04 November 2013

దేవుడనేవాడున్నాడా?

ఏ కాలంలోనైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, అప్పుడప్పుడు అడుగబడుతుండే ఒకే ఒక ప్రశ్న “దేవుడనేవాడున్నాడా అని?! ఒకవేళ ఉంటే ఆయన్ని చూడగలమా అని?!’
అయితే ఈ సందేహం ఇప్పటిది కాదు. మనిషి పుట్టినప్పటినుంచి మన వెన్నంటి వస్తున్న ‘సందేహం’ ఇదేననడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఈ విషయమై మన ప్రాచీన కవి తన సందిగ్ధాన్ని ఇలా వెల్లడించారు.

కలడందురు దీనుల యెడ
కలడందురు పరమయోగి గనములపాలన్
కలడందురన్ని దిశలన్ , గలడు
కలండనెడువాడు గలడో లేడో

మన కవీశ్వరుని సందేహమిదైతే, ఓ ప్రాచీన తమిళ కవి సందేహం మరోవిధంగా ఉంది. అసలు కంటికి కనిపించని ఆ దేవుడు… పురుషుడా? స్త్రీయా? లేక నపుంసకుడా? అంటూ తన సందేహాన్ని ఇలా వ్యక్తం చేసాడు.
ఆణల్లాన్ పెణ్ణల్లాన్ అల్లాదు అలియుమల్లాన్
కాణాలుమగాన్ ఉళనల్లాన్ ఇల్లెయల్లాన్
పేణుంగాల్ పేణుమ్మ్ ఉరువాగుమ్మ్ అల్లనుమామ్మ్
కోణై పెరిదుడైత్తు ఎంపెంమానై కూరుదలే

‘వాడు మగా? లేక ఆడా? అదీ కాకపోతే నపుంసకుడా? అతడిని చూడలేం. తను ఉన్నట్లుగా లేడు. లేనట్లుగా లేడు. నేను నిత్యం ప్రార్థిస్తున్న రూపంలో ఉన్నాడా అంటే, అలా కూడా లేడు. ఇలాంటి నా స్వామిని వర్ణించడం నావల్ల కాని పనీ.
‘దేవుడున్నాడా?’ అనే ప్రశ్నకు ‘ఎల్లయ్య, పుల్లయ్య ఉన్నారా?’ అనే ప్రశ్నకు చెప్పినంత తేలిగ్గా జవాబు చెప్పేందుకు వీలుకాదు. కారణం ఎల్లయ్య, పుల్లయ్యలు ఎక్కడా ఉన్నారన్న సంగతి వాళ్ల ఇళ్ళకో లేక వాళ్ళూ పనిచేసే కార్యాలయాలకో వెళ్ళి నివారణ చేసుకోవచ్చు. కానీ, దేవుని విషయం అలా కాదు గదా!!
‘దేవుడ్క్కడ?’ అని అడిగేవారికి, ‘దేవుడిని ప్రత్యక్షంగా చూడాల్సిన అవసరమేమి లేదు. పసిపాపల బోసినవ్వులలో, పేదవాని సంతోషంలో, ఉదయాన్నే పూచే పూవులలో, పక్షుల కిలకిలరావాలలో, లేగదూడ పరుగులో, ఆ సౄష్టికారుని దర్శించండీ అంటూ సమాధానం లభిస్తోంది.

ఇహ ఆయన ‘ఉన్నాడా? లేడా’ అన్న విషయంపై జరుగుతున్న వాదోపవాదాలు, మరే విషయంపై ఇంతవరకు జరగలేదన్నది వాస్తవం. ఈ సౄష్టి ఉన్నప్పుడు సౄష్టికర్త ఒకడు ఉండాలి కదా! అని ఆస్తికులు అంటుండగా, మరి ఆ సౄష్టి కర్తని ఎవరు సౄష్టించారు? అని నాస్తికులు ఎదురు ప్రశ్నిస్తున్నారు.
అయితే ఈ విశాల సౄష్టిలో ‘నేనెవరిని?’ అని మనిషి ప్రశ్నించుకున్నప్పట్నుంచే, దేవుని గురించిన అన్వేషన ప్రారంభమైందని చెప్పొచ్చు. అన్వేషణ ఉధౄతమైన కొలదీ మనిషికి తనెంత అల్పుడనైన సంగతి, దేవుడెంత గొప్పవాడన్న సంగతి అర్థమవ సాగింది. మనిషిని గురించి చీమ నడిగితే ఏంచెబుతుంది? చీమ పరమాణం, తెలివితేటలను లెక్కలోకి తీసుకుంటే, అది మనిషిని గురించి చీమనడిగితే ఏం చెబుతుంది?. అది మనిషి పూర్తి స్వరూపాన్ని ఎట్టి పరిస్తితులు అర్థం చేసుకోలేదని అవగత మవుతుంది. అలాగే సర్వాంతర్యామి యైన భగవంతుడిని అర్థం చేసుకోవదానికి, అణుమాత్రులమైన మన శక్తి యుక్తులు ఏపాటివి? కాబట్టి ఈ విషయం మన పరిమిత బుద్ధికి అందన విషయమని మేధావులు పేర్కొనగా, అసలు తర్కం ఎక్కడ అంతంవుతుందో, ఆస్తికత్వం అక్కడ మొదలవుతుందిని స్వామి వివేకానంద చెప్పారు.
అలా తర్కమీమాంసకు అవతలి వైపుకు చేరుకున్న మన ౠషులు, ’ఈశ్వర: సర్వభూతానాం హౄద్యసే తిష్టతీ (భగవంతుడు సకల జీవరాశులలోనూ ఉన్నాడు) అని వ్రాక్కుచ్చారు. ఈ విషయాన్నే మన వేదాలు కూడ ఉద్ఘోషిస్తున్నాయి.

ప్రజ్ణ్జానాం బ్రహ్మ (ౠగ్వేదం)
అహాం బ్రహ్మస్మి (యజుర్వేదం)
తత్త్వమసి (సామవేదం)
ఐం ఆత్మ బ్రహ్మ (అధర్వణ వేదం)

ఇలా నాలుగు వేదాలు సకల జీవులలో భగవంతుడున్నాడని పేర్కొంటున్నాయి.
‘ఓమిత్యేకాక్షరం బ్రహ్మా అంటున్న వేదమతం దేవుడు మొదట శబ్దరూపంలో ఉండి, ఆ తర్వాత విశ్వరూపం దాల్చాడని అంటుండగా, అది నిజంకాదు, మొదట భగవంతుడు తేజో రూపంలో ఉద్భవించి, ఆతర్వాత సౄస్టిని ప్రారంభించాడని మరికొన్ని వాదనలు రేకెత్తునాయి. ఇదిలా ఉండగా ఆయన మాయలో, ఆయన పడటం ఏమిటండీ, అర్థం లేకుండా అని హేతువాదులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు

1 comment: