30 August 2015

రథసప్తమి :-

కాలః పచతి భూతాని
కాలం సంహరతే ప్రజాః
కాలః సుప్తేషు జాగ్రర్తి
కాలోహి దురతిక్రమః


కాలమే సకల ప్రాణులను పుట్టిస్తుంది. కాలమే సర్వప్రాణులను సంహరిస్తుంది. లీనమై నిదురించిన కాలమే తిరిగి మేల్కొంటుంది, సృష్టి క్రమాన్ని ప్రారంభిస్తుంది. అందుకే కాలధర్మాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు.

విత్తు మొలకెత్తటానికి, మొక్క చిగురించటానికి, చిగురించిన మొక్క మొగ్గ తొడగటానికి, మొగ్గ పుష్పంలా వికసించటానికి, పువ్వు కాయగా మారటానికి, కాయ పండుగా మారటానికి, కాలమే కారణం.
కాలం మహా వేగవంతమైనది. దానికి పురోగమనమేకానీ, తిరోగమనమే లేదు. అట్టి కాలం యొక్క వేగాన్ని తెలుసుకోవడం ఎలా?

సూర్య గమనమే కాలవేగానికి ప్రమాణం. సూర్యునకు కూడా పురోగమనమేకానీ, తిరోగమనం లేదు. ఆయన వేసే ప్రతి అడుగు కాలవేగానికి, కాలగమనానికి కొలబద్ద.

ఈనాడు మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలకు ఆధారం సూర్యుడే.


కాలమే వేదస్వరూపం అంటుంది వేదం. కాలం కంటికి కనబడదు. దైవమూ కంటికి కనబడడు. కానీ కాలానికి ప్రమాణమైన సూర్యుడు మన చర్మ చక్షువులకు కనిపిస్తాడు. అందుకే ఆయనకు ప్రత్యక్షదైవంలాగా కొలుస్తాము, ఆడి నారాయణుడిగా ఆరాధిస్తాము.

భౌతిక, వైజ్ఞానిక, దృష్టితో పరిశీలిస్తే సృష్టి, స్థితి, లయ కారకుడు సూర్యుడు మాత్రమే.
సూర్యుని వలెనే ఈ సమస్త ప్రకృతి చైతన్యవంతం అవుతుంది, తేజోవంతమవుతుంది. ప్రాణవంత మవుతుంది. ఆరోగ్యవంత మౌతుంది, అందుకే -


సప్తాశ్వరాధ మారూఢం
ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధారం దేవం
టం సూర్యం ప్రణమామ్యహం.


ఏడు గుఱ్ఱాలు పూన్చిన రథాన్ని అధిరోహించి, నిరంతర సంచారం చేసే కశ్యపాత్మజుడైన సూర్యునకు నమస్కారం, అని ఉభయ సంధ్యలోనూ, ఆయనను స్తుతిస్తాము.

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ |
తమోఘ్నం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ||


ఎఱ్ఱని దాసాని పువ్వు రంగువంటి శరీరకాంతితో, ప్రకాశించేవాడూ, కశ్యపుని కుమారుడు, మహా కాంతివంతుడు, చీకటిని తొలగించేవాడు అయిన సూర్యునకు నమస్కారము, అని పురాణాలు ప్రవచిస్తాయి.

ఇంతకీ ఈ సూర్యుడు ఎవరు? అతని తల్లిదండ్రులెవరు? ఎప్పుడు జన్మించాడు?
ఎన్నో కొన్ని లక్షల సంవత్సరాలక్రితం జరిగిన పెద్ద విస్ఫోటనం కారణంగా ఈ ఖగోళాలన్న ఏర్పడ్డాయని "బిగ్ బ్యాంగ్'' థియరీ చెప్తుంది. కానీ ఆ విస్ఫోటనానికి కారణం ఏమిటన్నది ఏ సైన్సు యింతవరకు వివరించలేదు.


ఓంకార విస్ఫోటనంతో మొదట కాంతి ఏర్పడిందని, ఆ కాంతియే సూర్యుడని పురాణాలు ఘోషిస్తున్నాయి.
నిజానికి సూర్యుడు భగభగ మండే అగ్నిగోళం మాత్రమే. ఆ గోళానికి అధిపతి మార్తాండుడు. ఆయన తల్లిదండ్రులే ఆదితి, కష్యపులు. సూర్యగోళానికి అధిపతి కనుక ఆయన సూర్యుడయ్యాడు. మాఘ శుద్ధ సప్తమినాడు సూర్యుడు జన్మించాడు. సూర్యరథాన్ని ఆధారం చేసుకుని తక్కిన గ్రహాలన్నీ సంచరిస్తాయి. సూర్య జననమే లేకపోతే తక్కిన గ్రహాలకు గమనమే లేదు. పండుగ చేసుకోవడం, సూర్యుడిని ఆరాధించడం ఆచారమైంది.

