది. కామాఖ్య దేవి అనేక రూపాలు ధరించి భక్తులకు చేరువై వారి వారి కోరికలను తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది. కామాఖ్యా దేవిని త్రిపుర శక్తిదాయినిగా కొలుచుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మూడు ప్రధాన రూపాల్లో ఈ తల్లి ఇక్కడ దర్శనమిస్తుంది. అరాచకవాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా రూపం ధరిస్తుంది. ఈ రూపాన్ని పరమేశ్వరుడు కూడా చూడలేడు. ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహినియై దర్శనమిస్తుంది. పరమే శ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపురసుందరిగా మారుతుంది. ఇంకా అనేక రూపాలు ధరించగల తల్లి ఈమె.
ఆలయానికి వచ్చిన భక్తులకు ముందుగా స్వాగత ద్వారం ఎదురవుతుంది. స్వాగత ద్వారం కూడా ఎంతో ఆకర్షణీయంగా చక్కగా చెక్కిన శిల్పాలతో చూడముచ్చటగా కనిపిస్తూ భక్తులను అమ్మవారి దర్శనానికి రమ్మని ఆహ్వానిస్తున్నట్టుంటుంది. స్వాగత ద్వారాన్ని దాటుకుని ముందుకు వెడితే అక్కడ స్థూపాకారంలో ఉన్న గోపురాలతో ఆలయం దర్శనమిస్తుంది. ఆలయం గోపురాదులు, లోపలి శిల్ప సంపద అలనాటి సౌందర్యాన్ని చవి చూపిస్తుంటాయి. ఇక్కడి గోపుర నిర్మాణం మన వైపు మాదిరి కాకుండా ఉత్తరాది పద్ధతి స్పష్టంగా కనిపిస్తుంది. కనిపించే వాటిలో పెద్దగా ఉన్న గోపురం కలిగిన మందిరంలోనే కామాఖ్యాదేవి కొలువు దీరి ఉంది. ఈ ప్రధాన గోపురంపై ఉన్న శిఖరంపై బంగారు కలశం స్థాపితమై ఉంది. అలాగే, మిగిలిన గోపుర శిఖరాలపై త్రిశూలాలు స్థాపితమై ఉన్నాయి. ప్రధాన గోపురంపై అసంఖ్యాక రీతిలో పావురాళ్లు వాలి ఉంటాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే అమ్మవారు విగ్రహరూపంలో దర్శనం ఇవ్వరు.

ఇందుకో పురాణ కధ ఉంది. భర్త అయిన పరమేశ్వరుణ్ణి పిలవకుండా తన తండ్రి దక్షప్రజాపతి యాగాన్నే చేయాలను కోవడమే కాకుండా, వచ్చిన తనను కూతురని కూడా చూడకుండా అవమానించినందుకు సహించలేని సచీదేవి యజ్ఞ గుండం వద్దనే అగ్నికి ఆహుతై పోతుంది. దీన్ని భరించలేని పరమేశ్వరుడు అగ్రహోదగ్రుడై వీరభద్రుణ్ణి సృష్టించి యజ్ఞాన్ని భగ్నం చెయ్యమని పంపిస్తాడు. తనలో అర్థభాగమైన భార్య తనను విడిచి ఎక్కడకూ పోలేదని తెలిసిన పరమేశ్వరుడు సాధారణ మానవునిలా లోకాన్ని పట్టించుకోకుండా విరాగిలా మారతాడు. భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకుని పిచ్చిగా తిరుగుతుంటాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు పార్వతీ దేహాన్ని సుదర్శనంతో ఖండిస్తాడు. అలా ఖండించినప్సుడు ఆ ముక్కలన్నీ చెల్లాచెదురై వివిధ ప్రాంతాల్లో పడతాయి. అందులో అమ్మ వారి ప్రధానమైన యోనిభాగం గౌహతి వద్ద నీలాచలంపై పడింది. మానవ సృష్టికి మూల కారణమైన స్థానం కాబట్టి ఈ ప్రదేశం అన్ని శక్తి పీఠాల్లోకెల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

