30 August 2015

ఒంటరితనం / వయోభారం :-

ఈ శతాబ్దం మొదట్లో అంటే 2001లో భారతదేశంలో వృద్ధులు ఏడు కోట్ల మంది. మరో ఇరవై సంవత్సరాలకి అంటే 2021 నాటికి సీనియర్ సిటిజన్స్ రెండింతలవుతారని అంచనా. అంటే, ఇంకో ఆరేళ్లలో మన దేశ జనాభాలో పద్నాలుగు కోట్లమంది వయోవృద్ధులే ఉంటారన్నమాట. 

ప్రస్తుతానికి మాత్రం ప్రతి ఎనిమిది మందిలో ఒకరు వయోవృద్ధులే. ప్రపంచంలో ఆరోగ్య వ్యవస్థ గతంకన్నా మెరుగ్గా ఉండటంవల్ల వృద్ధుల సంఖ్య గణనీయమవుతోంది. జనాభాతోపాటు వీరి ఒంటరితనమూ పెరుగుతోంది. ఈ రోజు శారీరకంగా అనే కాదు మానసికంగానూ, ఉద్రేకపడటం మూలంగాను వయోవృద్ధులలో ఒకవిధమైన నైరాశ్యత నెలకొంది. పిల్లలు దగ్గిర లేకపోవటం అన్నది ఈ వయసువారికి ప్రధాన సమస్య.


సంతానం విదేశాలలో స్థిరపడిపోవటం అన్నది ఈనాటి వృద్ధమూర్తుల బెంగ. దీనే్న మనం ‘ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్’ అంటుంటాం. అంటే వృద్ధదంపతులు బాహ్యానికి బాగానే కనిపిస్తున్నా అంతరాంతరాలలో శూన్యం నెలకొని ఉంటుంది. అంటే, ఈ ఒంటరితనంతో ఇంకా బ్రతికి ప్రయోజనం ఏమిటి? అన్న నైరాశ్యత. లంకంత ఇంట్లో వేధించే ఒంటరితనానికి పత్రికలు, న్యూస్‌పేపర్లు, టీవీ షోలు-ఇవేనా సమాధానాలు?

కొందరి పిల్లలైతే స్వదేశంలోనే ఉంటారు. కానీ ఉద్యోగాల పేరిట ఏయే రాష్ట్రాలలోనో ఉంటుంటారు. 

చుట్టపుచూపుగా తల్లిదండ్రుల్ని వచ్చి చూసి పోతుంటారు. మరికొన్ని కుటుంబాల సంతానమైతే ఒకేచోట ఉన్నా ‘తమకు కావలసిన స్పేస్ ఉండటంలేదని, ప్రైవసీ ఉండటంలేదని, తమకు స్వేచ్ఛ లేదని, తాము స్వతంత్రంగా తమకిష్టమైన రీతిన ఉండలేకపోతున్నామని అనటం మనం చూస్తున్నాం, వింటున్నాం.
ఇవేవీ కాదనలేని కారణాలు కాదు. రెండు తరాల మధ్య ఒక అండర్‌స్టాండింగ్ లేకపోవడంతో కుటుంబ వ్యవస్థ బద్ధలైపోతోంది. ఫలితంగా వయోవృద్ధులకు ఒంటరితనం తప్పటంలేదు. తమ ఆలోచనలను పంచుకునే ఆత్మీయులు దగ్గిర లేకపోవటం, తమను భౌతికంగానే కాదు మానసికంగాను అక్కున చేర్చుకునే సంతానం పట్టనట్టు ఊరుకోవటం, తమ నిత్య వ్యవహారాలను చూసుకునే శక్తి తమలో తగ్గిపోతుండటం- కనీసం పనివారితోనైనా కాలక్షేపం చేద్దామనుకుంటే వారూ కరువైపోతుండటం- సీనియర్ సిటిజన్స్‌ను కృంగదీస్తున్న సమస్యలు.

కొందరు వృద్ధులు ఎంతలా వయసు పైబడుతున్నా ఇంకా గతంలోనే జీవిస్తుంటారు. అంటే ఇంకా గత వైభవానే్న ఆశిస్తుంటారు. ఆ అధికార దర్పం నుండి బయటపడరు. పైగా తమ మాటనే నెగ్గాలనుకుంటారు. ఈ నేపథ్యంలో అదృశ్యంగా ఉమ్మడి కుటుంబాలలో ఆక్సిడెంట్స్ జరిగిపోతుంటాయి. రెండు తరాలమధ్య అంతరాలు పెరిగిపోతుంటాయి. పలుకే బంగారమయిపోతుంటుంది. వయోవృద్ధులు తమ స్పేస్‌లో తాము ఉంటుంటే తరువాతి తరం తమ స్పేస్ తమకు ఉండాలంటూ జాగ్రత్తపడుతుంటారు.
తొలితరం తమ గతంనుండి తప్పుకోలేక మలి తరాన్ని లెక్కించకపోవటమూ జరుగుతుంటుంది. అందుకే మలితరం తొలి తరం నుండి తప్పుకుంటుంటుంది. ఫలితంగా తొలితరానికి ఒంటరితనం తప్పటంలేదు. దీన్ని జీర్ణం చేసుకోలేక ‘టు బి ఫర్‌గాటన్ బై ఎవ్విరిబడి ఈజ్ వర్స్ దేన్ డెత్’ అని అనుకుంటుంటారు. దీంతో వయసు మీరుతున్నకొద్దీ బ్రతుకు మరింత భారం అవుతుంటుంది.

