25 September 2015

విశిష్ట దేవదేవుడు వినాయకుడుకి ఇరువురు భార్యలు సిద్ధి, బుద్ధి :-

వినాయకునకు సిద్ధి, బుద్ధి అనేవారు భార్యలు. కనుకనే వినాయకుడు ఉన్నచోట సకల కార్యాలూ సిద్ధిస్తాయి. జ్ఙానం వికసిస్తుంది. ఇక కొరతేమున్నది. అందువలన ఏ పనైనా - పూజ కాని, పెండ్లి కాని, గృహప్రవేశం గాని, ప్రారంభోత్సవం గాని, రచనారంభం గాని, పరీక్ష గాని, ఉద్యోగం గాని - వినాయకుని పూజతోనే మొదలవుతుంది. ముఖ్యంగా జ్యోతిష్యులకూ, రచయితలకూ వినాయకుడు నిత్యారాధ్య దేవుడు.

భారతీయుల ఆరాధ్య దైవం గణపతి. దేశం నలు చెరగులా వినాయక ఆరాధన పలు విధాలుగా వ్యాప్తి చెందింది. మనం ఏ పూజ చేయాలన్నా, ఏ పని ప్రారంభించాలనుకున్నా, ఏదైనా శుభకార్యానికి శ్రీకారం చుట్టాలన్నా అన్నింటా తొలి పూజ అందుకునేది వినాయకుడే. ఈ కారణంగానే ప్రాంతీయ భేదం లేకుండా యావత్ భారతదేశంలోని హిందువులు వినాయక చవితి పండుగను ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.

వినాయకుడు విశిష్ట స్వరూపుడు. వేదాలలో అతి ప్రాచీనమైన రుగ్వేదంలో గణపతి శబ్దం ప్రస్తావన మనకు కనిపిస్తుంది. బృహస్పతికి పర్యాయపదంగా గణపతిని ఉదహరించారు. దేవగురువైన బృహస్పతి అపార విజ్ఞాన సంపన్నుడు. ఆయనే కాలక్రమంలో గణపతిగా పరిణమించాడనే ఓ వాదం మనకు అక్కడక్కడా వినిపిస్తుంది. ఈ వాదన సంగతెలా ఉన్నా, బొజ్జ గణపతి మాత్రం బృహస్పతి సమానుడైన బుద్ధి సంపన్నుడే. విఘ్నాతిపతిగా, సర్వ శుభంకరునిగా వినా యకుడు నిత్య పూజితుడు. బ్రహ్మ వైవర్త పురాణం గణపతి పేరును నిర్వచిస్తూ ‘గ’ మేధకు, ‘ణ’ మోక్షానికి సమానార్థకాలంటూ ఆ రెండింటికీ ‘పతి’ (అధిదేవుడని) ఆయనను కొనియాడింది.

అలాంటి గణపతి కాలచక్ర పరిభ్రమణంలో రానురానూ ఔన్నత్యాన్ని సంతరించుకుంటూ పురాణయుగం నాటికి ప్రసిద్ధ దైవంగా గుర్తింపు పొందాడు. ఇందుకు మన పురాణాలు ఎంతో దోహదపడ్డాయి. ఒకప్పుడు క్షుద్ర దైవంగా పిల్వబడిన గణపతి సిద్ధి వినాయకుడైపోయాడు. త్రిమూర్తులలో ఒకరైన పరమేశ్వరుడి పుత్రుడిగా ప్రసిద్ధి చెందాడు. విఘ్నాధిపతియై ముక్కోటి దేవతలకే కాక ముల్లోకవాసులందరికీ ముఖ్య దైవమై తొలి పూజలు అందుకోవడానికి అర్హుడయ్యాడు.

ఇక గణపతి బ్రహ్మచర్యం గురించిన విషయానికొస్తే అనేకానేక అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి. ఆయనకు పెళ్ళయినదనీ, సిద్ధి, బుద్ధి అనే ఇరువురు భార్యలున్నారనీ, వారి ద్వారా క్షేముడు, లాభుడు అనే ఇద్దరు కుమారులు కలిగారనీ కొన్ని పురాణాల్లో కనబడుతుంది. ఇక్కడ ముఖ్యంగా చర్చించుకోతగిన విషయం కూడా ఒకటుంది. సోదరులైన కుమారస్వామి, గణపతికి మధ్య జరిగిన ఒకానొక పందెంలో భూప్రదక్షిణానికి బదులు తల్లి పార్వతి చుట్టూ ప్రదక్షిణ చేసిగణపతి భేష్ అనిపించుకుంటాడు. ఆ బుద్ధి సూక్ష్మతకు సంబరపడిన పార్వతీదేవి అతనికి సిద్ధి, బుద్ధులనిచ్చి పెళ్లి జరిపిస్తుంది. బ్రహ్మచారికి కార్యసిద్ధి, సూక్ష్మబుద్ధి భార్యల వంటివి. వాటికి అతడే భర్త. ఈ విషయం వినాయకుడి ప్రవర్తనవల్ల మనకు స్పష్టమవుతుంది. ఆ ఇద్దరు భార్యలవల్ల గణపతికి లాభుడు, క్షేముడు కలిగారని అంటారు. కార్యసిద్ధివల్ల క్షేమం, సూక్ష్మబుద్ధివల్ల లాభం ప్రాప్తిస్తాయని మనకు తెలియచెప్పేందుకే వినాయకునికి వివాహమైనదనీ, ఇద్దరు కుమారులున్నారనీ చెప్పబడింది. పెళ్లి తంతు జరుగలేదు కనుకనే ఆయనను ‘బ్రహ్మచారిణే నమః’ అని పూజించడం జరుగుతోంది.

గణపతి పూర్యష్టకానికి అధిపతి అని తెలుస్తోంది. పూర్యష్టకం అంటే ఎనిమిది రకాల ప్రత్యేకతలున్న పట్టణం అని అర్థం. ఇక్కడ పూర్యష్టకం అని చెప్పుకోతగిన ఆ పట్టణం మరేదో కాదు- అది మన దేహమే. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచప్రాణాలు, కామం, కర్మ, అవిద్య, మనస్సు అనే ఈ ఎనిమిది ప్రత్యేకతలతో రూపొందినదే మానవ దేహం. దీనికి అధిపతి గణపతి. కనుకనే దేహానికిగల ప్రత్యేకతలను గ్రహించి తదనుగుణంగా దానికి అధిపతియైన వినాయకుణ్ణి సేవిస్తే అహం నశించి, మోక్షప్రాప్తి కల్గుతుందని భారతీయ రుషిగణం, ఆధ్యాత్మిక వేత్తలూ వివరించి చెప్పారు. వినాయకుణ్ణి విశిష్ట స్వరూపుడిగా వివరించుకున్న దానిని బట్టి ఆయన సర్వాంగాల విశిష్టతను ఓసారి తెలుసుకుందాం.

‘‘ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం
పాశాంకుశ ధరం దేవం ధ్యయేత్ సిద్ధి వినాయకమ్’’
-అని వర్ణించారు.


ఏకదంతం ద్వంద్వాతీత ప్రవృత్తికి, అద్వైత భావనకు ప్రతీక. ఒకసారి పరశురాముడు శివుడి దర్శనానికి వచ్చాడు. శివపార్వతులు ఏకాంతంగా ఉన్నారనీ, వారి ఏకాంతానికి భంగం కల్గించవద్దని ద్వారం దగ్గరే నుంచున్న గణేశుడు అడ్డగించాడు. అందుకు పరశురామునికి కోపం వచ్చి చేతనున్న గండ్రగొడ్డలిని అలా ఝుళిపించగా ఒక దంతం సగానికి విరిగిపోయింది. అలా విరిగిన దంతాన్ని వినాయకుడు దుష్ట సంహార సమయంలో ఆయుధంగానూ, వ్యాస మహర్షి భారతం చెబుతూండగా రాసేందుకు గంటంగాను ఉపయోగించాడు. శూర్పకర్ణుడైనందున భక్తుల మొరలను సులభంగా వింటారని అంతరార్థం. ఆయనది ఏనుగు తల. పెద్దదైన ఆ తల అపార జ్ఞాన భాండాగారానికి గుర్తు. ఎంతటి మహోన్నతుడైనా అణగిఉన్నంత మాత్రాన గొప్పతనం ఏ విధంగానూ తగ్గదని తెలియచెబుతుంది- ఆ మరుగుజ్జు రూపం.

గణేశుడు చతుర్భుజుడు. నాల్గు చేతులూ నాల్గు పురుషార్థాలకు సంకేతం. ఒక చేత గండ్రగొడ్డలి లేదా అంకుశం, మరో చేతిలో పాశం, ఇంకో చేతిలో కమలం, నాల్గవచేయి అభయముద్ర చూపుతూ ఉంటుంది. చెడును, అజ్ఞానాన్ని నరికివేసేది గొడ్డలి. మందకొడితనాన్ని పోగొట్టి మోక్షమార్గం వైపు నడిపేది అంకుశం. భవ బంధాలను వదిలించుకోమనే తత్త్వాన్ని తెలియజేసేది, భగవంతుడిపై భక్తి పాశమును పెంపొందించేది పాశము. ఇక కమలం నిర్మల హృదయానికి గుర్తు. సకల కార్యాలను సాధించడానికి, భక్తుల బాధలు నివారించడనికి తానున్నానని భరోసా ఇస్తుంది- ఆ అభయహస్తం. ఐతే, ఆ లంబోదరం సకల జగత్తూ తనలోనే ఉన్నదని గ్రహించమని సూచిస్తుంది. నడిపే వారి సామర్థ్యాన్ని బట్టి వాహనం నడుస్తుంది. ఈ ప్రపంచంలో ఏదీ నీచమైనది కాదనే బోధతోపాటు, చిక్కకుండా పరుగెత్తే ఏ విషయమైనా మన అదుపులోకి రాక తప్పదనేది మూషికం ద్వారా తెలుసుకోమంటుంది వినాయకుని తత్త్వం. ఇలా.. వినాయకుని విశిష్టతను వివరిస్తూ పోతే దానికి అంతే ఉండదు. పరమేశ్వరుని పుత్రుడిగా వాసికెక్కి, ముక్కోటి దేవతలకు, ముల్లోక వాసులందరికీ ముఖ్య దైవమై విరాజిల్లుతూ అందరితో పూజలందుకొంటూన్న గణపతిని అనునిత్య భక్తిశ్రద్ధలతో పూజించుకుంటే మనకు అన్నీ శుభాలే. మన కార్యాలనన్నింటినీ నిర్విఘ్నంగా నెరవేర్చుకుని ఆనందమయ జీవనం సాగించేందుకు వి నాయకుడే నిజమైన మార్గదర్శి.



No comments:

Post a Comment