11 December 2014

ఏ రోజు ఏ దేవుడికి ఉపవాసం ఆచరించాలి ?

ఉపవాసం మనిషి ఆరోగ్యవంతమైన జీవితానికి, మానసిక స్థైర్యానికి, సత్త్వసిద్ధికి ఉపకరిస్తుంది.
ఆహార శుద్ధే సత్వశుద్ధి: అని అన్నారు. అంటే ఆహార లక్షణాన్ని బట్టే మానవుని మనసు ఉంటుందన్నమాట. ఆధ్యాత్మికపథంలో పయనిస్తున్నవారు తమ శారీరక ఆరోగ్యం కోసం మితాహారం, క్రమాహారం, సాత్వికాహారం అంటూ విభజించి తీసుకుంటుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకునే మనవాళ్ళు ''ఆత్యాహార మానాహారం నిత్యం యోగీ వవర్జయేత్'' అని అన్నారు. అతిగా తినడం, అసలు తినకుండా ఉండటం కూడా మంచిది కాదన్నారు. జీవించడానికే తినాలిగానీ తినడానికే జీవించకూడదు.

మితాహారం: కడుపులో సగభాగం అన్నం తదితర ఆహార పదార్థాల చేత, పాతికభాగం నీటి చేత నింపి, మిగిలిన పాతికభాగం గాలికోసం ఖాళీగా ఉంచాలి. ఈ విధంగా ఆహారాన్ని స్వీకరించడమే మితాహార పద్ధతి. ఇలా ఐందుకు చెప్పరంటే, అధికంగా తింటే భగవధ్యానం కుదరదు. అధిక మైన ఆహారం వలన శరీరం బరువెక్కి, మత్తుగా మారి పూజ, ధ్యానం వంటి విషయాలపై ఆసక్తిని నిలుపలేము. అందుకే మితంగా తినడం, మితంగా నిద్రించడం అత్యంతావశ్యకం అని అన్నారు.

క్రమాహారం: ఈ ఆహార విధానాన్ని మరలా సాత్త్విక, రాజసిక, తామసిక ఆహార విధానాలంటూ మూడు విధాలుగా విభజించారు. క్రమాహారం అంటే ప్రతిరోజు దాదాపు ఒకే సమయానికి, పరిమితంగా సమతులమైన ఆహారాన్ని తీసుకోవడం. ఇలా తినడం వల్ల మానసిక ఆరోగ్యం చక్కగా ఉంటుంది. 


సాత్త్వికాహారం : సాత్త్వికాహారం వలన మానసిక ఉద్రేకం తగ్గుతుంది. క్రమమైన సాత్త్వికాహారం అనేక శారీరకరోగాలను నిరోధించి ఆయు: ప్రమాణాన్ని పెంచుతుంది. కాబట్టి ఈ ఆహార నియమాలకు తోడుగా ఉపవాసదీక్షను ఏర్పరిచారు. ఇందులోకూడ ఆరోగ్యరహస్యాలు ఇమిడి ఉన్నాయి.

వారంలో ఉన్న ఏడురోజులకు ఏడుగురు అధిపతులున్నారు. ఏమి ఆశించి ఉపవాసం చేస్తారనేదాన్ని బట్టి వారు వారంలో ఏరోజు ఉపవాసం చేయాలనేది ఆధారపడి వుంటుంది. ప్రతిరోజుకు ఒక్కో గ్రహం అధిపతి. ఒక్కో గ్రహాదిపతి కృప పొందేందుకు ఒక్కోవిధమైన ఉపవాసం పాటించాల్సి ఉంటుంది.

సూర్య గ్రహ అనుగ్రహం పొందాలనుకునేవారు ఆదివారం ఉపవాసముంటారు. కంటి సమస్యలు, చర్మ, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడేవారు సూర్యుని ఆరాధిస్తే మంచిది. సూర్యగ్రహ ఆరాధనవల్ల గౌరవం, కీర్తిప్రతిష్టలు లభించడంతో పాటు శత్రువుల పీడ నివారణ అవుతుంది. సూర్యునికోసం ఉపవాసముండేవారు సూర్యాస్తమయం లోపల రోజుకి ఒకసారి మాత్రమే భోజనం చేస్తారు. సూర్యాస్తమయం తరువాత ఏమీ తీసుకోరు. తినే ఆహారంలో ఉప్పు, నూనె ఉండకూడదు. తామసిక ఆహారం ఉపవాసమున్నవారు తినరు. సూర్యుడికి ప్రార్థనలుచేసి సూర్యునికి సబంధించిన కథను చదవడంగానీ, వినడంగానీ చేస్తారు. అలా చదివిన తరువాతే ఆహారం తీసుకుంటారు. సూర్యుని అనుగ్రహం పొందాలనుకునేవారు కెంపును ధరించాలి.గోధుమలు, ఎర్రధాన్యం, బెల్లం, బంగారం, రాగి ఆభరణాల్లో కెంపు దానమివ్వాల్సి ఉంటుంది. దానం ఇవ్వడానికి సూర్యాస్తమయం ఉత్తమమైన సమయం.

