08 December 2014

గురువు :-
గురు లేదా గురువు విద్యను నేర్పువాడు. గురువును త్రిమూర్తుల స్వరూపంగా భావించడం, ఆరాధించడం హిందూ సంప్రదాయం. ప్రతి వ్యక్తి జీవితంలో గురువు పాత్ర గణనీయంగా ఉంటుంది. సంస్కృతంలో గు అనగా చీకటి/అంధకారం మరియు రు అనగా వెలుతురు/ప్రకాశం అని అర్ధం. అనగా గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి బ్రహ్మవిద్య అనే ప్రకాశాన్ని అందించేవాడు. మతపరంగా గురువు అనేది మార్గదర్శి అన్న అర్ధం వచ్చే విధంగా సిక్కు, బౌద్ధ, హిందూ మతాలలో మరియు కొన్ని ఆధునిక మత చైతన్యాలలో ఉపయోగంలో ఉన్నాయి. గురు పూర్ణిమ నాడు గురువులను ప్రత్యేకంగా స్మరించి తరించడం మన ఆనవాయితీ. అన్ని జంతువులకు, మనుషులకు తల్లి తొలి గురువు.
గురుకుల విద్యా విధానం లో గురువు పాత్ర అత్యంత కీలకమైనది.


ఆధునిక కాలంలో ఉపాధ్యాయులు మరియు ఉపన్యాసకులు .
వివిధ దశల్లో విద్యాబోధన చేస్తున్నారు.


శాంతో దాంతః కులీనశ్చ వినీతః శుద్ధవేషవాన్
శుద్ధాచార సుప్రతిష్టః శుచిర్దక్షః సుబుద్ధిమాన్
ఆధ్యాత్మ జ్ఞాననిష్ఠశ్చ మంత్రతంత్ర విశారదః
నిగ్రహాన గ్రహేశక్తో గురురిత్యభి ధీయతే.


అనగా శాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, కులీనుడు, వినయవంతుడు, పరిశుద్ధుడు, ఆచార వంతుడు, మంచి వేషధారణగలవాడు, గౌరవనీయుడు, పవిత్రుడు, బుద్ధిమంతుడు, మంత్ర తంత్రములలో నిష్ణాతుడు, నిగ్రహానుగ్రహశక్తుడు అయినవాడు గురువు అనిపించుకుంటాడు.

భారతదేశంలో ఆధ్యాత్మికంగాను, సామాజికంగాను గురువుకు చాలా ప్రాధాన్యత ఉంది. తల్లిదండ్రుల తరువాత గురువు అంతటివాడని మాతృదేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అనే సూక్తి చెబుతుంది. గురువును ప్రత్యక్ష దైవముగా పూజించుట ఒక ఆచారము. విద్యాభ్యాసం తరువాత గురుదక్షిణ ఇవ్వడం కూడా సనాతన కాలంలో ఆచారంగా ఉంది. నిత్య ప్రార్ధనలలో గురువును, గురుపరంపరను స్తుతించడం ఒక ఆచారం.

భారతదేశంలో అనాదిగా గురు పరంపర వస్తూనే ఉన్నది. గురు సంప్రదాయానికి మూల పురుషుడు సదాశివుడు. ఆయనను దక్షిణామూర్తి అన్నారు. కుమారస్వామి కూడ గురువు. విశ్వామిత్రుని వద్ద రామలక్ష్మణులు, సాందీపుని వద్ద బలరామకృష్ణులు, పరశురాముని వద్ద భీష్ముడు, ద్రోణుని వద్ద అర్జునుడు, గోవింద భగవత్పాదాచార్యుని వద్ద ఆదిశంకరులు, వీరబ్రహ్మంగారి వద్ద సిద్దయ్య, రామకృష్ణ పరమహంస వద్ద వివేకానంద స్వామి - ఇలా ఎందరో గురుకృపతో ధన్యజివులైనారు. దత్తాత్రేయుని, సాయిబాబాను "గురువు" అని ప్రస్తావించడం సాధారణం.

గురువును స్మరించే కొన్ని ప్రసిద్ధ శ్లోకాలు :-

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలనం యేన తస్మై శ్రీ గురవే నమః


గురువుపట్ల ఎలా మెలగాలో ఈ పద్యం చెబుతుంది:-

గురుమూర్తి వచ్చుచో గూర్చుండరాదు గురుశిష్యులొకశయ్య గూర్కరాదు
ముందుగా దనయంత భుజియింపగారాదు పోరి దొంగత్రోవల బోవరాదు
గురునింద వినరాదు కూడి సేయగరాదు గురునికప్రియమును గూర్చరాదు
సద్గురువిడిన శాసనము మీరగరాదు హెచ్చిదా గురుని శాసింపరాదు
గురుడు బోధింపనెంచిన నురుగరాదు అతడు బోధింపకుండిన నడుగరాదు
శ్రీగురుమూర్తి చేరినంతనె నమస్కారము ముందుగా సలుపవలయు
లజ్జాభిమాన కులంబు వీడి పాదచారియై సద్భక్తి చేరవలయు
సుతుడైన హితుడైన సోదరుడైనను గులహీనుడైన కొలువవలయును
గురునాజ్ఞ వర్తించి గురుడిచ్చు తృణమైన మేరువుగా నెంచి మెలగవలయును
గురుని ప్రభువంచు స్వామి దేవర యటంచు బిలుచుచు లోభ గుణముల దొలచవలయును


