15 October 2015

రాణి రుద్రమదేవి :-

భరతఖండం చరిత్ర గర్భంలో ఎన్నో కోణాలు, దృక్కోణాలు. తరచి చూడాలన్న తపన ఉండాలే కానీ చరిత్రపుటల్లో ఎన్నో అద్భుతాలు, సాహస గాథలు కళ్ళముందు సాక్షాత్కరిస్తాయి, ఆవిష్కృతమవుతాయి. క్రీస్తుకు పూర్వం నుంచే అనూహ్యమైన, సువిశాల రాజ్యాలు, సామ్రాజ్యాలు అనేకం అవిర్భవించాయి. రాజుల పాలనలో ప్రముఖంగా కన్పించేవి కుట్రలు, కుతంత్రాలు, పోరాటాలు, యుద్ధాలు. ప్రవహించేవి సామాన్యుల రక్తపుటేర్లు. వినిపించేవి ప్రజల అరణ్యరోధనలు, హాహాకారాలు.

అయితే ఆ కాలంలో కూడా దట్టంగా అలుముకున్న కారు చీకట్ల లోనూ అరుదుగానైనా కొన్ని కాంతి పుంజాలున్నాయి. సుపరిపాలనను అందించిన మహారాజులూ, మహా రాణులూ ఉన్నారు. శత్రు దుర్భేద్యమైన సైన్యాలు నిర్మించి, సుభిక్షమైన స్వర్ణయుగాలు స్ధాపించిన చక్రవర్తులూ, ప్రభువులూ ఉన్నారు. ఒక్కసారి గంతంలోకి తొంగిచూస్తే భరత ఖండాన్ని ఎన్నో రాజ వంశాలు, ఎందరో సామ్రాట్ లు, ఎందరో రాజాధి రాజులు ఎందరో మహా రాజులు పాలించినట్టు మనకు అవగతమవుతుంది. ఒక్కో వంశంలో అనేక మంది రాజులు, రారాజులు. ఒక్కొక్కరిది ఒక్కో విశిష్టమైన, వైవిధ్యమైన పాలన. ఒకరు ప్రజలను నానా హింసలకు గురిచేసి నరహంతలై పీక్కుతింటే మరొకరు అదే ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకున్నారు. ఒకరు తమ మతం తప్ప పర మతాలు పనికి రావని మత మార్పిళ్ళకి పాల్పడి సామాజిక, సాంస్కృతిక బీభత్సం సృష్టిస్తే, మరి కొందరు సర్వమతాల సారం ఒకటేనని చాటారు. మత సహనాన్ని బోధించారు, పాటించారు. కొందరు రాజులు కరకు కత్తులతోనే పాలన సాగించారు. కానీ మరికొందరు మాత్రం శాంతి, ప్రేమ, పూదోటలు వేశారు. కొందరు రాజులు ప్రజలను కేవలం పన్నులు చెల్లించేవారుగా, బానిసలుగా చూశారు. కానీ మరికొందరు మాత్రం ప్రజా సంక్షేమమే ఊపిరిగా బతికారు. ఆధునిక పాలకులకు సైతం ఆదర్శప్రాయమయ్యారు. ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారు. యావత్ తెలుగునాడును ఏకం చేసి, సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి సుభిక్ష పాలనను అందించిన కాకతీయవంశ గజకేసరి, సామ్రాజ్ఞి..రాణీ రుద్రమదేవి.

జనరంజక పాలన :-
రుద్రమదేవి పాలన ప్రజారంజకమై భాసిల్లింది. శాంతి, సుస్థిరతలతో విరాజిల్లింది. దాదాపు ఎనిమిది వందల ఏళ్ళ క్రితమే ఆమె సమాజంలో బలంగా వేళ్ళూనిన పురుషాధిక్యంపై సవాలు విసిరింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అన్న పురుషాధిక్యం తలలు వంచింది, అందరి నోళ్లు మూయించింది.


కాకతీయుల పాలనా కాలం :-
తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాలతో పాటు ఇప్పటి కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లలోని చాలా భాగాలు రుద్రమ సామ్రాజ్యంలో అంతర్భాగాలయ్యాయి. బలవంతులదే రాజ్యమన్న మధ్యయుగాల్లోనే ఈమె దక్షిణాపథంలో సువిశాల మహాసామ్రాజ్యాన్ని నెలకొల్పింది. కాకతీయుల రాజధాని ఓరుగల్లు నగరం. రాణీరుద్రమ తనదైన శైలిలో, అరుదైన రీతిలో పాలన సాగించింది. ప్రజలను, ముఖ్యంగా మహిళలను ఆమె అర్థం చేసుకున్నట్టుగా ఏ ఇతర రాజలూ అర్థం చేసుకోలేదు. ఆమె సాహసానికీ, ధీరత్వానికీ, తెగువకూ, పాలనా దక్షతకూ మారుపేరుగా నిలిచింది. తెలుగు మహిళ పాలనా పటిమను- తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసింది. అందుకే ఇప్పటికీ రాణీ రుద్రమ పేరు వింటేనే తెలుగు వారి ఒళ్ళు గగురుపొడుస్తుంది. తెలుగు జాతి రోమాంచితమవుతుంది.