అంతే కాకుండా ఈ పీఠమే అన్ని శక్తి పీఠాలకూ ఆధార స్థానంగా భావిస్తారు. అలాగే, ఈ శక్తి పీఠాన్ని మహాయోగ స్థలమని పిలుస్తారు. నీలాచలంపై దేవి యోని భాగం పడి ఈ పర్వతం నీలంగా మారిందంటారు. ఈ రాతి యోనిలోనే కామాఖ్యాదేవి నివాసం ఉంటుందని అంటారు. ఇక్కడకు వచ్చి ఈ పర్వతాన్ని ఒక్కసారి తాకితే అమరత్వం సిద్ధించి బ్రహ్మలోకంలో ఉండి చివరిలో మోక్షాన్ని పొందుతారని అంటారు. దేవతల పంపుపై తనను మోహ పరవశుణ్ణి చేసేందుకు వచ్చిన మన్మథుణ్ణి ఈ నీలాచలంపైనే పరమేశ్వరుడు దగ్థం చేశాడు. అనంతరం రతీదేవి ప్రార్థనను ఆలించి ఆమెకు మాత్రమే కనిపించేలా తిరిగి బతికించారు అమ్మాఅయ్యలు. కాబట్టి ఈ ప్రాంతం కామరూప ప్రాంతమైంది. ఇక్కడ సకల దేవతలూ పర్వత రూపంలో ఉంటూ అమ్మను సేవించుకుంటుంటారు. ఎందుకంటే ఈ క్షేత్ర అధిష్ఠాన దేవత నీల పార్వతి. రాక్షసుడైన నరకాసురుడు ఆ నారాయణుని పట్ల భక్తి భావంతో ఉండే వాడు. అందుకు మహావిష్ణువు మోచ్చి అతనికి ప్రాగ్జ్యోతషపురానికి రాజును చేస్తాడు. కామాఖ్యాదేవిపై భక్తితో ఉంటే నీవా పదవిని ఎక్కువ కాలం అనుభవించగలవని చెబుతాడు.

కానీ, మరో ద్వాపరయుంగాంతంలో శోణితపురానికి బాణాసురుడు రాజయ్యాడు. అతని ప్రోద్బలంతో నరకుడు దేవతలకు శత్రువుగా మారి కామాఖ్యాదేవినే పెండ్లి చేసుకొమ్మని కోరతాడు. అప్పుడా తల్లి తెల్లవారేలోగా ఇక్కడ స్వర్గాన్ని తలపించే విధంగా భవనాల్ని సృష్టించ గలిగితే
చేసుకుంటానంటుంది.వెంటనే అతను విశ్వకర్మను పిలిచి ఆ పని అప్పచెబుతాడు. పని పూర్తయ్యే సమయానికి మాయా ప్రభావంతో కోడి కూస్తుంది. దాంతో వివాహం ఆగి పోతుంది. అందుకే కామాఖ్యా మందిరం వెళ్లే మార్గాన్ని నరకాసురమార్గంగా పిలుస్తారు. కామాఖ్యాదేవి గర్భగుడి మందిరాన్ని కామదేవ మందిరంగా పిలుస్తారు. ఈ లోపలెక్కడా నరకుని ప్రసక్తి వినిపించదు. అలాంటి కామమోహితుణ్ణి సైతం ఏమార్చగలిగిన తల్లిని దర్శించుకునేందుకు ఎంతో మంది భక్తులిక్కడకు తరలి వస్తారు.

