10 September 2015

నమ్మకం :-

చిన్నప్పటినుంచీ కళ్లతో చూసిందే నమ్ముతున్నాం. అలా నమ్మటంవల్ల తార్కిక బుద్ధి ఏర్పడి, ప్రతిదీ రుజువు చేసుకుంటూ ఉంటే మనకు ఆనందం కలుగుతుంది. అందుకు మనల్ని మేధావులని పిలిస్తే గొప్ప సంతోషం మనకు. మన అహంకారం సంతృప్తి చెందితే విశ్వాన్ని జయించినంతగా ఆనందపడిపోతాం. ఒక్కోసారి చిన్నమాటకే బాధపడి గాలి తీసిన బుడగలాగ అయిపోతాం.

నమ్మకాలు ఉండాలి. నమ్మాలి. కొందరు అమ్మ చెబితేనే నమ్ముతారు. కొందరు నాన్న చెబితే నమ్ముతారు. కొందరు భార్య చెబితే నమ్ముతారు. కొందరు భర్త చెబితే నమ్ముతారు. కొందరు స్నేహితులు చెబితే నమ్ముతారు. కొందరు బంధువులు చెబితే నమ్ముతారు. కొందరు ఎవరు చెప్పినా నమ్మరు.వివేకానంద. రామకృష్ణ పరమహంస. దిగి వచ్చి చెప్పినా వాళ్లకు నమ్మకం కలగదు. వివేకానందనీ ఎగాదిగా చూస్తారు. అబ్దుల్‌ కలామ్‌ మాటలనీ హేళనగా తీసుకుంటారు.

చూసింది నమ్మక, చూడనిది నమ్మక మరి వీళ్లు ఎవరిని నమ్ముతారు? నమ్మకం లేకపోతే జీవితం లేదు. అడుగడుగునా నమ్మకాలతో ముడివడే- జీవితాలు నడుస్తూ ఉంటాయి. గడుస్తూ ఉంటాయి. నిత్యం సందేహాలతో కొట్టుకునేవాళ్లు, అపనమ్మకాలతో జీవించేవాళ్లు- మందులనే కాదు, తల్లిప్రేమలో సైతం కల్తీ ఉందేమోనని అనుమానపడుతూ ఉంటారు. నమ్మడంవల్ల ఆత్మవిశ్వాసం, ధైర్యం కలుగుతాయి. నమ్మడంవల్ల విజయానికి చేరువ కావడానికి కావలసిన దారులను మన అంతశ్చేతన కల్పిస్తుంది. నమ్మి సహనంతో నిరీక్షిస్తే దివ్యత్వపు దారులు తెరచుకుంటాయి. ఎంతోమంది మహానుభావులు ఈ విషయాన్ని రుజువు చేశారు.

నమ్మకం అనే విషయం మీద ఆధారపడే, సర్వమత గ్రంథాలు మనుగడ సాగిస్తున్నాయి. నమ్మకం లేకపోతే, దేవుణ్ని చూడటం మాట అటుంచి, మనిషిని మనిషిగా చూసే పరిస్థితీ ఉండదు. మన మాటల్లో నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉన్నట్లు మాట్లాడతాం. మనసు నిండా సందేహం గూడు కట్టుకుని ఉంటుంది. ఈ పరిస్థితిని ఏమనాలి? ఇటువంటి నమ్మకాలు ఏ ఫలితాలను ఇస్తాయి?

ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? ఇలా చాలామంది తర్జనభర్జన పడుతూ ఉంటారు. లోకంలో జరుగుతున్న మోసాలను చూసి అలా అనుకోవడం సహజమే. అలా అని నమ్మకం మీద నమ్మకం వదిలేస్తే జీవనం సాగించగలమా, బతుకుబండి నడుస్తుందా?

మంచికో చెడుకో దుర్యోధనుణ్ని నమ్మాడు కర్ణుడు. జీవితం చివరిదాకా అతనితోనే ఉన్నాడు. ఎన్నో దూషణ భూషణ తిరస్కారాలను ఎదుర్కొన్నాడు. బాధలు పడ్డాడు. స్థిరమైన విశ్వాసంతో ఉన్నాడు. చరిత్రలో నిలిచిపోయాడు. పాండవులు పూర్ణంగా శరణాగతితో శ్రీకృష్ణుని విశ్వసించారు. విధిని ఎదిరించారు. విజయం సాధించారు. నమ్మడం ఎప్పుడూ మంచిదే. నమ్మకపోవడమే చెడ్డది. జీవితంలో ఎదగాలనుకునేవాళ్లు నమ్మకాన్ని గౌరవిస్తూనే ఉండాలి.

నమ్మితే అద్భుతాలు చూడగలవు అంటుంది సనాతన ధర్మం. హిందూ తత్వం. విశ్వాసమే ప్రాతిపదికన పొర్లు దండాలు, చెక్క భజనలు మూఢనమ్మకాలు అనుకున్నా, వాటిలోనూ మానవుడి హృదయముంది. ప్రేమ ఉంది. విశ్వాసం ఉంది. ఎవరు ఏ దారిలో వెళ్లి నమ్మినా మంచిదే. తరవాత అందులో ఉన్న మంచిచెడ్డలు వాళ్లే స్వయంగా తెలుసుకుంటారు.

ఎవరిని నమ్మినా, నమ్మకపోయినా మనల్ని మనం నమ్మాలి. మనశక్తిని నమ్మాలి. మానవుడు సృష్టిస్తున్న అద్భుతాలను నమ్మాలి. ఏ శక్తి విశ్వానికి కారణం అవుతుందో ఆ శక్తిని తెలుసుకోవడానికి మనలో ఉన్న దైవత్వాన్ని నమ్మాలి. మట్టిసారం తెలుసుకోవాలంటే మట్టిని విశ్వసించాలి. విశ్వ రహస్యాలు తెలుసుకోవాలంటే, దానికి ప్రతీక అయిన నరుడి అంతరంగంలోకి నమ్మకంతో నడవాలి. మహాత్ములు తెలుసుకున్న సత్యాన్ని మనమూ నమ్మక తప్పదు.

" సమస్త జ్ఞానం నాలో ఉంది. సర్వశక్తి నాలో ఉంది. నేను పరమ పవిత్రుణ్ని, నిత్య ముక్తుణ్ని.ఈ జ్ఞానం నేను ఎందుకు అభివ్యక్తం చేయలేక పోతున్నాను? నాకు దానిపై విశ్వాసం కుదరలేదు కాబట్టే! దానిపై నాకు విశ్వాసం కలిగిన వెంటనే అది అభివ్యక్తం కాగలదు. అభివ్యక్తమయ్యే తీరుతుంది " అంటాడు స్వామి వివేకానందుడు.

No comments:

Post a Comment