04 November 2013

తల్లిదండ్రులు మనం డబ్బు ఇస్తే పుచ్చుకోకుండా క్రిందపెట్టమంటారు . ఎందుకో తెలుసా ?

శ్లో || కామశ్చ , క్రోధశ్చ , లోభశ్చ , దేహే తిష్థన్తి తస్కరాః |
జ్ఞాన రత్నాపహారాయ , తస్మాత్ జాగ్రత జాగ్రత ||
-- జాతకకధలు .
భావము :- కామము , క్రోధము , లోభము అనే ముగ్గురు దొంగలు ,
జ్ఞానమనే రత్నాన్ని దొంగిలించడానికి మన దేహంలో తిష్ఠ వేసుకున్నారు .
కాబట్టి జాగ్రత్తగా ఉండండి .

-- బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించేరోజుల్లొ రాజధానిలో 4 ఝాములూ
ప్రజలను అప్రమత్తంగా ఉంచడానికి , `పారాహుషార్ ` అంటూ చాటింపు వెయ్యడానికి
ఒకతను ఉండేవాడు . అతనికి ఎంతకాలానికీ సంతానం కలుగనందుకు చింతిస్తూ ఉండేవాడు .
ఒకరోజు ఆ రాజ్యానికి ఒక సాధువుగారు వచ్చారు . ఇతను భార్యతోకలసి సాధువుని దర్శించుకుని ,
సంతానం కోసం ప్రాధేయపడ్డాడు . సాధువు దివ్యదృష్టితోచూసి , ఇతను దరిద్రంతో బాధపడడంవలన ,
ఎలాంటి దానధర్మములు చెయ్యలేదని , అందువలన సంతానహీనుడయ్యాడని గ్రహించాడు .
` నీ వృత్తి ఏమిటి ? ` అని అడిగాడు . పగలు చెప్పులు కుట్టుకుంటూ , రాత్రిపూట చాటింపు వేస్తానని చెప్పాడు .

వెంటనే సాధువు అతనికి ఉపాయం చెబుతాడు . ఆప్రకారం అతను మంచి చెప్పులు కుట్టి ,
ఆనగరానికి దగ్గరలో ఉన్న ఎడారిలో ఒకచోట వదలిపెట్టి ఇంటికి వచ్చేస్తాడు .
కాసేపటితర్వాత అదేదారిలో బోధిసత్వుడు ప్రయాణం చేస్తున్నాడు .
సరిగ్గా అక్కడికి వచ్చేసరికి ఆయన చెప్పులు తెగిపోతాయి . దగ్గరలో క్రొత్త చెప్పులు కనిపిస్తాయి .
కానీ అక్కడ ఎవరూ లేరు . చేసేదిలేక అవి తొడుక్కుని వెళ్ళిపోతాడు .
వెంటనే ఋణానుబంధం ఏర్పడి , మరణించి అతనికి కొడుకుగా పుట్టి పెరిగి పెద్దవాడు అవుతాడు .
కానీ జ్ఞాని కదా ! తనకు ఈ జన్మ ఎలా ప్రాప్తించిందో గ్రహిస్తాడు .
ఋణం తీర్చుకుని సంసారబంధంనుండి బయటపడడానికి మార్గాలు వెదుకుతుంటాడు .
ఇలాఉండగా , ఒకరోజు తండ్రికి అనారోగ్యంగా ఉండడంతో అతనిబదులు బోధిసత్వుడు
చాటింపు వేయడానికి వెళ్తాడు . పండితుడు కాబట్టి ` పారాహుషార్ ` కి బదులు పై శ్లోకం చెబుతాడు .
అంతఃపురంలోఉన్న రాజు ఇదివిని ఉలిక్కిపడతాడు . నిద్రపోకుండా , 4 ఝాములు , 4 శ్లోకాలు విని ,
మర్నాడు తండ్రికి కబురుచేసి అతనికుమారుని జన్మవృత్తాంతము తెలిసికొని
బోధిసత్వుడే ఇతనికి కుమారుడిగా పుట్టాడని గ్రహించి , " నువ్వు ఎప్పుడూ
నీ కుమారుడి చేతినుండి ధనము తీసుకోవద్దు . అలా చేస్తే నీకొడుకు నీకు దక్కడు . " అని సలహా ఇస్తాడు
.
అతను ఆ సలహా పాటిస్తూ , కొడుకు ఎన్నిసార్లు ధనము చేతికి ఇవ్వబోయినా ,తీసుకోకుండా క్రింద పెట్టమంటాడు .
ఇలావుండగా ఒకరోజు , అగ్నిప్రమాదంలో వాళ్ళ ఇల్లు కాలిపోతుంది .
తండ్రీకొడుకులు ఇద్దరూ సామానులు బయట పెడుతుంటారు .
ఆ హడావిడిలో అకస్మాత్తుగా బోధిసత్వుడు , తండ్రికి ధనపుసంచి ఇచ్చి బయటపెట్టమంటాడు .
అతను ఆ కంగారులో తీసుకుంటాడు . ఋణానుబంధము తీరిపోయింది . వెంటనే బోధిసత్వుడు తలపగిలి చనిపోతాడు .
మన తల్లిదండ్రులు , మనం వాళ్ళ చేతికి డబ్బు ఇస్తే పుచ్చుకోకుండా క్రిందపెట్టమనడంలో అంతరార్ధం ఇదే !!!

No comments:

Post a Comment