ఈ విశ్వం ఒక వృత్తమైతే, దానికి 360 డిగ్రీలు వుంటాయని, సంఖ్యాశాస్త్రం చెబుతుంది. సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున చరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని పూర్తిచేస్తాడు. అదే మనకొక సంవత్సరం. అందుకే జోతిష శాస్త్రవేత్తలు ఈ సృష్టి చక్రాన్ని 12 రాసులుగా విభజించి, ఒక్కొక్క రాశికి 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా, ఈ బ్రహ్మాండంలో యింకా 11 మంది సూర్యులు వున్నట్లు ఇటీవల శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. అయితే మన ప్రాచీన ఋషులు ఎప్పుడో ఈ ద్వాదశాదిత్యులను గుర్తించి పురాణాల ద్వారా పరిచయం చేశారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు.

ఈ ద్వాదశాదిత్యులే సంవత్సరాత్మకమైన కాల విభాగంలోని ద్వాదశామాసాలకూ ఆధిదేవతలుగా పేర్కొనబడినారు. రాశులు కూడా ఇందువల్లనే 12గా ఏర్పడినాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. ముఖ్యంగా ఈ మాఘమాసంలో "అర్క'' నామంతో సంచరిస్తాడు.
మా + అఘ = పాపం లేనిది.

పుణ్యాన్ని ప్రసాదించే మాసం కనుక ఈ మాసాన్ని (మాఖ)మాఘమాసం అన్నారు. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రమణంతో ప్రారంభమైనా, ఈ రథసప్తమి నుండి ఉత్తరాయణస్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది. దక్షిణాయణం అనే గ్రహణం నుండి సూర్యుడు విముక్తుడై ఈ రథసప్తమి నుండి ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. కనుక ఈ రథసప్తమిని సూర్యగ్రహణతుల్యంగా భావించి, పితృతర్పణాలు, దేవ ఋషి తర్పణాలు ఇవ్వాలనే నియమాన్ని పెద్దలు నిర్ణయించారు. ఉత్తరాయణం, మాఘమాసం, రథసప్తమి మానవుణ్ణి ఉన్నతజ్ఞాన మార్గంలో ప్రయాణింపజేసి భగవత్ సాక్షాత్కార ప్రాప్తికి ప్రాత్రుణ్ణి చేస్తాయి.
"సూర్య ఆత్మా జగత స్తస్దుషశ్చ''

మన సౌరకుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కనుక సూర్యోపాసన చేస్తే (అరుణం) ఋణ, రోగ, శతృబాధలు నశిస్తాయి. మన మంత్రపుష్పాలలో ఇకటిగా పేర్కొనే "యోపాం పుష్పం వేద, పుష్పవాన్ ప్రజావాన్, పశుమాన్ భవతి'' అనే వాక్యాలున్న మంత్రం అరుణం లోనిదే.

సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశుసంపద సమృద్ధిమంతుడు అవుతాడు.
"ఆరోగ్యం భాస్కరా దిచ్చేత్''

సూర్యకాంతిలోని నీలికిరణాల ప్రభావం వల్లనే మన శరీరం సహజసిద్ధంగా విటమిన్ 'డి'ని ఉత్పత్తి చేసుకొంటుంది. 'డి' విటమిన్ లోపిస్తే ఎముకల పెరుగుదల తగ్గిపోతుంది. సూర్యకిరణ జన్యసంయోగం వల్లనే సృష్టి, ఆహారం, పోషణ మున్నగునవి ఏర్పడుతున్నాయి. సూర్యకిరణాలు మానవశరీరంపై తప్పక ప్రసరించాలి. అందుకే వైదిక వాజ్మయం సంధ్యావందనం, సూర్యనమస్కారాలు, ఆర్ఘ్యప్రధానం, మున్నగు ప్రక్రియల్ని ప్రవేశపెట్టింది.

జ్యోతిశ్శాస్త్రం "ఆత్మ ప్రభావశక్తిశ్చ పితృచింతారవే:ఫలం'' అని సూర్యగ్రహ ఫలితాన్ని చెప్పింది. సూర్యోపాసనవల్ల, సూర్యగ్రహ ప్రభావంవల్ల ఆత్మశక్తి పెరుగుతుంది. నేత్రశక్తి పెరుగుదలకూ, హృద్యోగనివారణకూ సూర్యుడే ఆరాధ్యుడు. మేషరాశిలో సూర్యుడు ఉండగా జన్మించే వారందరూ ఆత్మప్రభావాధికులుగా ఉంటారని జ్యోతిష్యజ్ఞులు చెప్తారు.

