మనసే మంత్రము :
అన్నీ వడ్డించిన విస్తరి ఎగిరెగిరి పడక, అణిగిమణిగి వుంటుంది అని నానుడి.
మనిషి జీవితాన్ని కూడా వడ్డించిన విస్తరితోనే పోలుస్తారు. అంటే, జీవితంలో
మనకి అన్నీ వున్నాకూడా గంభీరంగా, నిదానంగా, అణుకవతో వుండాలని దాని అర్ధం.
మరి అలా వుండాలంటే మనం ఏంచేయాలి? ఏం తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలి? అనేవే
ప్రశ్నలు. సమాధానాలు అనేకం వుంటాయి. శ్రీ రమణ మహర్షి అన్నట్లు, “ నిన్ను
నువ్వు తెలుసుకోవాలి ” అనేది అనేక సమాధానాల్లో ఒకటి. అదేమిటో, ఎట్లాగో మీతో
చెప్పాలనుకున్నాను. వినండి…..
ఎన్ని సంపదులున్నా, మంచి మనస్సు
లేనిదే ఉపయోగంలేదు. పువ్వుకి వాసన ఎట్లాగో, సంపదలున్నవాడికి మంచి మనస్సు
కలిగి వుండటంకూడా అంత ముఖ్యమే. మనస్సు చిత్రమైనది; బహు విచిత్రమైనది అని
అందరికీ తెలిసిందే!! కాకపోతే, ఎవరి మనస్సు వారికే తెలియాలి; తెలుసుకోవాలి.
మనిషి శరీరం ఐదు జ్ఞానేంద్రియాలు; ఐదు కర్మేంద్రియాలతో కలిసి మనస్సు
అధీనంలో పనిచేస్తుంటాయి. ఈ ఇంద్రియాలన్నీ బాహ్యప్రపంచంతో అనుబంధం కలిగి,
విషయాలను మనస్సుకు అందిస్తుంటాయి వార్తాహరులులాగా. వీటికి తమ స్వంత
ఆలోచనలు, కోరికలు వుండవు. కేవలం మనస్సు చెప్పినట్లుగా స్పందిస్తుంటాయి.
మనస్సు చాలా విచిత్రమైనదని ముందే అనుకున్నాం మనం. ఈ మనస్సు, తనకు
అనుసంధానమై, అనుబంధమైన ఈ దశేంద్రియాలను చూసుకుని ఎక్కువగా గొప్పలు
పోతూవుంటుంది. అనేకసార్లు దెబ్బలుకూడా తింటూవుంటుంది. ఇంతకీ ఈ మనస్సు
గొప్పేంటి అంటారా? చెవులు ద్వారా అతి సున్నితమైన శబ్దాలని వింటుంది;
కళ్ళద్వారా ప్రకృతిలోని అందాలని చూస్తుంది; ముక్కుద్వారా సువాసనల్ని
గ్రహిస్తుంది; నాలుకద్వారా రుచుల్ని గ్రహిస్తుంది; చర్మంద్వారా
స్పర్శజ్ఞానం పొందుతుంది. ఈ ఐదింటి ద్వారా కలిగిన జ్ఞానాన్ని తన
కర్మేంద్రియాలైన నోరు, కాళ్ళు, చేతులు మొదలైన వాటిద్వారా తన మనసులో కలిగిన
కోరికలకు కార్యరూపం ఇస్తుంది, అనుభవిస్తుంది.
వచ్చిన చిక్కల్లా
ఎక్కడుందంటే, తన జ్ఞానేంద్రియాలద్వారా పొందిన విషయాల్ని అతిగా వాడుకొని,
కష్టాలు కొనితెచ్చుకుంటుందీ మనస్సు. ఉదాహరణకి, చెవులద్వారా ఎన్నో వినదగ్గ
విషయాలను విని, ఇతరులకు చెప్పకుండా, తనలోనే దాచుకుంటుంది. తనంత
జ్ఞానవంతురాలు మరొకరు లేరని విర్రవీగుతుంది. మరొక ప్రక్క, వినకూడని
విషయాలను విని, అనవసరం అయినా, అవసరం లేని వ్యక్తుల చెవుల్లో ఊదుతుంది.
