07 November 2013

శఠగోపము మననెత్తి మీద పెడాతారు,ఎందుకు ?

నీపాద కమలసేవయు
నీ పాదార్చకుల తోడి నెయ్యము నితాం
తాపార భూతదయయును

తాపల మందార నాకు దయసేయగదే!!


మనం దేవాలయాలకు వెళ్ళినపుడు భగవద్దర్శనం అయ్యాక అర్చక స్వామి శఠగోపము మననెత్తి మీద పెడాతారు. భగవంతుని పాదాల ముద్రలున్న పాదుకలు ఈ కీరిటము వంటి శఠగోపంపైన మనకు దర్శనమిస్తాయి.

ఈ శఠగోపము వెండితోకాని, పంచ లోహాలతో కాని, ఇత్తడితో కాని, బంగారంతో చేయించి దేవాలయాల్లో వాటిని స్వామి పాదుకలుగా భావిస్తారు. కనుకనే ఆ పాదుకలను మన నెత్తిపై అర్చకస్వాములు పెట్టేటపుడు ఇలా భావించాలి.


‘దేవాధిదేవా! దేవతలంతా నీ పాదాలకు పూజించి అజరామరులైనారు. అట్టి నీ పాదాలను నా శిరస్సుపై ధరిస్తున్నాను. నీ పాదధూళితో నన్ను పునీతునిగా చేయుము స్వామీ!’ అని వేడుకుంటున్నాము. కామ క్రోధాదులను నశింపచేసి మనలను తరింపచేసేవి శ్రీవారి పాదములే.


‘బ్రహ్మ కడిగిన పాదము! బ్రహ్మము తానె నీ పాదము!
చెలగి వసుధ గొలిచిన పాదము
బలి తలమోసిన పాదము
పరమయోగులకు పరిపరి విధముల వరమొసగెడి పాదము
తిరు వేంకటగిరి తిరమని చూపిన పరమపదము నీ పాదమబ్రహం కడిగిన పాదము! బ్రహ్మము తానె నీ పాదము!’

అంటూ అన్నమాచార్యులవారు స్తుతించారు. అనేకమంది వాగ్గేయకారులు స్తుతించిన ఆ దివ్య పాదాలను మనం శిరసా ధరించేటపుడు ఆ భావన రావాలి. ‘శ్రీరామ పాదమా! నీ కౄపచాలున్ చిత్తమునకురావే’ అంటూ త్యాగయ్య శ్రీరామ పాదారవిందములను కొనియాడారు.
విభీషణ, సుగ్రీవాదులు శరణాగతి వేడిన పాదాలను, భరతుడు పాదుకా పట్టాభిషేకం చేసి సిమ్హాసనం ఎక్కిస్తే రాజ్యము ఏలిన పాదాలను మనం శిరస్సున ధరిస్తున్నామనే భక్తి భావన మనలో రావాలి. శత్రువుకైనా అభయమివ్వగల పాదుకలను మనం శిరసునుంచి వినమ్రతతో వంగి నెత్తిన పెట్టుకొని నమస్కరించడం మన సంప్రదాయం.

వేలాదిమమంది భక్తులు వరుసలో నిలబడితే వారి నెత్తిపై పాదుకలుంచే ఖంగారుతో అర్చకస్వాములు మన నెత్తిమీద టపాటపా మొత్తుతూన్నట్లే భావించి, దానితోనే మన జన్మ చరితార్ధమయిందని చాలమంది భావిస్తారు. కాని అందులో అంతరార్థం చాలా ఉంది.


అర్చకస్వామి మన శిరస్సుపై పాదుకలుంచేటపుడు సాక్షాత్తు పరమేశ్వరుని పాదాలను పాదధూళిని మనం ధరిస్తున్న అనుభూతితో ఈ క్రింది శ్లోకం చదవాలి.


శివ పాదుకలు ధరించేటపుడు చదవలసిన శ్లోకం:
శ్లో !! హిరణ్యగర్భాది సురా సురాణాం
కిరీట మాణిక్య విరాజ మండితం
శివస్య త్వత్పాద సరోజయగ్మం
మదీయ మూర్దాన మలం కరోతు!!


పై శ్లోకానికి భావం: ఓ సాంబా! శివా! బ్రహ్మాదిదేవతలు తమ తమ కిరీటాలను నీ పాదాలకు తాకి నమస్కరిస్తుంటే వాటి కాంతిచేత విరజమానమైన నీ పాదాలు నా శిరస్సునలంకరించుగాక!

ఈ శ్లోకం పాదుకలు ఇచ్చేవారు కూడా చదవాలి. మదీయ (నాయొక్క) అనేచోట (నీయొక్క) అని చదవాలి.


విష్ణాలయంలో కాని, శ్రీకౄష్ణ, శ్రీరామాలయాల్లో కాని పాదుకలు శిరసా ధరించేటపుడు ఈ క్రింది శ్లోకం చెప్పుకోవాలి.


శ్లో!! గదాపునశంఖ రధాంగ చక్ర
ధ్వజారవిందాంకుశ వజ్రలాంఛనం
విక్రమత్వచ్ఛరణాంబుజ ద్వయం, మదీయ మూర్థాన మలం కరోతు!!


శ్రీమహావిష్ణువు పాదాలలో గద, శంఖ, చక్రము, ధ్వజము, పద్మము, అంకుశం, వజ్రము మొదలైన శుభప్రదమైన లాంచనములుంటాయి. ఆ స్వామి పాదం క్రింద పెడితే ఆ భూమిపై ఆ గుర్తులు కానవస్తాయన్నమాట. శ్రీకౄష్ణావతారంలో ఆక్రూరుడు మధున నుండి బౄందావనానికి వెడూతుంటే బాలగోపాలుని చరణ చిహ్నాలను చూసి పులకిత గాత్రుడై అక్కడి పాద ధూళితీసి శిరస్సున ధరించినట్లు భాగవతంలో చెప్పబడింది.

‘ఓ త్రివిక్రమా! అటువంటి నీ చరణములు నాశిరస్సున ధరిస్తున్నాను.’ ‘శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే’ అంటూ మనం పాదుకలు శిరస్సున ధరించాలి భక్తితో.


అర్చకస్వామి ఈ పాదుకలు మన నెత్తిపై ఉంచేటప్పుడు ఆ శ్లోకంలో మదీయ (నాయొక్క) అన్నచోట త్వదీయ (నీయొక్క) అని చదవాలి.

No comments:

Post a Comment