సూర్యుణ్ణి "సప్తాశ్వుడు'', 'సప్తసప్తి' అన్నారు కదా!


సూర్యకిరణకాంతిలో ఏడురంగులు ఉంటాయి. ఆ కాంతి వర్ణాలనే ఏడు గుఱ్ఱాలుగా పేర్కొన్నారు. వాస్తవానికి "వేగం'' అనేది ఒక్కటే సూర్యుని గుఱ్ఱం. ఆ గుఱ్ఱం పేరే 'సప్త' అనగా కాంతికిరణ గమన వేగం ఒక్కటే ఏడుగా వర్ణాలుగా గోచరిస్తుంది. స్థూలదృష్టికి కాంతి కిరణం ఏడురంగులలో గోచరించినా, అతనీలలోహితాది కిరణాలు కోట్లకొలది ఉన్నాయని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. అశ్వాలు అంటే కిరణాలే. "తస్మో దశ్వా అజాయత'' అని వేదం చెప్పింది. సృష్టి యజ్ఞంలో మొదట ఏర్పడింది అశ్వమే. కనుక ఆ ఆశ్వాలే సూర్యుని కిరణాలు. సూర్యుడంటే "కిరణాలనూ, ప్రాణశక్తుల్ని, జలములందలి రసాన్ని స్వీకరించేవాడు, ఆకాశంలో సంచరించువాడు, లోకాన్ని సృష్టించువాడు, ప్రాణుల్ని కర్మలకు ప్రేరేపించువాడు, అని అర్థం.

"సూర్యా ద్భవంతి భూ తాని,
సూర్యేణ పాళీ తానిచ
సూర్యే లయం ప్రాప్నువంతి
య సూర్యః సోహ మేవచ''


సృష్టి, స్థితిలయాలు సూర్యుని వల్లనే జరుగుతున్నాయని సూర్యోపనిషత్తు సూచించింది.
సుప్రసిద్ధమైన గాయత్రీమంత్రం సూర్యపరమైనదే వేదాల్లోని సౌరసూక్తాలూ, రామాయణంలోని ఆదిత్యహృదయం, సూర్యారాధన యొక్క ప్రాచీనతను సూచిస్తున్నాయి. సూర్యోపాసనతో అనేక లాభాలు పొందినవారున్నారు. అగస్త్యుడు బోధించిన 'ఆదిర్యహ్ర్య్దయం' ప్రభావంతోనే శ్రీరాముడు రావణుణ్ణి సంహరించగల్గాడు. మయూరుడు సూర్యానుగ్రహంతో కుష్ఠురోగ విముక్తుడయినాడు. సూర్యానుగ్రహంతోనే పాండవులు "అక్షయపాత్ర'' పొంది అరణ్యవాసకాలంలో ఆహార సమస్య లేకుండా అతిథి సత్కారాలు చేస్తూ, ధన్యులయ్యారు.


సూర్యరథానికి ఒక్కటే చక్రం. దానికి ఆకులు ఆరు. గుఱ్ఱాలు ఏడు. అసూరుడు సారథి. కాంతులు విరజిమ్ముతూ, నిరంతరం ప్రయాణించడం, అతని గుణం. ఇది సూర్యుని భౌతిక స్వరూపం. కాళాత్మకంగా పరిశీలిస్తే సూర్యునికి సంవత్సరమనేదే చక్రం. విశ్వమే రథం. ఛందస్సులే (వేదాలు) గుఱ్ఱాలు. ఆరు ఋతువులే ఆరు ఆకులు. వ్యక్తిపరంగా ఆలోచిస్తే శరీరమే రథం. జ్ఞానమే చక్రం. కామ, క్రోధాది అరిషడ్ వర్గాలే ఆరు ఆకులు, శుభేచ్చ, విచారణ, తను మానసి, సత్త్వాపత్తి, సంసక్తి, పదార్థ భావన, తురీయము అను సప్తజ్ఞాన భూమికలే ఏడు గుఱ్ఱాలు. మనస్సే పగ్గాలు. బుద్ధియే సారథి అయిన అసూరుడు. పరమాత్మయే సూర్యుడు. హృదయమే పరమాత్మ కూర్చుండు పీఠం. జీవుని ప్రయాణ సాధనం శరీరం. ఇదే సూర్యరథం. సమిష్టిపరంగా పరిశీలిస్తే, విశ్వమే రథం. కాలమే చక్రం. ఉత్పత్తి, స్థితి, పరిణామం, వృద్ధి, క్షయం, నాశనం, అను షడ్భావ వికారాలే ఆరు ఆకులు. దేవ, మానవ, వృక్ష, మృగ, పక్షి, కీటక, జలచరములనే సప్త జన్మలు, సప్తాశ్వాలు. పరమాత్మయే సూర్యుడు. మనస్తత్వమే పగ్గాలు. బుద్ధితత్వమే సారథి అయిన అసూరుడు. ఇదే కాలవరణంతో కూడిన విశ్వాత్మక సృష్టి యొక్క సమిష్టి స్వరూపం.
యోగశాస్త్ర దృష్టితో పరిశీలిస్తే శరీరమే రథం, కుండలినీశక్తియే ఏకచక్రం, మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా, అనే షడ్చక్రాలే ఆరు ఆకులు. భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం, మహత్తు, అహంకారం అనే సప్తావరణాలే సప్తాశ్వాలు. చిదాత్మయే సూర్యుడు. కుండలినీ శక్తి యొక్క సంచారమే సూర్యుని సంచారం.