ఈ ఆలయం ఎంతో పురాతనమైనది.12వ శతాబ్దం వరకూ ఈ ప్రాంతాన్ని పాలించిన కామరూపాధిపతి తమ శాసనాల్లో ఆలయం ప్రస్తావన ఎక్కడా తీసుకురానప్పటికీ, తరువాతి వారి శాసనాల మేరకు కామేశ్వరి మహా గౌరి అమ్మవారు ఇక్కడ ఉన్నట్టు తెలుస్తోంది.13వ శతాబ్దం మొదట్లో గుత్తాధిపత్యం కోసం రాజుల మధ్య యుద్ధాలు ఎక్కువగా జరుగుతుండేవి. ఈ క్రమంలో కూచ్ బిహార్ రాజా విశ్వసింహ్ రాజయ్యాడు. ఒకసారి జరిగిన యుద్ధంలో అయినవాళ్లనందరినీ కోల్పోయి వారిని వెతుక్కుంటూ సోదరునితో నీలాచలంపైకి వస్తాడు విశ్వసింహ్. ఇక్కడితనికి ఒక వృద్ధురాలు కనిపించి సేద తీరుస్తుంది. ఆ సందర్భంలో అక్కడ కనిపించిన మట్టి దిబ్బ గురించి అవ్వను ప్రశ్ని స్తాడు రాజు. ఇందులోని దేవత చాలా శక్తిమంతురాలని, ఏ కోరికనైనా క్షణాల్లో తీరుస్తుందని చెబుతుంది. వెంటనే రాజు తన అనుచరులంతా తిరిగి రావాలని కోరుకుంటాడు. వెంటనే వారంతా అతని వద్దకు వస్తారు. రాజు ఎంతో భక్తితో తన రాజ్యంలో కరవు శాంతిస్తే ఇక్కడ బంగారు గుడి కట్టిస్తానని మొక్కుకుంటాడు. అలాగే, అతని రాజ్యం సస్యశ్యామలమై సుఖవంతమవుతుంది. అప్పుడు రాజు గుడి కట్టించేందుకు మట్టిదిబ్బ తవ్వించగా అక్కడ కామాఖ్యాదేవి రాతిశిల బయటపడుతుంది. ఆ అమ్మకు మట్టి రాయిలో గురివింద ఎత్తులో బంగారాన్ని పెట్టించి తేనెతుట్టు ఆకార గోపురాదులతో ఆలయాన్ని నిర్మింపచేస్తాడు.
కామాఖ్యా దేవీ మందిరం అధిష్ఠాన దేవత భైరవి కామాఖ్యాదేవి. అమ్మ ఎక్కడుంటే అయ్య కూడా అక్కడే ఉంటాడు. కాబట్టి నీలాచలమంతా అమ్మాఅయ్యల స్వరూపమే. ఇక్కడ పరమేశ్వరుడు ఉమానంద భైరవునిగా ఉంటాడు. నీలాచలానికి తూర్పుభాగంలో బ్రహ్మపుత్రా నది మధ్యలో వేంచేసి ఉన్నాడీ స్వామి. అందుకే మందిరం కింద ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ శివుడు లింగస్వరూపంలో దర్శనమిస్తాడు. ఈ లింగాన్ని చూడగానే మనసంతా భక్తిభావంతో పులకించి పోతుంది. ఇక్కడకు పడవలపై చేరుకోవచ్చు. అమ్మవారిని దర్శించేందుకు ముందే ఈ స్వామిని దర్శించాలి. ఈ స్వామిని దర్శించని పక్షంలో అమ్మ వారి యాత్ర పూర్తిగానట్టే పరిగణిస్తారు భక్తులు. అందుకే తప్పనిసరిగా ఇక్కడకు వచ్చిన వారంతా ముందుగా ఉమానంద భైరవుణ్ణి దర్శించి ఆయన ఆశీస్సులు పొందుతారు. ఇక్కడకు చేరుకుంటుంటే వశిష్ఠుడు తపస్తు చేసుకునే ప్రాంతం కనిపిస్తుంది. వశిష్ఠా శ్రమాన్ని చూస్తుంటే నిజంగా మనం మునివాటికకే వచ్చామా అనిపించక మానదు. ఎటు చూసినా చూసినా పచ్చ దనమే. బండరాళ్ల మధ్య నుంచి జలజల పారుతున్న నీటి ప్రవాహం మన మనసుకు ఊరట కలిగిస్తుంది. దీన్ని వశిష్ఠ గంగ అంటారు. ఆ ప్రవాహ ఝరికి పైకి లేచే నీటి తుంపరులు పరిసరాల్ని ఆహ్లాదపరుస్తాయి. ఇక్కడ ఎంతో మంది స్నానాలు చేస్తారు. ఇక్కడ విఘ్న నివారకుడైన వినాయకుని విగ్రహం, విద్యలకు అధిదేవత అయిన సరస్వతి విగ్రహం దర్శనం ఇస్తాయి.