శత్రువుల పాలిట సింహస్వప్నం :-
అసమాన పరాక్రమశాలి రాణీ రుద్రమదేవి. ఆమె కాకతీయ పాలకుల వైభవానికి సమున్నత కేతనమై నిలిచింది. రుద్రమ్మ తన భుజ శక్తి, ధీయుక్తితో శత్రువుల పాలిట సింహ ప్వప్నమైంది. ఆనాడే స్త్రీ సాధికారతను అమలు చేసిన మహారాణి ఆమె. అంతశ్శత్రువుల, బైటి శత్రువుల కుట్రలు, కుతంత్రాలెన్నో సమర్థంగా ఎదుర్కొన్న వీరవనిత. సామ్రాజ్యాన్ని దక్షణాన తమిళనాడులోని కంచి నుంచి ఉత్తరాన ఛత్తీస్ గఢ్ బస్తర్ సీమ వరుకు, పడమరన బెడదనాడు నుంచి తూర్పున సముద్రం వరకు, ఈశాన్యంలో గంజాం.. అంటే అస్సాం వరకు కాకతీయ సామ్రాజ్యం విస్తరింపజేసింది.


మూల పురుషుడు కాకర్త్య గుండ్యన :-
క్రీ.శ. 1083 నుంచి 1323 వరకు దాదాపు 250 ఏళ్ళపాటు తెలుగు నేలనేలింది కాకతీయ వంశం. వీరికాలంలోనే తెలుగునాడంతా ఒకే తాటిమీదకు వచ్చింది. వీరి కాలంలోనే త్రిలింగ, ఆంధ్ర పదాలకు ఒక అర్థం, పరమార్థం ఏర్పడ్డాయి. దేశపరంగా, జాతిపరంగా కూడా ఎంతో ప్రచారంలోకి వచ్చాయి. ఈ వంశానికి మూలపురుషుడు కాకర్త్య గుండ్యనుడు.


ఈ వంశంలో సప్తమ చక్రవర్తి అయిన గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు, పుత్ర సంతానం లేదు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు తలొగ్గిన ఆయన, రెండవ కుమార్తె రుద్రమదేవినే కుమారుడిగా పెంచాడు, అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతిదేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినపుడు ఆమె వయసు పధ్నాలుగేళ్ళే. అప్పటి నుంచి ఆమె తండ్రి చాటు బిడ్డగా దాదాపు పాతికేళ్ళ పాటు పాలన సాగించింది. ఆమె ఆడపిల్లన్న నిజాన్ని చాలా కాలం పాటు రహస్యంగా ఉంచారు. అనంతరం రుద్రమదేవి చక్రవర్తిగా 1262 నుంచి 1289 వరకు అంటే ఇరవైఏడేళ్ళ పాటు అప్రతిహతంగా పాలన సాగించింది. సువిశాలమైన భూభాగాన్ని ఒక మహిళగా అసమాన ధైర్యసాహసాలతో ఎంతో సమర్థవంతంగా పరిపాలించడం వల్ల ఈ కాలం తెలుగువారి చరిత్రలో ఒక సువర్ణధ్యాయంగా నిలిచిపోయింది.

ప్రతికూల పరిస్థితులను అధిగమించి :-
రుద్రమదేవి పాలనాకాలమంతా యుద్ధాలతోనే గడిచింది. తొలుత స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్నిసహించలేని సామంతులనుంచి, దాయాదులనుంచి ఆమెకు తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యింది. తండ్రి గణపతి దేవుని కాలంలో సామంతులుగా ఉన్న రాజులు రుద్రమ సింహాసనం అధిష్టించగానే ఎదురుతిరిగారు. తిరుగుబాట్లు లేవదీశారు. అయితే ఈ విపత్తులన్నింటినీ ఆమె సమర్థవంతంగా ఎదుర్కొంది. అదే సమయంలో దేవగిరి యాదవ మహదేవుడు ఎనిమిది లక్షల మహాసైన్యంతో రుద్రమ పైకి దండెత్తి వచ్చాడు. మహదేవునిపై పది రోజులకు పైగా జరిగిన భీకర పోరాటంలో రుద్రమ ప్రత్యక్షంగా పాల్గొన్నది. తన అపార శక్తి సామర్థ్యాలతో అపరభద్రకాళిలా విజృంభించింది. ఆమె తన చిరకాల ప్రత్యర్థి మహదేవుడ్ని ఆ యుద్ధంలో మట్టికరిపించి మూడు కోట్ల బంగారు వరహాలను పరిహారంగా గ్రహించింది. ఆ విధంగా శత్రువును ఆర్థికంగా చావు దెబ్బకొట్టి మళ్ళీ తలెత్తకుండా చేసింది. తరువాత 1262 సంవత్సరంలో తూర్పున గంగ నరసింహదేవుడు వేంగి ప్రాంతాన్ని ఆక్రమించాడు. కాని రుద్రమ సేనా నాయకులైన పోతినాయకుడు, ప్రోలినాయకుడు వీరిని ఓడించి తిరిగి అక్కడ కాకతీయుల అధికారం నెలకొల్పారు.