కనుకనే ఇడాపింగళ మార్గద్వయంలో సంచరిస్తూ, సుఘమ్నాస్థానంలో దివ్యతేజస్సుతో ప్రకాశిస్తూ ఈ దేహాన్ని తేజోవంతం చేసే ఈ సూర్యుడు మనకు ఆరాధ్య దైవమైనాడు. ఆయన జన్మదినమైన 'రథసప్తమి' మనకు పండుగ అయింది. "సూర్యజయంతి'' అయిన ఈ రథసప్తమినాడు బంగారం, వెండి, రాగి, ఇనుము, వీనిలో ఏదైనా ఒకదానితో చేసిన దీపప్రమిదలో నూనె, నెయ్యి, ఆముదం, విప్పనూనె, నువ్వులనూనెతో దీపం వెలిగించి, ఆ దీపాన్ని నెత్తిపై పెట్టుకుని, నదీతీరానికి కానీ, చెరువుల వద్దకు కానీ, వెళ్ళి సూర్యుణ్ణి ధ్యానించి, ఆ దీపాన్ని నీళ్ళలో వదిలి, ఎవ్వరూ నీటిని తాకకముందే స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడు ఆకులలో ఏడు రేగుపండ్లు తలపై పెట్టుకుని చేయాలి. రుద్రాక్ష, జిల్లేడు, రేగు, చెట్లు సూర్యకిరణాలలోని ప్రాణశక్తిని అత్యధికంగా నిల్వచేసుకునే వృక్షజాతులు. ఏడాదికి ఒక్కసారైనా ఈ ఔషధాలను తాకినా, వాటి స్పర్శా ప్రభావం ఆ సంవత్సరమంతా శరీరంపై ఉంటుందనీ, ఈ పండుగనాడు వీటితో తప్పక శిరఃస్నానం చేయాలని పెద్దలు నిర్ణయించారు. వైవస్వతాది మన్వంతరాలలో వైవస్వతుడు ఏడవ మనువు. సూర్యుడు వివస్వంతుడు. వైవస్వతుని కొడుకు కనుకనే వైవస్వతుడు ఇప్పటి మన్వంతరమైన వైవస్వత మన్వంతరానికి రథసప్తమియే సంవత్సరాది. అనగా ఉగాది. ఈ రథసప్తమినాడు సూర్యోదయ కాలంలో నక్షత్రాలున్న సప్తమీ దినం కనుక "రథసప్తమే'' అని అంటారు. కనుక ఈ రథసప్తమి మానవాళికి పర్వదినమైంది. పితృదేవతలకు ప్రీతికరమైనది. కనుక ఈనాడు మకర సంక్రాంతి వలెనే చక్కర పొంగలి చేసి, సూర్యునికి నివేదన యిచ్చి, పండుగ చేసుకోవాలి. పితృదేవతలకు తర్పణాలు యిచ్చి సంతోషం కల్గించాలి.

ఈ సూర్యారాధనతో మానవాళి సర్వపాప విముక్తులై, శాశ్వత పుణ్యలోకాలు పొందాలి అని ఆశిద్దాం.

సూర్యగ్రహణతుల్యా సాశుక్లా మాఘస్య సప్తమీ
అరుణోదయ వెలాయాం స్నానం తత్ర మహాఫలం
మాఘమాసి సితేపక్షే సప్తమీ కోటి పుణ్యదా
కుర్వాత్ స్నానార్ఘ్యదానాభ్యమాయు ఆరోగ్యసంపదః''


No comments:

Post a Comment