ఇక్కడ ఉన్న ఒక మందిరం కనిపిస్తుంది. దాని బయటా, లోపలా కూడా ఆద్యంతం దేవతా మూర్తులు, రాజుల విగ్రహాలు చెక్కి కనులకు విందు చేస్తాయి. లోపల గీతాచార్యుని విశ్వరూప సందర్శనం, త్రిమూర్తుల తైలవర్ణ చిత్రాలు కనిపిస్తాయి. ఇంకా గోడలపై అనేక భంగిమల్లో వినాయకుని వర్ణ విగ్రహాలు చెక్కి ఉంచారు. ముద్దులయ్య చూసేందుకు ముద్దు రావడమే కాదు భక్తిని కూడా పెంపొందింపచేస్తున్నాడు. లక్ష్మీనారాయణుల మందిరంతో పాటు మరెందరో దేవతా మూర్తుల విగ్రహాలు దర్శనమిస్తాయి. అమ్మవారి ఆలయ శక్తి పీఠం ముందే ఒక పుష్కరిణి కనిపిస్తుంది. ఇది ఎంతో శక్తిమంతమైంది. దీన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారంటారు. ఈ గుండానికి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలం వస్తుందని భక్తుల భావన. ఇందులో నీరు ఎరుపురంగులో ఉంటుంది. దీన్ని సౌభాగ్య కుండం, పాతక వినాశ కుండం అని పిలుస్తారు. అమ్మ వారి యోని స్రావిత పవిత్ర జలలాతో పునీతమైన ఈ కుండంలో స్నానం చేస్తే ఎంతటి మహాపాతకమైనా నశిస్తుందని, బ్రహ్మ హత్యా పాతకమైనా నివారణ మవుతుందని విశ్వాసం. దేవాలయానికి కొద్దిగా వెనుక భాగంలో మరో కుండం ఉంది. ఇది పార్వతి కుండం. ముందు కుండంలో స్నానం చేసిన భక్తులంతా ఈ పార్వతీకుండంలో కూడా స్నానం చేసి దర్శనానికి వెడతారు. అంటే సౌభాగ్య కుండంలో స్నానం చేసిన భక్తులు ఆలయంలోని యోని శిలారూపాన్ని తాకి నమస్కరించుకుంటారు. అక్కడి యోని స్రావిత జలాన్ని తీర్థంగా సేవిస్తారు. ఈ కారణంగా ఆలయం వెనుక ఉన్న పార్వతి కుండంలో మరో సారి తలస్నానం చేసి శుచులవ్వడం మంచిదని ఇక్కడి పూజార్లు చెబుతారు.

