02 October 2015

మహాలయ అమావాస్య - పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం :-

మనభారతీయ సంస్కృతిలో వైదికమార్గాన్ని, ఋషివాక్యాన్ని విశ్వసించే మతం మనది. అంతటి పుణ్యపురు షూలైన వారు కూడా వీటిని గుడ్డిగా నమ్మమని చెప్పలేదు. అలా అని భావితరాలవార్ని తప్పుడు మార్గంవైపు నడిపించే అగత్యం వార్కిలేదు. అందువల్లనే మనపూర్వీకుల నుండి నేటివరకు ‘‘ఆర్షధర్మం’’ మీద విశ్వాసముంచు కున్నవారు ఎన్నడూ చెడిపోలేదు అని పెద్దలు చెప్తారు.
రేపటి నుండి మహాలయా పక్షాలు.సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 4 దాకా,వీలుగా ఉంటే ఇవి పాటించండి. వీలుపడకపోతే ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి, మీ పితృదేవతలను స్మరించి, వారికి నమస్కారము చేస్తూ, ” నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి, మీ దీవెనలు అందచేయండి’ అని మనస్సులో ప్రార్ధన చేయండి.

ఈ పక్షం పితృపక్షం :-
భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో, బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని, మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.


తండ్రి జీవించి, తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలని ధర్మసింధు, నిర్ణయసింధు చెబుతున్నాయి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయమైనా చేసి తీరాలి. ఆ ఒక్కరోజు కూడా చేయలేనివారు హిరణ్యశ్రాద్ధం చేయాలి. పితరులను తృప్తి పరిచే ఈ కర్మల ద్వారా పితృఋణం తీర్చుకునేందుకు అవకాశం ఇదే!

దీనికి సంబంధించినఐతిహ్యం ఉంది:-
దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది.

స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ‘‘కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ, కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’’అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా, ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి, మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.

ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు. చిత్రం! ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆర్తి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు.

మహాలయ అమావాస్య:-
ఈ పక్షంలో చివరి రోజైన నేడు ఇంతకు ముందు చెప్పినట్లు ఈపక్షమంతా అన్నిరోజులు లేదా పితృదేవతలు మరణించిన తిథినాడు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధవిధులను నిర్వర్తించడానికి కుదరనివారు కనీసం ఈ ఒక్కరోజయినా చేయడం విధాయకమని శాస్త్రగ్రంథాలు చెబుతున్నాయి.
సెప్టెంబర్ 20నుంచి ప్రారంభమైన మహాలయ పక్షం వచ్చేనెల అంటే అక్టోబర్ 4న మహాలయ అమావాస్యతో ముగుస్తోంది. ఈలోగా ఆచారం ఉన్నవారు యథావిధిగా అన్నసంతర్పణ, పితృశ్రాద్ధాలు నిర్వర్తించడం, ఇప్పటి వరకు ఆ అలవాటు లేనివారు కనీసం ఏదైనా దేవాలయంలో బియ్యం, కూరగాయలు, ఉప్పు, పప్పు, పండ్లు దక్షిణ తాంబూలాదులతో విప్రులకు స్వయంపాకం సమర్పించడం లేదా పేదలకు అన్నదానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులతో ఎంతోకాలంగా తీరని కోరికలు తప్పక నెరవేరతాయని పురాణోక్తి.
ఎప్పుడో మరణించిన పితృదేవతలకు తర్పణలు వదలడం, వారి పేరుమీద అన్నదానాలు నిర్వర్తించడం కొందరికి చాదస్తంగా తోచవచ్చు. లౌకికంగా ఆలోచిద్దాం. ఈలోకంలో అన్నార్తులు ఎందరో ఉన్నారు. వారిని పిలిచి, చనిపోయిన మన పెద్దల పేరు మీద పట్టెడన్నం పెట్టామనుకోండి, వారికి ఆకలి బాధ తీరుతుంది. మనకి కూడా కనీసం ఒకరి కడుపు నింపామన్న తృప్తి మిగులుతుంది. అందుకే గతించిన పెద్దలను తలచుకుని వారి పేరిట అన్నదానం చేస్తే వారికి కడుపు, మనకు మనసు నిండుతాయి.
భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు బహుళ పక్షం పితృ దేవతా పూజకు విశిష్టమైనది. ఈ బహుళ నుంచి భాద్రపద మాసం బహుళ పక్షం ప్రారంభమవుతుంది. పితృదేవతలకు ఇష్టమైన పక్షం కనుక దీనిని పితృపక్షం అంటారు. అలాగే ఈ పక్షాన్ని మహాలయ పక్షం అని కూడా అంటారు. ఈ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు. పక్షం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకూ పితృ దేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలని శాస్త్ర వచనం.

