06 December 2014

గోదావరి పుష్కరాలు :-
పుష్కరము అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ ‘పుష్కరాలు’ వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు. బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.

పుష్కర జననం :-

పవిత్రమైన నదులలో మానవులు స్నానం చేసి వారి పాపాలను పోగొట్టుకొంటున్నారు. నదులు ఆపాపాలు స్వీకరించి అపవిత్రులు అవుతున్నాయి. మానవుల వల్ల అపవిత్రులై ఆ నదులు పాపాలు భరించలేక బాధ పడుతుంటే పుష్కరుడు అనే మహానుభావుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మ దేవుని అనుగ్రహం పొంది తనను ఒక పవిత్ర క్షేత్రంగా మార్చమని కోరతాడు. ఈ విధం గా పుష్కరుడు పుష్కర తీర్థం గా మారి స్వర్గలోకమున మందాకిని నది యందు అంతర్భూతమై ఉన్నాడు.

పుష్కరుని చరిత్ర :-

పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఈశ్వరుడు తందిలునితో ఏమి వరం కావాలో కోరుకోమని అడిగాడు. తందిలుడు ఈశ్వరునితో తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానంకావాలని కోరుకున్నాడు. ఈశ్వరుడు సంతోషించి తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో అతనికి శాశ్వతంగా స్థానం ఇచ్చాడు. అందువలన అతడు మూడున్నర కోట్ల పుణ్యతీర్ధాలకు అధికారి అయ్యాడు. ఇలా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి లభించింది. పోషించే శక్తిని సంస్కృతంలో పుష్కరం అంటారు. అలా తందిలుడు పుష్కరుడైయ్యాడు. బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు జలంతో అవసరమేర్పడి జలంకోసం ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వవలసినదని కోరుకున్నాడు. ఈశ్వరుడు అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండంలంలోకి ప్రవేశించాడు. బ్రహ్మ కార్యం పూర్తి అయిన తరువాత ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవాధారమైన జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్ధించాడు .ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు కానీ పుష్కరుడు తాను బ్రహ్మదేవుని వదలి వెళ్ళలేనని చెప్పాడు. అప్పుడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరమంతా మధ్యాహ్న సమయంలో రెండు మూహూర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించారు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి అధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యప్రథమని పుణాలు చెప్తున్నాయి.
భారత దేశం లో గంగ నది తరువాత అంత పేరుగాంచిన జీవ నది గోదావరి నది ఈ గోదావరి నదిని దక్షిణ గంగ గా అబివర్నిస్తుంటారు. అంతటి ప్రాముక్యం గల ఈ గోదావరి నది యొక్క రాసి సింహరాశి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి యమునా నది పుష్కరాలు తరువాత గోదావరి పుష్కరాలు వస్తాయి.


నది : రాశి
గంగా నది : మేష రాశి
నర్మద నది : వృషభ రాశి
సరస్వతీ నది : మిథున రాశి
యమునా నది : కర్కాట రాశి
గోదావరి : సింహ రాశి
కృష్ణా నది : కన్యా రాశి
కావేరీ నది : తులా రాశి
భీమా నది : వృశ్చిక రాశి
పుష్కరవాహిని : ధనుర్ రాశి
తుంగభద్ర నది : మకర రాశి
సింధు నది : కుంభ రాశి
ప్రాణహిత నది : మీన రాశి


No comments:

Post a Comment