30 August 2015

కేదార నాథ్ :-
హిమాలయాలలోని కేదార శిఖరంపై విరాజిల్లే జ్యోతిర్లింగమే కేదారనాథ లింగం. కేదార శిఖరానికి పడమటి వైపున ‘మందాకిని ‘ తూర్పువైపున అలకనంద ప్రవహిస్తున్నాయి. మందానికి ఒడ్డున కేదారనాథస్వామి, అలంకనంద ఒడ్డున బదరీనారాయణ స్వామి వెలసియున్నారు. అలకనందా,మందాకిని నదులు ‘రుద్రప్రయాగలో’ కలసి కొంతదూరం ప్రవహించి ‘దేవప్రయాగ ‘ దగ్గర ‘భాగీరథి ‘లో కలుస్తున్నాయి. అందువల్ల గంగా స్నానముచేసే భక్తులు కేదారనాథ, బదరీనాథ్‌ల చరణ కమలాల నుండి వచ్చిన నీటిలో మునుగుతున్నట్లుగా భావించి పులకించిపోతారు. స్కాందపురాణంలోని కేదారఖండం ఈ కేదారేశ్వర జ్యోతిర్లింగం మహిమను గొప్పగా వర్ణించింది. ఏ భక్తుడైన కేదారనాథుని దర్శించకుండా బదరీయాత్ర చేసినట్లుయితే వాని యాత్ర నిష్ఫలమని పై పురాణం చెబుతోంది.

కేదారనాథుని దర్శించటానికి బయలుదేరిన ప్రాణి మార్గమధ్యంలో మరణించినా స్వామిని దర్శించిన పుణ్యం తప్పక లభిస్తుందని పురాణలు చెబుతున్నాయి.


కేదారనాథక్షేత్రం హరిద్వారమునకు 240 కి.మీ.లు. ఋషి కేశమునకు 211 కి.మీ.లు. 12 జ్యోతిర్లింగాలలో అత్యంత ఉన్నతమైనది కేదారనాథ్. ఇది సముద్ర మట్టానికి సుమారు 16,000 అడుగుల ఎత్తులో వుంది. 12 జ్యోతిర్లింగాలలో అతిపెద్దది కూడా ఇదే. పర్వతశిఖరమే జ్యోతిర్లింగము కనుక దీనికి పానుపట్టంలేదు. గర్భగృహాన్ని లింగాకారములో ఉన్న పర్వత శిఖరము ఆక్రమించివున్నదని చెప్పటంకంటే జ్యోతిర్లింగ రూపమైన పర్వత శిఖరం చుట్టూ ఆలయం నిర్మించబడిందని చెప్పటం బాగుంటుందేమో. ఈ జ్యోతిర్లింగంలో కైలాసపర్వతం యొక్క సూక్ష్మరూపం గోచరిస్తుంది.

కేదారనాథ్ యాత్రలో శివశక్తి స్పష్టంగా కనపడుతుంది.

యాత్రామార్గం:-

ఉత్తరప్రదేశ్‌లోని ఈ క్షేత్రానికి వెళ్ళాలంటే విజయవాడ నుండి నేరుగా ఢిల్లీ వెళ్ళి అక్కడనుండి ఋషికేశ్ దాకా రైలులో ప్రయాణించి అక్కడ నుండి 280 కి.మీ బస్సులో వెళ్ళి గుప్తకాశీని దాటి గౌరీకుండాన్ని చేరాలి. అక్కడే గౌరీదేవి ఆలయం ఉంది. అక్కడే మంచుకొండల మధ్య నిరంతరం ఒక నీటిబుగ్గలో నుండి వేడినీరు వస్తూవుంటుంది. అదే గౌరీకుండం. అక్కడే పార్వతీదేవి తపస్సు చేసింది. ఆమె సౌకర్యం కోసమే తండ్రి అయిన హిమవంతుడు ఆ తపోభూమిని ఏర్పాటు చేశాడు. అదే నేడు భక్తులకు సౌకర్యంగా వుంది. ప్రకృతిలోని విచిత్రాలలో యీ వేడినీటిబుగ్గ ఒకటి.