మరో కోణం :-
‘స్టేయింగ్ ఎలోన్’ అంటే ఒంటరితనం కాదు.. వొంటరిగా ఉండటం. ఒంటరితనం మీదపడ్డదైతే వొంటరిగా ఉండటం ఏరికోరి ఆహ్వానించింది. దీనికి కారణం స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఉండాలనుకోవటం. ఈ నిర్ణయానికి వచ్చిన సీనియర్ సిటిజన్స్ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటుంటారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవటానికి సంసిద్ధమై ఉంటారు. ఒక విధంగా తమ కుటుంబాలకు, తమ పిల్లలకు భారం కాకూడదన్న నిర్ణయమూ ఈ వొంటరితనాన్ని అభిలషించటానికి ఒక కారణమే... కాదనలేని వాస్తవం.
ఏది ఏమైనప్పటికీ వృద్ధాప్యంలో ఒంటరిగా ఉంటూ తమ స్వేచ్ఛను, తమ స్వాతంత్య్రాన్ని అనుభవిస్తూ ఆనందించటం ఒక విధంగా మంచి పరిణామమే.. ఒక విధంగా వయసుతో పాటు పెరిగిన మెచూరిటీగానే చెప్పుకోవచ్చు. మొత్తానికి తమ కిష్టమైన రీతిన జీవించాలన్న మనస్తత్వం ఈ ఉద్దేశాల నేపథ్యం. దీనే్న ‘ట్రైయింగ్ టు లివ్ ఇన్ దైర్ ఓన్ టర్మ్స్’ అని చెప్పుకోవచ్చు.


ఆమధ్య ఒంటరిగా ఉంటున్న ఎనభై ఏళ్ళ వృద్ధురాల్ని కలిసినపుడు అడిగారు :- ‘‘ఏదైనా జరగరానిది జరిగితే ఎలా?’’ అని. ఆమె తడుముకోకుండా ‘‘మహా అయితే ఏమవుతుంది. పోతాను, అంతే కదా. ఆ తర్వాత జరగాల్సింది జరుగుతుంది. దాని గురించి ఇప్పట్నించే బెంగపడటం ఎందుకు?’’ అంది. ఆమె మాటల్లోని ఆత్మవిశ్వాసాన్ని, నిజం చెప్పొద్దూ, సమకాలీన వ్యవస్థలో సన్యసించాం, మహాత్ములమైపోయాం అని చెప్పుకునే ఆధ్యాత్మికపరులలో సైతం చూడలేదు. నిజమే కదా- చావుకు భయపడుతున్నంతకాలం అడుగు తీసి అడుగువేయాలన్నా చావుకొస్తుంటుంది. మృత్యువు భయంతో బ్రతుకు సాగించేవారికి తాడూ పాములాగే భయపెడుతుంటుంది. వీరికి ప్రతిదీ అన్‌టువార్డ్ ఇన్‌సిడెంట్‌గానే కనిపిస్తుంటుంది.

ఈ నేపథ్యంలోనే మరో వృద్ధ జంట గురించి చెప్పుకోవాలి. వీరు ఏడు పదులలోనివారే. ఒకరికి ఒకరు తోడు. అయినా ఒకలాంటి డిప్రెషన్. పిల్లలు దగ్గిర లేరే అని బాధ. ఎప్పుడూ ఏదో అసంతృప్తి. పెద్దవారు కదా అని బంధువర్గంలోని వారు ఎవరో ఒకరు వచ్చి - చూసి- పలకరించి పోతుంటారు. ఇరుగువారు పొరుగువారు సాయంత్రాలు పలకరిస్తూనే ఉంటారు. అయినా ప్రతి దినాన్ని భయం భయంగానే గడుపుతుంటారు. నిజానికి ఇటువంటివారి విషయంలోనే అన్‌టువార్డ్ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఏ జ్వరమో, జలుబో నెలకొకసారి పలకరిస్తూ భయపెడుతుంటుంది. అందుకే ఎంతలా దేవుళ్ళకు మొక్కుతున్నా ఆ దేవతలు సైతం వీరికి సహాయం చేయటానికి భయపడుతుటారు. కారణం వీరు పూజలు సైతం భయంతోనే చేస్తుంటారు కాబట్టి.

వీరిని కలిసినప్పుడు ఉండబట్టలేక అడిగారు :- ‘‘మీరు మీ పిల్లలు దగ్గర లేరని.. పిల్లల్ని కనీ ఒంటరిగా ఉండాల్సి వస్తోందని అనుకుంటున్నారు కదా.. మరి మీరు మాత్రం మీ తల్లిదండ్రుల్ని వదిలి వేరే ప్రాంతాలలో ఉద్యోగాలు చేయలేదా’’ అని. సమాధానం చెప్పటానికి బదులు మామ్మగారు ఏదోపని ఉన్నట్లు వంటింట్లోకి జారుకున్నారు. ముందున్న పెద్దాయన పేపర్లోకి తలదూర్చి ఓ ఐదు నిమిషాల తర్వాత టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడటం ప్రారంభించారు.