రుద్రమ జరిపిన పోరాటాలన్నింటిలో ఆమెకు బాసటగా నిలిచిన సేనానులు చరిత్రలో చిరస్మరణీయులయ్యారు. వీరిలో గోన గన్నారెడ్డి, రేచర్ల ప్రసాదాదిత్యుడు, రుద్రనాయకుడు, జన్నిగదేవుడు, త్రిపురాంతకుడు, బెండపూడి అన్నయ్య ముఖ్యులు. రుద్రదేవుడి రూపంలో ఉన్న రుద్రమ పట్టోధృతి అంటే రాజప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దేశమంతా కలియ దిరిగింది. ప్రజాసమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుంది. యువరాజుగా ఆమె ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించింది. రాజ్యంలో ఒక చోట ఒక తల్లి కాన్పులోనే కన్ను మూయడం చూసి రుద్రమ తల్లడిల్లింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకండా సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ''మహామంత్రీ.. గ్రామగ్రామాన ప్రసూతి వైద్యశాలలు కట్టించండి. ఇక పై మన రాజ్యంలో ప్రసవ సమయంలో ఒక్క మాతృమూర్తి కూడా మృత్యువాత పడడానికి వీల్లేదు.'' అని ప్రకటించింది.

మార్కోపోలో ప్రశంస :-
ఇటలీ దేశ రాయబారి మార్కో పోలో 1293 సంవత్సరంలో కాకతీయ రాజ్యంగుండా ప్రయాణించి గోల్కొండను సందర్శించాడు. గోల్కొండ ఆ కాలంలో కాకతీయులకు సైనిక కేంద్రంగా ఉండేది. మార్కో పోలో రుద్రమదేవిని అత్యంత సమర్థురాలైన, పాలనాదక్షతగల చక్రవర్తిగా అభివర్ణించాడు.


ప్రజాసేవలో :-
రుద్రమదేవి పాలన గురుంచి, ఆనాటి కాలమాన విశేషాల గురించి తెలిపే సరైన చారిత్రక ఆధారాలు గానీ, శిలా శాసనాలు గానీ పెద్దగా లేవు. రెండున్నర శతాబ్దాలపాటు నిర్విఘ్నంగా సాగిన కాకతీయుల పాలనపై సమగ్ర పరిశోధనలు జరగాల్సి ఉంది. రుద్రమదేవి పాలనలో అప్పటి ప్రధాన రంగమైన వ్యవసాయం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లింది. సాగునీటి కొరత లేకుండా సువిశాలమైన చెరువులు తవ్వించారు. వేలాది ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువులను ఆ రోజుల్లో సముద్రాలుగా వ్యవహరించేవారు. వీరి కాలంలో వ్యవసాయంతో పాటు వాణిజ్యం కూడా విస్తరించింది, విరాజిల్లిది.


తిక్కనామాత్యుడు :-
మనుమసిద్ధి ఆస్థాన మహాకవి, కవిత్రయంలో ఒకరైన తిక్కనామాత్యుడు తమ రాజ్యం శత్రువుల వశం కావడంతో తమ ప్రభువుల రాయబారిగా రుద్రమను ఆశ్రయించాడు.


కట్టడాలకు, కళలకు నిలయం :-
శత్రుదుర్భేద్యమైన ఓరుగల్లు కోట, వేయి స్తంభాల గుడి, పాలంపేటలోని రామప్ప గుడి, భద్రకాళి ఆలయం, ఘణపురం కోటగుళ్ళు కాకతీయుల శిల్పకళా పోషణకు, నైపుణ్యానికి చక్కని తార్కాణం. భరతనాట్యం, కూచిపూడి వంటి సంప్రదాయ నృత్యాలకు ధీటైన పేరిణి శివతాండవమనే నూతన నృత్య విధానం పురుడుబోసుకుంది రుద్రమ కాలంలోనే. కాకతీయుల సైన్యాధిపతి అయిన జయాప సేనాని పేరిణి నృత్య సృష్టికర్త. రుద్రమదేవి కాలంలో సంగీతం, సాహిత్యం, శిల్పకళ, నృత్యం కలగలసిపోయి విరాజిల్లాయి.