దాంతో, వ్యక్తులమధ్య గొడవలురేగి, వారు తన్నుకుంటారు, ఒకానొకవేళ,
చెప్పినవాళ్ళకికూడా తన్నులు తప్పవు మరి!! ఇది ఈ మనస్సుయొక్క విచిత్రమైన
తత్త్వం. కళ్ళతో అందాల్ని చూసి వూరుకోక, నీవు అచ్చం నా భార్యలాగా అందంగా
వున్నావంటే ఎవరైనా వూరుకుంటారండీ? అతిధిగా ఎవరింటికైనా వెళ్ళి, ముక్కుతో
అక్కడి వంటకాల్ని వాసనచూసి, నాలుకతో రుచిచూచి, తిన్నంతగా తిని, అబ్బే,
వంటకాలు రుచీపచీ లేవంటే మర్యాదగా వుంటుందండీ? కాలు, నోరు మంచిదైతే అంతా
మంచేఅని నానుడి మరి!!
పైదంతా మనస్సుయొక్క ఒకవైపు ముఖకళవికలు. మరి రెండోవైపో? చూద్దామా?
చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక, చర్మం, నోరు, కాళ్ళు, చేతులు మొదలైన
ఇంద్రియాలన్నీ ఏ పనులు చేసినా, ఎంత గొప్ప పనులు చేసినా, అవి
‘నిశ్శబ్దం’గానే చేస్తాయి. ఏదైనా శబ్దాన్ని వినాలంటే, నిశబ్దంలోనే
వినగలుగుతాము. చెవులు శబ్దాన్ని వింటాయికానీ, లోపల వినటానికోసం నిశ్శబ్దంగా
వుంటాయి; కళ్ళు ఎన్ని విశేషాలను చూసినా, పొంగిపోయినా, రెప్పపాటు
శబ్దాన్నికూడా చేయవు; ముక్కు గుబాళించే సువాసనల్ని వాసన చూసినా, నిరంతరం
గాలిని పీలుస్తున్నా, ఎడమ ముక్కులోని శ్వాస కుడిముక్కుకుకూడా తెలియదు;
నాలుక నాగుపాములాగా ఎగిరెగిరి పడుతున్నా, వంటకాల్ని రుచి చూస్తుందేకానీ,
నరంలేని దానిలాగా నోట్లోనే వుంటుంది; ప్రతి ఇంద్రియం ఇలాగే వుంటూ, “ మూగ
మనస్సు ” చెప్పే, ఇచ్చే ఆదేశాలను శబ్దం చేయకుండా శిరసావహిస్తాయి.
అంతేకాదండీ! లబ్‍డబ్, లబ్‍డబ్ అని గుండె శబ్దం చేస్తుందని వైద్యులు
అంటారుకానీ, నిజంగా మన గుండె శబ్దాన్ని మనం ఎప్పుడూ వింటుంటామా? ఊహూ లేదే!
సెతస్కోప్‍కి మాత్రమే ఈ శబ్దం.
ఇప్పుడు మనం అసలు విషయానికి
వచ్చాం. ఏదైనా కార్యాన్ని సాధించాలంటే క్రమశిక్షణ, అంటే క్రమంతప్పని
అలవాట్లు, సమయపాలన, నిరంతర సాధన కలిగివుండాలి. మొట్టమొదట్లోనే
చెప్పుకున్నట్లుగా, “మనిషి జీవితం అన్నీ వడ్డించిన విస్తరిలాగా వుండాలి” —
అంటే అణుకవగా వుండాలి. అంటే మనం, మన మనస్సుని స్వాధీనం చేసుకోవాలి. అంటే
ఇది ఒక ఘనకార్యం. ఘన కార్యాన్ని సాధించాలంటే క్రమశిక్షణకూడా కఠినంగానే
వుండాలి. ఎంతో గొప్ప పేరుప్రఖ్యాతులు పొందిన వ్యక్తి ‘ మహాత్మాగాంధిజీ ’.
కోట్లాదిమందిని తన మాటలచేత, చేతలచేత కట్టివేసాడు. అందుకు కారణం ఆయన తన
దశేంద్రియాలన్నింటినీ తన మనస్సుకు కట్టుబానిస చేసాడు. మనస్సును, తన
మనస్సుకే బానిస చేసాడు.
