28 August 2015

నిద్ర :-

ఉదయం ఐదు గంటలకు లేచి చూస్తే రామలక్ష్మికి బెడ్‌ మీద భర్త సుగుణరావు కనిపించలేదు. ఏమైపోయాడో. ఫోన్‌ కూడా వదిలేశాడు. రెండు గంటల తరువాత జాగింగ్‌ బూట్లతో ఉత్సాహంగా ఇంటికి జేరాడు సుగుణరావు.

‘ఎక్కడికెళ్లారండి?’ అడిగింది రామలక్ష్మి కోపంగా.
‘మన కాలనీలో సడన్‌గా మా బాస్‌ ఐదు గంటలకు నిద్ర లేచే క్లబ్‌ పెట్టాడు. మొబైల్‌ పట్టుకెళ్లకూడదు. అతడికి డిస్టబెన్స్‌ ఇష్టం ఉండదు. ఒక మంచి పనికోసం ఇలా చెయ్యక తప్పదంటాడు. ఒప్పుకోక ఛస్తామా? వెళ్లాను’.

‘అక్కడేం చేశారు?’
‘నడవడం. పరుగెత్తడం. గెంతడం. కబుర్లు చెప్పుకోవడం. ఐదు గంటలకు లేవడం ముఖ్యం. తెల్లవారి ఐదు గంటలకి మా బాస్‌కి కాలనీ చివర క్లబ్‌ దగ్గర కనపడకపోతే అంతే సంగతులు’.
‘ఇన్నాళ్లకి మీ బాస్‌ ఒక మంచి పని చేస్తున్నాడు. మీ ఆరోగ్యం బాగుపడుతుంది. సంతోషంగా అంది రామలక్ష్మి.

నిద్రతో పోరాడి గెలవాలి :-
ఉదయం త్వరగా లేవడమన్నది మనకి మనం ఇచ్చుకునే కానుక. మన జీవితాన్ని ఈ అలవాటు మార్చగలిగినంతగా మరేది మార్చలేదు. ప్రాతః కాలంలో ఏదో మహత్తు ఉంది. కాలం నెమ్మదిగా నడుస్తున్నట్లుంటుంది. ఒక ప్రశాంతత, తాజాదనం మన చుట్టూ ఆవరిస్తుంది. సుగుణరావు లాగ ఐదు గంటలకు నిద్రలేచే క్లబ్‌లో మనం సభ్యులమైౖతే ప్రతి రోజూ మన అదుపులో ఉంటుంది. ఒత్తిడి తాలూకు కబంధ హస్తాల్లో మనం చిక్కుకోం. నిద్రతో పోరాటంలో గనక మనం నెగ్గితే, మన రోజులో అతి ముఖ్యమైన ఆరంభ సమయంలో కనీసం ఒక గంటసమయం మిగులుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకుంటే తక్కినరోజు అద్భుతంగా గడుస్తుంది.


మన నిత్యజీవిత విధానంలో ఉదయాన్నే లేవడమనేది చేసి తీరాల్సిన అలవాటని అర్థం చేసుకోవాలి.
ఇలా చేయడం మనకి అలవాటైపోతే మనం మహాత్మాగాంధీ, థామస్‌ అల్వా ఎడిసన్‌, నెల్సన్‌ మండేలా వంటి మహానుభావుల కోవలోకి చేరిపోతాం.

నిద్రించే ముందు ఏం చేయాలి?
ఉదయం త్వరగా లేవాలంటే గుర్తుంచుకోవల్సిన నియమం, ఎంతసేపు నిద్రపోయామన్నది కాదు. ఎలాంటి నిద్ర పోయామన్నది. నిరాఘాటంగా ఆరు గంటలు నిద్రపోవడం, అలజడితో పది గంటలు నిద్రపోవడం కంటే ఉపయోగకరమైంది. మరింత గాఢ నిద్రకు ఈ చిట్కాలు ఉపయోగించాలి.

నిద్రించే సమయంలో ఆ రోజు సంఘటనలన్నీ నెమరు వేసుకో కూడదు. టి.వి. చూడకూడదు. పడుకుని పుస్తకం చదవద్దు.

