02 October 2015

తథాస్తు దేవతలు :-

తథా – ఆ ప్రకారంగా; అస్తు – కావలసినదే. అనేవాళ్ళు ఉంటారు. ఎలా అంటారు ఈ మాట మీరు అంటే ముహూర్తం అనేదాన్ని విశ్వసిద్దాం ముందు. ముహూర్తబలం అంటారు. ఒకవ్యక్తి మరొక వ్యక్తిని చూస్తాడు. చూసిన వేళావిశేషమేమో గానీ వాళ్ళిద్దరిమధ్య ఉప్పు -నిప్పు. ఒకవ్యక్తి మరొక వ్యక్తిని చూస్తాడు. చూసిన వేళావిశేషమేమో గానీ వాళ్ళిద్దరిమధ్య ఏదో జన్మజన్మల బంధం ఉన్నట్లు ప్రేమ ఆప్యాయతలు తవ్వి పోసుకుంటారు. అది ఆధునికపరమైన వివాహసంబంధాలవైపు దారితీయవచ్చును. లేదా మిత్రత్వానికి దారితీయవచ్చును. 

ఇదంతా ఎలా వచ్చింది? ఆ చూసుకున్న నిమిషం వేళా విశేషం. అలాగే నిత్యమూ జపం చేసేటటువంటి వాళ్ళు పూజావిధానాలలో ఏదో ఒక లక్ష్యంతో నియమశుద్ధితో, సత్ప్రవర్తనతో మెలిగేటటువంటి వాళ్ళు నోరారా ఏదైనా ఒక మాట అంటే తథాస్తు. వాళ్ళు అన్నమాట నిజం అయి తీరుతుంది. దేవతలు అంటే పైన వాహనాలలో తిరుగుతూ ఎవరైనా ఏమైనా అంటాడా, తథాస్తు అందాం లాగా కాదు. సినిమాలు, సీరియళ్ళు చూసి ఇలాంటి భావనలు పెరిగిపోతున్నాయి ఈ మధ్య. మనస్సులోనే ఉంటుంది దేవత. మన మనస్సులో ఏ సంకల్పం చేస్తామో అదే తథాస్తు. పిల్లలే ఉన్నారు. నిర్లక్ష్యంగా మాట్లాడింది తండ్రితో. ఆ తండ్రి చాలా జపం చేసేవాడు, యోగ్యుడు, నిష్ఠాగరిష్ఠుడు. ఇలాగైతే…అని ఏదైనా అన్నాడనుకోండి, జరిగి తీరుతుంది. 

తథాస్తు దేవతలు అంటే ఎక్కడో ఉండేవారు కాదు. ఆ వ్యక్తులలో ఉండే సంకల్ప శక్తి, దానికున్న బలం – దానిపేరే తథాస్తు. కాబట్టి ఏది మాట్లాడాలన్నా, ఎలా మాట్లాడాలన్నా అవ్యాచ్యములు మాట్లాడకూడదు. ఎదుటివ్యక్తికి కష్టం కలిగించే మాట్లాడకూడదు. అందరూ కూడా ఎదుటివాడికి కష్టం కలుగకుండా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తథాస్తు దేవతలు ఉన్నారు అన్న భయంతోనైనా సవ్యంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాబట్టి తథాస్తు దేవతలు ఉంటారు. మన మనస్సులోనే ఉంటారు!

No comments:

Post a Comment