ఒకవేళ అలా కుదరనప్పుడు తమ పితృ దేవతలు ఏ తిథినాడు మృతి చెందారో అదే తిథినాడు శ్రాద్ధం నిర్వహించాలి. తండ్రి జీవించి ఉండగా తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షం నవమి తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు. ఈ పదిహేను రోజులూ నియమపూర్వకంగా పితృదేవతలకు తర్పణాదుల ద్వారా తృప్తి కలిగించాలి.

మాతాపితృ వర్జితులైన వారు ఈ పక్షంలో తప్పక పితృ కర్మలు చేయాలి. ప్రతీ సంవత్సరం చేసే శ్రాద్ధ్దం కన్నా అతి ముఖ్యం ఈ పక్షం. పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయమైనా చేసి తీరాలి. ఆ ఒక్కరోజు కూడా అన్న శ్రాద్ధం చేయలేనివారు హిరణ్య శ్రాద్ధం చేయాలి. ఏమీ చేయలేనివారు పితృ దేవతలనుద్దేశించి కన్నీరైనా కార్చాలని ధర్మశాస్త్రం చెప్తోంది.

ఉత్తరాయణం దేవతల కాలం గనుక ఉత్తమ కాలమని, దక్షిణాయనం పితృకాలం గనుక అశుభమని పూర్వీకుల విశ్వాసం. అంతేకాక ఆషాఢంలో వచ్చే కర్కోటక సంక్రమణ నుంచే ప్రారంభమయ్యే దక్షిణాయనం వానలు, బురద, చిమ్మచీకటితో భయంకరమవుతుంది. అశుభమనిపిస్తే ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. అందులో భాద్రపద మాసమంతా జలమయంగా కనిపిస్తుంది. ఇదే ఒక మహా వినాశనం అనుకోవడంలో ఆశ్చర్యం అంతకంటే లేదు. కావున ఈ పక్షంలో అందరికీ శ్రాద్ధ తర్పణములు చేయాలని శ్రాద్ధాలతో వారిని సంతృప్తి పరిస్తే తమకు ప్రళయం గడుస్తుందని భావించి ఉండవచ్చు. అంతేకాక ఆషాఢం రెండవ పక్షం మొదలు ఐదవ పక్షం వరకు పితురులు చాలా కష్టపడుతుంటారు. కాబట్టి మహాలయ పక్షంలో ప్రతిరోజూ శ్రాద్ధం జరపాలని ఆచారంగా పెట్టారు.

పితురులను తృప్తి పరచే ఈ కర్మల ద్వారా పితృ రుణం తీర్చుకునే అవకాశం ఇది. స్వర్గుస్తులైన మాతాపితురుల కోసం ప్రతీవారు ఈ పక్షాలలో పితృ కర్మలను ఆచరించాలి. తద్వారా శ్రేయస్సు పొందగలుగుతారు.భాద్రపద పూర్ణిమతో అరంభమైన పితృపక్షం, మహాలయ పక్షమం ఆమాసపు అమావాస్యతో ముగుస్తుంది. పితృదేవతల పూజకు ఉద్దిష్టమైనది. సాధారణ శ్రాద్ధదినం వ్యక్తులకు సంబంధించింది. రోమను జాతీయుల్లో ఫిబ్రవరి 19వ తేదీ పితృదేవతల పూజకు నిర్దిష్టమై ఉండేది. ఆనాడు వారు రోమునగరం దగ్గర గల కొండలలో ఒక కొండ మీద పెద్ద గొయ్యి తవ్వేవారు. తండ్రులు భూమి క్రింద వుంటారని వారి నమ్మిక. కావుననే గోతుల్లో బలి అన్నం వుంచే ఆచారం వారు అవలంబించారు. వివాహాలు కానీ, వ్యాపారం కానీ చేయడానికి అది అశుభ రోజని వారి నమ్మకం. మనలో కూడా ఈ రోజుల్లో శుభ కార్యాలు జరపరు. మన శాస్త్రాల్లో ఒక్క ఏడాదిలో చేయవలసినవి తొంభై ఆరు శ్రాద్ధాలని చెప్ప బడింది. ఆ తొంభైఆరు శ్రాద్ధాల్లోనూ ఈ పితృపక్షం ముఖ్యం. శ్రాద్ధదినం రోజు కర్మ చేసేవాడు శ్రాద్ధం పూర్తి అయ్యే వరకు ఉపవసిస్తాడు.