గౌరీకుండం నుంచి భక్తులు తప్పనిసరిగా కాలినడకనగానీ డోలీలలో గానీ పొట్టి గుఱ్ఱాలపై గానీ 14 కి.మీ.లు ప్రయాణించి కేదరనాథ్‌ను చేరాలి. గుఱ్ఱపుస్వారికి సుమారు 200 రూ.లు, డోలీకి 350 రూ.లు తీసుకుంటారు. ఉదయం బయలుదేరితే కేదరానాథ్ దర్శనము చేసుకొని సాయంత్రానికి గౌరీకుండానికి తిరిగి రావచ్చు.

రాత్రిపూట కేదరానాథ్‌లోని ఉండాలనుకొన్న యాత్రికులకు “కాలీకంబ్లీ వాలాసత్రం ” “భారత్ సాధూసమాజ్” వారి యాత్రా నివాసం, టూరిస్ట్ బంగ్లా మొదలైనవి వసతిని కల్పిస్తున్నాయి. కేదారేశ్వర వాతావరణం చాలా మనోహరంగా వుంటుంది. కానీ తరుచు హఠాత్తుగా మబ్బులు కమ్మి వడగండ్లతో వాన పడుతుంది.

పురాణగాథ:-
నరనారాయణులు గొప్ప తపస్సంపన్నులు. వారిద్దరూ విష్ణుమూర్తి యొక్క అవతారములు. ఆ మహర్షులు బదరికాశ్రమంలో చాలా సంవత్సరాలు తపస్సు చేసి జగత్తుకు మేలు కలగాలన్న కోరికతో కేదార శిఖరంపై శివుని ఆరాధించటం మొదలుపెట్టారు.

వారిద్దరూ ప్రతిరోజు ప్రభాత కాలంలో మందాకినిలో స్నానం చేసి ఈశ్వరుని పార్థింప లింగములను నిర్మించుకొని భక్తితో పూజ చేసేవారు. మందాకిని నీటితోనూ పవిత్రమైన బిల్వప్రతితోనూ చక్కగా వికసించిన తామర పువ్వులతోనూ వారిద్దరూ ప్రతిరోజు మిక్కిలి శ్రద్ధతో శివుని పూజించేవాళ్ళు.

ఇలా కొంతకాలం గడిచాక పరమశివునికి నరనారాయణులపై కరుణ కలిగి వారికి సాక్షాత్కరించాడు. అప్పుడు వారిద్దరు శివునికి సాష్టాంగ నమస్కారములు చేసి ఏంతగానో స్తుతించారు. ప్రసన్నుడైన శివుడు వారిని వరం కోరుకోమన్నాడు. అప్పుడు వారిద్దరు చేతులు జోడించి “మృత్యుంజయా ! జగత్ కళ్యాణం కోసం మేము నిన్ను ఆరాధించాము. నీవు మమ్ము అనుగ్రహించావు. ఇక ముందుకాలములో కూడా నిన్ను ఇక్కడ సేవించినవారికి కోరికలు నెరవేరుస్తూ ఈ శిఖరం మీదనే ‘కేదారేశ్వరుడు ‘ అనే పేరుతో నిలిచివుండు. నిన్ను దర్శించి స్తుతించిన భక్తులు తరిస్తారు. ఇదే మా కోరిక” అని ప్రార్థించారు. 

పరమశివుడు వారి కోరికను మన్నించి కేదారనాథ్ జ్యోతిర్లింగ రూపంలో అక్కడే ప్రకాశిస్తున్నాడు.
ఈ స్వామిని కృతయుగంలో నరనరాయణులు, త్రేతాయుగంలో ఉపమన్యు మహర్షి, ద్వాపర యుగంలో పాండవులు పూజించి ధన్యులయ్యారు. కేదారనాథ్ దేవాలయంలో పాండవులు శిలావిగ్రహాలను మనం చూస్తాం.

No comments:

Post a Comment