సోమవారానికి అధిపతి చంద్రుడు. సోమవారం శివపార్వతులకు పూజలు చేస్తారు. ఆనందకరమైన వివాహజీవితం కావాలనుకునేవారు సోమవారం నాడు శివపార్వతులకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించాలి. పెళ్ళి కావల్సినవారు సరైన జీవితభాగస్వామి కోసం శివపార్వతులకు పూజలు చేసి ఉపవాసం ఉంటారు. సోమవారం మూడురకాల ఉపవాసాలుంటారు. ఈరోజు ఉండే ఉపవాసాన్ని సౌమ్యప్రదోష మంటారు. ఏదైనా పొరపాటు జరిగితే, ఆ తప్పును ఒప్పుకుంటూ 16 సోమవారాలు ఉపవాసదీక్ష వహిస్తారు. ఉపవాసం చేసేవిధానం ఒకటే కానీ ఆరోజు చదువుకోవాల్సిన కథలు మాత్రం వేరుగా ఉంటాయి. భోజనం రోజుకి ఒకసారే చేస్తారు. తృణధాన్యాలు తీసుకోవచ్చు. శివపార్వతులకు ప్రార్థనలు చేసిన తర్వాత తగిన కథ చదువుకోవాలి. చంద్రుడి అనుగ్రహం కోసం ముత్యాలు, వెండి ధరించాలి. బియ్యం తెల్లటిదుస్తులు, శంఖం, వెండి, ముత్యాలాంటి వాటిని దానమివ్వాలి.

మంగళవారానికి అధిపతి కుజుడు. జాతకంలో కుజగ్రహం సరిగా లేనివారు ఆ దోషనివారణకు పన్నెండు మంగళవారాల ఉపవాసముండటం శుభప్రదం. మంగళవారం హనుమంతుడికి ప్రత్యేక ప్రార్థనలు చేయాలి. దుస్తులు, పూలు ఎర్రటివి ధరించడం శ్రేయస్కరం. గోధుమలు, బెల్లంతో చేసిన ఆహారం రోజుకి ఒక సారి మాత్రమే తినాలి. హనుమకు పూజ చేసిన పిదప కథ చదువు కోవాలి.

బుధవారానికి అధిపతి బుధుడు. బుధవారం ఉపవాసం ఉండదల్చుకున్నవారు రోజుకి ఒకసారి ఆకుపచ్చటి ఆహార పదార్థాలు తినాలి. విష్ణుమూర్తికి పూజచేసుకుని కథ చదువుకోవాలి. బుధగ్రహం అనుగ్రహం పొందాలనుకునేవారు బంగారంతో పొదిగిన పచ్చని (ఎమరాల్డ్) ధరించాలి. పెసలు, కస్తూరి, నీలపు దుస్తులు, బంగారం, రాగి వంటి వాటిని దానమివ్వాలి.

గురువారానికి అధిపతి బృహస్పతి. జ్ఞానసముపార్జనకు, సంపదకు గురుగ్రహం అనుగ్రహం ముఖ్యం. పసుపు పచ్చని దుస్తులు ధరించి గురువుకు ప్రార్థనలు చేసి కథ చదువుకోవాలి. రోజుకి ఒకసారే భోజనం చేయాలి. బంగారంలో పొదిగిన కనక పుష్యరాగాన్ని ధరించాలి. పసుపు, ఉప్పు, పసుపచ్చని దుస్తులు, బియ్యం వంటివాటిని దానమివ్వాలి.

శుక్రవారానికి అధిపతి శుక్రుడు. రోజుకి ఒకపూటే భోజనం చేయాలి. భోజనంలో పాయసం ఉండాలి. శుక్రుడి అనుగ్రహం పొందాలనుకునేవారు వజ్రాన్ని ధరించాలి. బియ్యం, తెల్లటి దుస్తులు, ఆవు, నెయ్యి, వజ్రాలు, బంగారం దానమివ్వలి. శుక్రవారం సంతోషిమాతకు పూజ చేసుకుని కథ చదువుకోవాలి. అమ్మవారికి హారతివ్వాలి. కటిక ఉపవాసముండాలి. పుల్లటి పదార్థాలు తినకపోవడమేకాదు, ఎవరికీ శుక్రవారం దానమివ్వకూడదు. ఇలా 16 శుక్రవారాలు ఉపవాసముండాలి. చివరి శుక్రవారం మగపిల్లలకు భోజనం పెట్టాలి.

శనివారానికి అధిపతి శని. శనికి నల్లటి వస్తువులు, నల్లని దుస్తులు, నల్లని నువ్వులు, ఇనుము, నూనె లాంటి పదార్థలు ఇష్టం. శనిదేవతకు పూజచేసుకుని కథ చదువుకొని హారతి ఇవ్వాలి. శని ప్రీతికోసం నీలం రాయిని ధరించాలి. నూనేతో నిండిన ఇనుపపాత్ర, నల్ల గొడుగు, నల్లటి చెప్పులు, నల్లటి దుస్తులు, నల్లనువ్వులు మొదలైన వాటిని దానమివ్వాలి. ఇలా మన ఉపవాసంలో ఆరోగ్యరహస్యాలతో పాటు కుటుంబ క్షేమమూ దాగుంది.

No comments:

Post a Comment