తండ్రి బ్రతికి వుండగా తల్లిని కోలుపోయినవాడు భాద్రపద కృష్ణ పక్ష నవమినాడు తల్లి శ్రాద్ధ కర్మ చేస్తాడు. ఇది చేయడానికి సుమారు ఒక గంట సమయం పడుతుంది. ఆ సందర్భంలో మూడు పిండాలు దానం చేయబడతాయి. ఒకటి చనిపోయిన తల్లికి, రెండోది కర్మ చేసేవాని పితామహికి. ఒకవేళ ఆమె సజీవురాలై వుంటే రెండోది ప్రపితామహికి, మూడోది ప్రపితామహి తల్లికి.

తండ్రికి చేసే శ్రాద్ధ కర్మ భూమి మీద ధావళి పరుచుకుంటారు. దాని మీద దక్షిణ ముఖంగా కూర్చుంటారు. పట్టుగుడ్డపోచ ఉత్తరీయంగా చేసుకుంటాడు. అది ఒక అంగుళం వెడల్పూ, యజ్ఞోపవీతమంత పొడుగూ ఉంటుంది. యజమానికి దగ్గరగా పురోహితుడు కూర్చుంటాడు. పురోహితుడు యజమానికి దర్భ ఇస్తాడు. దానిని యజమాని తన వెంట్రుకకు ముడివేసుకుంటాడు. కూర్చుండే ధావళీ మీద ఒక దర్భను ఉంచుకుంటాడు. దర్భతో చేసిన ఉంగరం తన అనామికకు పెట్టుకుంటాడు. దర్భతో చేసిన ఆ ఉంగరమే యజ్ఞోపవీతానికి ఒకటి, పైన చెప్పిన ఉత్తరీయానికి ఒకటి కట్టుకుంటాడు. తరువాత పురోహితుడు శ్రాద్ధ కర్మ ప్రారంభిస్తాడు. యజమానికి ఎదురుగా అయిదు అరిటి ఆకులు పరుస్తాడు. రాగి డబ్బు, దర్భ పుల్ల, ఇతర వస్తువులు వుంచుతాడు. ఐదు విస్తళ్లనూ ఆఘ్రాణించడానికి ఐదు గురు పితృదేవుళ్లు వస్తారు. మొదట వచ్చేవాడు యజమాని తండ్రి, అతని తాత, ముత్తాతలు, తల్లి పూర్వీకులకు ఒక ఆకు ఇట్లే ఇతర ఆకులు. మూడు విస్తళ్లు కూడా వేస్తారు. అందులో ఒకటి విష్ణుపాదమనేది విష్ణువు కొరకు. మిగతారెండూ విశ్వదేవుల కొరకు. ఆరోజు వంటకాల్లో ‘ఖిర్‌పూరీ’ అనే వంట ప్రధానమైనది. దర్భగడ్డి మీద అవిసె చెట్టు ఆకులు వేస్తారు. దాని మీద విష్ణు పాదమనే పైన చెప్పిన ఆకు వేస్తారు. దాని మీద పిండాలు ఉంచుతారు. ఇవి పెద్దపిండాలు. ఈ పిండాల పక్కని చిన్న పిండాలు. మరికొన్ని ధర్మపిండాలు.

