30 August 2015

విశ్వేదేవతలు :-

పరమాత్మ నిరాకారుడు. కేవలం జ్ఞానమే ఆయన స్వరూపం.ఆంతటా మహా శూన్యంగా వ్యాపించిన వ్యోమమే (గగనమే) ఆయన దేహం . నిజానికి ఆయన శూన్యం కాదు. అనంత శూన్యము లో ఆయన పరిపూర్ణ జ్ఞానం వ్యాపించే ఉన్నది.ఆ విశుద్ధ జ్ఞాన దేహుడైన పరమాత్మ యొక్క(Tangible entities ) ప్రత్యక్ష మూర్తులే విశ్వే దేవతలు. ఈ విశ్వమంతటా కోటాను కోట్ల గెలాక్సీలు ఉన్నయి. ప్రతి గెలాక్సీలో అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి.ప్రతీ బ్రహ్మాండం లోను ( ప్రతి సూర్య కుటుంబం లో) ఈ విశ్వే దేవతలు మూడు గణాలుగా వ్యక్తమవుతున్నారు. ఈ వ్యక్త మూర్తులలో ఉన్న పరమాత్మ చైతన్యమే ఈ సృష్టి ని లయబద్ధంగా నడిపిస్తున్నది. కనుక విశ్వే దేవతలు ఎవరో తెలుసుకొందాము.

1. దివి దేవతలు లేక ఆదిత్యులు (.Gods of Radiation) :-
మానవులందరికి స్వర్గలోకము అంటే సూర్య మండలమే. అదే దేవతలందరికి నివాస స్థానము.సూర్యమండలమును పరిపాలించు వాడు సూర్యుడు. ఆయనే ఆదిత్యుడు. ఒక్కో మాసం లో సూర్యకిరణాలు ఒక్కొక గుణము కలిగి ఉంటాయి గనుక ఆదిత్యుడు 12 రూపాలు ధరిస్తాడు. వీరే ద్వాదశాదిత్యులు.-- ధాత, అర్యముడు, మిత్రుడు, వరుణుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, త్వష్ట, విష్ణువు, తర్యముడు, భగుడు, పూషణుదు, క్రతువు- స్వర్గాన్ని వీరి రూపంలొ ఆదిత్యుడు 12 నెలలు పరిపాలిస్తాడని మనం అర్ధం చేసుకోవాలి.

2. అంతరిక్షదేవతలు లేక రుద్రులు ( Gods of Vibration ) :-
రుద్రుడు అనగా రోదసికి అధిపతి. ఇతడు పదకొండు రూపములలో వ్యక్తమవుతున్నాడు. అంతరిక్షమున ఏర్పడు స్పందనలన్నియు రుద్రుడు సృష్టించునవియే పంచ భూతాత్మకమైన ప్రకృతి యందు గల మార్పులన్నియు వీరు సృష్టించు స్పందనలే గనుక ప్రాణుల జీవనము వీరి దయపై అధార పడి యున్నది. మానవుల యందు పంచ జ్ఞానేంద్రియములను పంచ కర్మేంద్రియములను, మనసును శాసించు ప్రత్యక్ష మూర్తులు గనుక జీవులందరు వీరి రూపములుగానే భావించ వలెను. వీరే రుద్రులు - అజుడు, ఏకపాదుడు, అహిర్బుధ్న్యుడు, త్వష్ట, రుద్రుడు, శంభుడు, హరుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు, ఈశానుడు త్రిభువనుడు- రుద్రుడు ఇన్ని రూపములు ధరించు నని మనము అర్ధము చేసికొన వలెను.


3. పృథివీ దేవతలు వసువులు( Gods of Materialization) :-
భూమి పైగల సమస్త పదార్ధములకు రంగు, రుచి, వాసన, గుణములను ఆకారములు కల్పించుచు ప్రకాశింపజేయు వారు.. వీరు పరమాత్మ చైతన్య విజ్ఞానముతో ఏర్పడిన ప్రత్యక్ష మూర్తులు.భూమియందలి ఏ రూపమైనను వీరు లేక ఏర్పడజాలదు.వీరే అష్ట వసువులు.-- ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు.
ఈ ఆదిత్యులు, రుద్రులు,వసువులు పరమాత్మ ప్రత్యక్ష రూపములుగా వేదకాలము నాటి ఋషులు భావించిరి. అందరూ ఏదో ఒక రూపములో వీరిని ప్రతినిత్యము ఆరాధిస్తూనే ఉన్నారు.


No comments:

Post a Comment