గురువులలో రకాలు సాయిబాబా జీవిత చరిత్రలో తన గురువుగురించి వ్రాసిన విషయాలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి - "ఆయన నాకేమియు బోధించలేదు. కేవలం నన్ను ప్రేమతో చూసేవాడు. ఆ చూపునకే నాకు సకల విషయాలు అవగతమయ్యేవి"


"శ్రీకైవల్యసారథి" అనే పుస్తకంలో డాక్టర్ క్రోవి సారధి ఇలా వ్రాశాడు :-
"ఏ మహాత్ముని రూపం నీకు మదిలో నిలిచిపోతుందో,
ఏ సన్యాసి నీకు స్వప్నంలో కూడా కనిపించి సన్మార్గాన్ని బోధిస్తాడో,
ఏ సాధువు చెప్పిన ధర్మసూత్రాలు నీ మదిలో నిలిచిపోతాయో,
ఏ మహనీయుని దగ్గరకు వెళ్ళగానే నీ సందేహాలు నివృత్తి అవుతాయో,
ఏ వ్యక్తి దగ్గర నీకు ప్రశాంతత, ఆనందము కలుగుతాయో,
ఏ వ్యక్తిమీద నీకు నమ్మకము, గురి కలుగుతాయో ...
ఆ మహనీయుడే నీకు గురువు"


ఏడు రకాల గురువులు శాస్త్రాలలో చెప్పబడ్డారు :-
సూచక గురువు - చదువు చెప్పేవాడు
వాచక గురువు - కుల, ఆశ్రమ ధర్మాలను బోధించేవాడు
బోధక గురువు - మహామంత్రాలను ఉపదేశించేవాడు
నిషిద్ధ గురువు - వశీకరణ, మారణ ప్రయోగాళు నేర్పేవాడు
విహిత గురువు - విషయ భోగముల మీద విరక్తి కలిగించేవాడు
కారణ గురువు - జీవబ్రహ్మైక్యాన్ని బోధించేవాడు
పరమ గురువు - జీవాత్మ, పరమాత్మ ఒకటే అని ప్రత్యక్షానుభవాణ్ని కలిగించేవాడు.


గురువులు ఇచ్చే దీక్ష నాలుగు రకాలని చెబుతారు -
(1) స్పర్శదీక్ష (2) ధ్యాన దీక్ష (3) దృగ్దీక్ష (4) మంత్రదీక్ష.

1 comment:

  1. అన్వేషణ..... అన్వేషణ..... అన్వేషణ.... అన్వేషణ....
    మనస్సు ఏదైనా బాధాకరమైన స్థితి నుంచి గానీ, సంఘర్షణతో కూడిన స్థితి నుంచి గానీ తప్పించుకోవడానికి సుఖప్రదమైనదానిని, ఉపశమనం కలిగించేదానిని కనుక్కోవడానికి కృషి చేస్తున్న స్థితి. అన్వేషణ....
    అటువంటి మనస్సు నిజంగా అన్వేషిస్తుందా? మనస్సు అన్వేషిన్చేదానిని కనుక్కోవచ్చు, కానీ అది కనుగొనేది అది స్వయంగా ప్రదర్శించినది మాత్రమే. ఏదో ఉద్దేశ్యంతో చేసే అన్వేషణ నిజమైన అన్వేషణ అవుతుందా? అన్వేషణ అంతటికీ ఏదో ప్రయోజనం ఉండి తీరాలా? లేక ఏ ఉద్దేశ్యం లేకుండా చేసే అన్వేషణ ఉంటుందా? అన్వేషణ అనే కార్యకలాపం లేకుండా మనస్సు ఉండగలదా? మనస్సు తన నుంచి తాను తప్పించుకోవడానికి అన్వేషణ కేవలం మరొక సాధనమా? అలా అయితే తప్పించుకోవడానికి మనస్సును ప్రేరేపిస్తున్నది ఏమిటి........????? ఇదంతా దేనికి.? ఈ జన్మలు బంధాలు, మంచితనం కాపాడుకోవడానికి పుణ్యమని పాపమని ఏమిటి ఇదంతా మరణం తర్వాత మనం ఏమఫుతున్నాము? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు దేనికోసం మనం అమీబా నుండి మనవ జన్మ దాక వచ్చాము? ఖర్మ సిదంతము ఉంది అనుకుంటే ఎలా ఉంది?
    సర్, నాకు తెలుసుకోవాలని ఉంది

    ReplyDelete