ఈ అలవాటు రావాలంటే కొన్ని వారాలసమయం పట్టవచ్చు. మార్పు సాధించాలంటే, ప్రయత్నం ఉండాలి. దానివల్ల కలిగే ఫలితాలు చూస్తే మనం పడిన కష్టమంతా సార్థకమే అని పిస్తుంది. దీనివల్ల ఆఫీసులో సిబ్బంది సరైన సమ యానికే వచ్చేస్తారు.

‘ఇది మన ఆఫీసేనా?’ కళ్ళు నులుముకుని చూశాడు సుగుణరావు. బాస్‌ తన సీట్లో ఆనందంగా కనిపించాడు.

‘ఎలా ఉంది మన నిద్రలేచే క్లబ్‌ ఎఫెక్ట్‌’ అడి గాడు బాస్‌.
‘సూపర్‌ సార్‌’.
‘ఇదిలా కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైన పరిష్కారం’.
‘అంతేసార్‌’
‘వెళ్లి ఇప్పుడు ఈ విషయం నోటీసు బోర్డులో పెట్టు’.
‘ఓకే సార్‌’ అంటూ పరుగు తీశాడు సుగుణరావు.

తెల్లవారి నిద్ర లేచేటప్పుడు మనం ఒక దృఢ నిశ్చయంతో లేవాలి. పడుకునేటప్పుడు మాత్రం సంతృప్తిగా నిద్రపోవాలి.

పాజిటివ్‌ థింకింగ్‌ కావాలా?
ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస నిపుణుడు రాబిన్‌శర్మ ఇలా చెబుతారు.
1. ఉదయం 5 గంటలకు నిద్ర లేచి చూడండి. ఎంత శక్తి, ఎంత ఉత్సాహం, ఎంత దమ్ము మీలో ఉంటాయో!
2. ఉదయం 5 గంటలకు నిద్ర లేవటం వలన సానుకూల దృక్పథం అలవాటు అవుతుంది.
3. ఓ కప్పు కాఫీ తాగి మీ పని మొదలు పెట్టండి.
4. ఉదయం తల స్నానం చేసి చూడండి.
5. ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. నేను నమ్మకంతో ధైర్యంతో ఉన్నాను. ఎటువంటి పరిస్థితినైనా హాయిగా ఎదుర్కోగలను. అత్యంత చాకచక్యంతో వ్యవహరించి నా లక్ష్యం చేరుకోగలను అని మనసుకి ఉదయాన్నే చెప్పుకోండి...


ఐదుకి లేస్తేనే ఆరోగ్యం :-
‘ఉదయాన్నే లేచి పెందలాడే నిద్రపోయే మనిషి ఆరోగ్యంగా, వివేకవంతుడిగా, ధనవంతుడిగా ఉంటాడు’ అంటాడు బెంజిమిన్‌ ఫ్రాంక్లిన్‌.


ఉదయాన్ని ఆనందంగా పలకరించాలంటే తెల్లారగట్టే లేవాలి. రోజుని అద్భుతంగా ప్రారంభించాలంటే ఉదయాన్నే లేవాలి. మానసిక ప్రశాంతత రోజంతా ఉండాలంటే ఉదయాన్నే లేవాలి. సూర్యోదయం మొదట నుంచీ చూడాలంటే ఉదయాన్నే లేవాలి. ఉపాహారం ఉద యాన్నే తినాలంటే తెల్లవారి లేచి, ముఖం కడుక్కుని తయారయి ఉండాలి. చక్కటి వ్యాయామం చెయ్యాలంటే ఉదయాన్నే లేవాలి. మంచి ఉత్పాదకత సాధించాలంటే ఉదయం నుంచి కష్టపడాలి. లక్ష్యాలు చేరుకోవాలంటే ఉదయం 5 గంటలకు నిద్ర లేచే క్లబ్‌లో చేరాలి. రేపట్నుంచే ఉదయం 5 గంటలకు మనలో జీవ గడియారం (బయో క్లాక్‌) ఇవ్వబోయే అలారమ్‌కి సిద్ధం కండి. లేద్దాం! ఆరోగ్యంగా ఉందాం!!

No comments:

Post a Comment