మొదటి వృద్ధ మహిళ ఎంతో తృప్తిగా ‘ప్రతీగంటకీ ఎవరో ఒకరు వచ్చి అమ్మగారూ అంటూ పలకరిస్తుంటారు. ఆ పలకరింపు నాకెంతో ధైర్యాన్నిస్తుంటుంది. చుట్టుప్రక్కలనున్న వంద గడపలవారూ నాకూ ఆత్మీయులే.. నావారే.. బంధుజనం అందుబాటులో లేకపోయినా ఈ వందమంది పలకరింపులే నాకు వందేళ్ళ ఆయుష్షు’ అంటుంటే ఆమె నిర్భయత్వానికి, సడలని ఆత్మస్థైర్యానికి, పాజిటివ్ ఆటిట్యూడ్‌కి ‘హాట్సాఫ్’ అనుకుంటూ వినమ్రంగా మనసులో నమస్కరించాను.

రీసెంట్‌గా ఒక బంధువు ఇంటికి వెళ్లాను-ఆ కుటుంబంతో బంధుత్వాన్ని మించిన స్నేహం నాది. ఆ డెబ్భై ఏడేళ్ళ పెద్దాయనని బాబాయ్ అని పలకరిస్తున్నా మిత్రుడితో మాట్లాడుతున్నట్లే మాట్లాడుతుంటాను. ఇంతకీ అసలు విషయం నేను వెళ్లేటప్పటికి వృద్ధదంపతులిద్దరూ ఇంట్లో కొడుకు కోడలు ఉద్యోగాలికి ఉదయం తొమ్మిదింటికే వెళ్లిపోయారు.. మనవడు కాలేజీకి, మనవరాలు స్కూల్‌కి. మొత్తానికి పిన్ని మా ఇద్దరికీ వడ్డించింది. ఇంతలో మనవరాలు స్కూల్ నుండి వస్తే ఆ అమ్మాయికి మరీ కలిపి తినిపించింది. ఆ తర్వాత కానీ తాను తినలేదు.

ఊరుకోక ‘‘ఎందుకు పిన్నీ, పాపకు కలిపిపెట్టడం... తన కలుపుకు తినగలదు కదా’’ అని అంటే, వెంటనే ‘నేనూ బాబాయ్ ఉద్యోగాలకెళ్తే ఇంట్లో ఉన్న పిల్లలకి కలిపి పెట్టాలనే ధ్యాస.. కనీసం వడ్డించాలనే ధ్యాస... ఇంట్లో ఉన్న పెద్దలకి ఉండేదికాదు. నాకేమో నా పిల్లలకి దగ్గరుండి పెట్టలేకపోతున్నాననే అన్న బాధ వేధిస్తుండేది. కానీ నేను కూడా ఉద్యోగం చేస్తేకానీ ఇల్లు గడవని పరిస్థితి. అలాగే బాబాయ్‌కి మధ్యాహ్నాలప్పుడు నేనుదగ్గరుండి కడుపారా పెట్టలేకపోయేదాన్ని. అందుకే ఇప్పుడు ఓపిక లేకపోయినా మనస్ఫూర్తిగా ప్రతీ పని చేస్తున్నా.. నాలా నా కోడలు ఉద్యోగం చేస్తోంది కదా. తనకూ తన పిల్లల్ని దగ్గరుండి చూసుకోలేకపోతున్నాననే బాధ ఉంటుంది కదా. అందుకే నేను పడ్డ బాధ నా కోడలు పడకూడదని నేననుకుంటా’’ అంది.
 భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకెళ్తూ ఏదో సుఖపడిపోతున్నారన్న భ్రమల నుండి తొలగి వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోగలిగితే ఉమ్మడి కుటుంబాలలో రాద్ధాంతాలు తగ్గి, ఏడుపులు పెడబొబ్బలు తగ్గి కళకళలాడుతూ ఉండవచ్చు. సరిగ్గా అర్థం చేసుకోలేక, అనవసరమైన అహంకారాలకి పోయి, అయినదానికీ కానిదానికీ భూతద్దంలో చూస్తూ భూతంలా భ్రమిస్తుండటంవల్లనే కదా జాయింట్ ఫామిలీస్ న్యూక్లియర్ ఫామిలీస్‌గా విడివడిపోతోంది.

అసలు, ఏ తరం స్పేస్‌లో ఆ తరం ఉండగలిగితే స్వేచ్ఛ పేరిట, ప్రైవసీ పేరిట ఎక్కడికో పరుగులు పెట్టక్కర్లేదు. మైండ్ కల్చర్, వర్క్ కల్చర్‌లకు సరైన అర్థాలు తెలిస్తే కనుక ప్రతీ కుటుంబమూ స్వర్గ్ధామమే అవుతుంది.


No comments:

Post a Comment