వీటిని అన్నింటినీ పూజిస్తారు. తరువాత దీపారాధన చేస్తారు. ఆ మీద మంత్ర పుష్పాంజలి. ఆ సమయంలో ఇంటిలొ అందరూ మగవారూ, ఆడవారూ పితృదేవుల గౌరవార్థం అంజలి బద్ధులై తలలు వంచుకుని మంత్ర పుష్పాన్ని స్వీకరిస్తారు. ఆ తరువాత అగ్ని ఆరాధన. రాగిబిందెలో అగ్నిని వుంచి పూజిస్తారు. తరువాత నైవేద్యం తీసుకుని వెళ్లి ఇంటికి వెలుపల ఆరు బైట కాకి తినడం కోసం నేలమీద వేస్తారు.
కాకి ఈ నైవేద్యాన్ని ఎంత తొందరగా ముట్టుకుంటే పితృదేవతలు అంత ఎక్కువగా తృప్తి పడ్డారన్న మాట. ఇలా కర్మ చేయడానికి పాలుమాలిన తమ వంశీకుణ్ణి పితృదేవతలు శపిస్తారట. అవిసెచెట్టు ఆకులు పువ్వులే కాకుండా, తామరాకులు, తామర పువ్వులు, నల్ల నవ్వులు, యవల(బార్లీ) ఈ కర్మలో ఉపయోగిస్తారు. ఒక మనిషి జీవితకాలంలో ఈ మహాలయ పక్షంలో గంగ, యమున, ఫల్గుణి నదుల సంగమంలో గయలో శ్రాద్ధకర్మ చేయడం మహత్కార్యంగా మహారాష్ట్రలు భావిస్తారు. ఈ రోజు యథావిధిగా శ్రాద్ధకర్మ చేయడానికి వీలుకాని వారు తర్పణం వదలడంతో తృప్తిపడతారు. తర్పణానికి పిండాలు అవసరం లేదు. తిలాంజలితో సరి.

మహాలయము అనగా గొప్ప వినాశనము లేక చావు అని అర్థము. భాద్రపద కృష్ణ పక్షంలో హిందువులు తమతమ పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు. అన్ని వర్ణముల వారు తిలతర్పణం చేస్తారు. ఈ పక్షమునందు ఇది వరకు తిల తర్పణములచే పూజింపకుండినట్టు పితృదేవతలకు తర్పణము చేయవలెనని భవిష్యత్పురాణంలో ఉంది. దేవతా పూజలతో పాటూ పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన మాసం భాద్రపద మాసం. ఈ మాసంలోని శుక్ల పక్షం దేవతా పూజలకు కృష్ణపక్షం పితృదేవతలకు ఆరాధనకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలోని కృష్ణపక్షానికి ‘పితృపక్షం’ లేక మహాలయ పక్షం అని అంటారు. పితృదేవతలకు అత్యంత ఇష్టమైన ఈ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్దవిధులను నిర్వహించడం, పిండ ప్రదానాలు చేయడం మంచిది. అందువల్ల గయలో శ్రాద్ధకర్మలను చేసిన ఫలం కలుగుతుంది.

శాస్త్ర విధి ప్రకారం మనిషి పంచ మహాయజ్ఞాలు నిర్వర్తించాలి. అవి భూతయజ్ఞం, మనుష్య యజ్ఞం, పితృయజ్ఞం, దేవయజ్ఞం, బ్రహ్మయజ్ఞం. సమస్త ప్రాణులకై కొంత అన్నం కేటాయించడం భూతయజ్ఞం. ఇంటికి వచ్చిన అతిథికి ఆహారం ఇవ్వడం మనుష్య యజ్ఞం. పితురులకు తర్పణం ఇచ్చే శ్రాద్ధకర్మే పితృయజ్ఞం. హోమాదులు దేవయజ్ఞం సమాజానికి మార్గదర్శనం చేయటం అధ్యాపన బ్రహ్మయజ్ఞం. ఈ ఐదు మహాయజ్ఞాలో పితృయజ్ఞానికే విశేష స్థానం ఉంది. సాధారణంగా శ్రాద్ధం అంటే ఆబ్దికాలు చేయడం. సాధారణం శ్రాద్ధ దినం ఆయా మరణించిన వ్యక్తులకు సంబంధించినది. కాగా మహాలయ పక్షం సామూహిక పితృపూజలను చేయడానికి ఉద్దేశించబడినది. ఒకవేళ రోజూ వీలుకాకపోతే తమ పితృదేవతలు ఏ దినం మృతిచెందారో, మహాలయపక్షంలోని ఆ తిథినాడు శ్రాద్ధకర్మలను చేయాలి. ఈ రోజున శ్రాద్ధకర్మలు చేయడానికి వీలుపడని వ్యక్తులు తర్పణం వదలడం తృప్తి పడుతుంటారు. పితృదేవతల రుణంనుండి విముక్తి లభించడం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం చేసే త్యాగం విలువకట్టలేనిది. అందుచేత పితృదేవతల శ్రాద్ధకర్మ మానవ ధర్మంగా అవసరం. పితృపక్షాల్లో వారిని స్మరించి, ఆరాధించటం మన సంప్రదాయం, దీనివల్ల సుఖ సమృద్ధి, సంతోషం కలుగుతాయి. తమ పితురుల తిథి సరిగా తెలియకపోతే వారి పేరుమీద అమావాస్యరోజున తర్పణం వదలాలి. భాద్రపద బహుళ పాడ్యమినుండి అమావాస్య వరకు పితృప్రాణం భూమిపై వ్యాపించి ఉంటుంది.

