30 October 2013

Jyothishya Methods :

సాయన విధానం. దీనినే సూర్యమానం అని కూడా అంటారు.ఇది పాశ్చాత్యులు ఎక్కువగా వాడుతారు. ఇందులో ఋతువులు, సూర్య గమనం, రాశులు, గ్రహగతులు, ముఖ్యంగా చూస్తారు. వీరికి దశావిధానం లేదు. Primary and secondary directions వాడతారు. Primary directions లో ఒక డిగ్రీ ఒక సంవత్సరానికి సమానం. Secondary directions లో ఒక రోజు ఒక సంవత్సరానికి సమానం. ఇప్పుడు Tertiary directions కూడా వచ్చింది.యురేనస్,నెప్ట్యూన్,ప్లూటో మొదలైన గ్రహాలను లెక్కిస్తారు.
నిరయన విధానం దీనిని చాంద్రమానం అనీ నక్షత్రమానం అనీ అంటారు.ఇది మన భారతీయ విధానం.ఇందులో నవగ్రహాలను లెక్కిస్తారు. ఉపగ్రహాలున్నప్పటికీ వాటిని పెద్దగా వాడటం లేదు.నక్షత్ర దశలు, గ్రహములకు గల ప్రత్యేక దృష్టులు,యోగములు,గ్రహావస్థలు మొదలైనవి ప్రధానమైన విషయాలు.మన విధానంలో ముఖ్యంగా పరాశర, జైమిని, తాజక,నాడీ విధానాలున్నాయి. భృగు,గర్గ,కశ్యపాదుల పద్దతులున్నాయి. ఇవి కాక అనేక ఇతర విధానాలున్నాయి.
పరాశర విధానం ఇందులో వర్గ చక్రాలు,వివిధ దశావిధానాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. షడ్వరులు, సప్త వర్గులు, దశవర్గులు,షోడశ వర్గులు ముఖ్యమైనవి.గ్రహ యోగాలనూ, దశలనూ,గోచారాన్నీ, అష్టక వర్గులనూ కలిపి ఫలితాలను ఊహించడం జరుగుతుంది. పరాశర మహర్షి ఇంకా ఎన్నో విషయాలను చర్చించినప్పటికీ ముఖ్యంగా వీటినే పరిగణనలోకి తీసుకుంటున్నాము.
జైమిని విధానం ఇందులో కారకాంశ, రాశి దృష్టులు,రాశి దశలు, ఆరూఢ లగ్నాలు,శూల దశ,చరదశ వంటి ప్రత్యేక దశలు ఉంటాయి. ఆయుర్గణనలో విభిన్న పద్దతులు ఈయన ప్రత్యేకత. ఈ విధానాని పరాశర మహర్షి చర్చించినప్పటికీ దీనిని ఒక ప్రత్యేక విధానంగా జైమిని మహర్షి తయారుచేయటం తో ఆయన పేరుమీద చలామణీలోకి వచ్చింది. దీనిని వాడేవారు తక్కువగా ఉంటారు.
తాజక విధానం ఇది సాయన పద్దతికి దగ్గరగా ఉంటుంది. సహమములు, పాత్యాయనీ దశ, ముద్ద దశ, వర్ష ప్రవేశం, ముంధా బిందువు, ఇతశల, ముతశిల యోగం ఇత్యాది ప్రత్యేకతలుంటాయి.ఇందులోని యోగాలన్నీ పాశ్చాత్యుల విధానపు దృష్టులే. దీనిని ఎక్కువగా ప్రశ్న శాస్త్రంలో ఉపయోగిస్తారు.
నాడీ విధానం లేక భృగు సంహితా పద్దతి ఇది చాలా ప్రత్యేకమైన పద్దతి. ఒక రాశిని 150 భాగాలుగా విడగొట్టి దానిని బట్టి సూక్ష్మమైన ఫలితాలను చెప్పేదే నాడీ విధానం. దీనిలో చాలా రకాలైన నాడీ గ్రంధాలున్నాయి. ఫలితాలు కూడా చాలా విచిత్రంగా సరిపోతాయి. ఇందులో రాశి తుల్య నవాంశ పద్దతి, నాడీ అంశలపైన గ్రహాల సంచారం మొదలైనవాటిని బట్టి ఫలితాలు ఊహిస్తారు.ఇవిగాక K.P system ఇంకొక విధానం. భారతీయ పాశ్చాత్య పద్దతులను కలిపి సబ్ లార్డ్ థియరీతో రంగరించి దీన్ని ప్రొఫెసర్ కృష్ణమూర్తి గారు తయారు చేశారు.దీనిలో ఒక్కొక్క నక్షత్రాన్ని వింశోత్తరీ పద్దతిలో విభజించి సబ్ అనబడే సూక్ష్మ విభాగాన్ని తెచ్చారు. దీనిని మళ్లీ ఇదే పద్దతిలో విడగోట్టి సబ్ సబ్ అనే ఇంకా సూక్ష్మ విభాగాన్నితెచ్చారు. పాశ్చాత్యులు వాడే ప్లాసిడస్ హౌస్ సిస్టం ను ఈయన ఉపయోగించారు. హౌస్ కస్ప్ లు, సబ్ లార్డ్స్, సబ్ సబ్ లార్డ్స్, రూలింగ్ ప్లానెట్స్, హౌస్ రెలేషన్ షిప్ మొదలైన విభిన్న పద్ధతులతో ఆశ్చర్య కరమైన ఫలితాలు చెప్పవచ్చు. మిగిలినదంతా పరాశర విధానం వలెనే ఉంటుంది. ఇది ప్రాధమికంగా ప్రశ్న శాస్త్రం. కాని జనన జాతకానికి కూడా బాగా పనిచేస్తుంది.

No comments:

Post a Comment