బ్రాహ్మముహూర్తంలో నిద్రలేచి తీరాలని పండితులు అంటున్నారు:
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చిరాయువును పొందడానికి బ్రాహ్మముహూర్తంలో
నిద్రలేచి తీరాలని పండితులు అంటున్నారు. ఆయుర్వేదం- సూర్యుడుదయించుటకు 90
నిమిషాల మునుపటికాలమే బ్రహ్మమూహూర్తం. ఇది బుద్దిని వికసింపజేస్తుంది. ఈ
బ్రహ్మముహూర్తంలోనే సూర్యభగవానుడు తన అసంఖ్యాకకిరణాల జ్యోతిని, శక్తిని
ప్రపంచంపై ప్రసరింపజేయనారంభిస్తాడు. అప్పుడు వాటి ప్రభావం వల్ల మనశరీరం
చురుకుగా పనిచేస్తుంది.
మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నక్షత్రమండలం
నుండి ప్రసరించే కాంతికిరణాలు ప్రాణుల మస్తిష్కాన్ని ప్రభావితం చేస్తాయి.
అప్పటి భాస్కరకిరణ పుంజం మానవ శరీరంలోని జీవకణాలను చైతన్యవంతం చేస్తుంది.
కాబట్టి ఆ వేళలో మానవుడు తన ప్రాణాలను మహా ప్రాణాలతో సంబంధింపజేస్తే
మానవునిలో అపారమైనశక్తి ఉత్పన్నమౌతుందని పండితుల అభిప్రాయం.
ఈ సమయంలో జీవకోటి నిద్రాదశలో ఉంటుంది. ఈ నిశ్శబ్ధవాతావరణంలో
ఇంద్రియనిగ్రహాన్ని పాటించే మహర్షులు మేలుకుని ధ్యాన సమాధిని పొంది తపోమయ
విద్యుత్తరంగాలను విశ్వవ్యాప్తంగా ప్రసరింపచేస్తూంటారు.
బ్రాహ్మముహూర్తంలో నిద్రిస్తూంటే చేసుకున్న పుణ్యమంతా నశిస్తుంది. బ్రాహ్మే
ముహూర్తేయా నిద్రా సా పుణ్యక్షయకారిణీ- అంటారు. పుణ్యనాశానికెవరూ
అంగీకరించరూ కదా. కాబట్టి తెల్లవారుజామున నిద్రలేచి తీరాల్సిందే.
నూతన విషయాలు ఆలోచించడానికి, గ్రంథరచన సాగించడానికి, మానసిక వికాసానికి
బ్రాహ్మముహూర్తమెంతో సాయపడుతుంది. ఆ సమయంలో రాత్రి అంతా చంద్రకిరణాల నుండి
నక్షత్రకిరణాల నుంచి ప్రసరించి అమృతాన్ని గ్రహించి ఉషఃకాలవాయువు
వీస్తూంటుంది. ఈ గాలిసోకి శరీరమారోగ్యంగా, ముఖం కాంతివంతంగా, మనస్సు
ఆహ్లాదకరంగా, బుద్ధినిశితంగా ఉంటాయి.
కాబట్టి బ్రాహ్మముహూర్తంలో
నిద్రలేవడం వల్ల దేవతల, పితరుల అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆయువును
పెంచుకోవచ్చు. ఆరోగ్యాన్ని సంతరించుకోవచ్చు.
No comments:
Post a Comment