04 November 2013

ఏకత్వంలో భిన్నత్వం :

ఆ ఇంట్లో భార్యా,భర్తలిద్దరూ వైద్యులు. తమకున్న ఒక్క అబ్బాయి, ఒక్క అమ్మాయి ఇద్దరూకూడా వైద్యులు కావాలని వారి ఆకాంక్ష. ఆరవ తరగతికి వచ్చేసరికి, వారికి వైద్యవిద్య, వైద్య వృత్తికిగల విలువలుగురించి చెబుతూవుండేవారు. పదో తరగతికి వచ్చేసరికి, వారికి తెలియని పాఠాలగురించి చెబుతూ, మధ్య,మధ్యలో శస్త్ర చికిత్సలుగురించి కంప్యూట‍ర్లో వివరిస్తూ, ముందుముందు, మీరుకూడా గొప్ప వైద్యులు కావాలని ఉద్భోదించేవారు. అయితే, శస్త్ర చికిత్సల గురించి చెప్పేటప్పుడు, కొడుకు, అమ్మా, ఈ చికిత్సలో వాడుతున్న ఆ ముఖ్యమైన పనిముట్టుని ఇంతకంటే మెరుగ్గా తయారుచేయవచ్చని చెబుతూ, తన మనసులోని ఆలోచనలను వివరించేవాడు. ఇక కూతురు, ఈ శస్త్ర చికిత్స, ఇతర వైద్య ఖర్చులను ఎంత ఎక్కువగా తగ్గించవచ్చో చెబుతూ ఉపన్యాసాలిచ్చేది. తల్లి,తండ్రులిద్దరికీ తమ కోరికలు నెరవేరుతాయో లేదో అన్న అనుమానాలు, ఆందోళనలు రావటం మొదలయ్యాయి. అనుకోనివిధంగా, అబ్బాయి ఇంజనీర్, అమ్మాయి కాస్ట్-అకౌంటెంట్ గా తమ వృత్తి విద్యలను పూర్తిచేసి, మంచి పేరు తెచ్చుకోవటం మొదలెట్టారు. మరొక ఇంట్లో, ఇంటి యజమాని చాలా పేద్ద వ్యాపారి; కోటీశ్వరుడు. ఒక్కగానొక్క కొడుకు. ఎంతో గారాబంగా పెంచి, పెద్దచేసి, మంచి చదువులు చెప్పించాడు. తనతోపాటు వ్యాపారంలో కలిసి పనిచేయమన్నాడు. కానీ, తండ్రి కోరికను సున్నితంగా తిరస్కరించాడు కొడుకు. శ్రీరామకృష్ణ మఠంలో చేరి, సన్యాసం తీసుకున్నాడు. తండ్రి ఎంత చెప్పినా వ్యాపారంలోకి రావటానికి ఇష్టపడలేదు. పోనీ, కావలిసినంత ఆస్తిపాస్తులు వున్నాయికాబట్టి, సన్యాసం తీసుకోకుండా, ఇంట్లోనేవుండి, పెళ్ళి చేసుకొని, కాలక్షేపం చేయమన్నాడు. కానీ, కొడుకు సమాధానం వేరుగా వచ్చింది. నీకు, నాకు, మనందరికి కావలసినదానికంటే ఎంతో ఎక్కువ ఆస్తిపాస్తులున్నాయి. అవన్నీ అట్లాగేవుంటే వృధా అయుపోతాయి. వాటిని సమాజసేవలో ఉపయోగించాలి. కాబట్టి, నీకు మనసుంటే వాటిని ధర్మకార్యాలకి వుపయోగించమన్నాడు కొడుకు. దాంతో తండ్రి హాతాశుడైపోయాడు.
పైన చెప్పిన ఉదాహరణలు ప్రపంచంలో అడుగడుగునా కోకొల్లలుగా కనిపిస్తుంటాయి. “ తల్లి,తండ్రులు, తామున్న పరిధిలోనే తమ సంతానంకూడా జీవిస్తూ, తమ కలల పంటగా బతకాలని ఎంతో బలంగా ఆకాంక్షిస్తారు. కానీ, వారి ఊహలు, కోరికలు, కన్న కలలు తమ బిడ్డల విషయంలో వేరొకరకంగా, వైవిధ్యంగా రూపు చెందుతుంటుంటాయి ”. ఎందుకని ఇట్లా జరుగుతుంది? తల్లి,తండ్రులు అట్లా కోరుకోవటం తప్పా? దీనికి సమాధానం తెలుసుకునేముందు మరొక ప్రశ్నకూడా వుంది. అసలు, స్త్రీ, పురుషులు భార్యా,భర్తలు అయినతరువాత, సంతానాన్ని పొంది, తల్లి,తండ్రులు కావాలనుకుంటారు. అయితే, అసలు వీరెందుకు సంతానాన్ని కనాలనుకుంటున్నారు? కేవలం శృంగారం, శరీర సుఖం కోసమే అయితే, భార్యా,భర్తలు పిల్లల్ని కనకుండానే ఆ పని చేయవచ్చు. అట్లాకాకుండా, తమ ప్రతిరూపాలని చూసుకోవాలనీ, తమ వంశం ముందుతరాలలో అభివృద్ధి చెందాలని అనుకుని, సంతానాన్ని కంటారనుకోండి. బాగానేవుంది కానీ, సృష్టిలో అప్పుడు మనుషులకీ, పశుపక్ష్యాదులకీ మధ్య ఏమీతేడా కనిపించదు. అంటే, ఇంతకంటే ఎంతో బలీయమైన కారణం లేదా కారణాలు ఏవైనా వుండివుండి తీరాలి. అదే అయితే, అది లేదా అవి ఏమిటి?