వీరభద్రునితో వివాహం :-
పధ్నాలుగవ యేటనే పాలనా పగ్గాలు చేపట్టిన రుద్రమకు ఇరవై ఐదవ యేట నిడదవోలు రాజైన చాళుక్య వీరభద్రేశ్వరుడితో వివాహమైంది. వారికి ఇద్దరు కూతుళ్ళు ముమ్మడమ్మ, రుద్రమ్మ కలిగారు. ఈమెకు మరో పెంపుడు కూతురు రుయ్యమ్మ కూడా ఉంది. తనకు మగ సంతానం లేక పోవడంతో రుద్రమ తన పెద్ద కుమార్తె ముమ్మడమ్మ కుమారుడైన ప్రతాపరుద్రుడ్ని దత్తత తీసుకుని యువరాజుగా పట్టాభిషేకం చేసింది.


సర్వవర్గ సమానత్వం :-
ప్రజల సాంస్కృతిక జీవనంపై పట్టు లేకపోతే పాలన దుర్లభమవుతుందని గ్రహించిన మేధావి, రాజనీతిజ్ఞురాలు రుద్రమ. అందుకే ఆమె రాజ్యంలో జాతరలకు, పండుగలకు, ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. శైవ-జైన మతాల మధ్య అమోఘమైన సఖ్యత సమకూర్చిన అసలు సిసలైన లౌకిక పాలకురాలు రుద్రుదేవి. అలాగే ఆమె తన ముగ్గురు కూతుళ్ళను వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన రాజులకిచ్చి వివాహం జరిపి సర్వ వర్గ సమానత్వాన్ని చాటింది. రాజనీతిజ్ఞతను ప్రదర్శించింది.


అంబదేవుని దొంగదెబ్బ :-
అనేకసార్లు ఓటమి పాలైన వల్లూరు నేలే అంబదేవుడు రుద్రమదేవి పై కక్షగట్టాడు. రుద్రమకు వ్యతిరేకంగా సామంతులను సమీకరించాడు. అదనుకోసం చూస్తున్న సామంతుడైన అంబదేవుడికి సమయం కలసి వచ్చింది. రుద్రమ రాజ్యంపైకి పాండ్యులు, చోళులు, ఇతర సామంతులు ముప్పేట దాడికి దిగారు. దాన్ని అదనుగా తీసుకున్న అంబదేవుడు కుట్రలు, కుతంత్రాలతో ఇతర సామంత రాజులను ఏకం చేశాడు. రుద్రమకు అండగా నిలవాల్సిన తమ సేనలను రుద్రమపైకే ఎక్కుపెట్టాడు.


అంబదేవుడి కుట్ర తెలుసుకున్న రుద్రమ అపర భద్రకాళి అయింది. అంబదేవుడికి తగిన గుణపాఠం చెప్పాలనుకుంది. కత్తిపట్టి స్వయంగా కదన రంగాన దూకింది. అప్పటికి ఆమె వయస్సు ఎనభై ఏళ్ళ పైచిలుకే. ఇరు పక్షాల మధ్య దాదాపు రెండు వారాలకు పైగా భీకర పోరాటం సాగింది. ఆ వయసులోనూ రుద్రమను అంబదేవుడు ఓడించలేక పోయాడు. యుద్ధంలో రుద్రమను నేరుగా ఎదుర్కోలేని అంబదేవుడు కపట మాయోపాయం పన్నాడు.


ఆ రోజు రాత్రి వేళ యుద్ధక్షేత్రానికి సమీపంలోని గుడారంలో కార్తీక సోమవారం సందర్భంగా పరమ భక్తురాలైన రుద్రమ ప్రత్యేక పూజల్లో నిమగ్నమై ఉంది. పూజారుల స్థానంలో తమ వాళ్ళను పంపిన అంబదేవుడు తన దుష్టపథకాన్ని అమలు పర్చాడు. పూజలో ఉన్న రుద్రమను అంబదేవుడి మనుషులు వెనుక నుంచి పొడిచారు. రుద్రమదేవి ఎప్పుడు చనిపోయిందో నల్లగొండ చెందుపట్ల శాసనంలో ఉంది. అయితే రుద్రమ మనవడు ప్రతాపరుద్రుడు అమ్మమ్మ శపథం నెవేర్చాడు.ద్రోహి అంబదేవుడిని హతమార్చాడు. తెలుగువారే కాదు జాతి యావత్తూ గర్విందగ్గ అసమాన పాలనాదక్షురాలు రుద్రమ. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీక. స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాక. అసమాన పరాక్రమశాలి రాణీ రుద్రమదేవి.

No comments:

Post a Comment