మహాలయనాడు అన్నదానం చేస్తే తండ్రి ముత్తాతలకే కాక వారి సంరక్షకులైన శ్రీ మహావిష్ణువులకుకూడా చేరుతాయి. ఈ మహాలయ పక్షానికి ఒక విశేషత ఉంది. వారి వారి జ్ఞాత, బంధువులందరికీ అర్ఘ్యాదులు పిండోదకాలు సమర్పిస్తారు. మహాలయ పక్షంలో చేసే అన్నదానం వల్ల అనంతకోటి యజ్ఞ్ఫలం దక్కుతుంది. స్వర్గస్తులైన మాతా పితురులకోసం ప్రతివారూ మహాలయ పక్షంలో విదించబడ్డ విధి కర్మలను ఆచరించి తద్వారా శ్రేయస్సు పొందుతారు. ప్రతియేడూ చేసే శ్రాద్ధకం కన్నా ఈ మహాలయ పక్షాలు చేయడం ఎంతో శ్రేయస్కరం. కనీసం చివరిరోజైనా మహాలయ అమావాస్య రోజైన శ్రాద్ధం పెట్టాలి. ఆ ఒక్కరోజుకూడా అన్నశ్రాద్ధం పెట్టకపోతే హిరణ్యశ్రాద్ధం చేయాలి.

‘హేమాద్రి’ అనే ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమి చేయలేని నిష్ట దరిద్రుడు, ఒక పెద్ద ఆరణ్యంలోకి వెళ్లి, ముళ్ల కంచెను హత్తుకొని పితృదేవతలను ఉద్దేశించి కన్నీరైనా కార్చవలెనని చెప్తాడు. మహాలయ పక్షంలోని చివరి తిథి అయినా ‘అమావాస్య’ నాడైనా పితృతర్పణాదులు విడుచుట మంచిది. ఈ మహాలయ పక్షంలోని శ్రాద్ధకర్మను గురించి స్కాంద పురాణంలోని నాగరఖండలోనూ, మహాభారతంలోనూ వివరించబడింది.

మరోవిషయం ఆలోచిద్దాం! ఎక్కడో సుదూర ప్రాంతమందుగల ‘‘ఢిల్లీ ఆకాశవాణి’’ కేంద్రంనుండి వెలవడే మాటలు, పాటలు, మన కంటికి ఏ మాత్రమా కనిపించని రీతిలో ‘‘శబ్దగ్రాహకములైన కొన్ని అణువుల సముదాయముతో వాయు తరంగాలై మోసుకునివచ్చిన మాటలు పాటలు వినగలుగుతున్నామంటే’’! ఆలాగునే మనం ఇక్కడ పెట్టి శ్రాద్ధ ద్రవ్యంలోని ఆహారసారాన్ని మన పితృదేవతలు అందుకుంటారు అని !
జ్ఞానధనులైన మనపెద్దలకు అంతటి విశ్వాసము వున్నది గ్రహించవలెను. అంతేకాని, మనకు ఎంతో పూజనీయులైన మహర్షుల వాక్యంపైనా, పెద్దలపైనా విశ్వాసముపైన అప్రమాణబుద్ధితో చూచుటకూడా మరి దోషమేకదా….కావున పితృకార్యములు చేయుటకు అర్హత పొందినవారు అంతా విధిగా మహాలయ పక్షాలను ఆచరించి, వారి వారి వారి వంశవృక్షమూలకారకులైన పితృదేవతల శుభాశీస్సులతోపాటుగా, ఆచంద్ర తారార్కమూ వంశాభివృద్ధితోపాటు సర్వశుభములు పొందుదురు గాక !

No comments:

Post a Comment