అనేకానేక జీవజాతుల్లో మనిషి అత్యంత తెలివితేటలుగల జీవి. ప్రతి క్షణం, తన జీవితంలో ఏదో క్రొత్తదనాన్ని పొందాలని కోరుకుంటుంటాడు. అందుకు తన మేధస్సుకు నిత్యం పదునుపెడుతూ, పరిశీలిస్తూ, పరిశోధనలు చేస్తూ, క్రొత్త విషయాలను ఆవిష్కరిస్తూవుంటాడు. తాను సాధించింది, తను, తన కుటుంబమేకాకుండా, తన భావి తరాలవాళ్ళుకూడా అనుభవించాలని కోరుకుంటూ వుంటాడు. మనిషి బహు ఆశా జీవి. ఆశకు హద్దు అనేదేదీ లేదనుకుంటే ఒక్క విషయం ఇక్కడ చెబుతాను. ‘పునరపి జననం; పునరపి మరణం’ అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది నిజమనుకుంటే, తను కలలుకన్నది, తను మరణించేలోపు సాధించలేకపోతే, దానిని తన భావితరాలవాళ్ళు సాధించగలిగితే, తనకు మరల పునర్జన్మ కలిగితే, తన కలలను అప్పుడైనా అనుభవించచ్చేమోనన్న ఆశకూడా మనిషిలో వుండవచ్చు. బహుశా, ఇందుకోసమేకూడా, మనిషి సంతానాన్ని కొరుకుంటాడని కొంతమేర అతిశయోక్తిగా చెప్పవచ్చు. మనిషి ఆశాజీవి అని అన్నాను కదండీ! ఆశ మిగిలిపోయి వుండటంవలనే కదా మనిషికి మరో జన్మ కలుగుతున్నదని పెద్దలు చెబుతున్నారు! నేను చెప్పింది అతిశయోక్తి అని అనక్కరలేదనుకుంటా!!


మరొక విషయాన్నికూడా పరిశీలిద్దాం. ఇంతకు మునుపే చెప్పాను, “ తల్లి,తండ్రులు, తామున్న పరిధిలోనే తమ సంతానంకూడా జీవిస్తూ, తమ కలల పంటగా బతకాలని ఎంతో బలంగా ఆకాంక్షిస్తారు. కానీ, వారి ఊహలు, కోరికలు, కన్న కలలు తమ బిడ్డల విషయంలో వేరొకరకంగా, వైవిధ్యంగా రూపు చెందుతుంటుంటాయి ” అని. మరి, తమ పిల్లల విషయంలో, తాము కోరుకున్నట్లుగా జరగనప్పుడు, మరి మనిషి సంతానాన్ని ఎందుకు కోరుకుంటున్నాడు? తనకున్నదాంట్లోనే తృప్తి పడవచ్చుకదా? అంటే నా సమాధానం: “ మనిషి, తన సంతాన విషయంలో, తన ఊహలకు అనుగుణంగానే తన సంతానం వుండాలని తీవ్రంగా తపించినా, ఆంతర్యంలో, తనలో, ఎక్కడో, తనకు పూర్తిగా తెలియని ఒక వైవిధ్యమైన అంశం నిగూడంగా నిభిడీకృతమై వుంటుంది ” అన్నది నా ఆలోచన. ఈ తెలియని వైవిధ్యమైన అంశంకూడా మనిషిని సంతానోత్పుత్తి వైపుకు నడుపుతున్నదని నా భావన. ఈ వైవిధ్యమైన అంశమే, బహుశా, తన ద్వారా, తన సంతానానికి అందినప్పుడు, ఆ సంతానం, అనేకసార్లు, తల్లి,తండ్రుల కోరికలకు భిన్నంగా తమ జీవిత ప్రయాణాలని సాగిస్తూ, ఎన్నో వైవిధ్యమైన విషయాలను ఆవిష్కరిస్తూ, వైవిధ్యమైన ప్రపంచాన్ని సృష్టిస్తూ వుంటుంటారు. అందుకేనేమో, ఈ ప్రపంచంలో ఎప్పటికప్పుడు క్రొత్తదనం పులకరిస్తూ, మనుషుల్ని పలకరిస్తూ వుంటుంది.


పైన నేను ప్రతిపాదించిన విషయానికి ఏవైనా బలమైన ఆధారాల్లాంటివి వున్నాయా? అని అంటే వున్నాయని చెబుతాను నేను. మరి ఆ వివరాల్లోకి వెళ్దాం.


