02 November 2013

ముహూర్తం చూడడం ఎలా ?

శ్లో// చక్షుషే జగతాం కర్మసాక్షిణే తేజసాంనిధేః
మూర్తి త్రయ స్వరూపాయ మార్తాండాయ నమోనమః//

మనం ఒక అధికారి దగ్గరికి పనిమీద వెళ్లేటప్పుడు ఆ అధికారి కోపంలో ఉన్నాడా!?, సంతోషంలో ఉన్నాడా!? మొదలైన విషయాలు తెలుసుకుని అతను సంతోషంలో ఉన్నప్పుడు వెళితే మన పని త్వరగా అవుతుంది. అలాగే తెలివైన వారు కాలం యొక్క స్వభావాన్ని తెలుసుకుని మంచి కాలములో తగిన పనులు చేయ తలపెడతారు. అన్నికాలాలూ మనకు జయాన్ని ఇవ్వవు. ఒక సమయంలో ఒకరికి శుభం జరిగితే మరొకరికి కష్టం కలగవచ్చు. మనం పుట్టిన సమయాన్ని బట్టి మనకు మాత్రమే ప్రత్యేకంగా సరిపడు కాలం తెలుసుకోవాలి. మనం పుట్టిన సమయానికి ఉన్న నక్షత్ర,లగ్న ములను బట్టి మనకు/ మనం తలపెట్టిన పనికి సరిపడు నక్షత్ర, లగ్న సమయాలు తెలుసుకుని ముందడుగు వేయడం జయాన్ని కలిగిస్తుంది. కాలం యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఋషులు మనకు అందించిన అద్భుత వరం “జ్యోతిష్య శాస్త్రం”. దీని ఆధారంగా మన జీవితంలో జరుగు వివాహము, ఉపనయనము, గృహప్రవేశము మొదలైన కర్మలను ఏ రోజు, ఏ సమయంలో జరుపుకోవచ్చో తెలుసుకొనవచ్చు.
ముహూర్తం చూసే ప్రక్రియలో ముఖ్యంగా ఈ క్రింధి విషయాలు గమనించాల్సి ఉంటుంది.

1) తారా బలం, 2) చంద్ర బలం, 3) లగ్న బలం, 5) పంచక రహితం, 6) ఏకవింశతీ మహా దోషాలు
వీటి తో పాటు చివరిగా ఆయా క్రతువులకు పనికి వచ్చే తిథి, వార, నక్షత్రాలనే వాడామా లేదా అనే విషయం కూడా తప్పకుండా నిర్థారించుకోవాలి.

ఉదాహరణకు :
మనం అడిగి మరీ పెట్టించుకునే “ఆదివారం” గృహప్రవేశం, ఉపనయనం, వివాహం మొదలైనవాటికి తగిన వారంగా పేర్కొన బడలేదు. బుధ,గురు, శుక్రవారములు చాలా వరకు శుభకార్యములకు మంచివిగా పెద్దలు తెలిపారు. అయితే వారము కన్నా తిథి, తిథికన్నా నక్షత్రము, నక్షత్రముకన్నా లగ్నమూ అత్యంత బలీయములు. కనుక నక్షత్ర, లగ్నములు అనుకూలముగా ఉన్నచో తిథివారములు మధ్యస్థముగా ఉన్ననూ స్వీకరిస్తుంటారు.


ఒక పని ముఖ్యంగా వైదిక సంబంధమైన వివాహ గృహప్రవేశాది క్రతువులు చేయతలపెట్టినప్పుడు ఈ విషయాలు అన్నీ గమనించి శుద్ధపరచిన శుభముహూర్తములు గ్రహించాలి.

No comments:

Post a Comment