ఈ సాధనలో ఎన్నో ప్రక్రియలు; అందులో
అత్యున్నతమైనది “ ధ్యానం ”. చెవులతో శబ్దాన్ని వినటమేకాకుండా, మనస్సుని
వినండి; కళ్ళతో బాహ్య ప్రపంచాన్ని చూడటమే కాకుండా, మనస్సుని చూడండి;
ముక్కుతో శ్వాసించటమే కాకుండా, మనస్సుని శ్వాసించండి; నాలుకతో వంటకాల్ని
రుచి చూడటమే కాకుండా, మనస్సుయొక్క రుచి ఏమిటో తెలుసుకోండి; చర్మంతో బాహ్య
స్పర్శలను తెలుసుకోవటమే కాకుండా, మనస్సును స్పర్శించండి; కాళ్ళు, చేతులు,
నోటిని కట్టివేయండి – మనస్సుకు అప్పచెప్పండి. ఇలా, ఒక్కొక్క ఇంద్రియాన్ని
కట్టడి చేయగలమా? ఇది మాటలకు, రాతలవరకే పరిమితమా? అని మీరు అడగవచ్చు.
ప్రయత్నం చేస్తేగదా ఏదైనా అనుభవంలోకి వచ్చేది, తెలిసేదీ! సుఖాసనంలో
కూర్చొని, చేతి వ్రేళ్ళని కలిపి, కళ్ళు మూసుకొని, శ్వాసమీద ధ్యాస పెట్టండి.
అంతే, చెవులుకూడా, ఈ అవయవాలన్నీ ఏమి చేస్తున్నాయా అని తెలుసుకోవటానికి తమ
చెవులను రిక్కించి వినటానికి సిద్ధమవుతాయి. బాహ్యంలోవున్న ఇంద్రియాలన్నీ
ఇప్పుడు లోపలివైపుకి తిరిగినట్లేగదా!? ఇక మిగిలింది నాలుక. ఇప్పటికే పాపం
అది నోటిలోపలే వుంది కదండీ!! ఇంక ఆలస్యం ఎందుకు? మన మూగ మనసు ఏంచెబుతుందో
నిశ్శబ్దంగా వినటానికి ప్రయత్నించండి.
ఉపసంహారం:– హనుమంతుడు
సముద్రాన్ని దాటాల్సివచ్చింది. అది ఓ మహ ఘనకార్యం. అయితే, ఆయనకు తన బలం,
శక్తి సామర్ధ్యాల గురించి తెలియదు. అందుకనే, జాంబవంతుడు హనుమంతుడికి నీవు
దాటగలవు, నీకా శక్తి వున్నది అని ఉద్భోదించాడు. పని పూర్తయింది. అట్లాగే,
మన మనస్సు విచిత్రమైనది. దానియొక్క శక్తి దానికే పూర్తిగా తెలియదు. ఇతరులు
ఎవరైనా తెలియచెబితే తెలుసుకుంటుంది. లేదా, ఒక్కొక్కసారి, తనకు తానుగాకూడా
స్వీయ-సాధనతో తెలుసుకోగలదు. ఇంద్రియాలన్నింటినీ నియంత్రించగల ఓ మనసా!
నిన్ను నీవే నియంత్రించుకో అని చెబితే, నచ్చచెబితే, పాపం ఆ మూగ మనసు
తప్పకుండా తనమాట తను వింటుంది. ఎంతైనా మనస్సు నిప్పును తొక్కిన కోతి
లాంటిదని అందరూ ఎక్కిరిస్తారుగానీ ( ఎక్కిరిస్తే ఎవరికైనా ఉక్రోషం, కోపం
వస్తుంది కదండీ; చెప్పిన మాట అసలే వినరుకదా! ) అసలు నిప్పు జోలికి పోకుండా
వుంటే, వుండటానికి ప్రయత్నిస్తే, ఎంత చెడ్డా, మన మనస్సు మహ మంచిది కదండీ!!
ఇదే మాటని మీరు, మీ,మీ మనస్సులకుకూడా చెప్పి, సముదాయించండి. మీ మాట ఎందుకు
వినదో చూద్దాం! మనసుకు మనసే మంత్రమంటే ఇదే .......
No comments:
Post a Comment