కామాఖ్యాదేవిని దర్శనానికి లోనికి వచ్చిన భక్తులకు అక్కడకు సమీపంలోనే ఉన్న వినాయకుడు దర్శనమిస్తాడు. ఆయనను దర్శించుకుని అనంతరం అమ్మవారి దర్శననానికి వెడతారు. కామాఖ్యే వరదే దేవీ: నీలపర్వత వాసినీ… త్వం దేవీ జగతం మాతా: యోనిముద్రా నమోస్తుతే’ అని ప్రార్థిస్తూ లోనికి ప్రవేశించి అక్కడ దీపాలు వెలిగించుకుంటారు. అనంతరం అమ్మవారి దర్శనానికి బారికేడ్లలో నిల్చొని క్రమపద్ధతిలో ముందుకు నడుస్తారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అడుగుపెడుతుంటే మందిరంలోకి అడుగు పెడుతున్న భక్తులకు పన్నెండు స్తంభాల మంటపం మధ్య దేవి ఉత్సవ మూర్తి కనిపిస్తుంది. ఈ తల్లినే హరగౌరి మూర్తి, భోగమూర్తి అని పిలుస్తారు. ఈ మూర్తికి ఉత్తర భాగంలో వృషభ వాహనుడు, పంచవక్త్రుడు, దశాభుజ విశిష్ఠుడు, కామేశ్వర మహాదేవ మూర్తులు కనిపిస్తారు. దక్షిణ భాగంలో షడాననుడు, ద్వాదశ బాహు విశిష్ఠుడు, అష్టాదశలోచన, సింహవాహిని, కమలాసనదేవి మూర్తి దర్శనమిస్తుంది. ఈ తల్లినే మహామాయ కామేశ్వరీ పేరుతో పిలిచి కొలుచుకుంటారు. వీరందరిని చూసుకుంటూ మెట్లు దిగుతుంటు కామాఖ్యాదేవి శిలాయోని పీఠ మందిరం వస్తుంది. ముందు చెప్పు కున్నట్టు కామాఖ్యా దేవి విగ్రహం రూపంలో ఉండదు. శిలారూపంలో యోనిముద్రలో పూజలందుకుంటుంది తల్లి. ఈ శిలారూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది. భక్తులంతా మెట్లు దిగి గర్భగుడిలోపల ఉన్న శిలారూప భగేశ్వరీ మాతను దర్శిస్తారు. ఇక్కడ విశేష మేమిటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యాదేవీకి నెలలో మూడు రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది. మృగశిర నక్షత్రం మూడవ పాదంతో మొదలుఎట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకూ అమ్మవారి ఋతు స్రావం జరిగే ప్రత్యేక రోజులు. దేవీ భాగవతంలో ఈ ప్రత్యేక రోజుల గురించి ప్రస్తావన స్పష్టంగా ఉంది. ఈ రోజుల్లో యోనిశిల నుండి ఎర్రని స్రావం వెలువడుతుంది. ఈ ఎర్రని నీరే శక్తిపీఠం ముందున్న సౌభాగ్య కుండంలోని నీరుగా చెబుతారు. ఈ ప్రత్యేకమైన మూడు రోజులు ఆలయం మూసి ఉంచుతారు. నాలుగో రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు. అంతకు ముందే చాలా మంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు. ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీ కుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు. ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు. ఇది దగ్గర ఉంటే వారికి ఋతుస్రావ దోషాలు, రజస్వల అయిన సందర్భంలోని దోషాలేవి అంటవని భక్తుల విశ్వాసం.
ఇక ప్రతీ ఆషాఢమాసంలో అయిదు రోజుల పాటు అంబుబాచి మేళా జరుగుతుంది. ఎప్పుడెప్పుడు ఈ మేళా జరుగుతుందా అని ఎంతోమంది భక్తులు ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ అంబుబాచి మేళానే కామాఖ్యా కుంభమేళాగా పిలుస్తారు. ఈ మేళా కనీవినని రీతిలో జరుగుతుంది. దీని వైభవాన్ని ప్రత్యక్షంగా చూడాలే తప్ప వర్ణించేందుకు భాష చాలదంటే అతిశయోక్తి కాదు. ఆ శుభ తరుణం రాగానే వేలాదిమంది పండాలు, సిద్దులు వంటి వాళ్లే కాక సామాన్య భక్తులు కూడా ఆలయానికి తరలివచ్చి ఈ మేళాలో పాల్గొని అమ్మపై తమకున్న భక్తిశ్రద్ధలను చాటుకుంటారు. ఈ సందర్భంగా వారు చేసే తప్పెట్లు, తాళాలు వాయించుకుంటూ చేసే విన్యాసాలు, అభినయించే నృత్యాలు, ఇంతింత బారున జటలు కట్టిన జుట్టుతో ఉన్న సాధులు, సాధ్విలు పెట్టే అభయ ముద్రలు ఆకర్షణీయంగా ఉంటాయి. చాలామంది భక్తులు ఈ మేళా రోజులు జరిగినన్ని రోజులూ ఇక్కడే బస చేస్తారు. సాధారణ రోజుల్లో కూడా సాధువులు, సంతులు, అఘోరాలు, తాంత్రికులు ఇక్కడకు వచ్చి అమ్మను దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. అన్నట్టు ఈ ఆలయం ఎక్కువగా మంత్ర, తాంత్రిక, ఐంద్ర జాలాలకు కామాఖ్యాక్షేత్ర శక్తి పీఠం కేంద్రస్థానంగా చెబుతారు. ఈ నీలాచలం పైనే భువనేశ్వరీ మాత మంమందిరం కూడా ఉంది. ఈ ఆలయం ఎప్పుడూ భక్తులతో రద్దీగా ఉంటుంది. ఈ ఆలయంలో విధిగా ఆషాఢ, జ్యేష్ఠ మాసాల్లోనూ, దసరానవరాత్రి పర్వదినాల్లోనూ, ఇంకా విశేషమైన రోజుల్లోనూ ఉత్సవాలు నిర్వహిస్తారు.


 

No comments:

Post a Comment