04 November 2013

అష్టాదశ పురాణాలు మొత్తం 18 :

పురాణాలు ప్రణవం నుండి పుట్టాయని సంస్కృత భాగవతంలోని పన్నెండవ స్కందం చెప్తుంది. బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడై ఉన్న సమయంలో ఆయన హృదయగృహ నుండి ఒక అనాహత శబ్ధం వెలువడింది. ఆ శబ్ధంలో నుండి అ కార ఉకార మకార శబ్ధాలు కూడిన ఓంకారశబ్ధం ఆవిర్భవించింది. "అ" నుండి "హ" వరకు గల అక్షరాలు ఆశబ్ధంనుండి ఉద్భవించాయి. ఓంకారం సకల మంత్రాలకు బీజాక్షరం అయింది. ఓంకారం నుండి నాలుగు వేదాలను ఉద్భవించాయి. ఆ 'అ'కార, 'ఉ'కార 'మ'కారములనుండి సత్వ,రజో,తమో అనే త్రిగుణాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనే చతుర్వేదాలు, భూ॰భువ॰సువ॰ అనే త్రిలోకాలు, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు జనించాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు చతుర్వేదాలను వెలువరించి తనకుమారులైన మరీచి తదితరులకిచ్చాడు. వారు తమ కుమారులైన కశ్యపుడు తదితరులకు ఇచ్చారు. అలా వేదాలు పరంపరాగతంగా సాగిపోతూ ఉన్నాయి.
వేదాలు ప్రజలకు క్లిష్టమైనవి కనుక అందుబాటులో లేనివి కనుక వేదవ్యాసుడు వేద ఉపనిషత్తు సారంతో కూడిన అష్టాదశ పురాణాలను రచించాడు. పురాణాలను వ్యాసుడు తన శిష్యుడైన రోమహర్షణుకి చెప్పాడు. రోమహర్షుడు తిరిగి వాటిని తన శిష్యులైన త్రైయారుణి, కశ్యపుడు, సావర్ణి లాంటి శిష్యులకు అందించాడు. ఆ తర్వాత అలా ఒకరి నుండి ఒకరికి సంక్రమించాయి.


1. మత్స్య పురాణం : మత్స్యావతారమెత్తిన శ్రీ మహావిష్ణువు మనువుకు బోధించిన పురాణం ఇది. యయాతి, సావిత్రి, కార్తికేయ చరిత్రలు ఇందులో ఉన్నాయి. అంతేకాక వారణాసి, ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాల వివరణ ఇందులో ఉంది.


2. మార్కండేయ పురాణం :
ఇది మార్కండేయ ఋషి చెప్పినది కనుక దీనికి ఈ పేరు వచ్చింది. శివుడు, విష్ణువు, ఇంద్రుడు, అగ్నిదేవుడు, సూర్యుల మహత్తు గురించి ఇందులో వివరించారు.


3. భాగవత పురాణం : దీన్ని తెలుగులోకి పోతన కవి అనువదించారు కనుక తెలుగు ప్రజలకు ఇది చిరపరిచితమైన పురాణమే. ఇందులో మహావిష్ణు అవతారాల గురించి , శ్రీకృష్ణుని లీలల గురించి వివరించారు. తెలుగులో ఇది మొత్తం 12 స్కంధాల గ్రంధం.


4. భవిష్య పురాణం : ఇది సూర్యభగవానుడు మనువుకు చెప్పిన పురాణం. ఇందులో వర్ణాశ్రమాల ధర్మాల గురించి, భవిష్యత్తులో జరగబోయే పరిణామాల గురించి వివరించారు.


5. బ్రహ్మ పురాణం : ఇది దక్షునికి బ్రహ్మదేవుడు చెప్పిన పురాణం. శ్రీకృష్ణుడు, మార్కండేయుడు, కశ్యపుల జీవన గాథలు ఉన్నాయి.


6. బ్రహ్మాండ పురాణం : బ్రహ్మ మరీచికి చెప్పిన పురాణం ఇది. పరశురాముడి గురించి, రాముడి గురించి, శ్రీకృష్ణుని గురించి ఇందులో వివరించారు. ఇందులో దేవతాస్తోత్ర శ్లోకాలు కూడా ఉన్నాయి.


7. బ్రహ్మవైవర్త పురాణం : ఇది నారద మహర్షికి సావర్ణుడు చెప్పిన పురాణం. సృష్టికి మూలమైన భౌతిక జగత్తు గురించి, పంచమహా శక్తుల గురించి ఇందులో ఉంది.


8. వరాహ పురాణం : ఇది విష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన పురాణం. పార్వతీ పరమేశ్వర చరిత్ర, ధర్మశాస్త్ర శ్లోకాలు, వ్రత విధానాలు ఇందులో ఉన్నాయి.


9. వామన పురాణం : నారదునికి పులస్త్య ఋషి వివరించిన పురాణం ఇది. శివపార్వతుల కళ్యాణం, కార్తికేయగాధ, భూగోళ వర్ణన, రుతువర్ణన ఇందులో ఉన్నాయి. ఆర్యభట్టులాంటి ఖగోళ శాస్త్రవేత్తలు ఈ పురాణాన్ని శ్రద్ధగా చదివినట్లు ఆధారాలున్నాయి.


10. వాయు పురాణం : ఇది వాయుదేవుడు ఉపదేశించిన పురాణం. ఇందులో శివమహత్యముతో పాటు భూగోళ వర్ణన, సౌరమండల వ్యవస్థ వర్ణన కూడా ఉండి. మన ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలు ఈ పురాణాన్ని కూడా అధ్యయనం చేశారు.


