13 October 2015

ధ్యానం :-

• ఫిట్‌నెస్ మంత్ర :-
రోజువారీ ఒత్తిళ్లు, అలసట.. వంటివి తగ్గించి మానసికోల్లాసాన్ని అందించే అద్భుతమైన ప్రక్రియ 'ధ్యానం'. అందుకే చాలామంది వ్యాయామం, యోగా.. వంటి వాటితో పాటు మెడిటేషన్‌కి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే ఇది ఒంటరిగా చేయడం కంటే బృందంగా చేస్తే మరిన్ని అదనపు ప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల అనుకూల వాతావరణం ఏర్పడడంతో పాటు ఉత్సాహం, పనిమీద శ్రద్ధ.. వంటివి రెట్టింపవుతాయని వారంటున్నారు. మరి 'బృంద ధ్యానం (గ్రూప్ మెడిటేషన్)' వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలేంటో మనం కూడా తెలుసుకుందామా..!

• మనసు లగ్నం చేయచ్చు :-
మెడిటేషన్ అంటే.. 'హమ్మయ్య.. ఇవ్వాల్టికి పని పూర్తయింది..' అన్నట్లుగా కాకుండా దానివల్ల కలిగే ప్రయోజనాలన్నీ పొందేలా చేయాలి. అందుకు చుట్టూ ఉండే పరిస్థితులు కూడా అనుకూలించాలి. ఇంట్లో టీవీ సౌండ్, కుటుంబ సభ్యుల మాటలు, ఇంటి చుట్టూ వాహనాల శబ్దాలు.. చుట్టూ ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు మెడిటేషన్ చేయడం సరైనది కాదు.. పైగా చుట్టూ ఇలాంటి పరిస్థితులున్నప్పుడు మెడిటేషన్‌పై శ్రద్ధ కూడా క్రమంగా క్షీణించే అవకాశం ఉంటుంది. కాబట్టి చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకొని, కుటుంబ సభ్యుల్ని కూడా అందులో భాగస్వాముల్ని చేయాలి. ఇలా అందరితో కలిసి మెడిటేషన్ చేస్తుంటే మీకు దానిపై మరింత ఆసక్తి, ఉత్సాహం పెరుగుతాయి.

• ఆందోళన దూరం :-
ఒంటరిగా కంటే బృందంతో కలిసి ధ్యానం చేయడం వల్ల మానసిక ఆందోళనలు, ఒత్తిళ్ల నుంచి త్వరగా విముక్తి పొందచ్చంటున్నారు నిపుణులు. దీనివల్ల నాడీవ్యవస్థపై ఒత్తిడి పడకుండా ఉండడంతోపాటు కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా రక్తపోటు అదుపులో ఉండి.. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే అందరితో కలిసి ధ్యానం చేయడం వల్ల అందరితో బాగా కలిసిపోవచ్చు.. మీకున్న బాధలు, సమస్యలు.. వంటివి ఇతరులతో పంచుకోవచ్చు. తద్వారా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.

• క్రమం తప్పకుండా :-
కొంతమంది ఇంట్లో పనుల వల్లనో లేదంటే బద్ధకించో క్రమం తప్పకుండా చేయాల్సిన కొన్ని పనుల్ని వాయిదా వేస్తుంటారు. అందులో వ్యాయామం, మెడిటేషన్.. వంటివి కూడా ఉండచ్చు. 'అబ్బ ఈ రోజు ఇంట్లో కాస్త ఎక్కువ పనుంది.. రేపటి నుంచి చేద్దాంలే..' అంటూ రోజూ ఆ పనులను వాయిదా వేస్తూ ఉంటారు. ఇలా రోజూ చేస్తూ పోతే కొన్ని రోజులకు దానిపై ఉండే ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది. తద్వారా మానసిక ఒత్తిడి తగ్గడానికి బదులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా వాయిదా వేయకుండా మీ మనసును కంట్రోల్ చేసుకొని రోజూ మెడిటేషన్ చేసే అలవాటు చేసుకోవాలి. ఇందుకోసం ఒంటరిగా చేయడం కంటే మెడిటేషన్ శిక్షణ తరగతుల్లో చేరడం ఉత్తమం. తద్వారా రోజూ తరగతి ఫలానా సమయానికి ఉంటుంది కాబట్టి కచ్చితంగా ఆ సమయానికి అక్కడికి వెళ్లి అందరితో పాటు మెడిటేషన్‌లో పాల్గొనచ్చు. తద్వారా క్రమం తప్పకుండా మెడిటేషన్ చేసి.. అన్ని ప్రయోజనాలనూ పొందచ్చు.

• ఆరోగ్యానికి మేలు :-
అందరితో కలిసి ధ్యానం చేయడం వల్ల దానిపై ఆసక్తి పెరుగుతుంది. అంతేకాదు.. అందరూ కలిసి నిపుణులు ఇచ్చే సూచనల ప్రకారం ముందుకెళ్లచ్చు. ధ్యానంలో భాగంగా గట్టిగా గాలి పీల్చి వదిలే క్రమాన్ని సరిగ్గా చేస్తే శరీరంలోని విషపదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. ఫలితంగా శరీరం శక్తిమంతమవుతుంది. అలాగే ఈ ప్రక్రియ వల్ల శరీరంలోని అన్ని అవయవ వ్యవస్థల పనితీరు మెరుగుపడుతుంది. కాబట్టి ఇలా బృందంతో కలిసి నిపుణుల ఆధ్వర్యంలో ధ్యానం చేయడం వల్ల దానిపై ఆసక్తి పెరగడమే కాకుండా.. రోజంతా ఉల్లాసంగా ఉండచ్చు.

• సలహాలు.. సూచనలు :-
ఒంటరిగా మెడిటేషన్ చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే ఆ ప్రక్రియ బోరింగ్‌గా అనిపించచ్చు. దీంతోపాటు కాసేపు ధ్యానం చేశాక నిద్ర కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పైగా మిమ్మల్ని ఎవరూ పర్యవేక్షించరు కాబట్టి మీరు కూడా దానిపై శ్రద్ధ వహించకపోవచ్చు. కాబట్టి బృందంతో కలిసి చేస్తే.. చుట్టూ అందరూ ఉంటారు.. పర్యవేక్షించేవారు కూడా ఉంటారు కాబట్టి వారిని చూసి చేయాలనే ఆసక్తి కలుగుతుంది. అలాగే శిక్షణనిచ్చే నిపుణులు, తోటివారి నుంచి తగిన సలహాలు, సూచనలు కూడా తీసుకోవచ్చు. అలాగే గ్రూప్‌తో కలిసి మెడిటేషన్ చేయడం వల్ల ఆ ప్రక్రియ బోర్ కొట్టకుండా కూడా ఉంటుంది.
చూశారుగా.. బృందంతో కలిసి ధ్యానం చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో! అయితే ధ్యానం కోసం శిక్షణ తరగతులకు వెళ్లే తీరిక లేనివారు కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని, లేదంటే చుట్టుపక్కల వారిని.. కలుపుకొని ధ్యానం చేయచ్చు. తద్వారా ఆశించిన ఫలితాన్నీ పొందచ్చు.

No comments:

Post a Comment