ఆధునిక సైన్సు ప్రకారం ఈ విశ్వ సృష్టికి కారణం ‘బిగ్ బ్యాంగ్’ థియరీ. అంటే, అతి సూక్ష్మాతి సూక్ష్మమైన ఒక అణువు విస్పోటంచెంది, దానినుంచి అనేకానేక మూల వాయువులు, మూల కణాలు పుట్టి, వాటిలో కొన్ని, ఆ మూల కణాలయొక్క గుణాలను పూర్తిగా వదిలివేయకుండా, సమ్మేళనం చెంది, క్రొత్త కణాలుగా రూపొంది, అందులోంచి మరల,మరలా మరికొన్ని సమ్మేళనాలు చెంది, క్రొత్త పదార్ధాలుగా మారి, ఈ విశ్వం తయారయింది అని థియరీ చెబుతున్నది. అంటే, మూల కణం మొదటగా ఒకటే, కానీ, అదే తనలో తానే, తనకు తానుగా ఎన్నో రూపాంతరాలు చెందింది; ఒక్కొక్క రూపం, ఒక్కొక్క గుణాన్నిపొంది, ఒక్కొక్క రకంగా జీవాన్నిపొంది, మనకు ఈ సృష్టిలో కనిపిస్తుంది. కాబట్టే, దీన్ని వైవిధ్యభరితమైన సృష్టి అంటాం. అంతెందుకు, మనిషిలో మూలకణం ఒకటే. కానీ, ఆ మూలకణమే, అంతులేని కణాలుగా విభజింపబడి, వైవిధ్యమైన పనులను శరీరంలో చేస్తూవుంటుంది. ఇంకా చెప్పాలంటే, ఒక చెట్టును చూస్తే, చెట్టు ఒకటిగానేవున్నా, ఆకులన్నీ వేరువేరు పరిమాణాల్లో వుంటాయి; మన చెయ్యి ఒకటే, కానీ, ఐదు వేళ్ళు ఐదు రకాలుగా వుంటాయి; నదుల్లో నీరు తియ్యగా వుంటుంది. అదే నీరు సముద్రంలో కలిస్తే ఉప్పగా వుంటాయి; తెల్లని సూర్యకాంతి ఒక్కటే, కానీ అది ఏడురంగుల మిశ్రమం. ఒక్కొక్క రంగు ఒక్కొక్క అనుభూతిని కలిగిస్తుంది; పై ఉదాహరణలలో ప్రతిదీ ఒక్కొక్కటే కానీ, ఏకత్వంలో భిన్నత్వం కలిగివుంటుంది.


ఉపసంహారం:- ఈ విశ్వం ఏర్పాటు ఒక మూలకణంనుంచి ఏర్పడిందని అనుకున్నాంకదా. కానీ సృష్టి రచనను చూడండి ఎంత వైవిధ్యంగా వుంటుందో!! నీలం రంగు ఆకాశం; తెల్లని, నల్లని మబ్బులు; రంగురంగుల మొక్కలు, పువ్వులు; వివిధ రూపాలలో మనుషులు, పశుపక్ష్యాదులు. ఇవన్నీ ఒకే రంగులో వున్నాయనుకోండి — ఆ దృశ్యాన్ని ఊహించుకోండి! ఒక నలుపు,తెలుపు చిత్రంలాగా వుంటుంది, లేదా, ఒకే ఒక రంగును ముద్దలా అంతటా పులిమినట్లు వుంటుంది. రంగుల ప్రపంచం వుండదు; పంచరంగుల ఊహాప్రపంచంకూడా వుండదు. అంటే, సృష్టిలో ప్రతిదీ ఏకత్వంలో భిన్నత్వం కలిగే వుంటుంది. ఈ భిన్నత్వమే మనిషిలోకూడా వుంటుంది కాబట్టి తన సంతానంలోకూడా భిన్నత్వం యొక్క ఛాయలు తప్పకుండా కనిపిస్తూవుంటాయి. గ్రహాలన్నీ గుండ్రంగా వుంటాయి. కానీ అవి గుండ్రంగా తిరగటంలేదు. ఒక కోడిగుడ్డు ఆకారంలో తిరుగుతూ, సూర్యుడిని తాకుతూ, అక్కడినుంచి శక్తిని పొందుతూ, సృష్టియొక్క వైవిధ్య రచనలో తమవంతు పాలు పంచుకుంటాయి. అదే, అవి గుండ్రని ఆకారంలో తిరుగుతే, సూర్యశక్తికి దగ్గరగా పోలేవు. వాటివాటి పరిధిలోనే వుండిపోతాయి. మనిషికూడా, తన ఆలోచన పరిధిలో గుండ్రంగా తిరుగుతూవుంటే, క్రొత్తదనం అంటుకోదు. మనలోని, మనకు తెలియని ఒక శక్తి ఈ పరిధిని దాటి, మరొక క్రొత్త పరిధిని తాకుతుంది. అదే మనిషియొక్క సంతానంలో కనిపించే వైవిధ్యం. ఏకత్వంలో భిన్నత్వం!!

No comments:

Post a Comment