11. విష్ణు పురాణం : ఇది మైత్రేయునికి పరాశర మహర్షి ఉపదేశించిన పురాణం. విష్ణు, శ్రీకృష్ణ, ధృవ, ప్రహ్లాద, భరతుల గురించి విపులంగా వివరించారు.


12. నారద పురాణం : ఇది నారదుడు నలుగురు బ్రహ్మ మానసపుత్రులకు చెప్పిన పురాణం. ఇందులో వ్రతాల గురించి, వేదాంగాల గురించి కూడా వివరించారు. వివిధ పుణ్యక్షేత్రాల వర్ణన ఇందులో ఉంది.


13. అగ్ని పురాణం : ఇది అగ్నిదేవుడు ప్రవచించిన పురాణం. వైద్యం, వ్యాకరణం, చందస్సు, భూగోళ శాస్త్రం, జ్యోతిష్యం గురించి ఇందులో ఉన్నాయి.


14. స్కంద పురాణం : ఇది స్కందుడు చెప్పిన పురాణం. ఇందులో అనేక వ్రతాల గురించి, శివమాహత్మ్యం గురించి ఇంకా వివిధ పుణ్యక్షేత్రాల గురించి వివరించారు.


15. గరుడ పురాణం : ఇది తన వాహనమైన గరుడునికి (గరుత్మంతునికి) శ్రీమహావిష్ణువు ఉపదేశించిన పురాణం. గరుడుని జన్మవృత్తాంతముతో పాటు స్వర్గలోకం గురించి, నరకలోకం గురించి, విష్ణు ఉపాసన గురించి ఇందులో వివరించారు.


16. లింగ పురాణం : ఇందులో శివుని ఉపదేశాలు, ఇతర వ్రతాలు, ఖగోళశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం మొదలైన వాటి గురించి వివరించారు.


17. కూర్మ పురాణం : శ్రీమహావిష్ణువు కూర్మావతారంలో ఉపదేశించిన పురాణం కనుకే దీనికి ఈ పేరు వచ్చింది. ఇందులో వరాహ అవతారం గురించి, నరసింహావతారం గురించి వివరించారు. భూగోళం గురించి కూడా వివరించారు.


18. పద్మ పురాణం : 18 పురాణాలలోకెల్లా ఇది పెద్దది. ఇందులో బ్రహ్మ చేసిన సృష్టి గురించి, గంగా మహాత్మ్యం గురించి, గాయత్రీ చరితం గురించి, గీత గురించి, పూజా విధానం గురించి వివరంగా వర్ణించారు.


అష్టాదశ పురాణములలో శ్లోకాలు :


బ్రహ్మ పురాణం - బ్రహ్మదేవుడు మరీచికి బోధించినది. 10,000 శ్లోకములు కలది.

పద్మ పురాణము - బ్రహ్మదేవునిచే చెప్పబడినది. 55,000 శ్లోకములు కలది.
విష్ణు పురాణం - పరాశరుని రచన. దీనిలో 63,000 శ్లోకములు ఉన్నాయి.
శివ పురాణం - వాయుదేవునిచే చెప్పబడినది. ఇందులో 24,000 శ్లోకాలున్నాయి.
లింగ పురాణము - నందీశ్వరుని రచన. 11,000 శ్లోకాలు ఉన్నది.
గరుడ పురాణం - విష్ణుమూర్తి గరుత్మంతునికి చెప్పిన ఈ పురాణంలో 19,000 శ్లోకాలున్నాయి.
నారద పురాణము - నారద మహర్షి రచన. 24,000 శ్లోకములు కలది.
భాగవత పురాణం- శుకమహర్షి పరీక్షిత్తునకుపదేశించినది. 18,000 శ్లోకములు కలది.
అగ్ని పురాణం - భృగుమహర్షిచే చెప్పబడినది. 16,000 శ్లోకములు కలది.
స్కంద పురాణం - కుమారస్వామిచే చెప్పబడినది. 80,000 ఇందు శ్లోకములు ఉన్నాయి.
భవిష్య పురాణం - శతానీకుడు సుమంతునకు బోధించినది. 14,500 శ్లోకములు ఉన్నాయి.
బ్రహ్మవైవర్త పురాణం - వశిష్ట మహర్షి అంబరీషునకు ఉపదేశించినది. 18,000 శ్లోకములు కలది.
మార్కండేయ పురాణం - పక్షులు క్రోష్టి(జైమిని)కి చెప్పినట్లుగా మార్కండేయమహర్షి రచించెను. 9,000 శ్లోకములు ఉన్నది.
వామన పురాణము - బ్రహ్మదేవుని రచన - 14,000 శ్లోకములు కలది.
వరాహ పురాణం - శ్రీవరాహమూర్తి భూదేవికి ఉపదేశించినది. ఇందు 24,000 శ్లోకములు ఉన్నాయి.
మత్స్య పురాణం - శ్రీమత్స్యావతారుడైన విష్ణువు మనువునకు ఉపదేశించెను. దీనిలో 14,000 శ్లోకాలున్నాయి.
కూర్మ పురాణం - శ్రీకూర్మావతారుడైన విష్ణువు ఉపదేశించెను. దీనిలో 17,000 శ్లోకాలున్నాయి.
బ్రహ్మాండ పురాణం - బ్రహ్మదేవుని రచన- 1,100 శ్లోకములున్నది.

No comments:

Post a Comment